జాతీయ వార్తలు

నా లేఖను తప్పుగా చిత్రీకరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వ్యవహారంపై తాను రాసిన లేఖను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తప్పుగా చిత్రీకరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. గురువారం రాజ్యసభలో రోహిత్ వేముల ఆత్మహత్య, జెఎన్‌యులో ఇటీవల సంభవించిన పరిణామాలపై జరిగిన చర్చలో హనుమంతరావు పాల్గొన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, వైస్ చాన్సలర్ పక్షపాత వైఖరి, విశ్వవిద్యాలయానికి చెందిన భూమి దుర్వినియోగం, దళిత విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై తాను లేఖ రాస్తే, స్మృతి ఇరానీ మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని హనుమంతరావు విమర్శించారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం వ్యవహారంపై తాను రాసిన లేఖకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రాసిన లేఖకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ అప్పారావు వ్యవహారంపై తాను లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్ దేశంలోని ప్రతి విశ్వవిద్యాలయంలోని విద్యార్థులపై తమ సిద్ధాంతాలను రుద్దేందుకు ప్రయత్నిస్తోంది కాబట్టే విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతున్నాయని హనుమంతరావు ఆరోపించారు. విశ్వవిద్యాలయానికి చెందిన రెండు వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఇతరులకు బదిలీ చేశారని హనుమంతరావు ఆరోపించారు. రోహిత్ వేముల చాలామంచి విద్యార్థి అని ఆయన వివరించారు. విశ్వవిద్యాలయాలలోని విద్యార్థి సంఘాలను ఆర్‌ఎస్‌ఎస్, విద్యార్థి పరిషత్ డామినేట్ చేయాలనుకుంటున్నాయని ఆయన విమర్శించారు. వైస్ చాన్సలర్ దళిత విద్యార్థుల పట్ల పక్షపాతంతో వ్యవహరించినందుకే వారు అంబేద్కర్ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారని హనుమంతరావు తెలిపారు.
రోహిత్ మరికొంత మందిని సామాజికంగా బహిష్కరించినందుకే పరిస్థితి ఆత్మహత్యకు దారితీసిందని ఆయన చెప్పారు. బిజిపి ఎమ్మెల్సీ రామచందర్ రావు చెప్పినట్లు వైస్ చాన్సలర్ అప్పారావు వ్యవహరించారని హనుమంతరావు దుయ్యబట్టారు. రామచందర్‌రావుపై ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మద్దతు ఉన్నందుకే అప్పారావుపై చర్య తీసుకోవటం లేదని హనుమంతరావు ఆరోపించారు.