జాతీయ వార్తలు

ఎన్‌ఎస్‌జికి ఎందుకు అప్పగించారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష బిజూ జనతాదళ్ బుధవారం లోక్‌సభలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్‌ను ఎన్‌ఎస్‌జికి అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్రమైన తప్పిదమని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అకస్మాత్తుగా లాహోర్‌కు వెళ్లి వచ్చిన కొద్ది రోజులకే పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగిందని గుర్తుచేస్తూ, లాహోర్ పర్యటన ద్వారా ప్రధాని ఏమి సాధించారని బిజెడి నిలదీసింది. లోక్‌సభలో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడిపై జరిగిన చర్చలో బిజెడి సభ్యుడు కలికేశ్ సింగ్‌దేవ్ పాల్గొంటూ ఈ ఉగ్రవాద దాడిని ఎదుర్కొనే విషయంలో జాతీయ భద్రతా సలహాదారు అంతా తానై వ్యవహరించారని, నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని అక్రమంగా కాజేశారని విమర్శించారు. ఇలాంటి దాడులను ఎదుర్కోవడంలో ఆర్మీ బలగాలు ఉత్తమమైనవని, పైగా పఠాన్‌కోట్‌లోనే 50వేల బలగాలు ఉన్నాయని, అలాంటప్పుడు దాడిని ఎదుర్కొనే బాధ్యతను ఆర్మీకి ఎందుకు అప్పగించలేదని సింగ్‌దేవ్ ఆశ్యర్యం వ్యక్తం చేశారు.
నగర ప్రాంతాలలో బందీల సమస్య తలెత్తినప్పుడే నేషనల్ సెక్యూరిటి గార్డ్‌లను ఉపయోగిస్తారని, కౌంటర్-టెర్రరిజం కోసం కాదని పేర్కొంటూ, రక్షణ, హోంమంత్రిత్వ శాఖలు ఉగ్రవాదులను ఎదుర్కొనే బాధ్యతను ఎన్‌ఎస్‌జికి అప్పగించి ఎలా చేతులు దులుపుకోగలిగాయని ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఎన్‌ఎస్‌జిని మోహరించినప్పుడు వారి వద్ద రాత్రి సమయాలలో వీక్షించే పరికరాలు కూడా లేవని సింగ్‌దేవ్ పేర్కొన్నారు. భారత నిఘా యంత్రాంగాలను పటిష్ఠపరచుకోవలసిన అవసరం ఉందని పేర్కొంటూ దేశం ఉగ్రవాదులకన్నా ఒక అడుగు వెనుకబడి ఉందన్న వాస్తవాన్ని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఉగ్రవాద నాయకుడు వౌలానా మసూద్ అజర్ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని పేర్కొంటూ, అతని నేతృత్వంలోని ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్ పఠాన్‌కోట్ దాడికి బాధ్యురాలని పేర్కొన్నారు. అయినప్పటికీ పాకిస్తాన్‌పై తగినంత ఒత్తిడిని తీసుకురాలేకపోతున్నామని ఆయన ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించారు.

సవరణలతో

ఆధార్ బిల్లును
తిప్పిపంపిన రాజ్యసభ

సవరణలను తిరస్కరించిన లోక్‌సభ

న్యూఢిల్లీ, మార్చి 16: సబ్సిడీలు అర్హులైన వారికి మరింత మెరుగ్గా అందేలా చేయడం కోసం ఆధార్‌కు చట్టబద్దత కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ బుధవారం ప్రతిపక్షాలు చేసిన సవరణలతో లోక్‌సభకు తిప్పి పంపించింది. లోక్‌సభ ఇప్పటికే ఆమోదించిన ఆధార్ బిల్లుకు కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి జైరామ్ రమేశ్ ప్రతిపాదించిన సవరణలకు అనుకూలంగా మెజారిటీ సభ్యుల ఓటు వేయడం ద్వారా ఆమోదించారు. అయితే రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు బిల్లుకు చేసిన సవరణలన్నిటినీ లోక్‌సభ తిరస్కరిస్తూ యథాతథంగా బిల్లును ఆమోదించింది. బిల్లుకు సంబంధించిన పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తుతూ బిఎస్‌పి, తృణమూల్ కాంగ్రెస్, బిజెడి సభ్యులు రాజ్యసభలో వాకౌట్ చేశారు కూడా. ముఖ్యంగా ఈ బిల్లును ఎందుకు మనీ బిల్లుగా ప్రవేశపెట్టాల్సి వచ్చిందనే దానిపై ప్రతిపక్షానికి, అధికార పక్షానికి మధ్య తీవ్రస్థాయిలోవాగ్వాదం కూడా జరిగింది. ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చుతూ, ఆధార్ బిల్లు ద్రవ్య బిల్లేనని వాదించారు. సీతారాం ఏచూరి (సిపిఎం), జైరామ్ రమేశ్ (కాంగ్రెస్), నరేశ్ అగర్వాల్ (ఎస్‌పి), కెసి త్యాగి (జెడి-యు) సహా ప్రతిపక్షాలకు చెందిన పలువురు సభ్యులు ప్రభుత్వం ఈ బిల్లును మనీ బిల్లుగా ప్రవేశపెట్టిన తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. కాగా, రాజ్యాంగం ప్రకారం ఒక బిల్లును మనీ బిల్లుగా ప్రకటించే తుది అధికారం లోక్‌సభ స్పీకర్‌దేనని జైట్లీ అంటూ, లోక్‌సభ ఈ బిల్లును ఈ నెల 11న ఆమోదించిందని చెప్పారు.

తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి

విభజన హామీలపై నిలదీసిన విహెచ్

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, మార్చి 16: ఏపి విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ఎన్‌డిఏ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను కనబరుస్తోందని కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు ఆరోపించారు. విహెచ్ బుధవారం రాజ్యసభలో విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల విషయం ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తప్ప ఇతర అన్ని హామీలు పూర్తి చేస్తున్నారని, పెద్దఎత్తున పథకాలు, ప్రాజెక్టులు ఇస్తూ తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు ఏమైందని ఆయన నిలదీశారు. బయ్యారం ఉక్కు కార్మాగారాన్ని ఏం చేశారని హనుమంతరావు ప్రశ్నించారు. రైల్వే కోచ్ ను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? ప్రాణహిత, చేవెళ్లకు జాతీయ హోదా ఎప్పుడు ఇస్తారు అని నిలదీశారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన హామీ అమలుకు నోచుకుంటుందా? అని ఎన్‌డిఏ ప్రభుత్వంపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి ప్రకటించినా నిధులు కేటాయించలేదని దుయ్యబట్టారు. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఎందుకు ఇవ్వటం లేదని కాంగ్రెస్ ఎంపీ అన్నారు.
హనుమంతరావు తొలుత రాజ్యసభ జీరో అవర్‌లో విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడాలనుకున్నారు. అయితే డిప్యూటీ చైర్మన్ కురియన్ అందుకు అంగీకరించలేదు. దీనికి ఆగ్రహించిన హనుమంతరావు పోడియం వద్దకు వచ్చి గొడవ చేశారు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలపై మాట్లాడేందుకు మంగళవారం వారందరికి అనుమతి ఇచ్చి, ఈ రోజు తెలంగాణ హామీల గురించి చర్చించేందుకు ఎందుకు అనుమతి ఇవ్వటం లేదని అడిగారు. తెలంగాణకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడేందుకు చైర్మన్ హమీద్ అన్సారీ తనకు అనుమతి ఇచ్చినా మీరు అడ్డుపడుతున్నారని విహెచ్ ఆవేశంతో అన్నారు. టిఆర్‌ఎస్ పక్షం నాయకుడు కె కేశవరావు, తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు పాల్వాయి గోవర్దన్ రెడ్డి, రాపోలు ఆనంద్ భాస్కర్‌లు విహెచ్‌కు మద్దతు పలికారు. అయితే కురియన్ మాత్రం హనుమంతరావు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకుండా ఇతర అంశాలను చర్చకు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ముడుపులు పుచ్చుకున్నట్లు టివి చానళ్లు ప్రసారం చేసిన కార్యక్రమంపై సభలో గొడవ చెలరేగడంతో విహెచ్‌కు మాట్లాడేందుకు అవకాశం రాలేదు. దీంతో కురియన్ మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు హనుమంతరావుకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని పాల్వాయి గోవర్దన్ రెడ్డి, ఆనంద భాస్కర్ డిమాండ్ చేశారు.