జాతీయ వార్తలు

చావండని నా వాళ్లకు చెప్పలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 28: రాళ్ల దాడినుంచి బయట పడేందుకు ఆర్మీ అధికారి ఒకరు ఆందోళనకారుడిని మానవ కవచంగా చేసుకొని జీపు బాయ్‌నెట్‌కు కట్టడాన్ని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గట్టిగా సమర్థిస్తూ జమ్మూ, కాశ్మీర్‌లో జరుగుతున్నది ఓ అసహ్యకరమైన యుద్ధమని, దాన్ని ఎదుర్కోవాలంటే వినూత్నమైన మార్గాలు కావాలని అన్నారు. జమ్మూ, కాశ్మీర్‌లో పరిస్థితిపై పిటిఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారిగా స్పందించిన రావత్ ఎంతో ఉద్వేగంతో మాట్లాడారు. అంతేకాదు ఒక్కోసారి ఆవేదనకు కూడా గురయ్యారు. ‘ఆందోళనకారులు మాపై రాళ్లదాడి చేస్తున్నారు. అప్పుడు మా జవాన్లు వచ్చి మేము ఏం చేయాలని అడిగితే నేను ఏం చెప్పాలి? చివరిదాకా వేచి చూసి చనిపొమ్మని చెప్పాలా? ఓ మంచి శవపేటికను, దానిపై కప్పేందుకు త్రివర్ణ పతకాన్ని తీసుకువచ్చి మీ శవాలను మీ ఇళ్లకు గౌరవప్రదంగా పంపిస్తానని చెప్పాలా? ఆర్మీ చీఫ్‌గా నేను వాళ్లకు చెప్పాల్సింది ఇదేనా? ఆ పని చేయలేను. అక్కడ విధి నిర్వహణలో ఉన్న నా జవాన్ల ఆత్మస్థైర్యాన్ని నేను కాపాడాలి’ అని రావత్ అన్నారు. ‘కాశ్మీర్‌లో జరుగుతున్నది పరోక్ష యుద్ధం. పరోక్ష యుద్ధం ఒక అసహ్యకరమైన యుద్ధం. దానికి మామూలుగా శత్రువుతో ముఖాముఖి తలపడే యుద్ధాల్లో పాటించే నియమ నిబంధనలు ఏమీ ఉండవు. దాన్ని ఎదుర్కోవాలంటే వినూత్నమైన మార్గాలు అవసరం’ అని కూడా ఆయన అన్నారు. ‘ఆందోళనకారులు మా జవాన్లపై రాళ్ల దాడి చేసే బదులు ఆయుధాలతో కాల్పులు జరిపితే నేను సంతోషిస్తాను. అప్పుడు నేను ఏం చేయాలో అది చేస్తాను’ అని కూడా ఆయన అన్నారు.
53వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన మేజర్ లీటుల్ గొగోయ్ ఇటీవల జమ్మూ, కాశ్మీర్‌లో రాళ్లు రువ్వుతున్న జనంనుంచి తప్పించుకోవడానికి ఒక కాశ్మీరీని రక్షణ కవచంగా జీపు బానెట్‌కు కట్టుకోవడం తెలిసిందే. సోషల్ మీడియా ఈ చిత్రం రావడంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అయితే ఆ తర్వాత గొగోయ్ తాను ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. అనేకమంది అమాయకుల ప్రాణాలను కాపాడడం కోసమే ఆ పని చేసినట్లు చెప్పారు. లీతుల్‌పై కోర్టు ఆఫ్ ఎంక్వైరీ పూర్తయి తీర్పు వెలువడే సమయంలో తాను ప్రశంసాపత్రంతో అతడ్ని సత్కరించడాన్ని రావత్ గట్టిగా సమర్థించుకున్నారు. ఆర్మీ అధికారుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కోసమే తాను అలా చేసినట్లు చెప్పారు. సైనికులకు ఆత్మ రక్షణ హక్కు ఉందని, జనంపై కాల్పులు జరిపే మార్గాన్ని మేజర్ గొగోయ్ ఎంచుకొని ఉండవచ్చని, అయితే అతను ఆ పని చేయలేదని చెప్పారు. కాశ్మీర్‌లో వివిధ భద్రతా దళాల మధ్య ఉన్న విశ్వాసాన్ని భగ్నం చేయడానికి కుట్ర జరుగుతోందని రావత్ అన్నారు. ‘రేపు అనంత్‌నాగ్‌లో ఎన్నికలు జరపాల్సి ఉంది. అప్పుడు సైతం ఇలాంటి సంఘటనలే పునరావృతమైతే, సహాయంకోసం చేసే అభ్యర్థనలకు సైన్యం స్పందించకపోతే ప్రజలకు, పోలీసులకు, సైన్యానికి మధ్య ఉన్న విశ్వాసం దెబ్బతింటుందని ఆయన చెప్పారు. ఆందోళనకారులు మమ్మల్ని చూసి భయపడాలి. అదే సమయంలో జనంకూడా మమ్మల్ని చూసి భయపడాలి. మాది స్నేహపూర్వక సైన్యం. అయితే శాంతిభద్రతలను కాపాడాల్సి వచ్చినప్పుడు జనం మమ్మల్ని చూసి భయపడి తీరాలి’ అని రావత్ స్పష్టం చేశారు. కాశ్మీర్ శాంతిభద్రతల విషయంలో తాము అత్యంత సంయమనంతో వ్యవహరిస్తున్నట్లు ఆర్మీ చీఫ్ చెప్పారు. అయితే లోయలోని మూడు నాలుగు జిల్లాల్లో పరిస్థితి అదుపు తప్పితే మొత్తం రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని ఆయన చెప్పారు. కాగా, భారత్, పాక్‌ల మధ్య పరిమిత యుద్ధం వస్తుందని తాను అనుకోవడం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా రావత్ చెప్పారు.