జాతీయ వార్తలు

ఆలయం... అగ్నిగుండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

383మందికి తీవ్ర గాయాలు పుట్టింగల్ దేవి ఉత్సవాల్లో పెను విషాదం
అగ్నికీలలు సృష్టించిన బాణసంచా నిప్పురవ్వలు పడి గోడౌన్‌లోనూ విస్ఫోటనాలు
పెనువిపత్తును సృష్టించిన ఆనందం మృతుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్రాల 12లక్షల సాయం

బక్తిపారవశ్యంలో మునిగిన భక్తుల ఆనందం క్షణంలో పెను విషాదమైంది. పుట్టింగల్ దేవి ఉత్సవాల సందర్భంగా పేల్చిన బాణసంచా వారి పాలిట యమపాశమైంది. క్షణాల్లో విస్పోటనాల పరంపర వంద మందిని మింగేసింది. అనుమతుల్లేకుండా బాణసంచా కాల్చినందుకు ఆలయ అధికారులపై హత్య కేసు నమోదైంది. ఆలయ కమిటీ సభ్యులు పరారయ్యారు. మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్రాలు పనె్నండు లక్షల పరిహారం ప్రకటించాయి.

కొల్లం, ఏప్రిల్ 10: కేరళలోని ప్రసిద్ధ పుట్టింగల్ దేవి ఆలయంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 106మంది దుర్మరణం చెందారు. దాదాపు 400మంది తీవ్రంగా గాయపడ్డారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆలయ ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ ఎత్తున బాణ సంచా పేల్చడంతో ఈ విషాదం సంభవించింది. వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పుట్టింగళ్ ఆలయంలో ఇంత ఘోర విపత్తు జరగడం సర్వత్రా దిగ్భ్రాంతి కలిగించింది. బాణ సంచా పేల్చడానికి ఎలాంటి అనుమతి లేకపోయినా కొందరు భక్తులు అత్యుత్సాహంతో భారీ ఎత్తున వీటిని పేల్చడంతో ఈ విపత్తు సంభవించింది. ఈ దుర్ఘటనపై కేరళ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తితో దర్యాప్తుకు ఆదేశించింది. దీనితో పాటు ప్రమాదానికి దారితీసిన కారణాలపై క్రైం బ్రాంచి కూడా దర్యాప్తు జరుపుతుందని ముఖ్యమంత్రి చాందీ ప్రకటించారు. అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితిని సమీక్షించారు. వంద మంది మరణించారని, 383మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 60 మృత దేహాలను గుర్తించామని, సాధ్యమైనంత త్వరగా పోస్టుమార్టం పూర్తి చేసి వాటిని సంబంధిత బంధువులకు అప్పగిస్తామన్నారు. ఇప్పటి వరకూ ఎవరూ గుర్తించని మృత దేహాల విషయంలో శాస్ర్తియ పద్ధతుల్లో పరీక్షలు నిర్వహించి వాటి ఉనికిని నిర్థారిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు పది లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షల, స్వల్పంగా గాయపడిన వారికి 50వేల నష్ట పరిహారాన్ని ఆయన ప్రకటించారు. ఎంతటి ఉత్సాహ భరిత వాతావరణంలోనైనా ఇంత తీవ్రస్థాయిలో బాణసంచా పేల్చడం సమంజసం కాదని, ఇలాంటి ప్రయత్నాలను కఠినంగా అణచివేయాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. ఈ దుర్ఘటన ప్రతి ఒక్కరికీ కనువిప్పు కావాలని, భవిష్యత్‌లో ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడకుండా నిరోధించాలన్నారు. ప్రమాద స్థలానికి ఢిల్లీ నుంచి తరలి వచ్చిన ప్రధాని మోదీ ఈ దుర్ఘటనను దిగ్భ్రాంతికరమైనదిగా అభివర్ణించారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. క్షతగాత్రుల్ని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, క్షతగాత్రులకు 50వేల రూపాయల మేర నష్టపరిహారాన్ని ప్రకటించారు.
ఆదివారం అర్ధరాత్రి నుంచే ఆలయ ప్రాంగణంలో బాణసంచా ప్రదర్శన మొదలైందని, ఇందుకు ఎలాంటి అనుమతి లేకపోయినా..నిబంధనలకు విరుద్ధంగా కొందరు వీటిని పేల్చడం వల్ల ఈ ఘోర ప్రమాదం సంభవించినట్టుగా చెబుతున్నారు. ఏటేటా జరిగే పుట్టింగల్ దేవి ఆలయ ఉత్సవాల్లో జనం వేలాదిగా పాల్గొంటారు. దీని వీక్షించేందుకు అంతకు మించిన సంఖ్యలోనే రాష్ట్రం నలుమూలల నుంచి కొల్లం ఆలయానికి తరలివస్తారు. భక్తులు ఉత్సాహంగా పేల్చిన బాణ సంచా నిప్పులు ‘కంబాపుర’ గోదాంలో భారీగా నిల్వ ఉంచిన వాటిపై పడటంతో భయానక రీతిలో పేలుళ్ల పరంపర కొనసాగింది. చెవులు దద్దరిల్లి పోయేంత తీవ్రంగా సాగిన విస్ఫోటక ధ్వనులు సమీపంలోని కొన్ని కిలోమీటర్ల వరకూ మార్మోగాయి. పేలుళ్ల ప్రభావానికి విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టడంతో తీవ్ర స్థాయిలో తొక్కిసలాట జరిగింది. తెగిపోయిన తలలతో, విసిరేసినట్టుగా పడి ఉన్న శవాలతో ఆలయ ప్రాంగణమంతా శ్మశాన సదృశమైంది. తొక్కిసలాతలో కూడా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయని పోలీసులు తెలిపారు. పోటాపోటీగా బాణ సంచా పేల్చడానికి ఆలయ అధికారులు అనుమతి అడిగినా తాము ఇవ్వలేదని జిల్లా కలెక్టర్ షైనమోల్ తెలిపారు. ఇదిలా ఉండగా ఆలయ అధికారులపై ఐపిసి 307 (హత్యానేరం), 308 (మరణాలకుకారణం కావడం) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అలాగే పేలుడు పదార్ధాల చట్టంలోని 4వ సెక్షన్ కిందా కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని వెల్లడించారు.
ఆలయ కమిటీ పరారీ?
పేలుళ్లు జరిగిన సమయంలో పుట్టింగల్ ఆలయ ప్రాంగణంలోనే ఉన్న పదిహేను మంది కమిటీ సభ్యులు ఆ మరుక్షణమే పరారయ్యారు. గుట్టలుగా పడి ఉన్న శవాలను తొలగించడానికి, క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించేందుకు నౌకాదళం, వైమానిక దళాలను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపారు. ఆరు హెలికాప్టర్లు, డోర్నియర్ విమానాల ద్వారా ముమ్మర ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు.

చిత్రం.. ప్రమాద స్థలాన్ని కేరళ సిఎం చాందీతో కలిసి పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

‘ఇది ఊహకందని విషాదం. కేరళను అన్ని విధాలుగా ఆదుకుంటాం. సంఘటన తీవ్రతను మాటల్లో వర్ణించలేం’
ప్రధాని నరేంద్ర మోదీ

‘విచ్చలవిడిగా బాణ సంచా పేల్చడాన్ని నిరోధిస్తాం. ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఈ దుర్ఘటన అందరికీ కనువిప్పు కావాలి’
కేరళ సిఎం చాందీ