జాతీయ వార్తలు

ఎయిర్ బేస్‌లలో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/గురుదాస్‌పూర్, జనవరి 6: పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై దాడి చేసిన ఉగ్రవాదులందరినీ ఏరివేశామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో మరి కొందరు తీవ్రవాదులు సైనిక దుస్తుల్లో కనిపించారంటూ వెలుగు చూసిన నిఘా హెచ్చరికలు కలకలం రేపాయి. గురుదాస్‌పూర్‌లోని సైనిక కేంద్రం సమీపంలో ఇద్దరు మిలిటెంట్లు సంచరిస్తున్నట్టుగా హెచ్చరికలు రావడంతో పశ్చిమ సెక్టార్‌లోని అన్ని వైమానిక కేంద్రాలనూ అప్రమత్తం చేశారు. మరి కొందరు ఉగ్రవాదులు పరారీలో ఉన్నారన్న కథనాలూ మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గురుదాస్‌పూర్‌లోని తిబ్రీ సైనిక కేంద్రం వద్ద మిలిటెంట్లు కనిపించారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఈ మొత్తం ప్రాంతాన్ని దిగ్బంధం చేశారు. మరో పక్క రానున్న పర్వదిన సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. సంక్రాంతి, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా గరిష్ఠ స్థాయిలో దేశంలోని అన్ని కీలక కేంద్రాల వద్ద అప్రమత్తత పాటించాలని, ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు పోలీసు దళాలు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల్లో ప్రయాణికుల తనిఖీలను విస్తృతంగా చేపడుతున్నారు. చేతి బ్యాంగ్‌లనే కాకుండా కాళ్లకు వేసుకునే చెప్పులు, బూట్లనూ సోదా చేస్తున్నారు. ఇందుకోసం సిఐఎస్‌ఎఫ్, విమానాశ్రయ భద్రతా దళాలను నియోగించారు. విమానం ఎక్కే ముందుకు కూడా ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలంటూ వీరికి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దేశంలో నెలకొన్న భద్రతా పరిస్థితితో పాటు నిఘా వర్గాలు చేస్తున్న హెచ్చరికలనూ దృష్టిలో పెట్టుకుని తనిఖీ చర్యలను, అన్ని చోట్లా రక్షణను ముమ్మరం చేసినట్టు చెబుతున్నారు. గతంలో కూడా పర్వదినాల సమయంలో ఈ తరహా తనిఖీలు నిర్వహించినప్పటికీ పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో అదనపు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందని చెబుతున్నారు. అన్ని కీలక విమానాశ్రయాల వద్ద సైన్యానికి చెందిన మెరుపుదళ కమెండోలను, స్థానిక పోలీసులను నియోగించారు. రానున్న రెండు మూడు వారాల్లో పోలీసులు, దళాలు భారీ సంఖ్యలో అందుబాటులో ఉండే విధంగా వారి సెలవులనూ నియంత్రించారు. అన్ని చోట్లా కూడా వివిధ విభాగాల్లో ఆరితేరిన దళాలను సంసిద్ధం చేశారు.