జాతీయ వార్తలు

అది అంతర్గత కుట్రే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంలో ఉగ్రవాదులు జరిపిన దాడికి దారితీసిన కారణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. లోపాలను కూపీ లాగేందుకు విస్తృత దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఓ దిగ్భ్రాంతికర వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది. అంతర్గత కుట్ర కారణంగానే ఈ ఉగ్రవాద దాడి జరిగిందని స్పష్టమైన సంకేతాలు అందాయని, ఈ విషయాన్ని నిర్ధారించేందుకు దాదాపు మూడువేల మంది వైమానిక సిబ్బంది ఫోన్ రికార్డులను ఎన్‌ఐఏ పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని రహస్య డాక్యుమెంట్లను ఐఎస్‌ఐకి చెందిన నిఘా వర్గాలకు అందించారన్న ఆరోపణలపై ఎయిర్‌ఫోర్స్ అధికారి రంజిత్ కె.కె.ను అరెస్టు చేశారు. యుకెకు చెందిన ఓ రక్షణ పత్రికలో రక్షణ విశే్లషకుడిగా రంజిత్ పనిచేస్తున్నాడు. అయితే ఈ కుట్రలో తనకు తెలియకుండానే ఇరుక్కుపోయాడని, అరెస్టు జరిగేవరకు కూడా ఈ వాస్తవం అతనికీ తెలియదని ఎన్‌ఐఏ వార్గలు చెబుతున్నాయి.

విదేశీ పర్యటనలపై కేంద్రం ఆంక్షలు
మార్గదర్శకాలను సవరించిన ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ, జనవరి 14: బ్యూరోక్రాట్ల అధికారిక విదేశీ పర్యటనలకు కళ్లెం పడింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరించిన మార్గదర్శకాల ప్రకారం బ్యూరోక్రాట్లు ఒక సంవత్సరంలో గరిష్ఠంగా నాలుగుసార్లు మాత్రమే విదేశాల్లో పర్యటించడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ శాఖల కార్యదర్శులు తప్పనిసరి పరిస్థితుల్లో మినహా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న రోజుల్లో విదేశాలకు వెళ్లకూడదు. ఒక ప్రభుత్వ శాఖ మంత్రి, కార్యదర్శి ఒకేసారి విదేశాలకు వెళ్లకూడదు. సంవత్సరంలో నాలుగుసార్లకు మించి విదేశాలకు వెళ్లాలంటే సదరు ప్రభుత్వ కార్యదర్శి ప్రధానమంత్రి ఆమోదం పొందవలసి ఉంటుంది. భారత ప్రభుత్వ అధికారులు, ప్రతినిధి బృందాల విదేశీ ప్రయాణాలను నియంత్రించడానికి, మరింత సమర్థవంతం చేయడానికి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలను సమీక్షించి సవరించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యూరోక్రాట్లు విదేశాలకు వెళ్లాలంటే స్క్రీనింగ్ కమిటీ ఆఫ్ సెక్రెటరీస్ (ఎస్‌సిఒఎస్) అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వరంగ సంస్థల, స్వయంప్రతిపత్తి గల సంస్థల అధికారులు తమ విదేశీ పర్యటనలకు స్క్రీనింగ్ కమిటీ అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. సవరించిన తాజా మార్గదర్శకాల ప్రకారం విదేశీ సందర్శనలు అయిదు పని దినాలకు మించకూడదు.

సోనియాకిచ్చిన ఆఫర్ వెనక్కి
పార్లమెంటు కొనసాగింపుపై నా సలహా
పాటించలేదు: రాంజఠ్మలానీ వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 14: నేషనల్ హెరాల్డ్ కేసులో వాదిస్తానంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఇచ్చిన ఆఫర్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రముఖ న్యాయవాది రామ్‌జఠ్మలానీ వెల్లడించారు. పార్లమెంటును సజావుగా కొనసాగించాలన్న తన సలహాను సోనియాగాంధీ పట్టించుకోకపోవడం వల్లే తన ఆఫర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసి కేసులు తప్పుడు కేసులని, దురుద్దేశపూరితమైనవి తను ముందే స్పష్టం చేశానని, అదే సమయంలో వారి తరఫున వాదించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ సోనియా డిసెంబర్ 10న లేఖ కూడా రాశానని జఠ్మలానీ స్పష్టం చేశారు. అయితే సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసింది తప్పుడు కేసున్న విషయాన్ని కోర్టులో రుజువు చేయాలి తప్ప, రాజ్యసభ కార్యకలాపాలను స్తంభింపచేయడం ద్వారా కాదని తన లేఖలో సోనియాకు స్పష్టం చేశానన్నారు. రాజ్యసభలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఎంతమాత్రం సమంజసమైనవి కావంటూ ఒక న్యాయవాదిగా, పార్లమెంటేరియన్‌గా కూడా సోనియాకు స్పష్టం చేశానన్నారు.

జల్లికట్టును అనుమతించండి
తమిళనాట మూడోరోజూ నిరసనల హోరు
చెన్నై/మధురై, జనవరి 14: తమిళనాడు సంస్కృతిలో భాగంగా ఉన్న జల్లికట్టు క్రీడను అనుమతించాలంటూ మూడోరోజైన గురువారం కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మద్దతు ర్యాలీలు జరిగాయి. ఈ క్రీడను అనుమతించేది లేదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై ఈ నెల 17న తాము నిరాహారీ దీక్ష చేపడతామని ప్రజా సంక్షేమ ఫ్రంట్ వెల్లడించింది. మరోపక్క చెన్నై, మధురై, తిరుచిరాల్లి సహా అనేక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. జల్లికట్టుకు అనుమతించాల్సిందేనంటూ భారీఎత్తున ఊరేగింపులు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వ్యక్తులు నల్లజెండాలతో తమ నిరసన తెలిపారు. అనేకమంది గుండు గీయించుకున్నారు. మరోపక్క జల్లికట్టుకు అనుమతించడంపై రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్రం చర్యలు తీసుకోవాలంటూ రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. జల్లికట్టుపై అనిశ్చిత పరిస్థితి ఏర్పాడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణే కారణమని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలంగోవన్ ఆరోపించారు. పరిస్థితి ఏమాత్రం శ్రుతి మించకుండా ఈ క్రీడ నిర్వహించేందుకు ఓ ఆర్డినెన్స్ జారీచేయాలని పిఎంకె అధ్యక్షుడు రామదాసు డిమాండ్ చేశారు. ఈ విషయంలో విఫలమయ్యే ప్రభుత్వాలను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరని, అధికారంలో ఉన్న పార్టీలు జీవితంలో మర్చిపోలేని తీర్పునిస్తారని పేర్కొన్నారు.