జాతీయ వార్తలు

ఇక సభా సంగ్రామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎన్డీయే సర్కారును ముప్పుతిప్పలు పెట్టేందుకు విపక్షాలు వివాదాస్పద ఆయుధాలతో సన్నద్ధమవుతున్నాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. అయితే, దేశ భక్తి నినాదంతో విపక్షాలను ఎదురు దెబ్బ తీసేందుకు అధికారపక్షం ప్రతి వ్యూహం పన్నుతోంది. ప్రభుత్వం ఘర్షణ విధానాన్ని అవలంభిస్తోందని ప్రతిపక్షం ఆరోపించటం చూస్తుంటే బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం తప్పదన్నది స్పష్టమవుతోంది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించటం ద్వారా బడ్జెట్ సమావేశాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈనెల 29న 2016-17 వార్షిక ప్రణాళికను లోక్‌సభలో ప్రతిపాదిస్తారు. అంతకుముందు 26న ఆయన ఆర్థిక సర్వేను సభ ముందుకుతెస్తారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రతిపాదిస్తారు. ఇదిలావుంటే, సెంట్రల్ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ఉభయ సభలు సమావేశమవుతాయి. జెఎన్‌యు వివాదం, హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య, అరుణాచల్‌ప్రదేశ్ రాజకీయ వివాదం, పఠాన్‌కోట్‌లోని వైమానిక కేంద్రంపై లష్కరే తోయిబా ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి, జాట్ రిజర్వేషన్ల గొడవ తదితర అంశాలపై సర్కారును నిలదీసేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతోంది. ప్రతిపక్షం దాడిని తిప్పికొట్టేందుకు ప్రభుత్వం సైతం దేశభక్తి ఆయుధాన్ని సిద్ధం చేసుకుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో తమను కోర్టుచుట్టూ తిప్పుతున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని రాజ్యసభలో మూడు చెరువుల నీళ్లు తాగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రధాని స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. గతవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించిన మోదీ, సెషన్స్‌పై సర్కారుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉభయ సభలు సాగితేనే ప్రజా సమస్యలపై దృష్టి సారించే వీలుంటుందని గుర్తుచేశారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సైతం తమస్థాయిలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి సమావేశాలు అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేయటం తెలిసిందే. జెఎన్‌యు వివాదాస్పద అంశాలన్నింటిపై చర్చించేందుకు సర్కారు సిద్ధంగా ఉందని ఎన్డీయే పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. అయితే, విపక్షం మాత్రం ప్రభుత్వంతో ఏకీభవించటం లేదు. వివాదాస్పద అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని తూర్పారబట్టాలని చూస్తోంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న వారిపై నరేంద్ర మోదీ చర్యలు తీసుకోలేనప్పుడు, బడ్జెట్ సమావేవాలు సజావుగా ఎలా సాగుతాయని ప్రశ్నిస్తోంది. ఏకాభిప్రాయం కుదిరిన బిల్లులు వినా, కుదరని బిల్లులను చర్చకు కూడా రానిచ్చేది లేదని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ సోమవారం స్పష్టం చేశారు. దేశంలో నిరంకుశత్వం పెరుగుతోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి ఆరోపించారు. ఉభయ సభల్లో వివాదాస్పద అంశాలపై లోతైన చర్చకు సముచిత సమయం కేటాయించకుంటే గొడవ జరిగి తీరుతుందని హెచ్చరించారు. ప్రతిపక్షం ప్రతిపాదించే ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఉభయ సభల్లో గొడవల వల్ల తమకు నష్టం జరుగుతోందని చిన్న పార్టీలు ఆందోళన చెందుతున్నాయన్నారు. బడ్జెట్ సమావేశాల్లో జిఎస్టీ బిల్లుకు సభామోదం తీసుకునేందుకు ప్రయత్నిస్తామని వెంకయ్య చెప్పారు.

చిత్రం... భద్రత నేపథ్యంలో పార్లమెంట్ వద్ద మోహరించిన అశ్వికదళం