జాతీయ వార్తలు

మీ వల్లే దేశం పరువు పోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మే 19: కులభూషణ్ జాధవ్ కేసు విషయంలో పాక్ పాలకుల వైఖరి కారణంగానే అంతర్జాతీయ న్యాయ స్థానంముందు దేశం పరువు పోయిందని ఆ దేశంలోని న్యాయ నిపుణులతో పాటుగా సామాన్య ప్రజలు సైతం మండిపడుతున్నారు. గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ భారత నౌకాదళం మాజీ అధికారి అయిన జాధవ్‌కు పాక్ మిలిటరీ న్యాయ స్థానం ఇటీవల విధించిన మరణ శిక్ష అమలును తుది తీర్పు వెలువడే దాకా నిలిపివేయాలని హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం గురువారం పాక్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో ఈ వ్యవహారం విషయంలో విదేశాంగ శాఖ వ్యవహరించిన తీరుపైన, అలాగే అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్ తరఫున వాదనలు వినిపించడానికి ఖవర్ ఖురేషిని ఎంచుకోవడంపైన కూడా న్యాయ నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్తాన్ అటార్నీ జనరల్(ఎజిపి) మరో న్యాయవాదిని సూచించింనట్లు ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక కథనం పేర్కొంది. జాధవ్ కేసును భారత దేశం అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు తీసుకువెళ్లిన వెంటనే ఐసిజె మధ్యవర్తిత్వాన్ని తప్పకుండా అంగీకరిస్తూ ఈ ఏడాది మార్చి 29న ఇచ్చిన డిక్లరేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకొని ఉండాల్సిందని పాకిస్తాన్ బార్ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షుడు ఫరోగ్ నసీమ్ అభిప్రాయ పడ్డారు. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి పాక్ వద్ద బలమైన సాక్ష్యాధారాలున్నప్పటికీ అది ఐసిజె దృష్టికి ఈ అంశాలను ఎందుకు తీసుకెళ్లలేదని కూడా ఆయన ప్రశ్నించారు. ఒక డిక్లరేషన్ ద్వారా పాకిస్తాన్ ఐసిజె జ్యూరిస్‌డిక్షన్‌ను అంగీకరించిందని, భారత్ తనకు వ్యతిరేకంగా ఐసిజె జ్యూరిస్‌డిక్షన్‌ను తీసుకు వస్తుందని తెలిసిన వెంటనే ఆ డిక్లరేషన్‌ను పాక్ ఉపసంహరించుకొని ఉండాల్సిందని అంతర్జాతీయ చట్టాల్లో నిపుణుడు, మాజీ అదనపు అటార్నీ జనరల్ తారిక్ ఖోకర్ అభిప్రాయ పడ్డారు. ఐసిజె ఒక మధ్యవర్తిత్వ వేదిక అయినందున కక్షిదారులుగా ఉండే ప్రతి దేశమూ ఐసిజెలో ఒక అడ్‌హాక్ జడ్జిగా తమ తరఫున వ్యవహరించేందుకు ఒక వ్యక్తిని నియమించుకోవచ్చని, భారత్ తన తరఫున ఒక వ్యక్తిని నియమించుకొందని, పాక్ ఎందుకు నియమించుకోలేదని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు పాకిస్తాన్ తరఫు న్యాయవాది కేటాయించిన పూర్తి సమయం వాదించలేదని కూడా ఆయన అన్నారు.
కాగా, జాధవ్ కేసును ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా చేయడానికి బదులు అందరూ కలిసి కూర్చుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటే బాగుంటుందని ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల ఉద్యమ నాయకురాలు ఆస్మా జహంగీర్ అభిప్రాయ పడ్డారు. అంతేకాదు జాధవ్‌కు ఇక్కడే ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసి ఉంటే సమస్య ఇంతదాకా వచ్చి ఉండేది కాదని కూడా ఆమె అభిప్రాయ పడ్డారు. ‘జాధవ్‌ను భారత దౌత్య అధికారులు కలుసుకొనేందుకు అనుమతి ఇవ్వవద్దని ఎవరు సలహా ఇచ్చారు?’ అని కూడా ఆమె ప్రశ్నించారు. జాధవ్‌ను తమ దౌత్య అధికారులు కలవడానికి అవకాశం కల్పించాలని భారత్ దాదాపు 16 సార్లు పాక్‌ను కోరిన విషయం తెలిసిందే. భారత జైళ్లలో అనేక మంది పాకిస్తానీలు మగ్గుతున్నారని ఆమె గుర్తు చేస్తూ వారందరి విషయంలో పాక్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగలదా? అని కూడా ఆస్మా జహంగీర్ ప్రశ్నించినట్లు ‘డాన్’ పత్రిక పేర్కొంది. కాగా, సైనిక వ్యవస్థకు, రాజకీయ వ్యవస్థ మధ్య అదికార పోరాటం, అలాగే విదేశాంగ విధానం, జాతీయ భద్రత దృష్టి కోణాల మధ్య అంతరం ఎంతగా పెరిగి పోయాయనే దానికి జాధవ్ కేసు ఒక చక్కటి నిదర్శనమని పాక్ బార్ కౌన్సిల్ సభ్యుడు రహీల్ కమ్రాన్ షేక్ అభిప్రాయ పడ్డారు. జరిగింది జరిగిపోయిందని, ఇక రెండో దశ విషయంలోనైనా పాక్ ప్రభుత్వం పూర్తి సంసిద్ధంగా ఉండాలని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐసజెలో పాక్ ప్రభుత్వం తరఫున కేసు వాదించడానికి కొత్త న్యాయవాదుల బృందాన్ని ఎంపిక చేయనున్నట్లు ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారయిన సర్తార్ అజీజ్ శుక్రవారం ప్రకటించారు.

అణు సామగ్రిని ఆయుధాల
తయారీకి మళ్లిస్తున్నారు
భారత్‌పై పాకిస్తాన్ ఆరోపణ
ఇస్లామాబాద్, మే 19: అణు సరఫరాల గ్రూపు (ఎన్‌ఎస్‌జి) ఇచ్చిన మినహాయింపుల ద్వారా భారత్ శాంతియుత ప్రయోజనాల కోసం సంపాదించిన అణు సామగ్రిని ఆయుధాల తయారీకి మళ్లిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. 2008లో ఎన్‌ఎస్‌జి ఇచ్చిన మినహాయింపులతో పాటు పౌర అణు సహకార ఒప్పందాలను ఆసరాగా చేసుకుని భారత్ దిగుమతి చేసుకున్న అణు ఇంధనాన్ని, సామగ్రిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అణ్వాయుధాల తయారీకి మళ్లించే ప్రమాదం ఉందని పాకిస్తాన్ ఎన్నో ఏళ్ల నుంచి చెబుతూనే ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా గురువారం విలేఖరులతో అన్నారు. ‘శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగిస్తామన్న హామీతో దిగుమతి చేసుకున్న అణు సామగ్రిని అణ్వాయుధాల తయారీకి మళ్లించడం భారత్‌కే చెల్లుతోంది. ఈ మళ్లింపులపై మేము చేస్తున్న వాదన కొత్తది గానీ, పసలేనిది గానీ కాదు’ అని ఆయన పేర్కొన్నారు.
ముంబయి ఉగ్రదాడుల కేసు..
పాక్ ప్రత్యేక కోర్టులో
మళ్లీ న్యాయమూర్తి మార్పు
లాహోర్, మే 19: ముంబయి ఉగ్రదాడుల కేసుపై విచారణ జరుపుతున్న పాకిస్తాన్‌లోని తీవ్రవాద వ్యతిరేక కోర్టు (ఎటిసి) న్యాయమూర్తిని మరోసారి మార్చారు. గత ఎనిమిదేళ్లలో ఈ కోర్టు న్యాయమూర్తిని మార్చడం ఇది తొమ్మిదోసారి. ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రదాడులతో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న ఏడుగురు పాక్ జాతీయులపై ఈ ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎటిసి న్యాయమూర్తిని ఇటీవల మార్చారని కోర్టు అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ముంబయి దాడుల కేసుపై గత రెండేళ్ల నుంచి విచారణ జరుపుతున్న ఎటిసి న్యాయమూర్తి సొహైల్ అక్రమ్‌ను పంజాబ్ జ్యుడిషియల్ సర్వీసెస్‌కు బదిలీ చేసి, ప్రస్తుతం ఈ కేసు విచారణను జస్టిస్ కౌసర్ అబ్బాస్ జైదీకి బదిలీ చేశారని, అక్రమ్ కంటే ముందు అబ్బాస్ జైదీ ఎటిసి న్యాయమూర్తిగా వ్యవహరించారని ఆ అధికారి తెలిపారు.