తెలంగాణ

విద్యాసాగర్‌రావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారిక లాంఛనాలతో నేడు అంత్యక్రియలు
భౌతిక కాయం వద్ద కెసిఆర్ కన్నీటి నివాళి
ఒక ప్రాజెక్టుకు పేరు పెట్టాలని నిర్ణయం
చంద్రబాబు, జగన్ సహా పలువురి సంతాపం

హైదరాబాద్, ఏప్రిల్ 29: సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై జీవితకాలమంతా గళమెత్తిన సాగునీటి నిపుణుడు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు (78) శనివారం ఉదయం కన్నుమూశారు. విద్యాసాగర్‌రావుకు భార్య, ఇద్దరు సంతానం. అనారోగ్యంతో గత రెండువారాలుగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. తెలంగాణ కన్నీటిని తుడిచేది జలవనరులేనని నమ్మిన ఆయన, అధికారంలో ఎవరున్నా, తెలంగాణ కోసం ఎవరు ఉద్యమించినా.. వాళ్లకు జలవనరుల్లో జరుగుతోన్న అన్యాయాన్ని వివరించే వారు. విద్యాసాగర్ రావు మరణవార్త తెలుసుకుని సిఎం కెసిఆర్ దిగ్బ్రాంతికి గురయ్యారు. కుటుంబీకులతో కలిసి హబ్సిగూడలోని ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయం వద్ద నివాళి అర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. విద్యాసాగర్‌రావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న సమయంలో కెసిఆర్ కళ్లు చెమ్మగిల్లాయి.
2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైనపుడు, 2002 నుంచీ కెసిఆర్, విద్యాసాగర్‌రావులను జలవనరులే కలిపాయి. చివరి వరకు ఆ అనుబంధం కొనసాగింది. ఉద్యమకాలంలో జల వనరుల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సాధికారికంగా వివరించిన విద్యాసాగర్‌రావు, తెలంగాణ ఆవిర్భావం తరువాత ప్రాజెక్టుల రీ డిజైనింగ్, కోటి ఎకరాలకు సాగునీటిని అందించే ప్రాజెక్టుల రూపకల్పనలో కీలక పాత్ర వహించారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కాగా, జలవనరుల ఉద్యమం నడిపిన విద్యాసాగర్‌రావు సాగునీటి రంగంలో ప్రభుత్వ సలహాదారుగా తన సేవలందించారు.
1939 నవంబర్ 14న నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెంలో లక్ష్మమ్మ, రాఘవరావు దంపతులకు విద్యాసాగర్ రావు జన్మించారు. ఆ గ్రామం నుంచి తొలి ఇంజనీర్ విద్యాసాగర్ రావు. జనవనరుల శాఖలో ఇంజనీర్‌గా అపారమైన అనుభవం సంపాదించారు. ఆరవ తరగతి చదువుతున్నప్పుడే బాలపత్రికలో లోభి అనే కథ రాసిన విద్యాసాగర్ రావు, ప్రవృత్తిగా రచనా వ్యాసంగం పట్ల ఆకర్షితులయ్యారు. క్యాజువల్ ఆర్టిస్ట్‌గా, అనౌన్సర్‌గా రేడియోతోనూ ఆయనకు అనుబంధం ఉంది.
మూడు దశాబ్దాలపాటు కేంద్ర జల సంఘంలో పని చేసిన విద్యాసాగర్ రావు, నిరాడంబర జీవితానే్న గడిపారు. ఆ అనుభవంతోనే నీళ్లు -నిజాలు, నీళ్లు -నిజాలు 2 పేరిట వెలువరించిన పుస్తకాల్లో తెలంగాణకు ప్రాజెక్టుల్లో జరుగుతోన్న అన్యాయాన్ని వివరించారు. జలవనరుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సమగ్రంగా వివరించగలిగే వ్యక్తి కోసం ఎదురుచూసిన తెలంగాణ ఉద్యమానికి విద్యాసాగర్‌రావు రూపంలో ఆ లోటు తీరింది. ఇంజనీరుగా ఉంటూ మంచి రచయితగా, రంగస్థల నటునిగా ఆయన పేరు సంపాదించారు.
నేడు అంత్యక్రియలు
అధికారిక లాంఛనాలతో విద్యాసాగర్‌రావు అంత్యక్రియలు నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సిఎం కెసిఆర్ ఆదేశించటంతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంబర్‌పేట స్మశాన వాటికలో ఉదయం పది గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రాజెక్టుకు విద్యాసాగర్‌రావు పేరు
రాష్ట్రంలోని ఒక ప్రాజెక్టుకు విద్యాసాగర్‌రావు పేరు పెట్టనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన కుటుంబీకులకు హామీ ఇచ్చారు. తెలంగాణకు నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయంపై ఉద్యమ సమయంలో గణాంకాలతో వివరించి ప్రజలకు అవగాహన కలిగించిన మహోన్నత వ్యక్తి విద్యాసాగర్ రావు అని కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ప్రాజెక్టులపై జరిగిన అన్యాయంపై ఆయన చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యమైనదంటూ నివాళి అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి, తెరాస పార్టీకి, వ్యక్తిగతంగా తనకూ ఎప్పటికప్పుడు వివరాలందిస్తూ, సలహాలిస్తూ ముందుకు నడిపారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ప్రాజెక్టుల రీ డిజైనింగ్ సహా నీటిపారుదల రంగంలో చేపట్టాల్సిన కార్యక్రమాల రూపకల్పనలో విద్యాసాగర్‌రావు విశేష అనుభవం ఉపయోగపడిందన్నారు. జయశంకర్ తర్వాత తెలంగాణ జాతి విద్యాసాగర్‌రావును ఎన్నటికీ మరిచిపోదన్నారు. ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపర్చి ప్రాణాలు దక్కించేందుకు ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు కట్టి తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించాలనే స్వప్న సాకారంలో భాగస్వామిగా ఉండాల్సిన విద్యాసాగర్‌రావు, అర్థాంతరంగా మనల్ని వదిలి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు విద్యాసాగర్‌రావు మంచి మిత్రుడని, మొదటి నుంచీ కుటుంబీకుడిగా తనకు పెద్దన్నలా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. విద్యాసాగర్వ్రు కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పలువురి సంతాపం
విద్యాసాగర్‌రావు మృతికి ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంతాపం ప్రకటించారు. నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు విద్యాసాగర్‌రావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఉద్యమ సమయంలో నీటిపారుదల రంగానికి సంబంధించి ఆయనతో కలిసి పని చేసిన క్షణాలను మంత్రి కెటిఆర్ గుర్తు చేసుకున్నారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ కవిత తదితరులు సంతాపం తెలిపారు. నీళ్లను కన్నీళ్లను వేరు చేసిన తెలంగాణ విద్యాసాగర్‌కు జోహార్లని కవి జూలూరి గౌరీశంకర్ నివాళి అర్పించారు. టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, ప్రెస్ అకాడమీ చైర్మన్, బిసి కమిషన్ చైర్మన్ , ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సంతాపం వెలిబుచ్చిన వారిలో ఉన్నారు.