జాతీయ వార్తలు

పదిహేనేళ్లుగా చేసిందేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోక్రాజార్ (అసోం), జనవరి 19: గత పదిహేను సంవత్సరాలుగా అసోంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏ విధంగానూ అభివృద్ధి చేయలేకపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ప్రచార కార్యక్రమానికి మంగళవారం నాడిక్కడ శ్రీకారం చుట్టిన నరేంద్ర మోదీ అనేక కీలక ప్రకటనలు చేశారు. రెండు కమ్యూనిటీలకు గిరిజన హోదా కల్పిస్తామని వెల్లడించారు. బిజెపి, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడిన మోదీ, తమ పార్టీకి పగ్గాలు అప్పగిస్తే, బోడోలాండ్ ప్రాదేశిక మండలి పరిధిలోని ప్రాంతాల సమగ్ర వికాసానికి కృషిచేస్తామన్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వాలు దగా చేస్తూనే వచ్చాయని విమర్శించారు. రాష్ట్రంలో 15 సంవత్సరాల పాటు ఒకే పార్టీ అధికారంలో ఉన్నా, మన్మోహన్ సింగ్‌ను ప్రధాన మంత్రిగా పదేళ్లపాటు ఎన్నుకున్నా అస్సాం అనేక సమస్యల కూపంలో చిక్కుకుపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. పదిహేనేళ్లపాటు నిష్క్రియాపరత్వంగా పాలన సాగించిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు పదిహేను నెలల వ్యవధిలోనే అన్ని సమస్యలూ పరిష్కరించాలని తమపై వత్తిడి తేవడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. అసోంకు సంబంధించినంతవరకు సమస్యల జాబితాకు అంతూపొంతూ లేదని, అసలు అభివృద్ధే కనిపించడం లేదని మోదీ తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కేంద్రంలోని గత యుపిఏ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో తప్పుబట్టిన మోదీ అసోం ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఈడేర్చడంలో నాటి కేంద్ర, నేటి ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇప్పుడు తన ప్రభుత్వం ఏమి చేసిందంటూ విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతలు, గత పదిహేను సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ప్రజలకు ఏమి చేశారు, పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా అసోంకు ఒరగబెట్టింది ఏమిటని మోదీ ప్రశ్నించారు. ముఖ్యంగా అసోం నుంచి ఎన్నికైన వ్యక్తే దేశానికి ప్రధానిగా పదేళ్లు పనిచేసినా ఈ ఈశాన్య రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం ఏమీ లేదని మోదీ తెలిపారు. ‘పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనను 15 నెలల నా ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని బేరీజు వేసుకోండి, తేడా చాలా విస్తృతంగానే కనిపిస్తుంది’ అని మోదీ వెల్లడించారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న బోడోలు, మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న కర్బీ తెగలకు గిరిజన హోదా కల్పిస్తామని ప్రకటించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైందని వెల్లడించారు. కేవలం అభివృద్ది ద్వారానే అసోం సమస్యలను పరిష్కరించగలుగుతామని, ఈ విషయంలో రాష్ట్రం ప్రజలకు మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నారని మోదీ తెలిపారు. ఢిల్లీ పోలీసు వ్యవస్థలో ఈశాన్య భారతానికి చెందిన యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని తాను ఆదేశాలు జారీచేశానని, ఈ దిశగానే నియామకాలు జరుగుతున్నాయని మోదీ తెలిపారు. కోక్రాజార్‌లో ఉన్న కేంద్ర సాంకేతిక సంస్థకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పిస్తామని, అలాగే సీల్దా-గౌహతి కాంచన్‌గంగ ఎక్స్‌ప్రెస్‌ను బరాక్‌లోయ వరకు విస్తరిస్తామని తెలిపారు.
అలాగే దుబ్రీ ప్రాంతంలోని రుప్సీ విమానాశ్రయాన్ని భారత వైమానిక దళాలు చేపడతాయని వెల్లడించారు. 126 స్థానాలు కలిగిన అసోం అసెంబ్లీకి మరో నాలుగు రాష్ట్రాలతోపాటు ఏప్రిల్, మే నెల మధ్యలో ఎన్నికలు జరుగుతాయి.
చిత్రం..
కోక్రాజార్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో బోడోలాండ్ పీపుల్స్ అధినేత హగ్రామ మోహిలరి, కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్, జితేంద్ర సింగ్.

గౌహతిలో మంగళవారం బిజెపి నిర్వహించిన యువ ర్యాలీలో సాంప్రదాయక అస్సామీ టోపీతో ప్రధాని నరేంద్ర మోదీ