జాతీయ వార్తలు

ప్రవాసుల మనసుల్లో ‘మన్‌కీ బాత్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన ‘మన్‌కీబాత్’ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా విస్తృతస్థాయి ప్రతిస్పందన వస్తోందని ఆకాశవాణి విదేశీ విభాగం డైరెక్టర్ అమలం జ్యోతి మజుందార్ వెల్లడించారు. దాదాపు 150 దేశాల్లో నెల వారీగా మన్‌కీబాత్ ప్రసారం అవుతోందని, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయుల్లో అలాగే భారత సంతతికి చెందిన వారిలో దీని పట్ల ఎనలేని ఆసక్తి వ్యక్తమవుతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ హిందీలోనే మన్‌కీ బాత్ ప్రసంగం చేస్తున్నప్పటికీ, దాన్ని అంగ్లంలోనూ సంక్షిప్త సారాంశాన్ని రష్యా, ఫ్రెంచి, ఉర్దూ, చైనా సహా అనేక ఇతర భాషల్లోనూ అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రసంగానికి ప్రవాసభారతీయుల నుంచి అనూహ్యంగా ప్రతిస్పందన వస్తున్నదని వెల్లడించిన ఆయన తమ మాతృదేశంలో జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత కూడా వారికి ఉండటం ఇందుకు కారణమని మజుందార్ తెలిపారు. మోదీ ప్రసంగాన్ని ఎప్పుడు ప్రసారం చేసినా అనూహ్య స్పందనతో పాటు, ఎన్నో సందేశాలు వస్తున్నాయని గుజరాతీ సంతతికి చెందిన ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న ఆఫ్రికా దేశాల నుంచి ఈ స్పందనలు అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. అలాగే గల్ఫ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా తదితర దేశాల నుంచి వస్తున్న ప్రతిస్పందనలు కూడా తక్కువేమీ కాదన్నారు. న్యూజిలాండ్‌కు చెందిన ఒక పౌరుడైతే ‘‘మోదీ హిందీ ప్రసంగం సమ్మోహనంగా ఉంది. ఆయన మా దేశానికి ఎప్పుడు వస్తారు’’ అని అడిగినట్లు మజుందార్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దుపై దేశీయంగా విమర్శలు వస్తున్నప్పటికీ, ఇతర దేశాల్లో ఉంటున్న భారతీయులు మాత్రం నల్లధనం నిర్మూలనపై వేసిన ముందడుగుగా హర్షిస్తున్నారన్నారు. నరేంద్రమోదీకి ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో అభిమానులు ఉండటం కూడా ఈ ప్రతిస్పందనలకు ఒక కారణమని ఆయన వెల్లడించారు.

తలాఖ్ అంతం కావలసిందే
షబానా అజ్మీ
లూధియానా, మే 21: ట్రిపుల్ తలాఖ్ అమానవీయమైనదని, ప్రతి ముస్లిం మహిళ వౌలిక హక్కులకు అది వ్యతిరేకమైందని బాలీవుడ్ నటి, మహిళా హక్కుల ఉద్యమ నాయకురాలు షబానా అజ్మీ అన్నారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడడం ప్రభుత్వ విధి అని, తలాఖ్ వ్యవస్థను రద్దు చేసే విషయంలో రెండో ఆలోచనే ఉండకూడదని కూడా ఆమె అన్నారు. ట్రిపుల్ తలాఖ్ అనేది పూర్తిగా అమానవీయమైనది, ముస్లిం మహిళలకున్న సాధికారికత, సమానత్వ హక్కులను హరించి వేస్తోందని షబానా అజ్మీ ఆదివారం పంజాబ్‌లోని లూధియానాలో విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. అంతకు ముందు షబానా అజ్మీ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఒక సమాజంలో మహిళలు ఏ మేరకు సాధికారికత పొందారనే దానిని బట్టే ఆ సమాజం అభివృద్ధిని అంచనా వేయాలని అన్నారు. ‘సాధికారికత పొందిన మహిళలు మిగతా మహిళల సాధికారికత సాధించేందుకు కృషి చేయాలి, వాళ్లు సపోర్టు గ్రూపులను ఏర్పాటు చేయాలి’ అని షబానా అన్నారు.
ప్రభుత్వమే చట్టం చేస్తుంది
బెంగళూరు: ట్రిపుల్ తలాఖ్‌కు ముగింపు పలకడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాఖ్‌ను ఆపడానికి ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకు వస్తుందని, అయితే ముస్లింలు అంతర్గత చర్చల తర్వాత ఒక సానుకూల నిర్ణయానికి వచ్చేలా చేసిన తర్వాతే ఈ చట్టాన్ని తీసుకు వస్తామని శనివారం ఇక్కడ డాక్టర్ ఎంఎస్ రామయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ వెంకయ్య చెప్పారు. వరకట్నం, సతీ సహగమనం, బాల్య వివాహాలులాంటి అనేక సామాజిక రుగ్మతల విషయంలో హిందూ సమాజం ముందుకు రావడంతో వాటిని రద్దు చేయడానికి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆయన అంటూ, ముస్లింలు సైతం హిందువులలాగానే ముందుకు వచ్చి తలాఖ్‌కు ముగింపు పలకాలని అన్నారు.
రైలు మార్గాల
పరిశుభ్రతపై సర్వే
పనితీరు ఆధారంగా జోన్లకు ర్యాంకులు
న్యూఢిల్లీ, మే 21: పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత విస్తరిస్తున్న రైల్వే శాఖ ఎప్పుడూ రద్దీగా ఉండే రైలు మార్గాల్లో పరిశుభ్రతపై స్వతంత్ర సంస్థతో సర్వే చేయించడంతో పాటు దేశంలోని మొత్తం 16 రైల్వే జోన్లకు పనితీరు ఆధారంగా ర్యాంకులను కేటాయించనుంది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో 407 రైల్వే స్టేషన్లపై నిర్వహించిన ఇదేవిధమైన సర్వే ఫలితాలను రైల్వే శాఖ ఇటీవల విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న పారిశుద్ధ్య ఉద్యమంలో భాగంగా రైల్వే ట్రాక్‌లను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అన్నివిధాలుగా ప్రయత్నించబోతున్నట్లు ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో రైళ్ల నుంచి ప్రయాణికులు విసిరేస్తున్న వ్యర్థాలు, పేపర్ బాక్సులు, ప్లాస్టిక్ సీసాలు, ఆహార పదార్ధాలతో రైలు మార్గాలపై చెత్త పేరుకుపోతుండటం ఆందోళన కలిగిస్తోందని, ప్రత్యేకించి ఓపెన్ డిశ్చార్జి టాయిలెట్ల నుంచి వస్తున్న మానవ వ్యర్థాలు పేరుకుపోయి రైల్వే ట్రాక్‌లకు నష్టం వాటిల్లుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ఆశాభావం

పెల్లింగ్, మే 21: ఎన్డీఏ ప్రభుత్వం కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అయితే కాశ్మీర్‌లో అల్లర్లను రెచ్చగొట్టడం ద్వారా భారత్‌ను అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఆదివారం సిక్కింలోని పెల్లింగ్‌లో జరిగిన పౌరసన్మానం సందర్భంగా మాట్లాడుతూ హోం మంత్రి చెప్పారు. ‘అయితే కాశ్మీర్ సమస్యకు మా ప్రభుత్వం ఒక శాశ్వత పరిష్కారం కనుగొంటుందని మాత్రం చెప్పదలచుకున్నాను’ అని రాజ్‌నాథ్ అన్నారు. ఆయన అంతకుమించి వివరించలేదు.
గత ఏప్రిల్ 9న శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక జరిగిన రోజునుంచి కాశ్మీర్ లోయలో నిరంతరంగా హింస కొనసాగుతున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ రోజు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది చనిపోయారు. కేవలం 7.14 శాతం మంది ఓటర్లు మాత్రమో ఓటింగ్‌లో పాల్గొన్నారు. కాశ్మీర్‌లో భయోత్పాత పరిస్థితి దృష్ట్యా ఏప్రిల్ 12న అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ వాయిదా వేయాల్సి వచ్చింది. గత ఏడాది హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ కమాండర్ బుర్హన్ వనీ భద్రతా దళాల చేతిలో హతమైన తర్వాత చెలరేగిన హింసలో దాదాపు 80 మంది మృతి చెందారు. ‘కాశ్మీర్ మనది, కాశ్మీరీలు మనవాళ్లే, కాశ్మీయత్ కూడా మనదే. కాశ్మీర్ సమస్యకు మేము ఒక శాశ్వత పరిష్కారం కనుగొంటాం’ అని రాజ్‌నాథ్ అన్నారు. 2014లో మోదీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారాన్ని ఆయన ప్రస్తావిస్తూ, అన్ని దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని అనుకుంటున్నామని చాటి చెప్పడం కోసం పాకిస్తాన్ సహా అన్ని పొరుగుదేశాల నేతలను ఆ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించామని చెప్పా రు. అయితే భారత్ పట్ల పాక్ వైఖరి మారలేదని, మన దేశాన్ని అస్థిరపర్చడానికే అది ఇంకా ప్రయత్నిస్తూనే ఉందని ఆయన అన్నారు. పాకిస్తాన్ మారుతుందని తాము ఆశించామని, అయితే అది మారలేదని ఆయన అంటూ, ప్రపంచీకరణ తర్వాత ఒక దేశం మరో దేశాన్ని అస్థిరపర్చలేదని, ఎందుకంటే ప్రపంచ దేశాలు దాన్ని మరిచిపోవని అన్నారు. సరిహద్దు రాష్టమ్రయిన సిక్కింలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన రాజ్‌నాథ్ భారత్-చైనా సరిహద్దు వెంబడి భద్రతా పరిస్థితిని, అభివృద్ధి కార్యకలాపాలను సమీక్షించడం కోసం అయిదు రాష్ట్రాల సమావేశంలో పాల్గొనడం తెలిసిందే. ఆయన నాతులా సరిహద్దు పోస్టుతో పాటుగా భారత్-టిబెట్, భారత్, నేపాల్ సరిహద్దుల్లోని కొన్ని ఐటిబిపి, ఎస్‌ఎస్‌బి పోస్టులను కూడా సందర్శించారు.

సిక్కింలో 36వ బెటాలియన్ నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్నకేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్

రాష్టప్రతి అభ్యర్థిని
ఇంకా నిర్ణయించలేదు
బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్పష్టీకరణ
న్యూఢిల్లీ, మే 21: త్వరలో జరుగనున్న రాష్టప్రతి ఎన్నికల్లో అధికార ఎన్‌డిఎ కూటమి అభ్యర్థిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భగవత్‌ను బరిలోకి దింపాలని శివసేన చేసిన ప్రతిపాదనను బిజెపి తిరస్కరించినప్పటికీ ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలన్న దానిపై ఆ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జూలైలో జరిగే ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రతిపక్షాలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినప్పటికీ బిజెపి మాత్రం ఇంకా తమ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ‘ఆజ్‌తక్’ టెలివిజన్ చానల్ ఇంటర్వ్యూలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్టప్రతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఎవరి పేరైనా తన మదిలో ఉన్నప్పటికీ దాని గురించి తొలుత పార్టీలో చర్చించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. మోహన్ భగవత్ గురించి శివసేన చేసిన ప్రతిపాదనను అమిత్ షా తిరస్కరిస్తూ, ఈ ప్రతిపాదనను ఆ పార్టీయే తోసిపుచ్చిందన్నారు. కాశ్మీరులో ఎన్నో నెలల నుంచి అశాంతి కొనసాగుతుండటం పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితిని మోదీ ప్రభుత్వం అదుపులోకి తీసుకొస్తుందని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాశ్మీరులో వాస్తవిక పరిస్థితికి, దానిపై జరుగుతున్న ప్రచారానికి మధ్య చాలా అంతరం ఉందని, ఆ రాష్ట్రంలోని మూడు, నాలుగు జిల్లాల్లో మాత్రమే గందరగోళ పరిస్థితులు ఉన్నాయని అమిత్ షా తెలిపారు.