జాతీయ వార్తలు

జగన్నాథ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని సందర్శించిన మోదీకి అక్కడి పూజారులు, స్థానిక బిజెపి నేతలతోపాటు ఆలయ కమిటీ పాలనాధికారి ఎస్.సి.మహాపాత్ర తదితరులు ఘనస్వాగతం పలికారు. దాదాపు 30 నిమిషాలపాటు మోదీ ఆలయంలో గడిపారు. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా పూరిని సందర్శించిన మోదీ, ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఇక్కడకు రావడం ఇదే మొదటిసారి. ప్రధానిని చూసేందుకు ప్రజలు భారీగా తరలిరావడంతో ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న రోడ్డు జనసంద్రమైంది. అయితే ప్రజలను నిరాశపరచకుండా మోదీ ప్రయాణిస్తున్న కారు ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. పూరీ ప్రజలు చూపించిన ప్రేమాభిమానులు ఎనలేనివని ఆ తర్వాత మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మోదీ పర్యటన సందర్భంగా స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
గుజరాత్ యువతకు శిక్షణ ఇవ్వండి
మోదీ పూరీ పర్యటన సందర్భంగా ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత చిత్రకారుడు సుదర్శన్ పట్నాయక్ ప్రధానిని కలుసుకున్నారు. ప్రధాని రాక సందర్భంగా పట్నాయక్ ‘ఒడిశాకు స్వాగతం’ అనే శిల్పాన్ని తయారుచేసి మోదీకి ఘన స్వాగతం పలికారు. జగన్నాథ స్వామి ఆలయంలో ఈ ఏడాది ఘనంగా నిర్వహించిన ‘నబకళేబర’ ఉత్సవానికి సంబంధించిన సైకతశిల్ప ఫోటోను ప్రధాని మోదీకి కానుకగా అందజేశారు. గుజరాత్ యువతకు సైకతశిల్ప కళలో శిక్షణ ఇవ్వాలని ప్రధాని తనను కోరినట్లు పట్నాయక్ తెలిపారు.

పూరీలో కారు ఫుట్‌రెస్ట్‌పై నిలబడి అభిమానులకు అభివాదం చేస్తున్న నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీకి ‘నబకళేబర’ సైకత శిల్పం ఫొటోను అందజేస్తున్న కళాకారుడు సుదర్శన్ పట్నాయక్

నలుగురు స్మగ్లర్ల కాల్చివేత

ఫిరోజ్‌పూర్, ఫిబ్రవరి 7: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా మెహిందీపూర్ సరిహద్దు ఔట్‌పోస్టు సమీపంలో సరిహద్దు భధ్రతా దళం (బిఎస్‌ఎఫ్) జవాన్లు ఆదివారం ఇద్దరు పాకిస్తానీ చొరబాటుదారులు సహా నలుగురు స్మగ్లర్లను కాల్చి చంపి, వారి వద్దనుంచి పది కిలోల హెరాయన్, కొన్ని ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దులను కాపలా కాస్తున్న బిఎస్‌ఎఫ్ దళాలు ఇద్దరు పాక్ చొరబాటుదారులతో పాటుగా మరో ఇద్దరు భారతీయులను కాల్చి చంపినట్లు బిఎస్‌ఎఫ్ ఫిరోజ్‌పూర్ సెక్టార్ డిఐజి ఆర్‌కె థాపా చెప్పారు. మెహిందీపూర్ సరిహద్దు ఔట్‌పోస్టు వద్ద డ్యూటీలో ఉన్న 191 బెటాలియన్‌కు చెందిన బిఎస్‌ఎఫ్ జవాన్లు గస్తీ నిర్వహిస్తుండగా, ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో సరిహద్దు పిల్లర్ సమీపంలోని కంచె వద్ద అనుమానాస్పద కదలికలను గమనించారని, దరిమిలా వారు చొరబాటుదారులను చాలెంజ్ చేశారని థాపా చెప్పారు. పాక్ చొరబాటుదారులు కంచె దాకా వచ్చారని, ఇటువైపునుంచి భారతీయ స్మగ్లర్లు సైతం సరకు తీసుకోవడానికి అక్కడికి వచ్చారని ఆయన తెలిపారు. బిఎస్‌ఎఫ్ జవాన్లను చూసిన చొరబాటుదారులు సరిహద్దు ఔట్‌పోస్టు వైపుగా కాల్పులు జరిపారని, బిఎస్‌ఎఫ్ జవాన్లు సైతం ఎదురు కాల్పులు జరిపారని, దరిమిలా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పాక్ చౌరబాటుదారులు, మరో ఇద్దరు భారతీయ స్మగ్లర్లు చనిపోయారని థాపా చెప్పారు. ఎన్‌కౌంటర్ ముగిసిన తర్వాత జరిపిన తనిఖీల్లో పది కెజిల హెరాయిన్ పాకెట్లు, రెండు 9 ఎంఎం చైనా తయారీ పిస్టళ్లు, ఒక నాటు పిస్తోల్, 54 కార్టిడ్జ్‌లు, కొంత పాకిస్తానీ కరెన్సీ, పాకిస్తానీ సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు డిఐజి తెలిపారు.

స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలు తెలియజేస్తున్న బిఎస్‌ఎఫ్ ఐజి అనిల్ పాలివాల్

ముద్రగడ దీక్షకు ఢిల్లీ కాపు సంఘం మద్దతు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: కాపులను బిసి జాబితాలో చేర్చే డిమాండ్‌తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రారంభించిన దీక్షకు ఢిల్లీ కాపు సంక్షేమ సంఘం మద్దతు తెలిపింది. బిసి హోదా కాపుల హక్కు అని, స్వాతంత్య్రానికి పూర్వం నుండి బిసిలుగా ఉన్న కాపులకు తిరిగి రిజర్వేషన్లు కల్పించాలని కాపు సంఘం నాయకులు యాతం గంగారావు, మెండు చక్రపాణి, సుమంత్, వాయునందన్ డిమాండ్ చేశారు. ముద్రగడ దీక్షకు మద్దతుగా ఆదివారం డీడీఏ పార్కులో కాపు వర్గం ప్రజలు సమావేశమయ్యారు. కంచాలను గరిటెలతో వాయింటంద్వారా ముద్రగడ దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొంటున్న పరిణామాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాపువర్గం మంత్రులే బాధ్యత వహించాలని వారు స్పష్టం చేశారు. కాపులను బిసిల జాబితాలో చేర్చే అంశంపై చంద్రబాబు వ్యవహార శైలి ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు. కాపులకు మద్దతునిస్తున్న దళిత సంఘాల నేతలకు ఢిల్లీ కాపు సంఘం ధన్యవాదాలు తెలిపారు. కాపుజాతి కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. కాపుల రిజర్వేషన్లు, హక్కులను సాధించే వరకు ముద్రగడ నాయకత్వంలో కాపు, తెలగ, బలిజలు ఒకే తాటిపై నడుస్తారని ఢిల్లీ కాపు నేతలు ప్రకటించారు. కాపులపై దురుద్దేశంతో పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.