జాతీయ వార్తలు

అక్కడి ‘వైద్యం’.. ఇక్కడ వికటిస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గత 12 ఏళ్లలో విదేశాల్లో వైద్య డిగ్రీ పొంది తిరిగివచ్చిన భారతీయ విద్యార్థుల్లో సగటున 77 శాతం మంది ఇక్కడ డాక్టర్‌గా రిజిస్టర్ కావడానికి భారతీయ వైద్య మండలి (ఎంసిఐ) నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలో పాస్ కాలేక పోతున్నారు. దేశానికి వెలుపల ఉండే ఏ వైద్య కళాశాల ఇచ్చిన ప్రాథమిక మెడికల్ క్వాలిఫికేషన్ సర్ట్ఫికెట్ (ఎంబిబిఎస్ లేదా తత్సమాన డిగ్రీ) కలిగి ఉండే ఏ పౌరుడైనా సరే ఎంసిఐలో లేదా ఏ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లోనైనా రిజిస్టర్ చేసుకోవడానికి ఎంసిఐ నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజిఇ)గా పిలిచే స్క్రీనింగ్ పరీక్షలో తప్పకుండా పాస్ కావాలి. అయితే సమాచార హక్కు చట్టం కింద పిటిఐ అడిగిన ప్రశ్నకు ఎన్‌బిఏ అందించిన గణాంకాలను బట్టి చూస్తే ప్రతి ఏటా ఈ పరీక్ష రాసే విద్యార్థుల్లో 50 శాతంకన్నా ఎక్కువమంది పాసయిన సందర్భాలు రెండుకన్నా మించి లేవు. అంతేకాదు, ఒక సందర్భంలో అయితే ఉత్తీర్ణత నాలుగు శాతమే ఉంది. అత్యధికంగా 2005 సెప్టెంబర్‌లో నిర్వహించిన పరీక్షలో 76.8 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అప్పుడు 2,851మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా 2,192 మంది పాసయ్యారు. ఆ తర్వాత 2008 మార్చిలో మాత్రమే 58.7 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్ష పాసయ్యారు. కాగా, 2015లో నిర్వహించిన చివరి రెండు స్క్రీనింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం 10.4, 11.4 శాతంగానే ఉంది. గత ఏడాది జూన్‌లో 5,967 మంది ఈ పరీక్ష రాయగా, 603 మంది, డిసెంబర్‌లో 6,407 మంది పరీక్ష రాయగా, 731 మంది మాత్రమే పాసయ్యారు. గత 12 ఏళ్లలో సగటు ఉత్తీర్ణత 20 శాతానికి కాస్త అటూ ఇటూ ఉండగా, 2014 జూన్‌లో మాత్రం 5,724 మంది పరీక్ష రాయగా, 282 మంది మాత్రం (అంటే కేవలం 4 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా అధిక సంఖ్యలో వైద్య కళాశాలలున్నప్పటికీ, ఇండియన్ మెడికల్ రిజిస్టర్‌లో ప్రస్తుతం 9.29 లక్షల మంది డాక్టర్లు నమోదై ఉన్నప్పటికీ భారతదేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) నిర్దేశించిన ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు లక్ష్యానికన్నా ఎంతో వెనుకబడి ఉన్నాడని ఈ నెల ప్రారంభంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై రాజ్యసభ కమిటీ సమర్పించిన ఒక నివేదికలో పేర్కొంది. స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులతో పాటుగా తగినంతమంది వైద్య నిపుణులను అందించలేకపోతున్న ప్రస్తుత వైద్య విద్యా విధానమే దీనికి కారణమని ఆ నివేదిక అభిప్రాయపడింది. వైద్య విద్య చదవాలనుకుని, దేశంలో అవకాశం లభించని చాలామంది విద్యార్థులు రష్యా, బెలారస్, కజకిస్థాన్, చైనా లాంటి దేశాలకు వెళ్తున్నారని, అయితే వాళ్లు తిరిగివచ్చాక స్క్రీనింగ్ పరీక్షలో పాసయి, ఆ తర్వాత ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఎంసిఐ గుర్తింపు ఇస్తోందని కూడా కమిటీ ఆ నివేదికలో పేర్కొంది. పైన పేర్కొన్న అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఎంసిఐ నిర్ణయించిన కనీస స్టాండర్డ్ అర్హతలు (ఎంఎస్‌ఆర్) దేశంలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడానికి, వాటి విస్తరణకు పెద్ద అడ్డంకిగా ఉన్నాయని కమిటీ ఆ నివేదికలో అభిప్రాయపడింది.