జాతీయ వార్తలు

సంస్కరణల్లో కలగలిసిన మతతత్వం, కేంద్రీకృత అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జనవరి 9: బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకుపోవడానికి మతతత్వ అజెండాను అమలు చేయడంతోపాటు కేంద్రీకృత రాజ్య నిర్మాణానికి పూనుకుంటోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ప్రజలు ఈ రెండు సవాళ్లకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎకెజి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ స్టడీస్ ఇక్కడ ‘కేరళ స్టడీస్’పై రెండు రోజులపాటు నిర్వహించే నాలుగో అంతర్జాతీయ సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి మద్దతుతో ఎన్‌డిఏ ప్రభుత్వ హయాంలో దేశంలో నూతన సంస్కరణలను అమలు చేయడానికి మతతత్వ అజెండా, కేంద్రీకృత రాజ్య నిర్మాణం కలగలిసి పోయాయని వివరించారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తూ ఎన్‌డిఏ సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రమాదకరమయిందని ఏచూరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్‌డిఏ ప్రభుత్వం అమలు చేస్తున్న మతతత్వ అజెండా, ఏక కేంద్రక ఆర్థిక వ్యవస్థ దేశానికి ప్రమాదకరమని పేర్కొంటూ ఈ రెండు సవాళ్లకు వ్యతిరేకంగా ప్రజలు ఇప్పుడు పోరాడవలసిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రాల హక్కులు తగ్గిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర నిధులను రాష్ట్రాలకు ఎలా బదిలీ చేస్తారనే అంశంపై నీతి ఆయోగ్ వ్యవస్థలో స్పష్టత లేదని ఆయన వెల్లడించారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ అవుతున్న నిధుల మొత్తం తగ్గుతోందని, ఏళ్లు గడిచినాకొద్దీ ఇది మరింత తగ్గుతుందని ఏచూరి వివరించారు.
ప్రణాళికా సంఘం పేరు మాత్రమే మారలేదని దాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేయడం వల్ల దేశ ఆర్థిక ప్రణాళికను రూపొందించడంలో ప్రజాస్వామికంగా ఎన్నికయిన రాష్ట్రాల పాత్ర లేకుండా పోయిందని ఏచూరి వివరించారు. రాష్ట్రాలు అమ్మకం పన్ను (సేల్స్ ట్యాక్స్)ను విధించడం ద్వారా మాత్రమే వనరులను సమీకరించుకుంటున్నాయని, ప్రతిపాదిత వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)లో దీన్ని తొలగించారని ఆయన పేర్కొన్నారు. ఇది రాష్ట్రాలకు చాలా ప్రమాదకరమని, అందుకే వామపక్షాలు జిఎస్‌టి బిల్లును వ్యతిరేకిస్తున్నాయని ఆయన వివరించారు. ఈ బిల్లు ఇలాగే చట్టరూపం దాల్చితే రాష్ట్రాలు నిధులకోసం కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కార్పొరేట్లు, దేశీయ కార్పొరేట్లు గరిష్ఠంగా లాభాలు పొందడానికే ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారని ఏచూరి చెప్పారు.

ఆర్థిక విధానాల విషయంలో కాంగ్రెస్, బిజెపిలకు మధ్య పెద్దగా తేడా లేదని, అందువల్లే ప్రభుత్వం జిఎస్‌టి బిల్లుపై కేవలం కాంగ్రెస్ పార్టీతోనే చర్చిస్తోందని, అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అన్ని పక్షాలతో చర్చించడానికి ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు.