జాతీయ వార్తలు

ఉప ఎన్నికల్లో సత్తాచాటిన బిజెపి కూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలోని 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షాలు 7 స్థానాలను దక్కించుకుని అధిక్యతను చాటడంతో పాటుగా ఉత్తరప్రదేశ్, కర్నాటకలో అధికార పార్టీని దెబ్బతీసి లబ్ధి పొందింది. కాగా, ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మిశ్రమ ఫలితాలనిచ్చాయి. యుపి, కర్నాటక రాష్ట్రాల్లో మూడేసి అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, అధికార పార్టీలు రెండు స్థానాల్లో ఓడిపోయాయి. మరోవైపు మూడు నెలల క్రితం జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆర్‌జెడి-జెడి(యు), కాంగ్రెస్ పార్టీల మహాకూటమికి సైతం ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. హర్లఖి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిజెపి మిత్రపక్షమైన ఆర్‌ఎస్‌ఎల్‌పి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయితే అది ఇంతకుముందు ఆర్‌ఎస్‌ఎల్‌పి స్థానమే కావడం గమనార్హం. కాగా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణ, త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీలయిన బిజెపి, శివసేన, అకాలీదళ్, టిఆర్‌ఎస్, సిపిఎం పార్టీలు విజయం సాదించాయి. ఎనిమిది రాష్ట్రాల్లోని 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను మంగళవారం ప్రకటించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ముజఫర్‌నగర్, దేవ్‌బండ్ స్థానాల్లో అధికార సమాజ్‌వాది పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. 2013లో మత ఘర్షణలు జరిగిన ముజఫర్‌నగర్‌లో బిజెపి అభ్యర్థి కపిల్‌దేవ్ అగర్వాల్, సమాజ్‌వాది పార్టీకి చెందిన గౌరవ్ స్వరూప్‌పై 7,352 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కాగా, ఇస్లాం మత విద్యాలయం కేంద్రమైన దేవ్‌బండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మావియా అలీ సమాజ్‌వాది పార్టీకి చెందిన మీనా రాణాపై విజయం సాధించారు. అయితే ఫైజాబాద్ జిల్లాలోని బికాపూర్‌లో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి ఆనంద్ సేన్ యాదవ్ ఆర్‌ఎల్‌డి అభ్యర్థి మున్నా సింగ్ చౌహాన్‌ను ఓడించారు.
కాగా, మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో ప్రతిపక్ష బిజెపి అధికార కాంగ్రెస్‌పై పైచేయి సాధించింది. బెంగళూరులోని హెబ్బాల్ నియోజకవర్గంలో అధికార పార్టీతో దాదాపు ముఖాముఖి తలపడిన బిజెపి ఆ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. కాగా, మిగతా రెండు స్థానాలయిన దేవదుర్గ, బీదర్‌లలో ఆ పార్టీలు ఒకరి స్థానాన్ని మరో పార్టీ దక్కించుకున్నాయి. బిజెపినుంచి ఈ మూడు స్థానాలను గెలుచుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డిన నేపథ్యంలో ఫలితాలు ఆ పార్టీకి, ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు.
హెబ్బాల్‌లో మాజీ రైల్వే మంత్రి సికె జాఫర్ షరీఫ్ మనవడు, కాంగ్రెస్ అభ్యర్థి సికె అబ్దుల్ రహమాన్ షరీఫ్ బిజెపి అభ్యర్థి వైఎ నారాయణ స్వామి చేతిలో 19,149 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా ఎమ్మెల్సీ బైరతి సురేశ్‌ను నిలబెట్టాలని ముఖ్యమంత్రి భావించినప్పటికీ ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా చివరి క్షణంలో షరీఫ్‌కు టికెట్ ఇచ్చారు. కాగా. బీదర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రహీమ్ ఖాన్ తన సమీప ప్రత్యర్థి, బిజెపికి చెందిన ప్రకాశ్ ఖంద్రేపై 22,721 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దేవదుర్గలో బిజెపికి చెందిన కె శివన గౌడ్ నాయక్ కాంగ్రెస్‌కు చెందిన ఎ రాజశేఖర నాయక్‌ను 16,871 ఓట్ల తేడాతో ఓడించారు.

మధ్యప్రదేశ్‌లోని మైహార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి నేత నారాయణ్ త్రిపాఠి గెలుపొందడంతో బాణసంచా కలుస్తున్న కార్యకర్తలు

అభివృద్ధి రాజకీయాల విజయం: మోదీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షాలు విజయం సాధించడం ప్రజలు తమ ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి రాజకీయాలపై విశ్వాసం ఉంచారనడానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎన్డీఏ అద్భుత కృషి ఫలితంగానే ఈ విజయాలు లభించాయని మంగళవారం ఉపఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ట్విట్టర్‌లో ప్రధాని అన్నారు. ‘ఎన్డీఏ అద్భుతంగా కృషి చేసింది. దేశవ్యాప్తంగా ప్రజలు అభివృద్ధి రాజకీయాలపై పూర్తి విశ్వాసం ఉంచారు’ అని ఆయన అన్నారు.