జాతీయ వార్తలు

గణతంత్ర వేళ... ఐటంసాంగ్ హేల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపుర (కర్నాటక), జనవరి 28: దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతుంటే కర్నాటకలోని ఓ జైల్లో మాత్రం ఐటం సాంగ్ హోరెత్తింది. ఖైదీల విడుదలను పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఐటం సాంగ్ ప్రదర్శించడం వివాదం సృష్టించింది. జైలు అధికారుల నిర్వాకం టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో బాధ్యులైన ముగ్గుర్ని సస్పెండ్ చేశారు. దర్గా జైలు క్యాంపస్‌లో జరిగిన ఈ ఘటనలో ఇన్‌చార్జి జైలర్ పి.ఎస్.అంబేకర్, వార్డెన్ సంపత్, హెడ్ కానిస్టేబుల్ గుండల్లిని సస్పెండ్ చేశారు. విజయపుర ఎస్‌పి సిద్దరామప్ప నివేదిక మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు జైళ్ల డిజిపి సత్యనారాయణ గురువారం విలేఖరులకు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 38మంది ఖైదీలను విడుదల చేసే ముందు సాంస్కృతిక కార్యక్రమం పేరుతో ఐటం సాంగ్‌ను నిర్వహించారు. మహిళా డాన్సర్‌పై కొందరు కరెన్సీ నోట్లు వెదజల్లుతున్న దృశ్యాలు కూడా టీవీల్లో ప్రసారమయ్యాయి. ఇదంతా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎం.బి.పాటిల్ వంటి ప్రముఖుల సమక్షంలో జరగడం గమనార్హం. ఈ తతంగం అంతా ముగిసిన తర్వాత ఖైదీలకు విడుదల పత్రాలు అందజేశారు. దర్గా జైల్ క్యాంపస్‌లో జరిగిన ఐటం సాంగ్ వ్యవహారంపై బెంగళూరు పోలీసులు దర్యాప్తు జరుపుతారని, ఏ కారణంతో ఐటం సాంగ్‌ను ఏర్పాటుచేశారో నిగ్గు తేలుస్తారని డిజిపి సత్యనారాయణరావు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని జైలు అధికారులను ఆదేశించారు. టీవీ చానళ్లలో జైలు అధికారుల నిర్వాకం ప్రసారమైన వెంటనే విజయపురకు హుటాహుటిన వచ్చారు.

ఆకాశ్ క్షిపణిని పరీక్షించిన భారత్

బాలాసోర్ (ఒడిశా), జనవరి 28: పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాశ్ క్షిపణిని భారత్ గురువారం పరీక్షించింది. భూమిపై నుంచి గగనతలంలో గల లక్ష్యాన్ని ఛేదించే ఈ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్‌లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) నుంచి ప్రయోగించింది. భారత వైమానిక దళ సిబ్బంది గగనతలంలో ఉంచిన పారా-బారెల్ లక్ష్యాన్ని ఛేదించడానికి ఈ ఆకాశ్ క్షిపణిని మూడుసార్లు ప్రయోగించినట్లు ఒక అధికారి తెలిపారు. 60 కిలోల బరువు గల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలిగిన, 25 కిలో మీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించగలిగిన ఈ క్షిపణిని ఐటిఆర్‌లోని లాంచ్ కాంప్లెక్స్-3 నుంచి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రయోగించినట్లు ఆ అధికారి వివరించారు. గగనతలంలో ఉన్న శత్రుదేశాల యుద్ధ విమానాలను కూల్చివేయడానికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) ఇంటిగ్రేటెడ్ గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం కింద ఈ ఆకాశ్ క్షిపణిని అభివృద్ధి చేసింది.

స్థానిక ఎన్నికలపై సమాచారం ఇవ్వాలి

రాష్ట్రాలకు ఇసి ఆదేశం

న్యూఢిల్లీ, జనవరి 28: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమాచారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలు మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా ఏయే తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నదీ తమకు తెలపాలని ఇసి స్పష్టం చేసింది. లోక్‌సభ, రాజ్యసభ, రాష్టప్రతి, ఉపరాష్టప్రతి, పంచాయతీ, మున్సిపాలిటీల ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే జరగాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన ఎన్నికల కమిషనర్లకు చీఫ్ ఎన్నికల అధికారులు, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, రిటర్నింగ్ అధికారులను మాత్రం ఇసి నియమిస్తుంది. ప్రజాప్రాతినిధ్యం చట్టం కింద ఈ నియామకాలు జరుగుతాయి. స్థానిక సంస్థలు, పార్లమెంటు, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఇసి లేఖలో పేర్కొంది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, తేదీల సమాచారం తమకు తెలియజేయాలని ఇసి పేర్కొంది. లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలు జరపాల్సిన సందర్భంలోనూ స్థానిక ఎన్నికలు ఉంటే సంక్లిష్టత ఏర్పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో జార్ఖండ్‌లో చోటుచేసుకున్న పరిస్థితులు ఈ సందర్భంగా ఇసి ప్రస్తావించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మూడంచెల పంచాయతీ ఎన్నికల తేదీ, లోహర్‌డగ అసెంబ్లీ ఉపఎన్నిక తేదీ ఒకేసారి వచ్చింది. దీంతో అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను ఇసి రద్దు చేసుకోవల్సి వచ్చింది.

కేరళ సిఎంపై ఎఫ్‌ఐఆర్

‘సోలార్’ కుంభకోణం కేసులో త్రిచూర్ విజిలెన్స్ కోర్టు ఆదేశం

త్రిచూర్, జనవరి 28: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మెడకు సోలార్ కుంభకోణం ఉచ్చు బిగుసుకుంటోంది. సంచలనం రేకెత్తించిన సోలాల్ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి చాందీపై కేసు నమోదుకు త్రిచూర్ విజిలెన్స్ కోర్టు ఆదేశించింది. సోలార్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలు సరిత ఎస్ నాయర్ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, విద్యుత్‌మంత్రి ఆరయదన్ మహ్మద్‌లకు లంచం ఇచ్చినట్టు సంచలన ప్రకటన చేశారు. కోట్లాది రూపాయల సోలార్ కుంభకోణానికి సంబంధించి ఒక కార్యకర్త త్రిచూర్ న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కాగా బుధవారం జుడీషియల్ కమిషన్ ఎదుట హాజరైన సరిత ముఖ్యమంత్రి, విద్యుత్ మంత్రిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేశారు. కోచీ జుడీషియల్ కమిషన్ న్యాయమూర్తి శివరాజన్ కేసును విచారిస్తున్నారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడికి 1.90 కోట్లు, మంత్రికి 40 లక్షలు లంచంగా ఇచ్చానని ఆమె తెలిపారు. రాజకీయ కుట్రతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఆరోపించారు. సరిత ఆరోపణల వెనుక కేరళ బార్ యజమానులున్నారని ఆయన విమర్శించారు. మరోపక్క సిఎంకు వ్యతిరేకంగా తిరువనంతపురంలోని సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

పడవ మునిగి
24మంది మృతి
ఏథెన్స్, జనవరి 28: గ్రీక్‌కు వలస ప్రజలతో వెళ్తున్న ఒక పడవ గురువారం సముద్రంలో మునిగిపోయి 24 మంది మృతి చెందారు. మృతుల్లో పది మంది పిల్లలు ఉన్నారని గ్రీక్ కోస్ట్‌గార్డ్ తెలిపింది. వీరిలో అయిదుగురు బాలురు, అయిదుగురు బాలికలని వివరించింది. 45 మందిని తీసికెళ్తున్న పడవ మునిగిపోయిన ఈ ప్రమాదంలో పది మందిని సముద్ర జలాల నుంచి బయటకు తీసుకొచ్చినట్లు కోస్ట్‌గార్డ్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే మిగతా 11 మంది జాడ ఇంకా తెలియలేదని వెల్లడించింది. ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకతను సముద్రాన్ని ఈదుకుంటూ తీరానికి వచ్చి చెప్పడంతో పడవ మునిగిపోయిన విషయం తెలిసింది. దీంతో గ్రీక్ నౌకలతో పాటు యూరోపియన్ బోర్డర్ ఏజెన్సీ ఫ్రాంటెక్స్‌కు చెందిన రెండు నౌకలు బాధితులను రక్షించడానికి రంగంలోకి దిగాయి. బాధితులు ఏ దేశం నుంచి వలస వస్తున్నారనే విషయం ఇంకా తెలియరాలేదు. గత వారం మూడు పడవలు మునిగిపోయి 44 మంది వలస ప్రజలు మృతి చెందిన విషయం తెలిసిందే. బాగా చలి వాతావరణం నెలకొన్నప్పటికీ మధ్య ప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, పేదరికం వల్ల చాలా మంది ప్రజలు వలసపోతున్నారు.