జాతీయ వార్తలు

సుంకం కాదు.. యమపాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడుతూ, బంగారు ఆభరణాలపై విధించింది ఒక శాతం ఎక్సైజ్ సుంకం కాదని, అది బంగారం వ్యాపారుల పాలిట యమపాశం వంటిదని అన్నారు. అంతేకాదు బడా వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చేందుకే బిజెపి ప్రభుత్వం ఈ పని చేసిందన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద అఖిల భారత బంగారు అభరణ వ్యాపారుల, స్వర్ణకారుల ఫెడరేషన్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై కూడా రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, ఈ కార్యక్రమం లోగోను చిన్న వ్యాపారుల గొంతు నులిమే ‘బబ్బర్‌షేర్’గా అభివర్ణించారు. ఈ బబ్బర్‌షేర్ మీ రక్తాన్ని పీల్చి బ్రోకర్ పనులు చేయడం ద్వారా సంపాదించాలనుకునే అయిదారుగురు బడా పారిశ్రామికవ్తేతలకు చెందినదని ఆయన అన్నారు. మోదీజీ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుతున్నారు కానీ దేశంలో 60-70 ఏళ్ల క్రితమే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభమయిందని, దాని చిహ్నం ‘చరఖా’ అని రాహుల్ అన్నారు. బంగారు ఆభరణాల వ్యాపారంపై ఆరు కోట్లమంది ఆధారపడి ఉన్నారని, వారు తమ రక్తం, చెమట ధారపోసి దేశ జిడిపికి తమ వంతుగా 7 శాతం అందిస్తున్నారన్నారు. తాను కేవలం ప్రసంగించడానికి రాలేదని, మీకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చానని రాహుల్ ఆందోళన చేస్తున్న వారికి చెప్పారు. మనమంతా సంఘటితంగా ఉంటే మీ డిమాండ్లు తప్పకుండా నెరవేరుతాయని, కేంద్ర బడ్జెట్‌లో బంగారు ఆభరణాలపై 1 శాతం ఎక్సైజ్ పన్ను విధించడానికి వ్యతిరేకంగా నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న బంగారు వ్యాపారులనుద్దేశించి అన్నారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీతో పాటుగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా, ఆయన కుమారుడు, రోహ్తక్ ఎంపి దీపిందర్ హూడా, ఢిల్లీ పిసిసి అధ్యక్షుడు అజయ్ మాకెన్ కూడా పాల్గొన్నారు.

ర్యాలీలో మాట్లాడిన అనంతరం మంచినీళ్లు తాగుతున్న రాహుల్

‘పనామా’లో నీరా రాడియా

వెల్లడించిన ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’

న్యూఢిల్లీ/వాషింగ్టన్, ఏప్రిల్ 6: భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ‘పనామా పేపర్స్’ కుంభకోణంలో తవ్వే కొద్దీ కొత్త కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఎనిమిదేళ్ల క్రితం మంత్రులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలుసహా పలువురు ప్రముఖుల టెలిఫోన్ సంభాషణలను రికార్డు చేసి సంచలనం సృష్టించిన వైష్ణవీ కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకురాలు నీరా రాడియా పేరు కూడా ఈ పత్రాల్లో ఉన్నట్లు వెల్లడయింది. పన్ను ఎగవేతదారులకు స్వర్గ్ధామాలుగా భావించే దేశాల్లో ఒకటైన బ్రిటీష్ వర్జీనియా ఐలాండ్స్‌లోని ఓ కంపెనీతో నీరా రాడియాకు సంబంధాలున్నట్లు ఆ పత్రాల్లో ఉందని మన దేశంలో ఈ పత్రాలను బైటపెట్టిన ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ దినపత్రిక బుధవారం వెల్లడించింది. బ్రిటీష్ వర్జీనియా ఐలాండ్స్‌లో లిస్టింగ్ అయిన క్రౌన్‌మార్ట్ ఇంటర్నేషనల్ గ్రూపునకు చెందిన 232 డాక్యుమెంట్లలో నీరా రాడియాను ఆ కంపెనీ డైరెక్టర్లలో ఒకరుగా పేర్కొన్నట్లు ఆ పత్రిక బుధవారం ఓ కథనంలో తెలిపింది. అయతే నీరా రాడియా కార్యాలయం మాత్రం ఈ ఆరోపణలను ఖండించినట్లు ఆ పత్రిక తెలిపింది. బళ్లారికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, ఓ చార్టర్డ్ అకౌంటెంట్ పేర్లు కూడా బుధవారం ఆ పత్రిక బైటపెట్టన జాబితాలో ఉన్నాయి.
ఇది భారీ సమస్యే: ఒబామా
ప్రపంచవ్యాప్తంగా పన్నుల ఎగవేత లక్షల కోట్ల డాలర్ల మేరకు ఉండవచ్చని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బుధవారం అన్నారు. పన్ను ఎగవేతదారులకు స్వర్గ్ధామాలైన దేశాల్లో భారీ మొత్తాలు దాచుకున్న వేలాది మంది రాజకీయ నేతలు, సెలబ్రిటీల పేర్లను బైటపెట్టిన ‘పనామా పేపర్స్’ కుంభకోణంపై ఒబామా స్పందించడం ఇదే తొలిసారి. జి-7, జి-20 శిఖరాగ్ర సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకు రావడం జరిగిందని అన్నారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో చాలాభాగం చట్టవ్యతిరేకమైనవి కాకపోవడం తాము ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటని ఒబామా అన్నారు. అమెరికా, ఇతర దేశాలు చట్టాలు, నిబంధనల్లోని లోపాలను పూడ్చడం ద్వారా ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలిచేంతవరకు ఇవి జరుగుతున్నట్లు గుర్తించగలుగుతామే తప్ప వాటిని ఆపలేమని అన్నారు. ఇదిలా ఉండగా ఆఫ్‌షోర్ కంపెనీల ద్వారా సౌదీ రాజుకు లండన్‌లో 120 కోట్ల పౌండ్ల విలువైన ఆస్తులున్నట్లు ‘గార్డియన్’ పత్రిక తెలియజేసింది.

అద్వానీకి
సతీ వియోగం
కమలా దేవి కన్నుమూత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: బిజెపి కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీ సతీమణి కమలా అద్వానీ బుధవారం గుండెపోటుతో ఇక్కడి అకిల నారత వైద్య శాస్త్రాల అధ్యయన సంస్థ(ఎయిమ్స్)లో కన్ను మూశారు. ఆమెకు 83 ఏళ్లు. బుధవారం కమలాదేవికి గుండెపోటు రాగా ఆమెను వెంటనే ఎయిమ్స్‌కు తరలించారని, అక్కడి డాక్టర్లు ఆమెను కాపాడడానికి ప్రయత్నించారని, అయినా ఫలితం లేకపోయిందని కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. కమలాదేవికి భర్త అద్వానీకాకుండా ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగాకమలా దేవి వయసుకు సంబంధించిన పలు సమస్యలతో బాధపడుతున్నారు.

ఆమె గత కొద్ది నెలలుగా వీల్ చైర్లోనే ఉన్నారు. ఆమెకు మతిమరపు కూడా ఉన్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.

ఫలితాలు ఎలా ఉన్నా..
అసోం అభివృద్ధికి
పనిచేస్తూనే ఉంటాం
కేంద్ర మంత్రి గడ్కరీ
గౌహతి, ఏప్రిల్ 6: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా కేంద్రం అసోం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. అయితే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అసోంలోకి వస్తున్న అక్రమ వలసల సమస్యను పరిష్కరించడంలో మెరుగుదల ఉంటుందని ఆయన అన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, మేము అసోంలో వౌలిక సౌకర్యాల అభివృద్ధికి కృషి కొనసాగిస్తాం. అభివృద్ధి విషయంలో రాజకీయాలు ఉండవు’ అని గడ్కరీ బుధవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత 50-60 ఏళ్లలో జరిగిన దానికన్నా రానున్న అయిదేళ్లలో తాము ఎక్కువ పని చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నామని ఆయన అన్నారు. ‘కాంగ్రెస్‌కు అసోంను అభివృద్ధి చేయడానికి గత 60 ఏళ్లుగా అవకాశం ఉంది. స్వాతంత్రోద్యమ కాలంలో దేశంలోని పేద రాష్ట్రాలలో అసోం అయిదో స్థానంలో ఉంది. ఇప్పుడు నాలుగో స్థానంలో ఉంది’ అని గడ్కరీ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలలో వౌలిక సౌకర్యాల అభివృద్ధికి కేంద్రం రూ. ఒక లక్ష కోట్లు మంజూరు చేసిందని, ఇందులో రూ. 40వేల కోట్లు ఇదివరకే విడుదల చేసిందని ఆయన వివరించారు.

ఈశాన్య రాష్ట్రాలు, అసోం అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి కేంద్రీకరించారని గడ్కరీ తెలిపారు.

రామ్‌దేవ్‌కు
అమిత్ షా మద్దతు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ‘్భరత్ మాతాకీ జై’ అననివాళ్ల తలలు నరుకుతానన్న యోగా గురు రామ్‌దేవ్ బాబాకు బిజెపి చీఫ్ అమిత్ షా మద్దతు తెలిపారు. ‘తన మెడమీద కత్తిపెట్టినా భారత్ మాతాకీ జై కొట్టను’ అన్న ఎంపీకి భావస్వేచ్ఛ ఉన్నప్పుడు రామ్‌దేవ్‌కు వర్తించదా? అని ఓ అమిత్ షా ప్రశ్నించారు. దేశానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ భావస్వేచ్ఛ అని సమర్థించుకుంటున్నవారి సంగతేమిటనీ ప్రశ్నించారు.

రామ్‌దేవ్‌కు భావస్వేచ్ఛ ఉండకూడదా అని ఆయన నిలదీశారు. చట్టమంటే తనకు అపార గౌరవం ఉండబట్టే జాతి వ్యతిరేకులను వదిలేస్తున్నట్టు రామ్‌దేవ్ స్పష్టం చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తుచేశారు. మాతృదేశాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అలా చేయనివారు జాతి వ్యతిరేకులని, ఏ మతస్థులైనా భారతీయులేనని యోగాగురు వ్యాఖ్యానించారు. సద్భావన సమ్మేళన్‌లో రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

మూడు బాంబు పేలుళ్ల కేసులో

ముగ్గురికి యావజ్జీవం

ప్రధాన నిందితుడు నాచన్‌కు పదేళ్ల జైలు ముంబయి ప్రత్యేక పోటా కోర్టు తీర్పు

ముంబయి, ఏప్రిల్ 6: ముంబయిలో 2002 డిసెంబర్, 2003 మార్చి మధ్య కాలంలో జరిగిన మూడుబాంబు పేలుళ్ల కేసులో దోషులుగా నిర్ధారించిన పదిమందిలో ముగ్గురికి ప్రత్యేక పోటా కోర్టు బుధవారం యావజ్జీవ శిక్షలను విధించగా, ప్రధాన నిందితుడయిన సకీబ్ నాచన్‌కు పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. బాంబులు పెట్టిన ముజమ్మిల్ అన్సారీ మరణించే దాకా జైలుశిక్ష అనుభవించాలని కూడా జడ్జి పిఆర్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు.
ఈ కేసు అత్యంత అరుదైన కేసుల కేటగిరీ కిందికి రాదని, అందువల్లనే తాను అన్సారీకి మరణశిక్ష విధించడానికి ఇష్టపడ్డం లేదని జడ్జి అన్నారు. ఒక వ్యక్తిని ఉరితీస్తే సెకనులోనే ప్రాణం పోతుందని, ఈ నేరానికి బలయినవారు లేదా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు జీవితాంతం అనుభవించే బాధ, ఆవేదన అతనికి అర్థం కాదని కూడా జడ్జి వ్యాఖ్యానించారు. యావజ్జీవ శిక్ష విధించిన మిగతా ఇద్దరిలో ఫర్హాన్ ఖోట్, వాహిద్ అన్సారీలున్నారు. మిగతా ఆరుగురికి 2నుంచి పదేళ్ల దాకా శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. నిందితులనుంచి వసూలు చేసే రూ.9.45 లక్షల జరిమానా మొత్తంలో 75 శాతం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్లాలని, మిగతా మొత్తం ములుంద్ పేలుడు కారణంగా రైల్వేకు సంభవించిన నష్టానికిగాను భారతీయ రైల్వేకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు చెల్లించే నష్టపరిహారానికి సంబంధించి రైల్వే డిపార్ట్‌మెంట్‌నుంచి తమకు నష్టపరిహారం అందినట్లు గాయపడిన కొంతమంది సాక్షులు అంగీకరించినట్లు రికార్డులో తగిన సమాచారం లేనందున సంఘటనలో బాధితులకు, మృతులపై ఆధారపడిన వారికి నష్టపరిహారం ప్రకటించడం కష్టమని తెలిపింది. అయితే బాధితులకు, మృతులపై ఆధారపడిన వారికి ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని నిర్ణయించి తదనుగుణంగా వారికి చెల్లించాలని కోర్టు ముంబయి జిల్లా లీగల్ సెల్ అథారిటీని ఆదేశించింది.
2003 మార్చి 13న జరిగిన ములుంద్ రైలు పేలుడులో 12 మంది మృతి చెందారు. 2002 డిసెంబర్ 6న ముంబయి సెంట్రల్ స్టేషన్‌లోని మెక్‌డొనాల్డ్స్ వద్ద జరిగిన పేలుడులో పలువురు గాయపడ్డారు. కాగా, 2003 జనవరి 27న విలేపార్లేలోని ఒక మార్కెట్లో జరిగిన పేలుడులో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సకిబ్ నాచన్‌సహా అతీఫ్ ముల్లా, హసీబ్ ముల్లా, గులామ్ కోటల్, ముహమ్మద్ కమిల్, నూర్ మాలిక్,అన్వర్ అలీఖాన్, ఫర్హాన్ ఖోట్, వహిదీ అన్సారీ, ముజమ్మిల్ అన్సారీ మొత్తం పది మందిని దోషులుగా ప్రకటిస్తూ కోర్టు గత నెల 29న తీర్పు చెప్పింది.

దర్యాప్తుకు సహకరించండి
వీరభద్ర సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం అరెస్టు చేయవద్దని సిబిఐకి హితవు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం దర్యాప్తుకు సహకరించాలని కోరుతూ, ఆయనను అరెస్టు చేయవద్దని సిబిఐని ఆదేశించింది. దర్యాప్తులో పాలుపంచుకోవడానికి, సిబిఐకి సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వీరభద్ర సింగ్ కోర్టుకు చెప్పిన తర్వాత న్యాయమూర్తి ప్రతిభా రాణి ఈ విషయం చెప్పారు. దర్యాప్తులో పాలుపంచుకుంటామని నిందితుడి తరఫు న్యాయవాదులు చెబుతున్నారని, మీరు కూడా అడుగుతున్నది అదేకాబట్టి ఆయనను అరెస్టు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో వీరభద్ర సింగ్‌ను అరెస్టు చేయడం, ఇంటరాగేట్ చేయడం లేదా చార్జిషీటు దాఖలు చేయడం చేయవద్దని సిబిఐని ఆదేశిస్తూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు 2015 అక్టోబర్ 1న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సింగ్ వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను సిబిఐకి ఇవ్వాలని, దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన దర్యాప్తుకు సహకరించాలని కోర్టు సింగ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌కు తెలిపింది. దర్యాప్తులో పాలుపంచుకోవడానికి సింగ్ సిద్దంగా ఉన్నట్లు విచారణ సందర్భంగా సిబల్ కోర్టుకు తెలిపారు. అయితే కేసు దర్యాప్తులో సిబిఐకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, అందువల్ల హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని సిబిఐ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ పిఎస్ పట్వాలియా గట్టిగా కోరారు. అయితే సింగ్ దర్యాప్తుకు సహకరిస్తానని చెప్పినందుకు తాము ఎంతో సంతోషిస్తున్నామని, అసాధారణమైనదేదీ జరగదని ఆయనకు హామీ ఇస్తున్నామని విచారణ చివర్లో ఆయన అన్నారు.

హిమాచల్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్

రామ్మోహన్ రెడ్డి నియామకం సక్రమమే

కర్నాటక అభ్యంతరాలను తోసిపుచ్చిన కృష్ణా ట్రిబ్యునల్

ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ,ఏప్రిల్ 6: కృష్ణా జలాల వివాదం పరిష్కరించే బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో సభ్యుడిగా కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి నియామకంపై ఆ రాష్ట్రం లేవనెత్తిన అభ్యంతరాలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి ట్రిబ్యునల్ సభ్యుడిగా నియామకంపై మహారాష్ట్ర, తెలంగాణ ఎటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు కాని కర్నాటక లేవనెత్తిన అభ్యంతరాలకు పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్‌ను కోరింది. విచారణ రెండో రోజు బుధవారం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ సభ్యుడిగా జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి నియామకంపై ట్రిబ్యునల్‌లో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కర్నాటక రాష్ట్రానికి చెందిన సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి నియామకం వలన భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉందని కర్నాటక తరపున్యాయవాది అనిల్ దివాన్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించారు. ట్రిబ్యునల్ వాదనలు పూర్తయ్యాక మిగిలిన రాష్ట్రాలు అభ్యంతరాలు లేవనెత్తకూడదనే జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి నియామకంపై వాదనాలు వినిపిస్తున్నామని ట్రిబ్యునల్‌కు తెలిపారు. కర్నాటక అభ్యంతరాలకు పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్ తరఫున్యాయవాది ఎకె గంగూలి ట్రిబ్యునల్‌ను కోరారు. జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి నియామకంపై తమకు ఎటువంటి అభ్యతరాలు లేవని తెలంగాణ, మహారాష్ట్ర ట్రిబ్యునల్‌కు తేల్చిచెప్పాయి. ఒ రాష్ట్రానికి చెందిన కేసు విచారణలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ట్రిబ్యునల్‌లో ఉండకూడదని చట్టంలో ఎక్కడాలేదని మహారాష్ట్ర తరఫు న్యాయవాది అంద్యార్జున వాదనలు వినిపించారు. ట్రిబ్యునల్‌లో సభ్యుడిగా జస్టిస్ రామ్మోహన్ రెడ్డి నియామకాన్ని సుప్రీంకోర్టు జరిపిందని,అందులో మార్పులు చేసే ఆలోచన లేదని కేంద్ర తరఫు న్యాయవాది వసిం ఖాద్రి ట్రిబ్యునల్‌కు తెలిపారు. సభ్యుని నియామకం సక్రమంగానే జరిగిందని, ఇందులో కేంద్రం పాత్ర లేదని, విచారణ కొనసాగించాలని ట్రిబ్యునల్‌కు కేంద్రం స్పష్టం చేసింది. సభ్యుడి నియామకంపై కర్నాటక చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని ట్రిబ్యునల్ చెప్పడంతో కర్నాటక తన వైఖరి మార్చుకోంది. కర్నాటక అభ్యంతరాలను నమోదు చేసి ట్రిబ్యునల్ విచారణను కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటినే ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలని కర్నాటక వాదనలు వినిపించింది. కృష్ణానదీ జలాల వివాదంపై గురువారం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు కొనసాగనున్నాయి.

ఇంటింటికి మంచినీరు

పొంగని డ్రైనేజీలు, ట్రాఫిక్ జామ్‌కాని రోడ్లు ఇవే మా లక్ష్యాలు: జిహెచ్‌ఎంసి మేయర్ రామ్మోహన్

ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: హైదరాబాద్‌లోని ప్రతి ఇంటికి మంచినీరు, వర్షాకాలంలో పొంగని డ్రైనేజీ వ్యవస్థ, ట్రాఫిక్ జామ్ కాని రోడ్లను సాధించడమే తమ ముందు ఉన్న లక్ష్యాలని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అధ్యక్షతన జరిగిన అఖిల భారత మేయర్ల కౌన్సిల్ సమావేశానికి రామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో నీటి సమస్య ఉందని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. భూగర్భ నీటిమట్టం పూర్తిగా పడిపోవడంతో మహారాష్టల్రోని లాథూర్ నగరానికి రైలు ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని జంట నగరాల ప్రజలకు ఆయన గుర్తు చేశారు. ప్రజల భాగస్వామ్యం లేకపోతే హైదరాబాద్ విశ్వనగరం కాలేదని, మంచినీరు సరఫరా, డ్రైనేజి, ట్రాఫిక్‌లే తన ప్రధాన ఎజెండాలని బొంతు రామ్మోహన్ చెప్పారు. మూసీని ప్రక్షాళన చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ప్రజలు సహకరిస్తేనే ఈ లక్ష్యాలు సాధ్యం అవుతాయని అన్నారు. అయితే దేశంలోని అన్ని నగరాల మేయర్లతో కేంద్ర పట్టాణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బుధవారం నిర్వహించిన సదస్సులో ఇకపై అనుమతులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో ఫాలో అఫ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్న కేంద్రం నిర్ణయాన్ని రామ్మోహన్ స్వాగతించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలను, కెటిఆర్ నాయకత్వంలో అమలు చేస్తామన్నారు. ఉస్మాన్‌సాగర్, గండిపేట సహా హైదరాబాద్ దాహార్తిని తీర్చే నాలుగు జలాశయాలు అడుగంటాయని, జంట నగరాలకు 170 కిలోమీటర్ల దూరంలో గోదావరి నుంచి, 104 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది నుండి నీటిని తెచ్చి, నీటి కష్టాలు తీరుస్తున్నామని ఆయన తెలిపారు.

బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న గ్రేటర్ హైదరాబాద్
మేయర్ బొంతు రామ్మోహన్

తెలుగు విద్యార్థులకు
రక్షణ కల్పించండి
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని ఎన్‌ఐటిలో తెలుగు విద్యార్థులకు భద్రత కల్పించాలని ఢిల్లీలో ఏపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావువిజ్ఞప్తి చేశారు. ఈమేరకు కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కంభంపాటి లేఖరాశారు. ఎన్‌ఐటిలో స్థానికేతరులపై జరుగుతున్న దాడులతో రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.

రైతాంగ దిక్సూచికి శ్రీకారం
కొత్త హైడ్రాలజీ ప్రాజెక్టుకు
కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: కరవుకాటకాలకు సంబంధించి ముందస్తుగానే రైతుల్ని హెచ్చరించడంతో పాటు ఏఏ పంటలు వేయాలన్నదానిపైనా సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టును కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏర్పాటు చేసే వ్యవస్థ దేశ రైతాంగానికి అనేక రీతుల్లో తోడ్పడుతుందని, వాతావరణ వివరాల ఆధారంగా చాలా ముందుగానే వరదలకు సంబంధించిన హెచ్చరికలనూ జారీ చేస్తుందని చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాలజీ ప్రాజెక్టుతో పాటు పలు ఇతర నిర్ణయాలనూ ఆమోదించారు. దాదాపు 3,679 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని సంకల్పించారు. జల వనరులను పూర్తి స్థాయిలో నిర్వహణతో పాటు సమాన ప్రాతిపదికన నీటిని అందుబాటులోకి తెచ్చేందుకూ ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది. గతంలో చేపట్టిన జల ప్రాజెక్టులు కేవలం 13 రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకునే రూపొందించారు. ఈ తాజా ప్రాజెక్టును దేశ వ్యాప్తంగా రైతుల అవసరాలను అన్ని కోణాల్లోనూ తీర్చే విధంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా భూగర్భ జలాల లభ్యత గురించి కూడా రైతులకు తగిన సమాచారం ఇచ్చేందుకు, తదనుగుణంగా వారు ఏఏ పంటలు వేయాలో నిర్ణయించుకునేందుకు ఈ తాజా ప్రాజెక్టు ఉపకరిస్తుంది.