జాతీయ వార్తలు

ఉపాధి హామీకి మరిన్ని నిధులిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఇజి)కి మరిన్ని నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. 2016 ఏప్రిల్ నెల నుండి ఈ పథకం కింద చెల్లింపులకు నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రసింగ్ వెల్లడించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన హామీ పథకాన్ని ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ఒక సమ్మేళనంలో జైట్లీ ప్రసంగించారు. జాతీయ ఉపాధి కల్పనా హామీ పథకాన్ని నిలిపివేస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ పథకాన్ని మరింత పటిష్ఠం చేస్తామని హామీ ఇచ్చారు.
ఉపాధి పథకానికి ఈ ఆర్థిక సంవత్సరం ముప్ఫై ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించామని, గతంలో ఎప్పుడూ ఈ మేరకు నిధుల కేటాయింపు జరగలేదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, విద్యుదీకరణ, ఆరోగ్య సేవలను మెరుగుపరచటం, విద్యా సౌకర్యాలు, నీటిపారుదలు సౌకర్యాలను పెంచేందుకు కేటాయింపులను పెంచుతామని జైట్లీ తెలిపారు. ఈ పథకానికి ప్రైవేట్ రంగం నుండి ఆశించిన మేరకు పెట్టుబడులు రావటం లేదని ఆయన విమర్శించారు. ఈ పథకాన్ని రద్దు చేయటం లేదా దీని స్థానంలో కొత్త పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనేదీ ఎన్డీఏ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. పథకానికి ముందు ముందు నిధుల కేటాయింపు పెంచుతామంటూ, ఉపాధి డిమాండ్ పెరిగే కొద్దీ పథకానికి నిధుల కేటాయింపు పెరుగుతుందని జైట్లీ చెప్పారు. ఉపాధి హామీ, ఇతర సామాజిక పథకాలకు బడ్జెట్‌లో కోత పెట్టటం లేదన్నారు. గతంలో ఉపాధి హామీతోపాటు పలు ఇతర పథకాలకు కేటాయించిన నిధులను ఆఖరు క్షణంలో తగ్గించటం జరిగిందంటూ జైట్లీ పరోక్షంగా యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతున్న ప్రస్తుత తరుణంలో ఉన్నత అభివృద్ధి రేటును సాధించాలంటే గ్రామీణ ప్రాంతాలోని ప్రజలకు ఆర్థిక సాధికారిత కల్పించాలి, దీనికోసం గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసే పథకాల కేటాయింపులను పెంచవలసి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
వివిధ సంస్కరణల ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2015-16 సంవత్సరంలో పునరుద్ధరించటం జరిగిందని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ చెప్పారు. గత ఐదేళ్లతో పోలిస్తే 2015-16లో పని దినాలు బాగా పెరిగాయని, రెండవ త్రైమాసికంలో 46 కోట్ల పని దినాలు జరిగితే, మూడవ త్రైమాసికంలో 46.10 కోట్ల పని దినాలు ఈ పథకం కింద జరిగాయని బీరేంద్ర సింగ్ చెప్పారు. ఉపాధి హామీ పథకం నిధులను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహించటం ద్వారా అవినీతికి తావు లేకుండా చేశామని బీరేంద్ర సింగ్ తెలిపారు. 2016 ఏప్రిల్ ఒకటో తేదీ నుండి ఈ పథకం కింద చెల్లింపులకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. ఈ పథకం కింత ఇంతవరకు 3 లక్షల, 13వేల 844 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుదర్శన్ భగత్ చెప్పారు. ఈ మొత్తం చెల్లింపుల్లో 71 శాతం నిధులను వ్యవసాయ కార్మికులకు వేతనంగా చెల్లించామని తెలిపారు. నైపుణ్య పథకం కింద దాదాపు పది లక్షల మంది గ్రామీణ యువకులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి టెక్నీషియన్లను తయారు చేస్తామని భగత్ చెప్పారు.

మంగళవారం ఢిల్లీలో జరిగిన ఎంఎన్‌ఆర్‌ఇజి సమ్మేళనంలో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ