జాతీయ వార్తలు

సెంట్రల్ వర్శిటీల్లో జోక్యం మానండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలోని సెంట్రల్ యూనివర్శిటీల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మానుకోవాలని సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. అసమ్మతిని అణచివేసే కుట్రలో భాగంగానే మత, నియంతృత్వ హిందూరాజ్య స్థాపనకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దళిత విద్యార్థి ఆత్మహత్య, జెఎన్‌యు విద్యార్థుల అరెస్టు వంటి ఘటనలతో పాటు వివిధ యూనివర్శిటీల్లో జరుగుతున్న పరిణామాలను సమీక్ష జరిపేందుకు సభా కమిటీని నియమించాలని ఏచూరి డిమాండ్ చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో యూనివర్శిటీల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రాజ్యసభలో చర్చకు తెరతీశారు. లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశమైన భారత్‌లో మత, నియంతృత్వ హిందూ రాజ్య స్థాపనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దేశంలోని పలు యూనివర్శిటీల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం చట్టవిరుద్ధమని అన్నారు. ‘ఒకటి రెండు ఘటనలను దృష్టిలో పెట్టుకుని మొత్తం విద్యార్థి లోకాన్ని నిందించవద్దనీ, మీరు కోరుకుంటున్న జాతీయవాదాన్ని స్థాపించేందుకు చేస్తున్న యత్నాలను నిలిపివేయాల’ని ఏచూరి డిమాండ్ చేశారు. అయితే, జాతి వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని, అలాగని విద్యార్థులందర్నీ జాతి వ్యతిరేకులుగా చిత్రీకరించడం తగదని అన్నారు. అశోకుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మాగాంధీ వంటివారు ప్రవచించిన జాతీయవాదానికి బదులుగా సంకుచిత జాతీయవాదాన్ని రుద్దే రీతిలో కేంద్రంలో పరిపాలన సాగుతోందని ఏచూరి వ్యాఖ్యానించారు. ఇది చాలా తీవ్రమైన విషయమనీ, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిని దేశద్రోహులుగా చిత్రీకరించదలుచుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. దేశంలోని సెంట్రల్ వర్శిటీలన్నీ కేంద్ర చట్టాలకు లోబడి ఏర్పడినవేనని, వీటిల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యంతో పాటు తాజా పరిణామాలను అధ్యయనం చేసేందుకు సభా కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ వర్శిటీకి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాసిన లేఖను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. హైదరాబాద్ వర్శిటీ, జెఎన్‌యుల్లో మాత్రమే కేంద్ర జోక్యం పరిమితం కాలేదనీ, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఇతర వర్శిటీల్లోనూ ఈ ధోరణి కొనసాగుతోందని ఏచూరి పేర్కొన్నారు.