జాతీయ వార్తలు

నక్సల్స్‌పై దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వామపక్ష తీవ్రవాదాన్ని అణిచేద్దాం
కొత్త వ్యూహాలను సిద్ధం చేయండి
సాంకేతిక పరిజ్ఞానంతో సాధ్యమే..
పూర్తి బలగాలతో ఏకీకృత కమాండ్
‘సమాధాన్’ పథకంపై దృష్టిపెట్టండి
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ పిలుపు
నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలతో సమీక్ష

న్యూఢిల్లీ, మే 8: వామపక్ష తీవ్రవాదాన్ని దేశంనుంచి తుడిచేసేందుకు కొత్త వ్యూహాలు సిద్ధం చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. సిద్ధం చేసిన వ్యూహాలను పూర్తి బలం బలగంతో అమలు చేయాలని భద్రతా దళాలకు సూచించారు. నక్సలిజాన్ని అణగదొక్కేందుకు యుఏవి, పిటిజెడ్ కెమేరా, జిపిఎస్ ట్రాకింగ్, థర్మల్ ఇమేజింగ్, రాడార్, ఉపగ్రహ చిత్రాల్లాంటి సమాచార సాంకేతిక పరిజ్ఞానం మొత్తం ఉపయోగించాలన్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో తొలగించేందుకు ఏకీకృత సమన్వయం, కమాండ్ అవసరమన్నారు. నక్సలైట్లు ఇటీవల చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 25మంది సిఆర్‌పిఎఫ్ దళాలను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నక్సల్స్ ప్రభావిత పది రాష్ట్రాల సిఎంలు, సిఎస్‌లు, డిజిపిలతో రాజ్‌నాథ్ సింగ్ సోమవారం సమీక్ష నిర్వహించారు. నక్సలైట్లను నియంత్రించేందుకు భద్రతా దళాలు దూకుడు ప్రదర్శించాలని, ఆచరణాత్మక వ్యూహాలు రచించాలని పిలుపునిచ్చారు. తెలంగాణా డిజిపి అనురాగ్ శర్మ, ఆంధ్ర నుంచి ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చిన రాజప్ప, ముఖ్య కార్యదర్శి దినేష్‌కుమార్, డిజిపి ఎన్ సాంబశివరావు హాజరయ్యారు. రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు ఇద్దరు హోం శాఖ సహాయ మంత్రులు హన్స్‌రాజ్ అహిర్, కిరణ్ రెజుజి, హోంశాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. కార్యాచరణ స్థాయిలో వ్యూహాత్మక ఏకీకృత కమాండ్ ఏర్పాటు ద్వారా నక్సలిజాన్ని అదుపు చేయాలని హోంమంత్రి సూచించారు. వామపక్ష తీవ్రవాదం మూలంగా పది రాష్ట్రాల్లోని 35 జిల్లాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని రాజ్‌నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. సుక్మా జిల్లా బుర్కాపల్ ప్రాంతంలో 25మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను నక్సలైట్లు హత్య చేయటంపట్ల యావత్ దేశం ఆందోళన వ్యక్తం చేసిందని రాజ్‌నాథ్ అన్నారు. భద్రతా దళాలు ప్రణాళికాబద్ధంగా వేగంతో ముందుకు సాగితేనే నక్సలిజాన్ని అదుపు చేయగలుగుతామని, లక్ష్యాలు సాధించగలమని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. నక్సలిజాన్ని అంతమొందించేందుకు మన ఆలోచనా విధానం ఎలా ఉండాలి? మనం వ్యూహం ఎలా ఉండాలి? మన తయారీ ఎలా ఉండాలి? మన వనరులను ఎలా ఉపయోగించాలన్న అంశాలపై సమావేశంలో దృష్టి సారించాలని హోంమంత్రి సూచించారు. మనమంతా సంయుక్తంగా కొత్త వ్యూహాలు, పూర్తి బలం బలగంతో నక్సలిజాన్ని అదుపు చేయగలుగుతామనే ధీమా తనకుందని ఆయన చెప్పారు. ప్రపంచంలోని అతి పెద్దదైన భారత ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీన పర్చేందుకు నక్సలైట్లు అనునిత్యం ప్రయత్నిస్తున్నారని రాజ్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా దళాల శిక్షణ సౌకర్యాలు పెంచుకోవాలని, అదేవిధంగా భద్రతా దళాల క్యాంపుల్లోనూ సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. నక్సలిజాన్ని తిప్పికొట్టేందుకు ‘సమాధాన్’ పథకాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. నక్సలైట్లు క్రియాత్మకంగా ఉన్న ప్రతి ప్రాంతానికీ ఒక ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసుకుని స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్ణయించుకోవాలన్నారు. నక్సలైట్ల ఆర్థిక వనరులను పూర్తిగా అరికట్టాలని రాజ్‌నాథ్ సింగ్ పది రాష్ట్రాల అధికారులకు స్పష్టం చేశారు. భద్రతా దళాలపై తరచూ దాడులు చేయటం ద్వారా తమ మనోబలాన్ని పెంచుకునేందుకు నక్సలైట్లు ప్రయత్నిస్తున్నారని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. దాడి జరిగినపుడు తీవ్రంగా స్పందించటంకంటే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వ్యూహాత్మక దాడుల ద్వారా నక్సలిజాన్ని అంతమొందించాలని హోంమంత్రి అధికారులకు సూచించారు. భద్రతా దళాలు ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను సమీక్షించుకుంటూ అన్ని రాష్ట్రాల పోలీసుల సమైక్యత, పరస్పర సహకారంతో ముందుకు సాగాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్మించాలని అనుకుంటున్న ఆధునిక భారతదేశం లక్ష్యాన్ని సాధించాలంటే నక్సలిజాన్ని వీలైనంత త్వరగా అంతమొందించాలని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం వద్ద మంచి వనరులు, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. అయితే మంచి సమన్వయం లేకపోవటం వలన సమస్యలు ఎదురవుతున్నాయి’ అన్నారు. నక్సలైట్ల దాడుల మూలంగా ఇంతవరకు 12వేలమంది మరణించారని మంత్రి చెప్పారు. నక్సలైట్లు భద్రతా దళాలతోపాటు రోడ్లు, కల్వర్టులు, రైల్వే ట్రాక్స్, విద్యుత్, టెలిఫోన్ టవర్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, పంచాయితీ భవనాలు వంటి ప్రజా ఆస్తులనూ ధ్వంసం చేస్తున్నారని రాజ్‌నాథ్ చెప్పారు. గిరిజన, ఇతర వెనకుబడిన ప్రాంతాలు, ప్రజలు అభివృద్ది చెందటం నక్సలైట్లకు ఇష్టంలేదని ఆయన అన్నారు. స్మార్ట్ లీడర్‌షిప్, దూకుడు వ్యూహం, ‘సమాధాన్ పథకం’ ప్రేరణ, శిక్షణ ద్వారా నక్సలిజాన్ని అంతమొందించాలని రాజ్‌నాథ్ పది రాష్ట్రాలకు హితవు చెప్పారు.

చిత్రం... నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సిఎంలు, సిఎస్‌లు, డిజిపిల సమావేశంలో మాట్లాడుతున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్