జాతీయ వార్తలు

మైత్రీ బంధం మరింత విస్తరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలెం, జనవరి 19: భారత ఆర్థిక వ్యవస్థతో అవధుల్లేని దీర్ఘకాలిక సంబంధాలను పెంపొందించుకోవాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఇజ్రాయెల్ వ్యాపార, వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ఇక్కడ ఉంటున్న భారతీయ సంతతిని ఉద్దేశించి మాట్లాడిన సుష్మా స్వరాజ్ దేశీయ భద్రత, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటికే ఇరు దేశాల సంబంధాలు పరిమితం కాకూడదని స్పష్టం చేశారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య అన్ని రంగాల్లోనూ ద్వైపాక్షిక మైత్రీ బంధం రానున్న రోజుల్లో విస్తృతం కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్త చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను ఉటంకిస్తూ, ‘ఆకాశమే హద్దు’ అని రెండు దేశాల మధ్య మైత్రీ బంధాన్ని విశే్లషించారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలూ విజ్ఞాన ఆధారితమైనవని, దీన్ని కీలక భాగస్వామ్య బంధంగా మార్చుకునేందుకు, మరిన్ని కొత్త పుంతలు తొక్కేందుకు గట్టి ప్రయత్నం జరగాలన్నారు. పశ్చిమాసియా ప్రాంతంతో పర్యటిస్తున్న సుష్మా స్వరాజ్ ఇందులో భాగంగా ఇజ్రాయెల్ నేతలతో విస్తృత చర్చలు జరిపారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలను చర్చించారు. ద్వైపాక్షిక బంధం మరింత విస్తరించాలంటే ఈ రెండు దేశాలు ఆర్థికంగా సన్నిహితం కావాల్సిన అవసరం ఎంతో ఉందని సుష్మా వెల్లడించారు. కేవలం వాణిజ్య ఆధారిత ప్రక్రియకే పరిమితం కాకుండా పెట్టుబడుల ఆధారిత వ్యవస్థ దిశగా ఇరు దేశాలు పురోగమించాలన్నారు. అలాగే ఉత్పాదక రంగం, సేవా రంగం కూడా ఇందులో కీలక భాగం కావాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం మేకిన్ ఇండియా కార్యక్రమానికి విస్తృత ప్రాధాన్యత నిస్తోందని, అలాగే స్వచ్ఛ గంగ, స్మార్ట్ సిటీలు, డిజిటల్ ఇండియా వంటి బృహత్తర ప్రాజెక్టులను చేపడుతోందని తెలిపారు. వీటన్నింటిలోనూ ఇజ్రాయెల్ నిరుపమాన అనుభవాన్ని, నైపుణ్యాన్ని సంతరించకుందని తెలిపారు. అందుకే ఇరు దేశాలు మరింత సన్నిహతం అయ్యే దిశగా అన్ని రంగాలకు ద్వైపాక్షిక అనుబంధాన్ని విస్తరించుకోవాలన్నారు.
ఇరు దేశాల మధ్య రాజకీయపరమైన అనుబంధం కూడా పెరుగుతోందని, ఇందుకు భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఇజ్రాయెల్‌లో పర్యటించడమే నిదర్శనమని తెలిపారు.

చిత్రం.. జెరూసలెంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సుష్మాస్వరాజ్, నెతన్యాహూ

స్థానిక అంశాలపై
దృష్టిపెట్టండి
వైద్య పరిశోధకులకు నడ్డా పిలుపు
న్యూఢిల్లీ, జనవరి 19: భారత్‌కు చెందిన వైద్యపరమైన అంశాలను ప్రాతిపదికగా తీసుకొని పరిశోధనలు నిర్వహించాలని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్)కు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా పిలుపునిచ్చారు. భారత ప్రజలు ఎదుర్కొంటున్న అనేక వైద్యపరమైన సమస్యలే ఈ పరిశోధనలకు ప్రాతిపదిక కావాలని, అలాగే జీవ వైద్య పరిశోధనల్లో భారతీయ సంప్రదాయక విజ్ఞానాన్ని కూడా జోడించాలని ఆయన కోరారు. అనేక అంశాలను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ తక్షణ అంశాలనే కేంద్రకంగా చేసుకుని సమగ్ర రీతిలో పరిశోధనలు జరపాలని వాటికి స్పష్టమైన సమాధానాన్ని కనుగొనాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా అత్యంత కీలకమైన పది ఆరోగ్య అంశాలను ఎంపిక చేసుకుని వాటికి స్థానిక పరిష్కారాలను కనుగొనే దిశగా పరిశోధనలు సాగాలన్నారు. ఐసిఎంఆర్‌లో మంగళవారం జరిగిన అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. సంప్రదాయిక వైద్య విధానాలను జోడించే విధంగా జీవ వైద్య పరిశోధన సమగ్ర రీతిలో జరగాలని ఈ సందర్భంగా నడ్డా కోరారు. ఏ పరిశోధన జరిపినా కూడా దానికి ఓ సమగ్రత ఉండాలే తప్ప ఏకపక్షంగా జరగడంలో ఉపయోగం లేదని ఉద్ఘాటించారు. ఈ విషయంలో ఐసిఎంఆర్ గురుతర బాధ్యతను చేపట్టాలని, ప్రతిభావంతులైన పరిశోధకులకు అవకాశాలను కల్పిస్తూ వనరుల వినియోగంలో మరింత నైపుణ్యాన్ని సంతరించుకునేలా చేయాలని కోరారు.

దత్తాత్రేయను
బర్తరఫ్ చేయాలి
కేంద్ర మాజీ మంత్రి సెల్జా డిమాండ్
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, జనవరి 19: హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసిన పరిస్థితులపై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో దర్యాప్తు చేయించాలని, కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయను మంత్రివర్గం నుండి వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు కుమారి సెల్జా డిమాండ్ చేశారు. పిహెచ్‌డి స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్యకు బండారు దత్తాత్రేయ, బిజెపి ఎమ్మెల్సీ రామచందర్‌రావు, స్థానిక ఏబివిపి కార్యకర్తలే కారణమని మంగళవారం ఆమె ఆరోపించారు. సెల్జా ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన వాస్తవాలను పరిశీలిస్తే బండారు దత్తాత్రేయ, రామచంద్రారావు, ఏబివిపి నాయకులు చేసిన దురాగతాల మూలంగానే దళిత విద్యార్థులు సస్పెండ్ అయ్యారనేది స్పష్టమవుతోందని చెప్పారు. దళితులు, బడుగు, బలహీన వర్గాల హక్కులను హరించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగానే దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారని ఆమె విమర్శించారు. కేంద్రంలో ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులు, బడుగు, బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోయాయని ఆమె చెప్పారు. దళితులను బహిష్కరించటం వల్లే రోహిత్ లాంటివారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సెల్జా అన్నారు. ఏబివిపి కార్యకర్తలు దళిత విద్యార్థులను హేళన చేశారని ధ్వజమెత్తారు. విశ్వవిద్యాలయం అధికారులు ఏబివిపికి మద్దతు ఇచ్చినందుకే దళిత విద్యార్థులపై సెంట్రల్ వర్శిటీలో దాడులు జరిగాయని చెప్పారు. దళిత వర్గానికి చెందిన ఐదుగురు పిహెచ్‌డి విద్యార్థులను గత ఆగస్టులో సస్పెండ్ చేశారని, విశ్వవిద్యాలయం ప్రోటోకాల్ బోర్డు రోహిత్ తప్పులేదని ప్రకటించిందని ఆమె చెప్పారు. ప్రోటోకాల్ బోర్డు క్లీన్‌చిట్ ఇచ్చినా బిజెపి నాయకులు రోహిత్ వెంట పెడ్డారని ఆమె దుయ్యబట్టారు. దళిత విద్యార్థులపై చర్య తీసుకోవాలంటూ మానవ వనరుల శాఖ హైదరాబాదు విశ్వవిద్యాలయం పాలకులకు ఐదు లేఖలు రాయటం ఆశ్చర్యంగా ఉందని సెల్జా తెలిపారు.

చైనా దూకుడుకు చెక్
అండమాన్‌లో పి-81
మోహరించిన భారత్
పోర్ట్‌బ్లెయర్, జనవరి 19: అండమాన్ నికోబర్ దీవుల్లోని మిలటరీ బేస్ వద్ద లాంగ్ రేంజ్ నావల్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ పోసీడోన్-81ను భారత్ మోహరించింది. చైనా జలాంతర్గాములు నిత్యం హిందూ మహాసముద్రం జలాల్లోకి చొచ్చుకురావడంతో భారత్ ఈ చర్యలు చేపట్టింది. అలాగే చైనా సబ్‌మెరైన్లను కనిపెట్టడానికి స్పైడ్రోన్‌లను భారత్ మోహరించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అండమాన్ నికోబర్ ద్వీపంలోని వ్యూహాత్మక స్థావరం వద్ద రెండు పోసీడోన్-81 గస్తీ విమానాలు మోహరించినట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. శత్రుదేశాల దాడులను పసిగట్టడం, నిఘావ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రత్యేకించి పి-81ను రూపొదించారు. పి-81లో హార్పూన్ బ్లాక్-2 క్షిపణలు, ఎంకె-54 తేలికపాటి టార్పేడోలు, రాకెట్లు, డెప్త్ చార్జెస్ ఉంటాయని వెల్లడించారు.

పాఠాలు నేర్వకే ‘పఠాన్‌కోట్’

జమ్మూకాశ్మీర్ గవర్నర్ వోహ్రా వ్యాఖ్య

న్యూఢిల్లీ, జనవరి 19: పఠాన్‌కోట ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి నేపథ్యంలో సరిహద్దుల్లో మరింత అప్రమత్తత అవసరమని జమ్మూకాశ్మీర్ గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా ఉద్ఘాటించారు. గతంలో సరిహద్దుల్లో జరిగిన ఉగ్రవాద దాడుల నుంచి గుణపాఠం చేర్చుకుని ఉంటే పఠాన్‌కోట్ దాడిని నిరోధించగలికి ఉండేవారమని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దులో మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించాల్సి ఉందని ఆయన అన్నారు. సరిహద్దుల్లో ఇటీవలి చొరబాట్లు, పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడిపై ఆయన నిర్మోహమాటంగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పంజాబ్‌ను కలుపుకొని 200-250 మేర విస్తరించి ఉన్న సరిహద్దుకు భద్రత కల్పించాల్సి ఉందన్న గవర్నర్ బిఎస్‌ఎఫ్ ఒక్కటే ఆ పనిచేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)ఏడో వార్షిక సమావేశాల్లో వోహ్రా కీలక ఉపన్యాసం చేశారు. కతువ మీదుగా 2013 సెప్టెంబర్ నుంచి ఐదారు ఉగ్రవాద దాడులు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో జరిగిన ఉగ్రవాద దాడుల నుంచి గుణపాఠం చేర్చుకుని ఉంటే పఠాన్‌కోట్ ఘటన జరిగి ఉండేది కాదని గవర్నర్ స్పష్టం చేశారు. గురుదాస్‌పూర్‌లోని దీనానగర్ పోలీసు స్టేషన్‌పై జరిగిన ఉగ్రవాద దాడిని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. దీనానగర్ పోలీసు స్టేషన్‌పై దాడి తరువాత నిఘా సమర్థవంతంగా పనిచేసి ఉంటే పఠాన్‌కోట్ దాడి చోటుచేసుకుని ఉండేది కాదని వోహ్రా వ్యాఖ్యానించారు. వోహ్రా ఎనిమిదేళ్లుగా జమ్మూకాశ్మీర్ గవర్నర్‌గా ఉంటున్నారు. అంతకుముందు కేంద్ర హోమ్ శాఖ, రక్షణశాఖకు సంబంధించి ప్రధాన మంత్రి వద్ద కార్యదర్శి హోదాలో పనిచేసిన అనుభవం ఉంది. ‘అత్యంత కీలకపైన సరిహద్దును కాపాడడం ప్రస్తుత పరిస్థితుల్లో బిఎస్‌ఎఫ్ వల్ల కాదు. పంజాబ్ వరకూ 200 నుంచి 250 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సరిహద్దులో రక్షణ ఎంతో సంక్లిష్టమైంది’ అని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాద చర్యలకు సంబంధించిన కేసుల విచారణకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు విముఖత వ్యక్తం చేయడంపై ఆయన మాట్లాడారు. దీనానగర్ పోలీసు స్టేషన్‌పై దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగించడానికి పంజాబ్ ప్రభుత్వం తిరస్కరించింది. 2015 జూలైలో జరిగిన దాడి ఘటనలో పదిమంది మృతి చెందారు. ముగ్గురు ఉగ్రవాదులూ మృతి చెందారు.

ఎస్‌పి ఆ బల్జీత్‌సింగ్ దాడిలో మరణించారు.