జాతీయ వార్తలు

పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల శాసనసభల సీట్ల సంఖ్యను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. అయితే ఇందుకు సంబంధించిన సవరణ బిల్లు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాకపోచ్చునని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల పదవీ కాలం 2019 వరకు ఉన్నందున అప్పటిలోగా సీట్ల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవచ్చునని ఎన్‌డిఏ ప్రభుత్వం భావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్ల సంఖ్యను పెంచినా అవి 2019 నుండే అమలులోకి వస్తాయి కాబట్టి ఈ అంశంపై తొందర పడవలసిన అవసరం లేదని ఎన్‌డిఏ ప్రభుత్వం భావిస్తున్నట్లు బిజెపి సీనియర్ నాయకుడు ఒకరు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్యను ఇప్పుడే పెంచాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విడి విడిగా విజ్ఞప్తి చేయటం తెలిసిందే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పట్టుపడుతున్నందున ఇందుకు సంబంధించి రాష్ట్ర విభజన చట్టాన్ని వీలున్నంత త్వరగా సవరించాలని ఎన్‌డిఏ ప్రభుత్వం భావిస్తోంది. వెంకయ్యనాయుడు విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం అటార్నీ జనరల్ ఈ అంశంపై దృష్టి సారించారని అంటున్నారు. రాష్ట్ర విభజన చట్టం సవరణ బిల్లును హడావుడిగా చేయటం వలన న్యాయ పరమైన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున పకడ్బందీగా పని చేయాలని ఎన్‌డిఏ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సీనియర్ నాయకుడు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఏపి విభజన చట్టాన్ని హడావుడిగా సవరించటంలో ఏదైనా తప్పులు దొర్లి ఎవరైనా కోర్టులో ఎస్‌ఎల్‌పి వేస్తే పరిస్థితి ఇబ్బందికరంగా తయారవుతుంది కాబట్టి అన్ని అంశాలను లోతుగా పరిశీలించి అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేసే విషయం కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నది. ఖమ్మంలోని కొన్ని గ్రామాలను తెలంగాణకు ఇచ్చి వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సుముఖంగా ఉన్నందున ఈ వ్యవహారం సజావుగా జరిగిపోతుందనే మాట వినిపిస్తోంది. బంగ్లాదేశ్‌లోని కొన్ని గ్రామాలు భారత్ తీసుకుని మరికొన్ని గ్రామాలను బంగ్లాదేశ్‌కు ఇచ్చివేయటం తెలిసిందే. ఈ గ్రామాల మార్పిడికి సంబంధించిన బిల్లు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ఇదే విధంగా ఏపిలోని కొన్ని గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇచ్చి వేసేందుకు సంబంధించిన సవరణ బిల్లు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదిస్తారా? లేదా? అనేది స్పష్టం కావటం లేదు.
22న సమావేశం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను సజావుగా నడిపించటంతోపాటు ఆమోదించవలసిన బిల్లుల గురించి చర్చించేందుకు వెంకయ్యనాయుడు ఈనెల 22 తేదీనాడు పార్లమెంటులోని వివిధ పక్షాల నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటులో ప్రతిపాదించనున్న, చర్చకు రానున్న బిల్లుల గురించి ఆయన ప్రతిపక్షానికి వివరించి వారి సహకారం కోరనున్నారు. వెంకయ్యనాయుడు రాజస్థాన్ లేదా మరో బిజెపి పాలిత రాష్ట్రం నుండి రాజ్యసభకు నాలుగోసారి ఎన్నికవుతారని అంటున్నారు.
వెంకయ్యనాయుడు రాజ్యసభ సభ్యత్వ కాలం మే, జూన్‌లో ముగుస్తోంది. ఆయన ఇంత వరకు కర్నాటక నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే ఈసారి కర్నాటక నుండి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు అంతగా లేనందున అధినాయకత్వం ఆయనను రాజస్థాన్ లేదా మరో బిజెపి పాలిత రాష్ట్రం నుండి రాజ్యసభకు తెస్తారని చెబుతున్నారు.