జాతీయ వార్తలు

సామరస్యానికి పూర్తి రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఎన్‌డిఏ హయాంలో దేశంలో అసహన ధోరణులు పెరిగిపోతున్నాయన్న విపక్షాల ఆరోపణలను హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు. మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా క్షమించేది లేదని హెచ్చరించారు. దాద్రీ ఘటన, కల్బుర్గీ హత్యలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడానికి తమ ప్రభుత్వ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అసహన ధోరణులపై లోక్‌సభలో జరిగిన చర్చకు మంగళవారం సమాధానం చెప్పిన రాజ్‌నాథ్ సింగ్ అందరితోనూ చర్చించి, అందరి ఆందోళనలను, అపోహలను తొలగించేందుకు అన్ని చర్యలూ చేపడతామని తెలిపారు. అసహనం పెరిగిపోతోందంటూ ప్రతిపక్షం చేస్తున్న తప్పుడు ఆరోపణల వల్ల విదేశాల్లో భారత్ పరువు, ప్రతిష్ట దెబ్బతింటోందని ఆయన ఎదురుదాడికి దిగారు. ‘అసహనం పెరగకుండా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ లక్ష్య సాధనకు ప్రతిపక్షం కూడా ప్రభుత్వంతో సహకరించాలి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. అసహనం పెరుగుతోందంటూ అవార్డులు వాపస్ చేసినవారు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు.
దేశంలో అసహనం పెరిగిపోతోంటూ సిపిఎం సభ్యుడు సలీం 193 నిబంధన కింద ఇచ్చిన నోటీసుపై రెండు రోజుల్లో ఏడు గంటల పాటు లోక్‌సభలో జరిగిన చర్చకు రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం బదులిచ్చారు. యూపీలోని దాద్రీలో జరిగిన హత్య, కర్నాటకలో ప్రొఫెసర్ కల్బుర్గీ హత్యపై సిబిఐ దర్యాప్తు జరిపేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని హోం మంత్రి ప్రకటించారు. కాగా రాజ్‌నాథ్ బదులిస్తున్నప్పుడు ప్రతిపక్ష సభ్యులు పలుమార్లు అడ్డుపడ్డారు. ప్రతిపక్షం సభ్యుల తీరును స్పీకర్ సుమిత్రా మహాజన్ పలుమార్లు తప్పుపట్టారు. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున కర్గె జోక్యం చేసుకుని ‘మీరు అరేబియా తదితర దేశాల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఈ దేశంలో మీ పార్టీ సభ్యులు చేసిన అసహనం ప్రకటనలకు బదులివ్వరా?’ అని రాజ్‌నాథ్‌ను ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినాయకుడు ములాయం సింగ్ యాదవ్ లేచి రాజ్‌నాథ్ సింగ్ అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదో మాట్లాడుతున్నారని విమర్శించారు. దాద్రీ దుర్ఘటన వెనక బిజెపి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. దీనిపై రాజ్‌నాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం పట్ల ప్రతిపక్షానికి ఎందుకింత అసహనం అని నిలదీశారు. మంత్రి డొంకతిరుగుడు సమాధానం ఇస్తున్నారంటూ కాంగ్రెస్ సభ నుండి వాకౌట్ చేసింది.
బిజెపి వల్లే దేశంలో అసహనం పెరుగుతోందనటాన్ని హోం మంత్రి ఖండించారు. అవార్డులను వాపస్ చేసిన వారి గురించి మాట్లాడుతూ లోకసభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో మోదీ గెలిచిన తరువాత కూడా ఆయనను ఫాసిస్ట్ అంటారా? అని నిలదీశారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని సమర్ధించినవారు సహనంపై తమకు పాఠాలు నేర్పిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశం పట్ల విదేశీ పర్యటకులు ఏమనుకుంటున్నారనేది వివరిస్తూ చాలామంది విదేశీ పర్యాటకులు భారత్‌ను ప్రశంసలతో ముంచెత్తారని గుర్తుచేశారు. భారతదేశంలో వంద మతాలు, వంద భాషలున్నా ప్రజలందరు ప్రేమ, సహనంతో సహజీవనం గడుపుతున్నట్లు సౌదీ గజెట్ అభిప్రాయపడిందని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే అసహనం పేరుతో ఆరోపణలు చేస్తున్నారు. వితండవాదం చేస్తున్నారు’ అని ఆయన ధ్వజమెత్తారు. జమ్ముకాశ్మీర్‌లో లక్షలాది మందిని వెళ్లగొట్టినప్పుడు, 1984లో వందలాది మంది సిక్కులను ఊచకోత కోస్తుంటే వీరంతా ఎక్కడున్నారు? భాగల్పూర్, నెల్లి తదితర సంఘటనలు జరిగినప్పుడు వీరు ఏం చేశారు? తస్లీమా నస్రీన్‌కు అన్యాయం జరుగుతుంటే వీరేం చేశారు?’ అని రాజ్‌నాథ్ సింగ్ నిలదీశారు.
ప్రభుత్వం పట్ల ప్రతిపక్షంలో పెరుగుతున్న అసహనం మొదట తగ్గాలని రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. శ్రీరాముడు పాకిస్తాన్‌లో జన్మించాడని ముస్లిం లా బోర్డు సభ్యుడు ప్రకటించినా దేశంలో ఎలాంటి గొడవ జరగలేదంటే అది భారత సహనానికి నిదర్శమని హోం మంత్రి అన్నారు. ప్రభుత్వంపై ప్రతికూల విమర్శలు చేసిన కేంద్ర మంత్రి వికె సింగ్ విషయంలో ప్రధాన మంత్రి ఎందుకు స్పందించలేదనే ఆరోపణలకు బదులిస్తూ అది ప్రధాన మంత్రి బాధ్యత కాదు, తన బాధ్యత అని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. బిజెపికి చెందిన కొందరు ఎంపిలు, నాయకులు చేసిన ప్రకటనలపై తాను గతంలోనే స్పందించానన్నారు. సంయమనంతో వ్యవహరంచాలని తాను సూచించినట్లు వివరించారు.

చిత్రం.. లోక్‌సభలో వాడిగా వేడిగా చర్చలు, సమాధానాలు.. బయట కాస్తంత ఉపశమనం.
లోక్‌సభ సమావేశం అనంతరం వెలుపల సరదాగా మాట్లాడుకుంటున్న
సిపిఎం సభ్యుడు మహ్మద్ సలీం, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్