జాతీయ వార్తలు

‘తలాఖ్’పై తీర్పు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: ముస్లింలు పాటించే ట్రిపుల్ తలాఖ్ రాజ్యాంగ బద్దతపై తీర్పును సుప్రీంకోర్టు గురువారం వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం ఆరు రోజుల పాటు ఈ అంశంపై విచారణ జరిపింది. జూలైలో తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విచారణల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, అఖిల భారత ముస్లిం మహిళల పర్సనల్ లా బోర్డుసహా పలువురు ఇతరులు తమ వాదనలను వినిపించారు. ధర్మాసనంలో న్యాయమూర్తులు కురియన్ జోసెఫ్, ఆర్‌ఎఫ్ నారిమన్, యుయు లలిత్, అబ్దుల్ నజీర్ ఉన్నారు. ఈ నెల 11న ధర్మాసనం విచారణను ప్రారంభించింది. ధర్మాసనంలోని అయిదుగురు జడ్జీలు వేర్వేరు మతాలకు చెందినవారు కావడం గమనార్హం. ప్రస్తుతానికి తాము ట్రిపుల్ తలాఖ్ అంశాన్ని మాత్రమే పరిశీలిస్తామని, బహుభార్యాత్వం, నిఖా హలాలా అంశాలను పరిశీలించబోమని, వాటిని తర్వాత పరిశీలిస్తామని విచారణకు ముందే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కూడా. ఆరో రోజు విచారణ సందర్భంగా షయారా బానో తరఫు న్యాయవాది అమిత్ చద్దా వాదిస్తూ ట్రిపుల్ తలాఖ్‌ను పాపంగా అంగీకరించాలని ఆలిండియ ముస్లిం పర్సనల్ లా బోర్డును కోరారు. అయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాత్రం ట్రిపుల్ తలాఖ్ అనేది నమ్మకానికి, విశ్వాసానికి సంబంధించిన అంశమని వాదించారు. ఈ వాదనను చద్దా తిప్పికొట్టారు. ట్రిపుల్ తలాఖ్ అనే పదం కానీ, ఆచారం కానీ పవిత్ర ఖురాన్‌లో లేదని, అది ఆమోదయోగ్యం కాని అంశమని స్వయంగా పర్సనల్ లా బోర్డే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ దశలో జస్టిస్ నారిమన్ జోక్యం చేసుకుంటూ, ‘మీరు వాదించే దాన్నిబట్టి ట్రిపుల్ తలాఖ్ అనే సంప్రదాయం ముస్లిం మతంలో భాగమే కాదు కదా’ అని ప్రశ్నించగా అవునని చద్దా చెప్పారు. దీంతో ఈ అంశంపై వాదనలు ముగిసినట్లుగా ప్రకటించిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.
రేపు గాంగ్టక్‌లో ఐదు
రాష్ట్రాల సిఎంల భేటీ
న్యూఢిల్లీ, మే 18: కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం గాంగ్టక్‌లో ఏర్పాటు చేసిన అయిదు హిమాలయ ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో భారత్-చైనా సరిహద్దు పొడవునా రోడ్లు, వంతెనలు, ఇతర వౌలిక సదుపాయాల నిర్మాణం ప్రధాన అజెండాగా ఉండనుంది. చైనా బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ‘వన్ బెల్ట్, వన్ రోడ్’ సదస్సులో పాల్గొనడానికి మన దేశం నిరాకరించిన కొద్దిరోజులకే, అలాగే టిబెటన్ల బౌద్ధ గురువు దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడంపై ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగిన నెల రోజుల తర్వాత ఈ సమావేశం జరుగుతోంది. జమ్మూ, కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, వీరభద్ర సింగ్, త్రివేంద్ర సింగ్ రావత్, పవన్‌కుమార్ చామ్లింగ్, ప్రేమా ఖందూలు ఈ సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది.

చైనా-్భరత్ సరిహద్దు పొడవునా రోడ్ల నిర్మాణం సరిహద్దుల్లో వౌలిక సదుపాయాల కొరత కారణంగా తలెత్తిన పరిస్థితిని పరిష్కరించడంతోపాటుగా ఇతర అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తారని ఓ అధికారి చెప్పారు. భారత్, చైనాల మధ్య 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉండగా, ఈ అయిదు రాష్ట్రాల్లోనే ఈ మొత్తం ప్రాంతం ఉండడం గమనార్హం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో ఆపరేషన్ పరంగా కీలకమైన 73 రోడ్లను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. మొత్తం 804.93 కిలోమీటర్ల పొడవుండే ఈ రోడ్లను హోం శాఖ ఈ అయిదు రాష్ట్రాల్లో 1987 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది.

ఉష్ణోగ్రతలో
ఏపి నెంబర్ వన్
ఒక్క రోజులో నాలుగు నుంచి ఆరు డిగ్రీల పెరుగుదల
ఆరు నుంచి తొమ్మిది డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 18: దేశంలో మొత్తంమీద ఆంధ్ర ప్రదేశ్‌లోనే గురువారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియచేశారు. నిన్న మొన్నటి వరకూ దక్షిణ కోస్తాలో గణనీయంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, గురువారం ఉత్తర కోస్తాకు కూడా విస్తరించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కన్నా ఆరు నుంచి తొమ్మిది డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. గురువారం గన్నవరం, మచిలీపట్నం, బాపట్ల, ఒంగోలులో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అలాగే కావలి, నెల్లూరు, నర్సాపూర్, రామగుండంలలో 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 44, కాకినాడ, తునిల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. బుధవారం ఉత్తర కోస్తాలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే, గురువారం అది 39 నుంచి 40 డిగ్రీలకు చేరుకుంది. ఒక్క రోజులోనే నాలుగు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిపోయింది. గురువారం ఏపిలో కాసిన ఎండలు దేశంలోనే అత్యధికంగా విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం నిర్థారించింది. శుక్రవారం నుంచి ఉత్తర కోస్తాలో తీవ్రమైన వడగాడ్పులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉత్తర కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ విస్తరించిన అల్పపీడన ద్రోణి బుధవారం భూమీద ఉండేది. అది అకస్మాత్తుగా సముద్రంలోకి వెళ్లిపోవడంతో ఎండల తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎండల తీవ్రత మరో మూడు రోజులపాటు ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బీహార్, చత్తీస్‌గడ్, ఒడిశా నుంచి విశాఖ వరకూ మరో అల్పపీడన ద్రోణి గురువారం ఏర్పడింది. దీనివలన కూడా కోస్తాలో వడగాడ్పుల తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఆ ఒక్కటీ అడగొద్దు
రాజకీయ ప్రవేశంపై
రజనీకాంత్
చెన్నై, మే 18: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం కూడా అభిమానులతో భేటీ అయ్యారు. త్వరలో రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో వరుసగా అభిమానులను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రాజకీయరంగ ప్రవేశం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. ‘దయచేసి రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగవద్దు’ అని రజనీ కోరారు. ఎనిమిదేళ్ల తరువాత ఫ్యాన్స్‌తో ఫొటోలు, సమావేశాలతో ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. భవిష్యత్‌లో రాజకీయరంగ ప్రవేశంపై ప్రకటన చేస్తారని కథనాలు వెలువడ్డాయి.
సోమవారం అభిమానులతో భేటీ అయిన 66 ఏళ్ల సూపర్‌స్టార్ ‘దురలవాట్లకు దూరంగా ఉండండి. కుటుంబాలను చక్కగా చూసుకోండి’ అంటూ ఫ్యాన్‌కు ఉద్బోధించారు. అంతేకాదు దూమపానం, ఆల్కాహాల్‌కు బానిసలు కావద్దనని కోరారు. రాజకీయాలపై తనకు ఆసక్తిలేదన్న రజనీ ‘అంతా దేవుడి చేతుల్లో ఉంది. ఆయన ఎలా అంటే అలా జరుగుతుంది’ అన్నారు. ఇలా ఉండగా బిజెపి జాతీయ కార్యదర్శి హెచ్ రాజా బుధవారం ఓ ప్రకటన చేస్తూ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ఆహ్వానించదగ్గ పరిణామమేనని అన్నారు.

పోలీసు కస్టడీకి
హవాలా ఏజెంట్
న్యూఢిల్లీ, మే 18: ఎన్నికల అధికారికి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయిన హవాలా ఏజెంట్ లలిత్ కుమార్ అలియాస్ బాబూ భాయ్‌ని రెండ్రోజుల పోలీసు కస్టడీకి పంపుతూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పూనం చౌదరి గురువారం ఆదేశించారు. అన్నాడిఎంకె నేత టిటివి దినకరన్ తరఫున ఎన్నికల అధికారికి లంచం ఇవ్వడానికి బాబూభాయ్ మధ్యవర్తిత్వం జరిపాడు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. మధ్యవర్తి సుకేష్ చంద్రశేఖర్‌కు దినకరన్‌కు కోటి రూపాయల డీల్ కుదిరిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బల్బీర్ సింగ్ తెలిపారు. కుమార్‌కు సుకేష్‌కు మధ్య సంబంధాలే కాకుండా కేసుకు సంబంధించి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని ఆయన కోర్టుకు తెలిపారు.

పోలీసుల అభ్యర్థన మేరకు బాబూభాయ్‌ని రెండు రోజుల కస్టడీకి పంపుతూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.