జాతీయ వార్తలు

ఉద్యమ స్ఫూర్తితో నక్సలిజం అంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో నక్సలిజాన్ని అంతమొందించడానికి ప్రభుత్వం ఒక ఉద్యమం స్ఫూర్తితో పని చేస్తుందని కేంద్రం మంగళవారం లోక్‌సభలో తెలియజేసింది. అందువల్ల తీవ్రవాద హింసాకాండలో మృతుల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గిందని కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఈ సమస్యను ఎదుర్కోవడంలో రాష్ట్రాలకు సహాయం చేయడానికి కేంద్రం బహుముఖ వ్యూహాన్ని అమలుచేస్తోంది, బాధిత రాష్ట్రాలకు వీలయినంత ఎక్కువ సాయాన్ని అందిస్తోందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో బెదిరించి డబ్బులు వసూలు చేయడం, హత్యలు లాంటి సంఘటనలు కూడా ఉన్నాయని సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన చెప్పారు. నక్సల్స్ సమస్యను ఎదుర్కోవడానికి, అంతమొందించడానికి ప్రభుత్వం ఉద్యమం తరహాలో కృషి చేస్తుందని అంతకుముందు హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పరతిభాయ్ పటేల్ చెప్పారు.
నక్సల్స్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం ఫలితాలనిస్తోందని రాజ్‌నాథ్ అంటూ నక్సల్స్, మావోయిస్టుల కార్యకలాపాల కారణంగా పౌరులు, భద్రతా జవాన్ల మరణాల సంఖ్య 2010లో ఉండిన 1005తో పోలిస్తే గత ఏడాది 226కు తగ్గిపోయిందని చెప్పారు. 2010లో 720 మంది పౌరులు, 285 మంది భద్రతా జవాన్లు మృతి చెందగా, 2015లో 168 మంది పౌరులు, 58 మంది భద్రతా జవాన్లు మృతి చెందారని రాజ్‌నాథ్ చెప్పారు. 2010లో నక్సల్స్, మావోయిస్టులకు సంబంధించిన సంఘటనలు 2230 జరిగినట్లు ఆయన చెప్పారు. వామపక్ష తీవ్రవాద ముఠాలు, ముఖ్యంగా సిపిఐ (మావోయిస్టు) ముఠా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి సొమ్ములు వసూలు చేయడానికి దిగుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నట్లు చౌదరి చెప్పారు. అయితే ఇలాంటి కేసులు, ఇలాంటి కేసుల్లో మృతి చెందిన లేదా అరెస్టయిన వారి వివరాలను కేంద్రం నిర్వహించడం లేదని కూడా ఆయన తెలిపారు.

స్మృతి ఇరానీ రాజీనామా చేయాలి

కన్హయ్య కుమార్ డిమాండ్ జెఎన్‌యు విద్యార్థుల నిరసన యాత్ర

న్యూఢిల్లీ, మార్చి 15: దేశద్రోహ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, ఎస్‌ఎఆర్.గిలానీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థులు మంగళవారం న్యూఢిల్లీలో పార్లమెంట్ భవనం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘స్వాతంత్య్ర’ నిరసన యాత్ర పేరుతో నిర్వహించిన ఈ ప్రదర్శనలో ఆ విద్యార్థి సంఘ నాయకుడు కన్హయ్య కుమార్ కూడా పాల్గొన్నాడు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. కన్హయ్య కుమార్ మాట్లాడుతూ, జెఎన్‌యుకి చెందిన ఉన్నత స్థాయి కమిటీ తనకు షోకాజ్ నోటీసు జారీ చేసిందని, అయితే వర్శిటీ నుంచి తనను వెనక్కి పంపుతున్నామన్న ప్రస్తావన ఏదీ అందులో లేదని తెలిపాడు. ‘వర్శిటీ ఉన్నత స్థాయి కమిటీ నాకు షోకాజ్ నోటీసు జారీచేసి బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా సమాధానమివ్వాలని కోరింది. కానీ నన్ను వెనక్కి పంపుతున్నామన్న ప్రస్తావన ఏదీ ఆ నోటీసులో లేదు’ అని ఆయన చెప్పారు.
గత నెల జెఎన్‌యులో వివాదాస్పద కార్యక్రమాన్ని నిర్వహించి దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని అభియోగాలను ఎదుర్కొంటున్న కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, మరో ఇద్దరు విద్యార్థులను వర్శిటీ నుంచి వెనక్కి పంపాలని జెఎన్‌యు ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేసింది. అయితే ఈ సిఫారసును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వర్శిటీ వైస్ చాన్సలర్ ఎం.జగదీష్ కుమార్, చీఫ్ ప్రోక్టర్ ఎ.దిమిరి తుది నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.
కన్హయ్యపై పిటిషన్ తిరస్కృతి
దేశద్రోహ కేసులో కన్హయ్య కుమార్ తాత్కాలిక బెయిలుపై జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడని, కనుక ఆయనపై చర్యలు చేపట్టాలని కోరుతూ దేవ్‌దత్ శర్మ అనే సామాజిక కార్యకర్త దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ఇలాంటి వారిపై చర్యలు చేపట్టేందుకు శాంతి, భద్రతల వ్యవస్థ ఉందని, కనుక ఈ విషయమై పిటిషనర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జస్టిస్ ప్రతిభారాణి స్పష్టం చేశారు.

‘కోటా’ తేల్చండి
లేదంటే మళ్లీ ఆందోళన చేపడతాం
ఖట్టర్ సర్కారుకు జాట్ల అల్టిమేటం
చండీగఢ్, మార్చి 15: ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం ఈ నెల 17వ తేదీలోగా తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే రాష్ట్రంలో రిజర్వేషన్ల ఉద్యమాన్ని పునఃప్రారంభిస్తామని జాట్ సామాజికవర్గ నాయకులు హెచ్చరించారు. హర్యానాలో రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూ జాట్ సామాజికవర్గ ప్రజలు గత నెల నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 30మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే తక్షణమే తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే మళ్లీ ఆందోళనలకు దిగుతామని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను 17వ తేదీన నిర్ణయిస్తామని ఆలిండియా జాట్ మహాసభ చీఫ్ యశ్‌పాల్ మాలిక్ మంగళవారం టెలిఫోన్ ద్వారా పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. రిజర్వేషన్లు కల్పించాలన్న తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించకపోతే మళ్లీ వీధుల్లోకి వెళ్లి పోరాటం చేయాలని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జాట్ నాయకులు నిర్ణయించారని, ఈ పోరాటంలో భాగంగా ఈసారి గ్రామాల్లో సైతం ధర్నాలు నిర్వహిస్తామని ఆయన చెప్పాడు. ‘17వ తేదీలోగా మా డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చాం. అయినా ఇప్పటివరకూ ఏ డిమాండ్‌పైనా ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వ తీరు ఇదేవిధంగా కొనసాగితే గురువారం తర్వాత మా తడాఖా ఏమిటో చూపిస్తాం’ అని అఖిల భారతీయ జాట్ మహాసభ అధ్యక్షుడు హవా సింగ్ సంగ్వాన్ హెచ్చరించాడు.