జాతీయ వార్తలు

ఆ నినాదాలు జాతి వ్యతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ ద్రోహం కేసులో అరెస్టయిన జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌కు ఆర్నెల్ల పాటు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు ‘వర్శిటీ ప్రాంగణంలో చేసిన నినాదాలను జాతి వ్యతిరేకమైనవి’ పేర్కొంది. భారత్‌కు వ్యతిరేకంగా చేసిన ఆ నినాదాలు దేశ సమగ్రతను దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను ఉదహరించింది. పదివేల రూపాయల వ్యక్తిగత బాండ్, అంతే మొత్తంలో వర్శిటీ ఫ్యాకల్టీ పూచీకత్తుపై కన్హయ్య కుమార్‌కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ‘ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన కూడ’దని కన్హయ్య కుమార్‌ను ఆదేశించింది. ట్రయల్ కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా దేశ వదలి వెళ్లడానికి వీల్లేదని, విద్యార్థి యూనియన్ అధ్యక్షుడిగా వర్శిటీ క్యాంపస్‌లో జాతివ్యతిరేక కార్యకలాపాలను నిరోధించాలని కన్హయ్య కుమార్‌కు స్పష్టం చేసింది. అవసరమైనప్పుడల్లా దర్యాప్తు అధికారులకు సహకరించాలని ఆయనకు విజ్ఞప్తి చేసింది. కన్హయ్య కుమార్ తల్లి నెలకు మూడు వేల రూపాయలు సంపాదిస్తున్న అంగన్‌వాడి కార్యకర్త కావడం, అతడి కుటుంబ పరిస్థితిని లోతుగా పరిశీలించిన మీదటే వ్యక్తిగత బెయిల్ మొత్తాన్ని పదివేల రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని తెలిపింది. దేశద్రోహం కేసులో దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉన్నందున నిందితులు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కింద ఎలాంటి వెసులుబాటు పొందలేరని న్యాయమూర్తి ప్రతిభారాణి ఉద్ఘాటించారు. అఫ్జల్‌గురు, మక్బూల్ భట్‌లను కీర్తిస్తూ గత నెల తొమ్మిదిన వర్శిటీ ప్రాంగణంలో నినాదాలు చేయడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు. అఫ్జల్‌గురు, మక్బూల్ భట్‌ల పొటోలు కలిగిన పోస్టర్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేసిన విద్యార్థులు వాటి తీవ్రతను అంతర్మధనం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

చిత్రం... కన్హయ్యకు బెయల్ మంజూరు కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న జెఎన్‌యు విద్యార్థినీ విద్యార్థులు