జాతీయ వార్తలు

ముఫ్తీ మొహమ్మద్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సరుూద్ కన్నుమూశారు. ఇక్కడి అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్)లో కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న 79ఏళ్ల సరుూద్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యానికి గురయిన సరుూద్‌ను గత నెల 24న శ్రీనగర్‌నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి తీసుకువచ్చి ఎయిమ్స్‌లో చేర్పించిన విషయం తెలిసిందే. నిమోనియా వ్యాధితో పాటు ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్ (సెప్సిస్)తో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతుండగానే ఆయన రక్తంలోని ప్లేట్‌లెట్‌ల సంఖ్య ప్రమాదకర స్థాయికి పడిపోయిందని డాక్టర్లు చెప్పారు. సరుూద్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సరుూద్ భౌతికకాయాన్ని భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో శ్రీనగర్‌కు తరలించారు. సరుూద్ స్వగ్రామమైన దక్షిణ కాశ్మీర్‌లోని బిజ్‌బెహరా గ్రామంలో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేస్తారని భావిస్తున్నారు.
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పదవిలో ఉండగానే మృతిచెందిన రెండో వ్యక్తి సరుూద్. గతంలో షేక్ మొహమ్మద్ అబ్దుల్లా 1982 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రిగా ఉండగానే మృతిచెందారు. ముఫ్తీ మృతితో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. గురువారం సెలవుదినంగా ప్రకటించింది. పతాకాలను అవనతం చేశారు. పిడిపి-బిజెపి కూటమినుంచి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా సరుూద్ గత సంవత్సరం మార్చి ఒకటిన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ముస్లిం మెజారిటీ రాష్టమ్రైన జమ్మూకాశ్మీర్‌లో బిజెపితో జట్టుకట్టడం అసాధ్యమని అంతా భావిస్తున్న పరిస్థితుల్లో ఆ పార్టీతో దోస్తీ చేసి అధికారంలోకి రావడమే కాకుండా ఆ పార్టీకి సైతం మొట్టమొదటిసారి అధికారంలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా సరుూద్ సంచలనం సృష్టించారు. 1987 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సరుూద్ తరువాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి వి.పి.సింగ్‌తో కలిశారు. 1989లో వి.పి.సింగ్ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఆయన కీలకమైన హోంమంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. కేంద్రంలో హోంమంత్రిగా పనిచేసిన తొలి ముస్లింగా ఆయన రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టడం ద్వారా సరుూద్ 2002 నుంచి 2005 వరకు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో మొదటిసారి పిడిపి-బిజెపి కూటమి ఏర్పాటులో ఆయన కీలక భూమిక పోషించారు.
కొత్త ముఖ్యమంత్రి మెహబూబా?
ముఫ్తీ మొహమ్మద్ సరుూద్ మృతితో ఆయన కుమార్తె 56 ఏళ్ల మెహబూబా జమ్మూకాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నారు. ఈ విషయంలో పిడిపి నాయకులంతా ఆమెకు గట్టిగా మద్దతిస్తున్నారు. అయితే ఇందుకు బిజెపి ఒప్పుకోవాల్సి ఉంది. 87 స్థానాలున్న జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో పిడిపి 28 స్థానాల్లో, బిజెపి 25 స్థానాల్లో, ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ 15 స్థానాల్లో, కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలుపొందాయి.
మోదీ, రాజ్‌నాథ్ నివాళులు
సరుూద్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సరుూద్ భౌతికకాయాన్ని శ్రీనగర్‌కు తరలించడానికి ముందు ఇక్కడి పాలం టెక్నికల్ ఏరియాలో ఆయన భౌతికకాయం వద్ద మోదీ, రాజ్‌నాథ్ నివాళులర్పించారు. సరుూద్ మృతికి సంతాపంగా గురువారం దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సరుూద్‌కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది.