జాతీయ వార్తలు

ప్రతిపక్షాల గందరగోళం మధ్యే ఆర్థిక మంత్రి బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర గందరగోళం మధ్యే సోమవారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. హైదారాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యపై హెచ్‌ఆర్‌డి మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, వామపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. మంత్రిపై హక్కుల తీర్మానానికి విపక్షాలు పట్డుబట్టాయి. ప్రతిపక్షాల గొడవతో సభలో అసాధరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బడ్జెట్ డాక్యుమెంట్ ప్రతిపాదనకు కొద్ది నిముషాలు ఆలస్యం జరిగింది. అరుణ్ జైట్లీ ప్రసంగం ప్రారంభించగానే కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు లేచి స్మృతి ఇరానీపై సభాహక్కుల తీర్మానం విషయం లేవనెత్తారు. రోహిత్ వేముల ఆత్మహత్యపై మానవవనరుల మంత్రి స్మృతి ఇరానీ సభను తప్పుదోవపట్టించారని వారు ధ్వజమెత్తారు. ఈ అంశం పరిశీలనతో ఉందని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. అయినా ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు. హెచ్‌ఆర్‌డి మంత్రి తీరు తమను ఎంతో బాధకు గురిచేసిందని కాంగ్రెస్ సభ్యుడు కెసి వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఆ సమయంలో హెచ్‌ఆర్‌డి మంత్రి స్మృతి ఇరానీ సభలోనే ఉన్నారు. ప్రతిపక్షాల నినాదాల మధ్య జైట్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆర్థిక మంత్రి ప్రసంగం గంటన్నర సేపు సాగింది. జైట్లీ స్కైబ్లూ కుర్తా, షేడ్ డార్క్ జాకెట్ ధరించి సభకు హాజరయ్యారు. ఆర్థిక మంత్రి, మధ్యలో అడపాదడపా మంచి నీళ్లు తాగుతూ కనిపించారు.
కూర్చుని ప్రసంగిస్తా
అరుణ్ జైట్లీ బడ్జెట్‌పై 25 నిముషాలు ప్రసంగించిన తరువాత కూర్చుని మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు అభ్యర్థించారు. మంత్రి అభ్యర్థనకు స్పీకర్ ఆమోదం తెలిపారు. గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలోనూ జైట్లీకి ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పుడూ కూర్చునే ప్రసంగపాఠం చదివారు. చాలాకాలం నుంచి వెన్నునొప్పితో బాధపడుతున్న జైట్లీ నిలబడి ప్రసంగించడానికి కొంత ఇబ్బందికి గురయ్యారు.

ఉపాధి హామీ పథకానికి
రూ.3,800 కోట్లు పెంపు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరుపై గతంలో సందేహం వ్యక్తం చేసిన ఎన్‌డిఎ ప్రభుత్వం సోమవారంనాటి బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయింపులను రూ.3,800 కోట్లు పెంచింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి రోడ్‌మ్యాప్‌ను వేశారు. ‘2016-17 బడ్జెట్‌లో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎకు రూ.38,500 కోట్లు కేటాయించాం. ఈ మొత్తాన్ని వ్యయం చేస్తే, ఈ పథకంకోసం ఇప్పటివరకు ఎక్కువ వ్యయం చేసింది ఈ బడ్జెటే అవుతుంది’ అని జైట్లీ పేర్కొన్నారు. గత బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ పథకానికి రూ.34,699 కోట్లు కేటాయించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేసే నిధుల వాస్తవ వినియోగం ఆధారంగా మరో రూ.5000 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చింది. ప్రభుత్వానికి ఈ హామీని గుర్తు చేస్తూ గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్ సింగ్ గత సంవత్సరం డిసెంబర్ 30న ఆర్థిక మంత్రి జైట్లీకి ఒక లేఖ రాశారు. రూ. 5వేల కోట్ల నిధులు తక్కువ పడుతున్నాయని సింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం హామీ ఇచ్చిన 5వేల కోట్లను మంజూరు చేయలేదు.

హోంమంత్రిత్వ శాఖకు
24 శాతం పెరిగిన బడ్జెట్

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 77,383.12 కోట్లు కేటాయించారు. అంటే గత బడ్జెట్ సవరించిన అంచనాలతో పోలిస్తే ఈ బడ్జెట్‌లో కేటాయింపులను 24.56 శాతం పెంచారు. ఈ కేటాయింపుల్లో ఎక్కువ భాగం అంతర్గత భద్రత, సరిహద్దు కాపలా విధులు నిర్వహిస్తున్న పారామిలిటరీ బలగాలయిన సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్ వంటి వాటికి కేటాయించారు. హోంశాఖకు కేటాయించిన బడ్జెట్‌లో రూ.67,408.12 కోట్లు ప్రణాళికేతర వ్యయం కింద కేటాయించగా, రూ. 9,975 కోట్లు ప్రణాళికా వ్యయం కింద కేటాయించారు. 2016-17 బడ్జెట్‌లో ఏడు పారామిలిటరీ బలగాలకు రూ. 50,176.45 కోట్లు కేటాయించారు. ఈ బలగాలలో సిఆర్‌పిఎఫ్‌కు రూ.16,228.18 కోట్లు, బిఎస్‌ఎఫ్‌కు రూ. 14,652.90 కోట్లు, సిఐఎస్‌ఎఫ్‌కు రూ. 6,067.13 కోట్లు, ఐటిబిపికి రూ. 4,231.04 కోట్లు, అస్సాం రైఫిల్స్‌కు రూ.4,363.88 కోట్లు, సహస్ర సీమ బల్‌కు రూ. 3,854.67 కోట్లు, నేషనల్ సెక్యూరిటి గార్డ్స్‌కు రూ. 688.47 కోట్లు కేటాయించారు. ఢిల్లీ పోలీస్‌కు రూ. 5,657.84 కోట్లు కేటాయించారు.

సిబిఐకి 32శాతం పెరిగిన కేటాయింపులు

న్యూఢిల్లీ: తీవ్రమైన సిబ్బంది కొరతతో సతమతం అవుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రోత్సాహం లభించింది. ఈ సంస్థకు బడ్జెట్‌లో రూ. 727.75 కోట్లు కేటాయించారు. 2015-16 ఆర్థిక సంవత్సర సవరించిన అంచనా రూ. 550.08 కోట్లు కాగా, ఈసారి బడ్జెట్‌లో కేటాయింపు సుమారు 32 శాతం పెరిగింది. ఒకటికన్నా ఎక్కువ రాష్ట్రాలకు విస్తరించిన నేరాలతో పాటు చిట్‌ఫండ్ కుంభకోణం, వ్యాపం కుంభకోణం వంటి స్కామ్‌లను దర్యాప్తు చేస్తున్న సిబిఐ సమర్థవంతంగా పనిచేయాలంటే నిధులు అవసరమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అరుణ్ జైట్లీ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గత సవరించిన బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే రూ. 177.67 కోట్లు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు అవినీతి కేసులతో పాటు ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు, విచారణ బాధ్యతలను నిర్వహించే సిబిఐకి ఎస్టాబ్లిష్‌మెంట్ సంబంధిత వ్యయం మొదలగువాటి కోసం ఈ నిధులు కేటాయించారు.

న్యాయశాఖకు రూ.900 కోట్లు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయ పాలనను విస్తరించే లక్ష్యంతో కేంద్ర బడ్జెట్‌లో సంబంధిత మంత్రిత్వ శాఖకు 900 కోట్లు కేటాయించారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించడానికి వీలుగా అన్నిచోట్లా వౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. ఈ-కోర్టుల ఏర్పాటు, అనుబంధ న్యాయవ్యవస్థకు సామర్థ్య కల్పన మొదలైన వాటిని పెంపొందిస్తారు. న్యాయపాలన, న్యాయ సంస్కరణల జాతీయ మిషన్‌లో భాగంగా ఈ కేటాయింపులు జరిపారు.

ఇపిఎఫ్ డిపాజిట్లపై
రిటైర్మెంట్ పన్ను!

ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనూహ్యమైన షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు కూడా ప్రావిడెంట్ ఫండ్ నుంచి నిధులను విత్‌డ్రా చేసుకునే వారిపై ఏ రకమైన పన్ను ఉండేది కాదు. కానీ, 2016-17 బడ్జెట్‌లో రిటైర్‌మెంట్ టాక్స్‌ను ప్రవేశపెట్టారు. ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని తీసుకునే సమయంలో 60 శాతంపై పన్ను వేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. 2016 ఏప్రిల్ 1నుంచి ఈ కొత్త విధానాన్ని అమలులోకి తెస్తారు. ఇప్పటివరకు కూడా ఇపిఎఫ్ చేపట్టే సామాజిక భద్రతా పథకాలకు పన్నుల మినహాయింపు ఉండేది. దీని ప్రకారం డిపాజిట్లు, వాటిపై వచ్చే వడ్డీ, విత్‌డ్రాయల్స్‌పై ఏ రకమైన పన్ను విధించేవారు కాదు. వివిధ రకాల పెన్షన్ పథకాల్లో పన్నుల పరంగా సారూప్యతను తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆర్థిక మంత్రి ఈ ప్రతిపాదన చేశారు. జాతీయ పెన్షన్ పథకంలో 40 శాతం మేర రిటైర్మెంట్ ప్రాతిపదికగా పన్నుల మినహాయింపు ఇస్తున్నామని, ఇదే పద్ధతి ఇపిఎఫ్‌కూ వర్తింపజేస్తున్నామని జైట్లీ తెలిపారు.

బ్యూరోక్రాట్ల శిక్షణకు 220 కోట్లు

బ్యూరోక్రాట్లకు శిక్షణ ఇవ్వడానికి 2016-17 సంవత్సరానికిగాను సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 220 కోట్ల రూపాయలకు పైగా కేటాయించారు. పాలనాపరమైన ఖర్చుల కోసం న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజిమెంట్ (ఐఎస్‌టిఎం), ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్ర్తీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్‌ఫిఎన్‌ఎఎ)లకు ఆర్థిక మంత్రి 2016-17 ఆర్థిక బడ్జెట్‌లో రూ. 220.44 కోట్లు కేటాయించారు. ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఓఎస్‌తో పాటుగా సెక్రటేరియట్లలో అన్నిస్థాయిల ఉద్యోగులకు నియమ నిబంధనలపై అవగాహన, సామర్థ్యం పెంపుకోసం ఈ రెండు సంస్థలు శిక్షణ ఇస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రెండు సంస్థలకు రూ. 213.22 కోట్లు కేటాయించడం జరిగింది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల సంస్థ అయిన పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు (పిఇఎస్‌బి)లకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులను ఆర్థిక మంత్రి అయిదు కోట్ల మేర పెంచారు. ఈ రెండు సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 30,80 కోట్లు కేటాయించడం జరిగింది.

ఇంటి రుణంపై వడ్డీలో
రూ. 50వేల రాయితీ

స్థిరాస్థి రంగంలో డిమాండ్‌ను పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం తొలిసారి గృహాన్ని కొనుక్కునే వినియోగదారుల ఇంటి రుణాలపై అదనంగా రూ. 50వేల వడ్డీ రాయితీని ఇవ్వడానికి ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ప్రజలు భరించగలిగే వ్యయంలో చేపట్టే ఇళ్ల నిర్మాణాల ప్రాజెక్టులకు పన్ను ప్రోత్సాహకాలను కూడా ప్రతిపాదించింది. పిపిపి పథకాలు సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఏ పథకం కిందనయినా 60 చదరపు మీటర్ల వరకు ప్రజలు భరించగలిగే వ్యయంతో చేసే ఇళ్ల నిర్మాణానికి సేవాపన్నును ప్రభుత్వం మినహాయించింది. రియల్ ఎస్టేట్ రంగం ప్రత్యేకించి గృహ నిర్మాణ రంగం గత రెండు మూడేళ్ల నుంచి మందగించిన నేపథ్యంలో ప్రభుత్వం 2016-17 బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనలు చేసింది.

‘స్వచ్ఛ్భారత్’కు
రూ.9 వేల కోట్లు

దేశంలో ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత మెరుగుపరచడానికి భారీఎత్తున చేపట్టిన స్వచ్ఛ్భారత్ అభియాన్‌కు ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.9 వేల కోట్లు కేటాయించింది. ‘పరిశుభ్రత అనేది మహాత్మాగాంధీ మానస పుత్రిక. ప్రభుత్వం స్వచ్ఛ్భారత్ అభియాన్‌కు రూ.9 వేల కోట్లు కేటాయించింది’ అని ఆర్థిక మంత్రి చెప్పారు. మహాత్మాగాంధీ 145వ జయంతి సందర్భంగా 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించిన ఈ పథకం జాతీయ స్థాయిలో 4,041 పట్టణాలు, నగరాల్లో అమలవుతోంది. దేశంలో మొట్టమొదటిసారి పార్లమెంటు శానిటేషన్‌పై సమగ్ర చర్చ జరిపిందని జైట్లీ చెప్పారు. ఇప్పుడిది దేశంలో ప్రతి ఒక్క ఇంట్లో చర్చనీయాంశమైందని జైట్లీ చెప్తూ, శానిటేషన్ విషయంలో పట్టణ ప్రాంతాలకు ర్యాంకింగ్స్ ఇవ్వడాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టందని, దీని ఫలితంగా పట్టణాలు, నగరాల మధ్య నిర్మాణాత్మక పోటీ ఉంటోందని కూడా చెప్పారు.

విమాన ప్రయాణం
మరింత భారం

ఇంధనంపై సుంకం 6 శాతం పెంపు

దేశంలో ఇక విమాన ప్రయాణం మరింత భారం కానుంది. 2016-17 సాధారణ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం విమాన ఇంధనం (ఎటిఎఫ్)పై ఎక్సైజ్ సుంకాన్ని 6 శాతం పెంచడమే ఇందుకు కారణం. విమాన ఇంధనంపై ప్రస్తుతం 8 శాతంగా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని 14 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం పార్లమెంట్‌లో ప్రకటించారు. అయితే ప్రాంతీయ అనుసంధానత పథకం (రీజినల్ కనెక్టివిటీ స్కీమ్) కింద ప్రతిపాదించిన షెడ్యూల్డ్ కమ్యూటర్ ఎయిర్‌లైన్స్ (ఎస్‌సిఎ)కు ఈ సుంకం పెంపు వర్తించదు. కానీ ఎస్‌సిఎలు, ప్రాంతీయ అనుసంధానత పథకం ఇంకా అమలులోకి రానందున దేశంలోని అన్ని విమానాశ్రయాల నుంచి సర్వీసులను నడుపుతున్న ఎయిర్‌లైన్ సంస్థలకు ఇది వర్తిస్తుంది. దేశంలో ఎస్‌సిఎలను అందుబాటులోకి తీసుకువచ్చి వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానతను పెంపొందించాలని పౌర విమానయాన శాఖ తన విధాన ముసాయిదాలో ప్రతిపాదించింది. అయితే అది ఇంకా ఖరారు కాలేదు.

ఆరోగ్య సంరక్షణకు
కొత్త పథకం

కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ. లక్ష వరకు ఆరోగ్య సంరక్షణకోసం అందజేయడానికి వెసులుబాటు ఉంటుంది. దీంతోపాటు నాణ్యమైన ఔషధాలను ప్రజలకు భరించగలిగిన ధరలకు అందజేయడానికి దేశవ్యాప్తంగా 3వేల మెడికల్ స్టోర్‌లను ఏర్పాటు చేయనున్నారు. దేశంలో ప్రతి సంవత్సరం 2.2 లక్షల కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు చివరి దశకు చేరుకుంటుండటం వల్ల 3.4 కోట్ల డయాలసిస్ సెషన్ల అదనపు డిమాండ్ ఏర్పడినందున ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలను అందించేందుకు జాతీయ డయాలసిస్ సేవల కార్యక్రమాన్ని తీసుకురానుంది. పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలో కుటుంబ సభ్యులు ఎవరికి తీవ్రమైన వ్యాధి వచ్చినా ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ఒత్తిడి పడుతూ ఆ కుటుంబ ఆర్థిక భద్రతా పునాదిని దెబ్బతీస్తోంది. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వరకు ఆర్థిక సహాయం అందజేస్తుందని జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

హెచ్‌ఆర్‌ఎపై
పన్ను మినహాయింపు

పరిమితి 60 వేలకు పెంపు

కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు స్వల్ప ఊరట లభించింది. అందరూ అనుకున్నట్లుగా 2016-17 సార్వత్రిక బడ్జెట్‌లో కనీస ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచకపోయినప్పటికీ ఇంటి అద్దె అలవెన్సు (హెచ్‌ఆర్‌ఎ)పై ప్రస్తుతం సంవత్సరానికి రూ.24 వేలుగా ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని రూ.60 వేలకు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం పార్లమెంట్‌లో ప్రకటించారు. ‘ఆదాయ పన్ను చట్టంలోని 80 జిజి సెక్షన్ కింద హెచ్‌ఆర్‌ఎపై ప్రస్తుతం రూ.24 వేలుగా ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని రూ.60 వేలకు పెంచాలని నేను ప్రతిపాదిస్తున్నా. దీని వలన అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారికి ఊరట లభిస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు.
ధనిక వర్గాల ఆదాయ పన్నుపై సర్‌చార్జి 3 శాతం పెంపు
సంవత్సరానికి కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్న ధనిక వర్గాల ఆదాయ పన్నుపై సర్‌చార్జిని 12 నుంచి 15 శాతానికి పెంచింది. కంపెనీలు, సంస్థలు, సహకార సంఘాలు మినహా సంవత్సరానికి కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్న వ్యక్తుల ఆదాయ పన్నుపై సర్‌చార్జిని 3 శాతం పెంచాలని ప్రతిపాదిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న ఆదాయ పన్ను శ్లాబుల్లో ఆయన ఎటువంటి మార్పు చేయలేదు. 2013-14లో 10 శాతం సర్‌చార్జి విధించిన విషయం తెలిసిందే.
అయితే గత బడ్జెట్‌లో అరుణ్ జైట్లీ సంపద పన్నును రద్దుచేసి అందుకు బదులుగా కోటి రూపాయలు, అంతకంటే ఎక్కువ వార్షికాదాయం కలిగిన ధనికులు చెల్లించే పన్ను మొత్తంపై మరో 2 శాతం సర్‌చార్జి విధించారు.

క్రీడాశాఖకు నిధులు
ఒక మోస్తరుగా పెంపు

మొత్తం రూ.1,541 కోట్ల కేటాయింపు

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో క్రీడా శాఖకు గత ఏడాది కంటే ఈసారి కేటాయింపులు ఒక మోస్తరుగా రూ.50.87 కోట్లు పెరిగాయి. గత సార్వత్రిక బడ్జెట్‌లో ఈ శాఖకు మొత్తం రూ.1,541.13 కోట్లు కేటాయించగా, 2016-17 బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం కింద రూ.1,400 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద మరో రూ.192 కోట్లు చొప్పున మొత్తం రూ.1,592 కోట్లు కేటయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో క్రీడాశాఖకు గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ప్రణాళికా కేటాయింపులు సుమారు రూ.10.82 కోట్లు పెరగ్గా, ప్రణాళికేతర కేటాయింపులు రూ.40.15 కోట్లు పెరిగాయి. అయితే ప్రస్తుత బడ్జెట్‌లో ఈశాన్య భారతావనికి కేటాయింపులు స్వల్పంగా తగ్గాయి. గత బడ్జెట్‌లో ఈ ప్రాంతానికి రూ.150.23 కోట్లు కేటాయించిన అరుణ్ జైట్లీ 2016-17 సార్వత్రిక బడ్జెట్‌లో వీటిని రూ.144.98 కోట్లకు కుదించి, జాతీయ క్రీడా శిక్షణా శిబిరాల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న స్టోర్ట్స్ అధారిటీకి కేటాయింపులు రూ.11.91 కోట్లు పెంచి రూ.381.30 కోట్లు మంజూరు చేశారు.

వృత్తి నైపుణ్యత పెంపునకు
బహుముఖ శిక్షణా కేంద్రాలు

రూ.1,700 కోట్ల కేటాయించిన జైట్లీ

యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్‌లో అనేక చర్యలను ప్రతిపాదించారు. దేశంలో 1,500 బహుముఖ వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలతోపాటు జాతీయ నైపుణ్య అభివృద్ధి ధ్రువీకరణ బోర్డు (నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ సర్ట్ఫికేషన్ బోర్డు)ను ఏర్పాటుచేసి రానున్న మూడేళ్లలో కోటిమంది యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందిస్తామని, ఇందుకోసం 2016-17 సార్వత్రిక బడ్జెట్‌లో 1,700 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ప్రకటించారు. భారత్‌ను విజ్ఞాన ఆధారిత, ఉత్పాదక సమాజంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన తొమ్మిది మూల స్తంభాల్లో విద్య, వృత్తి నైపుణ్యం, ఉపాధి అవకాశాలను పెంపొందించడం ఒకటని జైట్లీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఉన్నత విద్యకోసం
ఓ ఆర్థిక సంస్థ

ఐఐటిలు లాంటి దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించడం కోసం వెయ్యి కోట్ల రూపాయల ప్రాథమిక మూలధనంలో ఒక ఉన్నత విద్యా ఆర్థిక ఏజన్సీ (హెచ్‌ఇఎఫ్‌ఏ)ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. పది ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే మరో పది ప్రైవేటు విద్యాసంస్థలు ప్రపంచ స్థాయి బోధన, పరిశోధనా సంస్థలుగా ఎదగడం కోసం ఒక రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు. అలాగే సెక్యూరిటీస్ డిపాజిటరీ తరహాలో స్కూల్ లీవింగ్ సర్ట్ఫికెట్లు, కాలేజి డిగ్రీలు, విద్యాపరమైన అవార్డులు, మార్క్‌షీట్లు లాంటి విద్యాపరమైన సర్ట్ఫికెట్ల కోసం ఒక డిజిటల్ డిపాజిటరీని ఏర్పాటు చేయనున్నట్లు, కొత్తగా మరో 62 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆర్థిక మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యను సార్వజనీకం చేసిన తర్వాత ప్రభుత్వం విద్య నాణ్యతపైన దృష్టిపెట్టడం ద్వారా మరో పెద్ద ముందడుగు వేయాలని అనుకుంటోందని సర్వశిక్షా అభియాన్ కింద కేటాయించిన నిధుల్లో అధిక వాటాను దీనికోసం కేటాయించనున్నట్లు ఆయన చెప్పారు.

ఇక పేదింటికి
గ్యాస్ వెలుగు
మూడేళ్లపాటు రాయితీలు

పేదరిక రేఖ దిగువన వున్న (బిపిఎల్) వర్గాలకు అరుణ్ జైట్లీ వరాలు ప్రకటించారు. రాయితీ ప్రాతిపదికగా ఈ వర్గాలకు ఐదుకోట్ల ఎల్‌పిజి కనెక్షన్లను అందించాలని నిర్ణయించారు. 2018-19 వరకు అంటే మూడు సంవత్సరాల కాలం పాటు ఈ రాయితీలు కొనసాగుతాయి. మొత్తం ఐదుకోట్ల బిపిఎల్ కుటుంబాలకు రూ.1600 చొప్పున రాయితీలు అందిస్తారు. పేద కుటుంబాల్లో మహిళల పేరిటే ఎల్‌పిజి కనెక్షన్లను అందిస్తారు. అలాగే ప్రారంభంగా చెల్లించాల్సిన మొత్తాన్ని భరించడానికి రెండువేల కోట్ల రూపాయలను అరుణ్ జైట్లీ కేటాయించారు. దీనివల్ల కోటిన్నర బిపిఎల్ కుటుంబాలకు ఉపయోగం ఉంటుందని తెలిపారు. అనంతరం మొత్తం ఐదుకోట్ల బిపిఎల్ కుటుంబాలకు దీన్ని విస్తరిస్తామని తెలిపారు. ఈ పథకం పూర్తయితే ప్రతి ఒక్కరికీ కూడా గ్యాస్ కనెక్షన్ అందించాలన్న లక్ష్యం నెరవేరుతుందన్నారు. 2016-17 సంవత్సరంలో కోటిన్నర కుటుంబాలకు, 1017-18 సంవత్సరంలో మరో కోటిన్నర కుటుంబాలకు, 2018-19 సంవత్సరంలో రెండుకోట్ల బిపిఎల్ కుటుంబాలకు రాయితీ ప్రాతిపదికన వంటగ్యాస్‌ను అందిస్తామని తెలిపారు.

10 శాతం పెరిగిన రక్షణ బడ్జెట్

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్ దాదాపు 9.76 శాతం మేర పెరిగింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాల మేరకు రక్షణ బడ్జెట్ రూ.2.33 కోట్లు ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ మొత్తాన్ని 2.58 కోట్ల రూపాయలకు పెంచారు. మరోవైపు ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్ అమలు కారణంగా మిలిటరీ పెన్షన్ల కింద చెల్లించాల్సిన మొత్తం ఏకంగా రూ. 82 వేలకు పెరిగింది. కాగా, ఆధునీకరణ కోసం త్రివిధ దళాలకు కేటాయించిన పెట్టుబడుల మొత్తం రూ. 78,586.68 కోట్లుగా ఉంది. అయితే ఆర్థిక మంత్రి 2016-17 సంవత్సరానికి రక్షణ కేటాయింపుల గురించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రస్తావనా చేయకపోవడం విశేషం. 2016-17 ఆర్థిక సంవత్సరానికి మొత్తం కేంద్ర ప్రభుత్వ వ్యయం రూ 19.78 లక్షల కోట్లు కాగా, రక్షణ బడ్జెట్ దానిలో 17.2 శాతం ఉంది. ఇందులో రక్షణ బడ్జెట్‌తో పాటుగా జవాన్లకు చెల్లించాల్సిన పెన్షన్ బడ్జెట్ కూడా కలిసి ఉంది. పెన్షన్ బడ్జెట్ వ్యయం భారీగా ఏకంగా 82,332.66 కోట్ల రూపాయలకు పెరగ్గా, అదే సమయంలో త్రివిధ దళాల పెట్టుబడుల వ్యయం మాత్రం స్వల్పంగా రూ.4,287.07 కోట్ల రూపాయలకు పెరగడం గమనార్హం. త్రివిధ దళాలు తమ ఆయుధాలు, ఇతర పరికరాలను పెద్ద ఎత్తున ఆధునీకరించే ప్రక్రియలో ఉన్న సమయంలో పెట్టుబడుల వ్యయం కేటాయింపులు స్వల్పంగా మాత్రమే పెరగడం విశేషం. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన పెట్టుబడుల బడ్జెట్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ పూర్తిగా వినియోగించుకోకపోవడం దీనికి ఒక కారణం. సైన్యం రఫాలే యుద్ధ విమానాలు, అపాచే, చినూక్, కామోవ్ హెలికాప్టర్లు, ఎం777 లైట్‌వెయిట్ హోవిట్జర్ తుపాకులను కొనుగోలు చేయడానికి వందల కోట్ల డాలర్ల ఒప్పందాలను కుదుర్చుకునే ప్రక్రియలో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీటి కొనుగోళ్ల చెల్లింపులను ఏకమొత్తంగా కాక దశలవారీగా చెల్లించడం జరుగుతుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

కారు మరింత ప్రియం

మార్కెట్లో ఎక్కువగా అమ్ముడు పోయే చిన్న కార్లు మొదలుకొని అన్ని కార్ల ధరలు ఇకపై పెరగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం పార్లమెంటుకు సమర్పించిన 2016-17 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో వివిధ రకాల కార్లపై 4 శాతం దాకా ఇన్‌ఫ్రాస్టక్చర్ సెస్ విధించనున్నట్లు ప్రకటించడమే దీనికి కారణం. ముఖ్యంగా డీజిల్ వాహనాల ధరలు ఎక్కువగా పెరగనున్నాయి. పెట్రోలు, ఎల్‌పిజి, సిఎన్‌జితో నడిచే చిన్న కార్లపై 1 శాతం, నిర్దిష్ట సామర్థ్యం కలిగిన డీజిల్ కార్లపై 2.5 శాతం, ఎక్కువ శక్తి కలిగిన వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్‌యువి)పై 4 శాతం సెస్ విధించడానికి ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అంతేకాకుండా పది లక్షల రూపాయల పైబడిన విలువ కలిగిన కార్లు, 2 లక్షల రూపాయలకు పైబడిన వస్తు, సేవల నగదు కొనుగోళ్లపైన 1శాతం చొప్పున పన్ను కొనుగోళ్లు జరిపినచోటనే వసూలు చేయాలని కూడా జైట్లీ ప్రతిపాదించారు. దేశంలోని నగరాలు, పట్టణాల్లో కాలుష్యం, ట్రాఫిక్ సమస్య ఆందోళనకరంగా ఉందని, అందువల్ల పెట్రోలు, ఎల్‌పిజి, సిఎన్‌జితో నడిచే చిన్నకార్లపైన 1 శాతం, కొన్ని రకాల సామర్థ్యం కలిగిన డీజిల్ వాహనాలపైన 2.5 శాతం, అధిక ఇంజను సామర్థ్యం వాహనాలు, ఎస్‌వియులపై 4 శాతం ఇన్‌ఫ్రాస్టక్చర్ సెస్ విధించడానికి ప్రతిపాదిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. పొడవు 4 మీటర్లకు, అలాగే ఇంజను సామర్థ్యం 1200 సిసికి మించని పెట్రోలు, ఎల్‌పిజి, డీజిలుతో నడిచే కార్లపైన 1 శాతం సెస్ విధిస్తారు. కాగా, 4 మీటర్ల పొడవుకు మించని, ఇంజను సామర్థ్యం 1500 సిసికి మించని డీజిలుతో నడిచే వాహనాలపై 2.5 శాతం, ఇతర అధిక ఇంజను సామర్థ్యం కలిగిన వాహనాలు, ఎస్‌యువిలపై 4 శాతం సెస్ విధించనున్నట్లు జైట్లీ వివరించారు.