జాతీయ వార్తలు

కార్మికులందరికీ ఇఎస్‌ఐసి వర్తించేలా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: ఇఎస్‌ఐసి కార్మికులందరికి సామాజిక న్యాయ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. దత్తాత్రేయ మంగళవారం ఇఎస్‌ఐసి 2016 సంవత్సరం క్యాలెండర్‌ను విడుదలు చేసిన అనంతరం మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఇఎస్‌ఐసి పథకాన్ని కార్మికులందరికీ వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్,మణిపూర్, మిజోరం, అండమాన్, నికోబార్‌లకు కూడా ఈ సేవలను విస్తరిస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఇప్పటివరకు 390 జిల్లాల్లో ఉన్న ఇఎస్‌ఐసి సేవలను త్వరలోనే మరో 650 జిల్లాలకు విస్తరిస్తామని దత్తాత్రేయ చెప్పారు. 2016 సంవత్సరం చివరి నాటికి దేశంలోని దాదాపు ముప్ఫై కోట్ల సంఘటిత, అసంఘటిత కార్మికులకు ఈ సేవలందించాలన్నదే తమ శాఖ లక్ష్యమని ఆయన ప్రకటించారు. 5.7 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులను సంఘటిత రంగం పరిధిలోకి తీసుకువచ్చి ఇఎస్‌ఐసి సేవలను అందజేస్తామని దత్తాత్రేయ తెలిపారు.
హైదరాబాద్‌లో ఇఎస్‌ఐసి ప్రాజెక్టులను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని ఆయన చెప్పారు. ఇఎస్‌ఐసి ఆసుపత్రులలో ప్రాథమిక సెకండరీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందిస్తామని దత్తాత్రేయ హామీ ఇచ్చారు. సనత్‌నగర్‌లోని ఇఎస్‌ఐసి వైద్య కళాశాలను ఈ సంవత్సరం ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. ఇఎస్‌ఐసి ద్వారా నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు తమ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. అఖిల భారత ప్రీ మెడికల్ ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన వారికే ఈ వైద్య కళాశాలలో సీట్లు కేటాయిస్తారన్నారు. అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ప్రవేశ పరీక్షలను పరిగణనలోకి తీసుకోకపోవటంతో రెండు రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశ అర్హత లేకుండా పోయిందని, ఇప్పటికైనా రెండు రాష్ట్రాల అధినేతలు పరస్పరం చర్చలు జరుపుకుని తనను సంప్రదిస్తే తగు నిర్ణయం తీసుకుంటామని, దీని వలన వైద్య విద్యను అభ్యిసించాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని దత్తాత్రేయ చెప్పారు.
రామగుండం ఎరువుల కార్మాగారం, థర్మల్ విద్యుత్ కేంద్రం, హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తి చూపిస్తున్నారని బండారు తెలిపారు. వీటి ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తేదీలు ఖరారు చేస్తే నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తారని ఆయన హామీ ఇచ్చారు. ప్రధాన మంత్రి తెలంగాణ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ టిఆర్‌ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలకు స్పందిస్తూ ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని దత్తాత్రేయ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్దికి అవసమైన నిధులను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విడుదలు చేస్తోందని ఆయన తెలిపారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నిన్న ఒక్క రోజే రహదార్ల అభివృద్ధికి 47 వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదా? అని దత్తాత్రేయ ప్రశ్నించారు. అభివృద్ధిని ఓట్లతో ముడిపెట్టటం ఎంత మాత్రం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. ఎలక్ట్రానికి మీడియాకు చెందిన జర్నలిస్టులను వేతనాల చట్టం పరిధిలోకి తెచ్చేందుకు త్వరలో త్రైపాక్షిక చర్చలు జరుపుతామని బండారు హామీ ఇచ్చారు.