జాతీయ వార్తలు

‘తలాఖ్’పై రాజకీయం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దురాచారం అంతానికి ముందుకు రండి ముస్లిం మతపెద్దలకు ప్రధాని పిలుపు
మీనుంచే సంస్కరణవాదులు పుట్టుకొస్తారు ఆ నమ్మకం తనకుందన్న నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ ఆచారానికి చరమగీతం పాడుతామన్న విశ్వాసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. ఈ దురాచారం నుంచి ముస్లిం మహిళలను కాపాడేందుకు ఆ సామాజిక వర్గంనుంచే సంస్కరణవాదులు ముందుకొస్తారని కూడా నమ్ముతున్నా అన్నారు. ట్రిపుల్ తలాఖ్ అంశాన్ని రాజకీయం చేయొద్దని కూడా ఆయన ముస్లిం మతపెద్దలకు విజ్ఞప్తి చేశారు. కన్నడ సంస్కరణవాది బసవేశ్వర జయంతి సందర్భంగా శనివారం ఢిల్లీలో బసవ సొసైటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ట్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా మరోసారి తన స్వరాన్ని పెంచారు. ట్రిపుల్ తలాక్ మూలంగా బాధపడుతున్న మహిళలు, యువతులను కాపాడేందుకు ముస్లిం మేధావులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమకాలీన దుష్ట సంప్రదాయాలు ఛేదిస్తూ ఆధునిక సంప్రదాయాలను నెలకొల్పేందుకు ఈ సమాజం నుంచే శక్తిమంతులు పుట్టుకొస్తారని, ముస్లిం సమాజం నుంచి కూడా ఇలాంటి మేధావులు, సంస్కర్తలు పుట్టుకొస్తారనే ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాఖ్ మూలంగా అష్టకష్టాలు పడుతున్న ముస్లిం తల్లులు, కూతుళ్లను కాపాడేందుకు పోరాడటంతోపాటు, ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటారని అభిప్రాయపడ్డారు. హిందుస్థాన్ నుంచి పుట్టే ఈ మేధావులు ప్రపంచంలోని ఇతర ముస్లిం దేశాలకు మార్గదర్శకులు అవుతారని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. ఇలాంటి మేధావులు, ఆలోచనాపరులకు జన్మనిచ్చే శక్తి ఈ దేశానికి ఉందన్నారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడు చేపట్టిన సంస్కరణలను మోదీ ప్రస్తావించారు. దశాబ్దాల క్రితం పెద్దవారు, చిన్నవారు అని తేడా లేకుండా అంటరానితనం రాజ్యమేలుతున్న సమయంలో బసవేశ్వరుడు మహిళలకు తమ వాదన వినిపించే అధికారం కల్పించారని గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్ మూలంగా కష్టాలపాలవుతున్న ముస్లిం మహిళలను ఆ సమాజం నుంచే పుట్టుకొస్తారని అంటూ, ఈ అంశాన్ని రాజకీయం కానివ్వొద్దని ముస్లిం నేతలకు హితవు చెప్పారు. ‘మీరు ముందుకొచ్చి సమస్యకు పరిష్కారం కనుగొనండి. దీనివలన కలిగే ఆనందమే వేరు. భావి తరాలవారు ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుంచుకుంటారు’ అని మోదీ అన్నారు. మీరు కనుగొనే పరిష్కారం ద్వారా రానున్న తరాలకు బలం చేకూరుతుందని ముస్లిం సమాజానికి హామీ ఇచ్చారు. ట్రిపుల్ తలాక్ మూలంగా ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు మీరే పరిష్కారం కనుగొనాలని ముస్లిం మేధావులకు పిలుపునిచ్చారు. ‘దేశంలోని ముస్లిం మహిళల వెతలకు ముగింపు పలుకుతా. ప్రపంచంలోని మిగతా ముస్లిం మహిళల మాదిరిగానే, దేశంలోని ముస్లింలనూ ఆధునికపథంలో నడిపించగలనన్న విశ్వాసం నాకుంది’ అని మోదీ స్పష్టం చేశారు. దాదాపు 40 నిమిషాల ప్రసంగంలో ప్రధాని మహిళా సాధికారికత, సమానత్వం, సుపరిపాలన గురించి ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్, కర్నాటక బిజెపి అధ్యక్షుడు బిఎస్ యెడ్యూరప్ప తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ 23 భాషల్లో రూపొందించిన బసవేశ్వరుడి ప్రవచనాల డిజిటల్ సంపుటిని ఆవిష్కరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇంతకుముందు ఒడిశాలో బిజెపి కార్యవర్గం సమావేశం జరిగినప్పుడూ ట్రిపుల్ తలాక్ సమస్యను ప్రస్తావించటం తెలిసిందే. ట్రిపుల్ తలాక్‌తో ముస్లిం మహిళలకు అన్యాయం చేయకూడదని ఆయన ఆ సమావేశంలో పిలుపునివ్వడం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికల కోసమే: కాంగ్రెస్
కర్నాటక శాసన సభకు వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బసవ జయంతిలో ట్రిపుల్ తలాక్ సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ లేవనెత్తారని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఖర్గే శనివారం తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ కర్నాటకలో ముస్లిం మహిళల ఓట్లు సంపాదించే లక్ష్యంతోనే ట్రిపుల్ తలాక్ ప్రస్తావన జరిగిందంటూ, ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దంటూనే రాజకీయం చేయటం మోదీకే చెల్లిందని విమర్శించారు. ట్రిపుల్ తలాక్ సమస్యను అడ్డం పెట్టుకుని ఉమ్మడి పౌర చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

చిత్రం... బసవేశ్వర జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ