జాతీయ వార్తలు

ఇస్లాంలో తలాఖ్ అంతర్భాగం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: ట్రిపుల్ తలాఖ్ ఇస్లాం మతంలో అంతర్భాగం కాదని, మెజారిటీ, మైనారిటీ సమస్యా కూడా కాదని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టు ఎదుట వాదించింది. ఇది ముస్లిం పురుషులు, అన్యాయానికి గురవుతున్న మహిళల మధ్య జరుగుతున్న సంఘర్షణేనని పేర్కొంది. ట్రిపుల్ తలాఖ్ విధానంపై బలమైన రీతిలో న్యాయ సమీక్ష జరగాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ స్పష్టం చేశారు. ముఖ్యంగా సమానత్వం, మహిళలకు న్యాయం కలిగించాలన్న ప్రాథమిక హక్కులకు ట్రిపుల్ తలాఖ్ విరుద్ధంగా ఉందన్నారు. ఈ కోణంలోనే ఈ అనైతిక విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సుప్రీంకోర్టు కూడా ఈ వాస్తవాలను ఎంతమాత్రం విస్మరించడానికి వీల్లేదన్నారు. ట్రిపుల్ తలాఖ్ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గత ఐదు రోజులుగా విచారిస్తున్న విషయం తెలిసిందే. ముస్లింలలో వివాహాలు, విడాకులను నియంత్రించే చట్టాన్ని ఇంతవరకు ఎందుకు తీసుకు రాలేదని ఈ సందర్భంగా కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ట్రిపుల్ తలాఖ్‌ను కోర్టు కొట్టివేస్తే కొత్త చట్టాన్ని తెస్తామని కేంద్రం చేసిన ప్రకటనను ప్రస్తావించిన ధర్మాసనం ‘గత అరవేయేళ్లుగా దీనిపై చట్టాన్ని ఎందుకు చేయలేక పోయారు?’ అని ప్రశ్నించింది. అయితే ఓ లౌకిక న్యాయస్థానం ప్రధాన బాధ్యత ప్రభుత్వ చట్టం కోసం ఎదురు చూడకుండా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడమేనని తన సమాధానంలో రోహత్గీ తెలిపారు. ఇటువంటి అంశాలు కోర్టు పరిశీలనకు వస్తే వాటిపై సముచిత రీతిలో ప్రతిస్పందించాల్సిన బాధ్యత న్యాయస్థానానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం చేయాల్సింది ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్న ఆయన, ఈ విషయంలో కోర్టులు ఏంచేస్తాయని అడిగారు. తాను ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నానే తప్ప పార్లమెంటు తరఫున కాదని రోహత్గీ వివరించారు. సమున్నత న్యాయస్థానానికి ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని, ట్రిపుల్ తలాఖ్ విషయంలో ఇటువంటి ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలని అన్నారు.