జాతీయ వార్తలు

దేశంలోకి ఉగ్రవాదులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ అహ్మదాబాద్: పాకిస్తాన్‌నుంచి గుజరాత్ గుండా పది మంది లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ మిలిటెంట్లు దేశంలోకి ప్రవేశించారని, దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరపడానికి నగరంలోకి చొరబడవచ్చన్న సమాచారం పోలీసులకు అందడంతో ఢిల్లీతో పాటుగా గుజరాత్, జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాల్లో ఆదివారం హై అలర్ట్ ప్రకటించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం సోమనాథ ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లకోసం నాలుగు ఎన్‌ఎస్‌జి దళాలను హుటాహుటిన ఆ రాష్ట్రానికి పంపించారు. సోమవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని గుజరాత్‌తో పాటుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, జమ్మూ, కాశ్మీర్‌లలో పోలీసులను అప్రమత్తం చేయడంతో పాటుగా కచ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఇతర ప్రధాన భవనాలు, సున్నిత ప్రాంతాల్లో, అన్ని ప్రముఖ దేవాలయాల వద్ద భద్రతను పెంచారు. గుజరాత్‌లోని సోమనాథ ఆలయం వద్ద ఒక ఎన్‌ఎస్‌జి బృందాన్ని నియమించారు. ఉగ్రవాద దాడుల ముప్పు దృష్ట్యా సోమనాథ ఆలయం వద్ద సోమవారం జరగాల్సిన సాంస్కృతిక కార్యక్రమాన్ని సైతం జిల్లా అధికారులు వాయిదా వేశారు.
కోల్‌కతాలోని ఎన్‌ఎస్‌సి బోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 24 గంటల్లోగా పేల్చివేస్తారంటూ ఒక ఇ-మెయిల్ బెదిరింపు రావడంతో విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయం మేనేజర్ ఐడికి ఈ ఇ-మెయిల్ వచ్చిందని, దాన్ని జర్మనీనుంచి పంపించినట్లు చెప్తున్నారని విమానాశ్రయం అధికారులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో అన్ని ప్రధాన సంస్థలు, ముఖ్యమైన భవనాలు, రద్దీగా ఉండే మాల్స్ వద్ద భద్రతను పెంచారు. ప్రముఖ మాల్స్, ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజిల వద్ద నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సిసిటీవీ కెమెరాలన్నీ పని చేసేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నగరంలోపల, చుట్టుపక్కల కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్యాంగ్‌లు, ఉగ్రవాద ముఠాలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న శక్తులపైనా నిఘా పెట్టి ఉంచారు. నగరమంతటా గస్తీని తీవ్రం చేశారు. గుజరాత్‌లో సోమనాథ ఆలయం, అక్షరధామ్‌తో పాటుగా ముంబయి, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా,బెంగళూరు తదితర ప్రధాన నగరాల్లోని ప్రధాన ఆలయాల వద్ద భద్రతను పెంచారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలులాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతను పెంచారు.
సముద్ర మార్గం గుండా టెర్రరిస్టులు గుజరాత్‌లోకి ప్రవేశించి ఉండవచ్చని పేర్కొంటూ ఇంటెలిజన్స్ నివేదికలు రావడంతో ఆ రాష్ట్రంలోని అన్ని ప్రధానమైన భవనాలు, ప్రాంతాల్లో, కీలకమైన పరిశ్రమల వద్ద భధ్రతను పెంచాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఢిల్లీనుంచి నాలుగు ఎన్‌ఎస్‌జి బృందాలు వచ్చాయని, ఒక బృందాన్ని సోమనాథ్‌కు పంపిస్తున్నట్లు, మిగిలిన మూడు ఇక్కడ ఉంటాయని గుజరాత్ డిజిపి పిసి ఠాకూర్ గాంధీ నగర్‌లో ఆదివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చెప్పారు. పోలీసుల సెలవులను రద్దు చేస్తూ ఠాకూర్ నిన్న రాత్రి ఆదేశాలు జారీ చేశారు. కాగా, పఠాన్‌కోట్‌జిల్లాలోని సరిహద్దు గ్రామమైన గుజ్రత్‌నుంచి పాక్‌కు ఒక ఫోన్‌కాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించడంతో పట్టణంమంతటా సోదాలు నిర్వహించారు.

చిత్రం...

ఉగ్రవాదులు దాడికి పాల్పడవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో
అహ్మదాబాద్‌లో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు