జాతీయ వార్తలు

సమయపాలన కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారాదీప్ (ఒడిశా): గతంలో చేపట్టిన ప్రాజెక్టులు ఆలస్యం కావడం వల్ల వాటి ఖర్చు పెరిగిపోయేదని ప్రధాని నరేంద్ర మోదీ అంటూ, దేశ ఆర్థికాభివృద్ధి పుంజుకోవాలంటే నిర్ణీత సమయంలోగా ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తి చేసే సరికొత్త సంస్కృతి అవసరమన్నారు. ప్రాజెక్టులన్నీ తమ హయాంలో ప్రారంభమైనవేనన్న కాంగ్రెస్ విమర్శను ప్రధాని తోసిపుచ్చుతూ, ఈ ప్రాజెక్టులు గనుక 15 ఏళ్ల క్రితమే ప్రారంభమై ఉద్యోగాలను సృష్టించివుంటే ప్రధానిగా తాను ఎంతో సంతోషించే వాడినన్నారు. ఒడిశాలోని పారాదీప్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ( ఐఓసి) రూ. 34,550 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన రిఫైనరీని ఆదివారం ప్రధాని జాతికి అంకితం చేసారు. ఈ సందర్భంగా మాట్లడుతూ దేశీయంగా ఉత్పత్తిని పెంచడం, అలాగే ఆటో ఇంధనాల్లో ఎథనాల్ లాంటి బయో ఇంధనాలను కలిపే విధాన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా 2022 నాటికి చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని పదిశాతం మేర తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ‘ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నందుకు నేను సంతోషించడం సహజమే. అయితే ఒక దేశ ప్రధానిగా నేను ఏమాత్రం సంతోషించడం లేదు. ఈ పనులు 15 ఏళ్ల క్రితమే పూర్తయి లక్షలాది స్థానికులకు ఉపాధి కల్పించి ఉంటే మరింత సంతోషించి ఉండే వాడిని’ అన్నారు. కోర్టు కేసులు, టెండరు ప్రక్రియలు, కొన్ని సందర్భాల్లో ఆందోళనల కారణంగా దేశంలో ప్రాజెక్టులకు అడ్డంకులు ఎదురవుతున్నాయని, ఫలితంగా వాటి వ్యయం భారీగా పెరిగిపోతోందన్నారు. గతంలో 50 ఏళ్ల క్రితం ఆలోచనను కాగితం పైన పెట్టడానికి పదేళ్లు, శంకుస్థాపనకు మరో పదేళ్లు, పూర్తి కావడానికి చాలా సంవత్సరాలు పట్టేదని ఆయన అన్నారు.
2000లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శంకుస్థాపన చేసిన పారాదీప్ రిఫైనరీ వల్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని, ఎందుకంటే ప్లాస్టిక్ సహా అనేక రంగాలకు అవసరమైన ముడి సరకును అది ఉత్పత్తి చేస్తుందని మోదీ చెప్పారు. ముద్రా పథకం కింద యువకులకు ఆర్థిక సహాయం అందించడం, ‘స్టార్టప్ ఇండియా’ ‘స్టాండప్ ఇండియా’ పథకాల కింద ప్రోత్సాహకాలు అందించడం ద్వారా వారిలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. భారతదేశం 79 శాతం చమురు అవసరాలకోసం దిగుమతులపై ఆదారపడుతోందని, అందువల్ల చమురు దిగుమతులను తగ్గించుకోవలసిన అవసరం ఉందన్నారు. 2022 నాటికి అంటే దేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తి చేసుకునే నాటికి చమురు దిగుమతులను కనీసం 10 శాతం తగ్గించుకోవాలని అంటూ, పెట్రోలియం మంత్రిత్వ శాఖ, చమురు కంపెనీలు దీన్ని చాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. పారదీప్ రిఫైనరీ ఒడిశా భవిష్యత్తునే మార్చివేస్తుందని, ఎందుకంటే ఇది లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని ఆయన చెప్పారు. ఈ రిఫైనరీ 78 కోట్ల కెజిల వంటగ్యాస్, 500 కోట్ల లీటర్ల పెట్రోలు, 660 కోట్ల లీటర్ల డీజిల్, 250 కోట్ల లీటర్ల కిరోసిన్, ఎటిఫ్, 27 లక్షల క్వింటాళ్ల గంధకం, 120 లక్షల క్వింటాళ్ల పెట్రోలియం కేక్‌ను ఉత్పత్తి చేస్తుందని ఆయన చెప్పారు. ఈ రిఫైనరీ వల్ల ఒడిశాలోని లక్షలాది పేదల ఇళ్లలోకి వంటగ్యాస్ సిలిండర్లు వస్తాయని చెప్పారు.

చిత్రం... ఒడిశాలో పారాదీప్ ఆయల్ రిఫైనరీని జాతికి అంకితం చేసిన అనంతరం జరిగిన సభలో
వేదికపై సిఎం నవీన్ పట్నాయక్‌తో ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ