జాతీయ వార్తలు

రాజ్యాంగ అమృతాన్ని పంచిన బాబాసాహెబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: తన జీవితంలో ఎన్నో గడ్డుసమస్యలను, ప్రతికూల సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి అమృతంలాంటి రాజ్యాంగాన్ని అందించారని ప్రధాని నరేంద్ర మోదీ శ్లాఘించారు. దేశ నిర్మాణంలోనూ జాతి నిర్మాణంలోనూ అంబేద్కర్ నిరుపమాన సేవలను అందించారని పేర్కొన్నారు. గురువారం ఇక్కడ జరిగిన ఎన్‌సిసి ర్యాలీలో పాల్గొన్న కేడెట్లను ఉద్దేశించి మాట్లాడిన నరేంద్ర మోదీ ‘మీరంతా దేశ నిర్మాణానికి, ప్రజా సంక్షేమానికి మీ జీవితాలను అంకితం చేయాలి’ అని పిలుపునిచ్చారు. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా నెల రోజులుగా ఢిల్లీలోనే ఉన్న విద్యార్థులు తమకు ఎదురైన మంచిని ఆస్వాదించాలని తమ అనుభవంలోకి వచ్చిన వాటిలోని సుగుణాలను జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించాలని కోరారు. స్వచ్ఛత, దేశభక్తి వంటి ఉన్నత విలువలను సమాజంలో పెంపొందించేందుకు ప్రయత్నించాలని, ఆ విధంగా తమ పట్టణాలు, గ్రామాలను విలువలతో సుసంపన్నం చేయాలని మోదీ కోరారు. దేశ వ్యాప్తంగా యువతను సంధానం చేసే ఓ బలమైన జాతీయ శక్తిగా ఎన్‌సిసిని ఆయన అభివర్ణించారు. ఎన్‌సిసిలో ఉన్న ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావన, విలువలతో కూడిన వ్యక్తిత్వం అలరారుతాయని మోదీ స్పష్టం చేశారు. అంబేద్కర్ 125వ జయంతి రోజునే 66వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం దేశ భక్తి ఉన్నత భావనలను సమాజంలో పెంపొందించడానికి లభించిన అవకాశంగా పేర్కొన్నారు. తన జీవితంలో అన్ని కోణాల్లోనూ విషాదాన్ని అనుభవించిన అంబేద్కర్ భారత్‌కు మాత్రం అమృతంలాంటి రాజ్యాంగానే్న అందిచారని, దాని ఆలంబనగానే సమైక్యతాభావం దినదిన ప్రవర్ధమానం అవుతోందని అన్నారు.

చిత్రం... ఢిల్లీలోని గారిసన్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం జరిగిన ఎన్‌సిసి ర్యాలీలో ఒక కేడెట్‌కు ట్రోఫీని అందజేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ