జాతీయ వార్తలు

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అగ్ని పరీక్షతో సమానమే. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూసిన బిజెపి ముఖ్యంగా నరేంద్ర మోదీ ఏప్రిల్ నాలుగో తేదీ నుండి మే 16 వరకు జరిగే అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించటం ద్వారా రాజకీయ పరువు,ప్రతిష్ట నిలుపుకోవలసి ఉంటుంది. కాంగ్రెస్ రాజకీయాన్ని అంతా తానై నిర్వహిస్తున్న పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ, అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకోవటంతోపాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పాండిచ్చేరిలో మంచి ఫలితాలు సాధించకపోతే ఆయన నాయకత్వమే ప్రశ్నార్థకంగా మారుతుంది. గత సంవత్సరం సిపిఎం ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన సీతారాం ఏచూరికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అధిక ప్రాధాన్యత సంపాదించుకున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో సిపిఎంకు గత వైభవాన్ని సాధించటం, కేరళలో సిపిఎం నాయకత్వంలోని కూటమిని అధికారంలోకి తీసుకురాగలగాలి. అప్పుడే ఆయన నాయకత్వానికి గుర్తింపు వస్తుంది. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, సీతారం ఏచూరి తమ లక్ష్యాలను సాధించటం అంత సులభం కాదు.
బిజెపికి అస్సాం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో పెద్దగా గుర్తింపు లేదు. అస్సాంలో అధికారం సంపాదించేందుకు బిజెపి ప్రఫుల్ల మొహంతా నాయకత్వంలోని అస్సాం గణ పరిషత్‌తో సీట్ల సర్దుబాటు చేసుకున్నది. అస్సాం గణ పరిషత్‌తో సీట్లసర్దుబాటు సాధించేందుకు బిజెపి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏజిపితో పొత్తు కుదరటం వలన రాష్ట్రంలో బిజెపి పరిస్థితి కొంత మెరుగైందనే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇటీవలి కాలంలో కొంత మెరుగుపడింది. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ నాయకత్వంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అనే మాట వినిపిస్తోంది. అస్సాంలో కాంగ్రెస్, వామపక్షాలు తెర వెనక సీట్ల సర్దుబాటు చేసుకునే అవకాశాలున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో కాలు మోపేందుకు బిజెపి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆశించిన ఫలితాలు సాధించేందుకు మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మరోసారి ఒంటరిగానే పోటీ చేయనున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించటం బిజెపి, కాంగ్రెస్, సిపిఎంలకు అంత సులభం కాదు. తృణమూల్‌తో సీట్ల సర్దుబాటుకు కాంగ్రెస్ సిద్ధమైనా మమతా బెనర్జీ ఒప్పుకోలేదు. దానితో సిపిఎంతో తెరవెనక సర్దుబాటు లేదా అవగాహనకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేరళలో ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులు కాబట్టి పశ్చిమ బెంగాల్‌లో లోపాయికారి అవగాహనకోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇక సిపిఎంకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జీవన్మరణ సమస్య లాంటివి. ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైతే వామపక్షాలు నామరూపాలు లేకుండాపోయే ప్రమాదం ఉంది. అందుకే సీతారాం ఏచూరి ఏ విధంగా పార్టీని పునరుజ్జీవింపజేస్తారనేది అందరు ఆసక్తితో చూస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్ల ప్రజాకర్షణ తగ్గిన సూచనలు కనిపించటం లేదు. ఇక కేరళలో తమకొక స్థానం కల్పించుకునేందుకు బిజెపి నాయకత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈడిగ వర్గంతో చేతులు కలపటం ద్వారా సీట్లు గెలుచుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. అధికారం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అష్టకష్టాలు పడాల్సి ఉంటుంది. అంతర్గత కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలు, అసమర్థ పాలన లాంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతుందా అనేది అనుమానమే. కాంగ్రెస్ నుండి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వామపక్షాల కూటమి ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. కేరళలో వామపక్షాల కూటమి విజయావకాశాలు అధికంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. తమిళనాడులో పోటీ ప్రధానంగా ముఖ్యమంత్రి జయలలిత నాయకత్వంలోని అన్నా డిఎంకె, ఎం.కరుణానిధి నాయకత్వంలోని డిఎంకె కూటమి మధ్యే ఉంటుంది. 92 సంవత్సరాల వయస్సున్న కరుణానిధి ఏ మేరకు డిఎంకె కూటమిని విజయపథంలో నడిపించగలుగుతారనేది చూడాల్సిందే. కరుణానిధి కుమారుడు స్టాలిన్ నాయకత్వంపట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగిన సూచనలు కనిపించటం లేదు. బిజెపితో పొత్తు పెట్టుకుంటున్న జయలలితను ఓడించేందుకు కరుణానిధి కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఇటీవల చెన్నై వెళ్లి కరుణానిధితో పొత్తు అంశాన్ని ఖరారు చేసుకుని వచ్చారు. విజయకాంత్ నాయకత్వంలోని పార్టీకూడా కరుణానిధి నాయకత్వంలో పని చేసేందుకు సంసిద్ధత చూపించింది. అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం జయలలిత పట్లే మొగ్గు చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.