జాతీయ వార్తలు

ఏళ్లొచ్చాయ.. ఎందుకు?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్‌పై
మోదీ పరోక్ష విసుర్లు

చెప్పడం తేలికేనంటూ వ్యంగ్యోక్తులు
కాంగ్రెస్‌ది ఆత్మన్యూనతే
ఏప్రిల్ 1నుంచి పంటల బీమా పథకం
ప్రతిపక్షంతో కలిసి పనిచేసేందుకు సిద్ధం
యువ ఎంపీలు, మహిళలకు మాట్లాడే అవకాశం
ధన్యవాద ప్రసంగంలో ప్రధానమంత్రి వెల్లడి

న్యూఢిల్లీ: ‘రాహుల్‌ది అనుభవ రాహిత్యం..వయసు పెరిగినా అవగాహన పెరుగలేదు..కొందరు చెబుతారు అంతే..వినే తత్వం వారికుండదు..’ ఇలా కాంగ్రెస్ యువనేతపై ప్రధాని మోదీ పరోక్షంగా వ్యంగ్యోక్తులతో, చతురోక్తులతో విరుచుకు పడ్డారు. ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ నిర్వాకాన్ని ఎండగట్టారు. ప్రభుత్వానివి తప్పులే అయినప్పుడు ఏమీ చేయాలో ఆయనే చెప్పాలంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిపై ఎదురుదాడికి దిగారు. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు జవాబిచ్చిన మోదీ ఇటు కాంగ్రెస్, అటు ఇతర విపక్షాల తీరుపైనా పదునైన వాగ్బాణాలు సంధించారు. రాహుల్ గాంధీని విమర్శించేందుకు ఆయన మాజీ ప్రధానమంత్రులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల ప్రసంగాలను ఉటంకించారు. రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండానే మోదీ ఆయనపై విమర్శలు గుప్పించారు. ఉభయ సభలను కాంగ్రెస్ స్తంభించజేయటం వల్లనే ముఖ్యమైన బిల్లులు పెండింగ్‌లో పడిపోవటంతోపాటు ప్రజాప్రతినిధుల పట్ల అధికార యంత్రాంగం అగౌరవభావంతో వ్యవహరిస్తోందని అన్నారు. ముఖ్యమైన బిల్లులను పార్లమెంటులో ఆమోదించేందుకు ప్రభుత్వంతో సహకరించాలని ఆయన ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు ప్రతిపక్షంతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రధాన మంత్రి పంటల బీమా పథకాన్ని ఏప్రిల్ ఒకటో తేదీ నుండి దేశమంతా అమలు చేస్తామని మోదీ ప్రకటించారు. పార్లమెంటు సక్రమంగా పని చేయకపోవటం వలన ప్రజాప్రతినిధుల పట్ల అధికార యంత్రాంగంలో పెరుగుతున్న నిర్లక్ష్యవైఖరిని అదుపు చేసేందుకు అధికార, ప్రతిపక్షం కలిసి పని చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. జెఎన్‌యు సంఘటనలను పరోక్షంగా ప్రస్తావిస్తూ రష్యా మాజీ అధ్యక్షుడు లెనిన్ విషయంలో కృశే్చవ్ చేసిన ఆరోపణ సంఘటనను వివరించారు. అర్థం కావలసిన వారికి అర్థమైతే చాలంటూ వామపక్షాలపై వ్యంగ్యోక్తులు విసిరారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ మాటలను ఉటంకిస్తూ ఆయన వామపక్షాలపై విమర్శలు గుప్పించారు. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు, బీదరికాన్ని తొలగించేందుకు ప్రతిపక్షంతో కలిసి పని చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నదని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశం ఎదుర్కొంటున్న బీదరికం, మంచినీటి కొరత, కోర్టులో కేసులు పేరుకుపోవటం వంటి సమస్యల గురించి ఉభయ సభల్లో చర్చించి పరిష్కారాలు కనుగొనేందుకు అధికార, ప్రతిపక్షం కలిసి పని చేయాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా దేశంలో ఈరోజు కూడా బీదరికం, వెనుకబాటుతనం ఉండటానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు తమ ఆత్మన్యూనతాభావాన్ని దాచుకునేందుకే కాంగ్రెస్ పార్లమెంటును స్తంభింపజేస్తోందని ఆయన విమర్శించారు. పార్లమెంటు సజావుగా జరిగితే ప్రతిపక్షంలోని సమర్థులైన ఎంపీలు ఎక్కడ ఎదిగిపోతారేమోననే భయంతో ఉభయ సభలను స్తంభింపజేస్తున్నారు తప్ప ఎన్డీఏ ప్రభుత్వంపై కోపంతో కాదంటూ ఆయన రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు చేశారు. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి హోదాలో అమెరికాలో పర్యటిస్తుంటే ఢిల్లీలో ఆయన ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను విలేఖరుల సమావేశంలో చింపివేసిన వారు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ జారీ చేసిన కరపత్రాన్ని బహిరంగ సభలో చించివేసిన వ్యక్తి నేర్చుకోలసింది ఎంతో ఉన్నదంటూ ఆయన రాహుల్ గాంధీకి పరోక్షంగా హితవు చెప్పారు. మొదటిసారి ఎంపికైన యువకులు, మహిళలకు మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు పార్లమెంటు సమావేశాలలో కొన్ని రోజులను వారి కోసం రిజర్వు చేసే విషయం పరిశీలించాలని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయి కాబట్టే తాము అధికారంలోకి పలు అభివృద్ది పథకాలను అమలు చేసి విజయం సాదిస్తున్నామని నరేంద్ర మోదీ తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి కల్పమా హామీ పథకం, ఆధార్ పథకం తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఎన్.డి.ఏ ప్రభుత్వం కాపీ కొడుతోందంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. 1950 నుండి రకరకాల పేర్లతో అమలు జరిగిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు మారుస్తూ వచ్చాయి, ఇప్పుడు తమ ప్రభుత్వం మరింత పటిష్టం చేసి అమలు చేస్తోందంటూ పలు వివరాలను సభ ముందు పెట్టారు. ఎన్‌డిఏ మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదంటూ ఆయన రైల్వే శాఖ, ఇతర శాఖలు గత ఇరవై నెలల్లో సాధించిన ఫలితాలను సభకు వివరించారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ నెల ఎనిమిదో తేదీ నాడు ఉభయ సభల్లో కేవలం మహిళలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు. ఒకటి,రెండు సమావేశాల్లో ఒక వారం రోజుల పాటు కేవలం మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైన వారికి మాట్లాడే అవకావం ఇవ్వాలని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. యువ ఎంపీలు ఇచ్చే తాజా ఆలోచనలు ఈ దేశానికి ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రధాన మంత్రిగా కాకుండా ఒక ఎంపీగా ఈ ప్రతిపాదనలు చేస్తున్నానని మోదీ చెప్పారు.
నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం పనె్నండు గంటల పదిహేను నిమిషాలకు తన ప్రసంగం ప్రారంభించి పార్లమెంటు ఉభయ సభలు సక్రమంగా పని చేయకపోవటం వలన అధికార పక్షానికి పెద్దగా నష్టం ఉండదు కానీ ప్రతిపక్షానికి ఎక్కువ నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించగానే అధికార పక్షం సభ్యులు ఆశ్చర్యపడ్డారు. అయితే నరేంద్ర మోదీ ఆ తరువాత చెప్పిన మాటతో వారంతా విరగబడి నవ్వారు. పార్లమెంటు స్తంభించిపోవటం వలన ప్రతిపక్షానికి ఎక్కువ నష్టం జరుగుతుందని తాను చెప్పట లేదు మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ చెప్పారని మోదీ ప్రకటించగానే అధికార పక్షంతో పాటు పలువురు ప్రతిపక్షం సభ్యులు సైతం గొళ్లున నవ్వారు. గతంలో పార్లమెంటులో ఒక సభ్యుడు ప్రశ్న చర్చకు వస్తోందంటే అధికార యంత్రాంగం వణికిపోయేది, ఎలాంటి విమర్శలు వస్తాయోనని భయపడిపోయేవారు, అందుకే కష్టపడి సమాధానాలు తయారు చేసేవారు అందుకే ఇప్పుడు పార్లమెంటు స్తంభించిపోవటం వలన అధికార యంత్రాంగం సంతోషిస్తున్నారని మోదీ చెప్పారు. ప్రజాప్రతినిధుల పట్ల అధికార యంత్రాంగానికి గౌరవం లేకుండాపోయింది, ఎం.పిలంటే వారు భయపడటం లేదు, ఎందుకీ దుస్థితి వచ్చిందని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులంటే భయపడని అధకార యంత్రం ఉండటం వలన దేశానికి ఎంతోనష్టం కలుగుతుందని ఆయన హెచ్చరించారు. ఎం.పిలంటే గౌరవం లేకుండాపోయింది, ఇది మంచి పరిణామం కాదంటూ ఈ పరిస్థితులను మార్చేందుకు అధికార, ప్రతిపక్షం కలిసి పని చేయాలన్నారు. పార్లమెంటు సక్రమంగా పని చేసినప్పుడే ఎం.పిలంటే అదికార యంత్రాంగం భయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి పార్లమెంటు సభ్యుడు ప్రధాన మంత్రితో సమానమని నరేంద్ర మోదీ ప్రకటించారు. లోకసభ ఆమోదించిన బిల్లులను రాజ్యసభలో తిరస్కరించటం ద్వారా దేశానికి ఎంతో నష్టం కలిగిస్తున్నారని ఆయన కాంగ్రెస్, వామపక్షాలపై ఆరోపణలు గుప్పించారు. నావిగేషన్ బిల్లు, విజిల్‌బ్లోవర్స్ బిల్లు,జి.ఎస్.టి బిల్లు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ బిల్లును రాజ్యసభలో ఎందుకు అడ్డుకుంటున్నారని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. మేక్ ఇన్ ఇండియా పథకాన్ని అపహాస్యం చేయటాన్ని ఆయన ఖండించారు. మార్పును వ్యతిరేకించటం మంచిది కాదంటూ మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ చేసిన వ్యాఖ్యను ఆయన కాంగ్రెస్‌కు గుర్తు చేశారు. మన్రేగా పథకంలోని అవినీతిని నిర్మూలిస్తున్నామని ఆయన తెలిపారు. అధికార యంత్రాంగం జవాబుదారీ తనం పెంచవలసి ఉన్నదని మోదీ తెలిపారు.

చిత్రం... గురువారం లోక్‌సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ