జాతీయ వార్తలు

ప్రశాంతంగా గణతంత్ర వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: ఉగ్రవాద దాడులు జరగవచ్చన్న ఇంటెలిజన్స్ నివేదికల హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం గణతంత్ర దినోత్సవ వేడుకలకోసం దేశవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద రిపబ్లిక్ డే వేడుకలు ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే దక్షిణ కాశ్మీర్‌లో గుర్తు తెలియని మిలిటెంట్ కాల్చివేత, పంజాబ్‌లోని పఠాన్‌కోట్ రైల్వే స్టేషన్‌లో వదిలిపెట్టి వెళ్లిన బ్యాగులో బాంబు ఉందన్న అనుమానాలు జనాన్ని, భద్రతా దళాలను అప్రమత్తం చేశాయి.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ ముఖ్య అతిథిగా హాజరయిన 67వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కోసం దేశ రాజధాని ఢిల్లీలో నింగినుంచి నేలదాకా కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేయడంతో అది ఒక దుర్భేద్యమైన కోటలాగా మారిపోయింది. నగరంలోని కొన్ని ముఖ్యమైన భవనాలపై ఉగ్రవాదులు దాడులు చేయవచ్చన్న ఇంటెలిజన్స్ నివేదికల కారణంగా వేలాది సాయుధ జవాన్లు రెప్ప వేయకుండా నిఘా పెట్టి ఉండడంతో మధ్య ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చీమకూడ చొరబడలేని దుర్భేద్యమైన కోటలాగా మారిపోయాయి. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత ఈ చర్యలన్నీ తీసుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు రెండు రోజుల ముందు కేంద్ర భద్రతా ఏజన్సీలు, జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ) ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న 14 మందిని అరెస్టు చేయడం ద్వారా ఉగ్రదాడుల పథకాన్ని భగ్నం చేసిన విషయం తెలిసిందే. దేశ రాజధానిసహా కొన్ని ముఖ్యమైన సంస్థలపైన దాడులు చేయడానికి వీరు పథక రచన చేసుకున్నారని అధికారులు అంటున్నారు. నగరంలోని పది కీలక ప్రాంతాల్లో తేలికపాటి మిషిన్ గన్స్‌తో ఉన్న కమాండ్లను మోహరించగా, రెండు ప్రధాన ప్రాంతాల్లో విమాన విధ్వంసక గన్స్‌ను మోహరించారు. సెంట్రల్, న్యూఢిల్లీలు మొత్తం ప్రాంతంలో ఢిల్లీ పోలీసు, కేంద్ర భద్రతా ఏజన్సీలకు చెందిన దాదాపు 50 వేల మంది భద్రతా సిబ్బంది అడుగడుగునా కనిపించారు.
ప్రధాన పరేడ్ జరిగిన సువిశాలమైన రాజ్‌పథ్ మార్గంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన హోలాన్ రాష్టప్రతి ప్రణబ్, ప్రధాని మోదీలతో కలిసి కూర్చున్నారు. ఉప రాష్టప్రతి హమిద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరు కూర్చున్న వివిఐపి ఎన్‌క్లోజర్ వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. లోపలి వైపు రాష్టప్రతి గార్డులు, ఎస్‌పిజి, ఎన్‌ఎస్‌జికి చెందిన గార్డులు భద్రతా ఏర్పాట్లు చూడగా, బయటి వలయం రక్షణ భద్రతను ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. రాజ్‌పథ్‌తోపాటుగా పరేడ్ సాగిపోయే మార్గం పొడవునా ఉండే ఎత్తయిని భవనాలపైన స్నైఫర్స్ (గురిచూసి కాల్చేవాళ్లు)ను మోహరించినట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఆకాశంలో అనుమతి లేకుండా ఎగరే ఏ వస్తువునైనా కాల్చి వేయాల్సిందిగా గన్నర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉదయం పదిన్నరనుంచి మధ్యాహ్నం 12.15 గంటల దాకా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి విమాన రాకపోకలు ఉండకూడదని ముందే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

చిత్రం...

ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో మంగళవారం జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్