జాతీయ వార్తలు

మళ్లీ.. ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయిన జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్‌ను బుధవారం పాటియాలా కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం 2.45 నిమిషాలకు కన్హయను కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై దాడి చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు కన్హయపై దాడి చేశారనీ, అతడితో ఉన్న పోలీసులను కూడా కొట్టారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఆయనకు మార్చి 2వ తేదీ వరకు జైలుశిక్ష విధించారు. దాంతో అతడ్ని తిహార్ జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం జరిగినట్లుగానే పాటియాల కోర్టులోనే ఈ రకమైన ఘటనలు చోటుచేసుకోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టువద్ద గట్టి భద్రత ఏర్పాటుచేయాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ బి.ఎస్.బస్సిని ఆదేశించింది. నల్లదుస్తులు ధరించిన వ్యక్తులు దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఆరుగురు సభ్యుల న్యాయవాదుల ప్యానెల్‌ను కోర్టు నియమించింది. ఈ బృందం తాజా పరిస్థితులపై కోర్టుకు నివేదిక ఇచ్చింది. కోర్టులో అసాధారణమైన పరిస్థితులు నెలకొన్నాయని, భయం, బెదిరింపులు తాండవిస్తున్నాయని తెలిపింది. అంతేకాదు, కన్హయకుమార్‌పై దాడి కూడా జరిగినట్లు ఈ ప్యానెల్ వెల్లడించింది. అక్కడ శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత ఢిల్లీ పోలీసు కమిషనర్‌దేనని న్యాయమూర్తులు జె.చలమేశ్వర్, ఎ.ఎం.సాప్రేలతో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించింది. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ఉంటే ఈ రకమైన పరిస్థితి తలెత్తేది కాదని ఈ ప్యానెల్ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. కన్హయ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. నిందితుడికి అన్నివిధాలుగా రక్షణ కల్పించాలని కోరారు. ఇందుకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పోలీసు కమిషనర్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.
ఇదిలావుండగా, బుధవారం కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా జెఎన్‌యు నాయకుడు కన్హయపై దాడి జరిగిందంటూ వచ్చిన కథనాల్లో నిజం లేదని పోలీసు కమిషనర్ బి.ఎస్.బస్సి స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి తాము చేపట్టిన రక్షణ చర్యలను ఆయన సమర్థించారు. అయితే లాయర్లపై పోలీసు దళాలను తీవ్ర స్థాయిలో ఉపయోగించడం అనేక విపరిణామాలకు దారితీస్తుందని, అది సరైన చర్య కాదని ఆయన పేర్కొన్నారు. అయితే కన్హయను కొట్టారంటూ వచ్చిన కథనాల్లో నిజం లేదని, కేవలం తోపులాట మాత్రం జరిగిందని వెల్లడించారు. పరిస్థితి అదుపు తప్పుతోందంటూ జరిగిన ప్రచారంలో కూడా నిజం లేదని చెప్పారు. కన్హయకు అన్ని విధాల రక్షణ కల్పించామనీ, సురక్షితంగానే కోర్టుకు హాజరుపరిచామని వెల్లడించారు.

చిత్రం... కన్హయ కుమార్‌ను పాటియాలా
కోర్టుకు తీసుకొస్తున్న పోలీసులు

కన్హయకు మద్దతుగా మీడియాతో మాట్లాడిన
జెఎన్‌యు విద్యార్థిపై కోర్టు ఆవరణలోనే న్యాయవాదుల దాడి