జాతీయ వార్తలు

రాజ్యాంగ పవిత్రత మీ చేతుల్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజ్యాంగ పరమైన పదవులు నిర్వహిస్తున్నవారంతా రాజ్యాంగ పవిత్రతను కాపాడాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఇక్కడ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సులో ఉద్బోధించారు. గవర్నర్ల పాత్ర వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో రాష్టప్రతి రెండు రోజుల పాటు జరిగే గవర్నర్ల 47వ సదస్సును ప్రారంభిస్తూ ఈ పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘పవిత్రమైన రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలను, విలువలను దృఢచిత్తంతో అనుసరించడం మన ప్రాథమిక విధి. మన ఆకాంక్షలను ప్రతిబింబించే, ఆ ఆకాంక్షలను అందుకోవడానికి అనుసరించాల్సిన పథాన్ని నిర్దేశించే శాశ్వత గ్రంథమిది. అందువల్ల రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్న మనందరిపై ఈ పవిత్ర గ్రంథం పవిత్రతను కాపాడవలసిన గురుతరమైన బాధ్యత ఉంది’ అని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అనేక పరిణామాలకు, చివరకు అరుణాచల్‌ప్రదేశ్‌లో కేంద్ర పాలనకు దారితీసిన ఆ రాష్ట్ర గవర్నర్ జె.పి.రాజ్‌ఖోవా పాత్ర వివాదాస్పదమైన నేపథ్యంలో రాష్టప్రతి ఈ పిలుపునివ్వడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో కేంద్ర పాలన అంశం చివరకు సుప్రీంకోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే. విదేశీ శక్తుల హస్తమున్నట్లు స్పష్టంగా కనపడే ఉగ్రవాద దాడులు జరిగిన గత సంవత్సరం ఎంతో జటిలమైనదని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మన దేశం శాంతియుతమైన చర్చలు, సంప్రదింపుల ద్వారా అపరిష్కృతంగా ఉన్న అన్ని అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించుకోవడానికి కృషిని కొనసాగించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ‘మనం ప్రపంచ ఆర్థిక మాంద్యం, వాతావరణ మార్పు సవాళ్లతో పాటు అంతర్గత భద్రతకు సవాళ్లు, విదేశీ శక్తుల నుంచి దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొన్నాం. అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు ఉగ్రవాద దాడులకు గురయ్యాయి. ఈ దాడుల్లో విదేశీ శక్తుల ప్రమేయం ఉన్నది స్పష్టం. విదేశీ శక్తుల నుంచి దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పు మన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టేలా చేసింది. అదే సమయంలో మనం అపరిష్కృతంగా ఉన్న అన్ని అంతర్జాతీయ సమస్యలను శాంతియుతమైన చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునే కృషిని కొనసాగించవలసి ఉంది’ అని రాష్టప్రతి గవర్నర్ల సదస్సులో అన్నారు.
రెండు వరుస రుతుపవనాలలోనూ వర్షాభావ పరిస్థితుల వల్ల దేశం తీవ్రమైన కరువును ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. తగినన్ని వర్షాలు లేక వ్యవసాయ దిగుబడులు తగ్గుతున్నాయని, అందువల్ల యుద్ధ ప్రాతిపదికన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. దిగుబడులు తగ్గి నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కొత్తగా ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉపయోగపడుతుందన్నారు. దీంతో పాటు రైతులను ఆదుకోవడానికి మరిన్ని ఇతర చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పథకాలయిన మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా, స్మార్ట్ సిటీ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... ఢిల్లీలో మంగళవారం ప్రారంభమైన రెండురోజుల గవర్నర్ల సదస్సులో మాట్లాడుతున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ. వేదికపై మోదీ