జాతీయ వార్తలు

అన్నీ మాట్లాడుకుందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తే అంశాలతోపాటు దేశం ముందున్న అన్ని సవాళ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తాను ఒక పార్టీకి ప్రధానిని కాదని, దేశానికి ప్రధానిని కనుక విపక్షాలు ప్రస్తావించే అంశాలపైనా పార్లమెంట్‌లో చర్చ జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అయితే ప్రతిపక్షం మాత్రం వివిధ అంశాలపై పార్లమెంట్ ఉభయ సభలు, ముఖ్యంగా రాజ్యసభను స్తంభింపజేసేందుకు సిద్ధమవుతోంది. 23నుంచి ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాలపై చర్చించేందుకు ప్రధాని మోదీ మంగళవారం తన కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మోదీ ప్రధాని అయిన తరువాత పార్లమెంట్ సమావేశాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఇదే ప్రథమం. సమావేశానికి హాజరైన విపక్షాలు, జెఎన్‌యు విద్యార్థులపై దేశ ద్రోహం కేసు, రోహిత్ వేముల ఆత్మహత్య, అరుణాచల్‌లో రాష్టప్రతి పాలన విధింపు తదితర అంశాలను ప్రస్తావించారు. విపక్ష నేతలు మాట్లాడిన తీరు చూస్తుంటే పార్లమెంట్‌లో ఎన్డీయేను నిలదీసేందుకు సమాయత్తం అవుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ వ్యతిరేక నినాదాలను సహించేది లేదంటూనే, జెఎన్‌యు విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని విపక్షాలు ఖండించాయి. జెఎన్‌యు విద్యార్థి సంఘ నాయకుడు కన్హయ్య కుమార్‌ను దేశ ద్రోహ నేరం కింద అరెస్టు చేయటాన్ని కాంగ్రెస్, వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అయితే, ప్రతిపక్షం ప్రస్తావించిన అన్ని అంశాలపై ప్రభుత్వం స్పందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. అఖిలపక్ష సమావేశంలో వ్యక్తమైన సుహృద్భావ వాతావరణం పార్లమెంటులోనూ నెలకొంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు సజావుగా కొనసాగాలని విపక్ష నేతలంతా అభిప్రాయపడినట్టు చెప్పారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ భారత వ్యతిరేక నినాదాలను కాంగ్రెస్ సహించదని చెబుతూనే, విద్యార్థి నేత కన్హయ్యను నిరాధారంగా అరెస్టు చేశారని ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్నవారే పరిస్థితిని చెడగొడుతుంటే, దాని ప్రభావం బడ్జెట్ సమావేశాలపై తప్పకుండా పడుతుందని ఆజాద్ వ్యాఖ్యానించారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధమంటున్న ప్రభుత్వం, జెఎన్‌యు వివాదంపై బహిరంగ చర్చకు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. జెఎన్‌యు ఘటనపై పారదర్శక చర్చ జరపాలన్నారు. పోలీసులు వర్శిటీ లోపలికి వెళ్లి ఉండాల్సిందని కొందరంటున్నారని, జెఎన్‌యు పరిణామాలను కొన్ని మీడియా సంస్థలు కొండంతలు చేసి చూపుతున్నాయని ఆజాద్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల్లో జిఎస్‌టిని ఆమోదించాలని అఖిలపక్ష సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ సూచించింది. ఇదిలావుంటే జెఎన్‌యు ఘటన, రోహిత్ వేముల ఆత్మహత్య, కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతిఇరానీ, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయల రాజీనామా, పఠాన్‌కోట్‌పై ఇస్లామిక్ తీవ్రవాదుల దాడి తదితర అంశాలను ఉభయ సభల్లో ప్రస్తావించేందుకు విపక్షం సిద్ధమవుతోంది. మోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి వెంకయ్యనాయుడు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ముక్తార్ అబ్బాస్ నఖ్వి, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, బిజెడి నాయకుడు భర్తుృహరి మహతామ్, సమాజ్‌వాదీ నాయకుడు రాంగోపాల్ యాదవ్, ఆర్జేడీ నాయకుడు ప్రేంచంద్ గుప్తా, లోక్‌జనశక్తి నాయకుడు, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్, సిపిఐ నుండి డి రాజా, జెడి(యు) నుంచి శరద్ యాదవ్, డిఎంకె తరఫున కనిమొళి, బిఎస్పీ నుంచి సతీష్ మిశ్రా, లోక్‌సభలో తెలుగుదేశం నాయకుడు తోట నరసింహం, తెరాస లోక్‌సభాపక్ష నేత జితేందర్ రెడ్డి, వైకాపా నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే హాజరుకాకపోవటం గమనార్హం.
పార్లమెంట్ బడ్జెట్ కార్యక్రమాలు చెడగొట్టకూడదని లోక్‌సభలో తెదేపా పక్షనేత తోట నరసింహం సూచించారు. ఈ లక్ష్య సాధనకు అన్ని పార్టీలూ సహకరిచాలని కోరారు. సమావేశాలు సజావుగా సాగేందుకు తెదేపా తనవంతు సహకరిస్తుందన్నారు. సమావేశాలు సజావుగా జరగాలనే అన్ని పార్టీల నేతలు సూచించారని వైకాపా పక్షనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. నవ్యాంధ్ర సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలు ప్రస్తావిస్తామన్నారు. సమావేశాలు సజావుగా జరగాలన్నదే తమ పార్టీ విధానమని, తెలంగాణ సమస్యలు ప్రధాని పరిష్కరించాలని సూచించినట్టు తెరాస లోక్‌సభాపక్ష నేత జితేందర్ రెడ్డి వెల్లడించారు.

చిత్రం... పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అఖిలపక్ష నేతల సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ