జాతీయ వార్తలు

ఆర్తనాదాలు.. హాహాకారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాం, ఏప్రిల్ 10: వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఓ ప్రాచీన ఆలయంలో సంభవించిన పెను విషాదం వేలాదిమందిని కదిలించి వేసింది. క్షణాల ముందువరకూ ఆనందోత్సాహాల మధ్య సాగిన వాతావరణం అంతలోనే భయానక విషాదంగా మారి స్మశాన సదృశమే అయంది. ఒక్కసారిగా సంభవించిన బాణసంచా పేలుళ్లతో ఆ ప్రాంతం హాహాకారాల మయంగా మారింది. కాలిన మృతదేహాలు, కూలిన ఆలయ స్లాబులతో నిండిపోయంది. కేరళలోని పుట్టింగల్ దేవి ఆలయ పరిసరాల్లో ఆదివారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో సంభవించిన భారీ పేలుడు ప్రకంపనలు కిలోమీటరు దూరంవరకు కనిపించాయంటే ప్రమాదం తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ప్రమాదం ఇంతకు ముందెప్పుడూ జరగలేదని ఆలయానికి కిలోమీటరు దూరంలో ఉంటున్న గిరిజ అనే మహిళ చెప్పింది. భారీ పేలుడు సంభవించిన వెంటనే దాని తీవ్రతకు భూకంపం సంభవించినప్పుడు కంపించినట్లుగా భూమి కంపించిందని ఆమె చెప్పింది. ఏడు రోజుల పాటు జరిగే మీనభరణి ఉత్సవాల చివరిరోజు బాణసంచా ప్రదర్శన కారణంగా ఈ దుర్ఘటన సంభవించింది. శనివారం అర్ధరాత్రినుంచి ప్రారంభమైన బాణసంచా ప్రదర్శనను తిలకించడానికి వేలాది మంది ఆలయం వద్దకు చేరుకోగా, తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో మంటలు చెలరేగాయి. టపాకాయలనుంచి చిమ్మిన నిప్పు రవ్వలు ఆలయంలోని స్టోర్ రూమ్ ‘కంబపుర’పై పడగానే అక్కడ పెద్దమొత్తంలో నిల్వ ఉంచిన బాణసంచా చెవులు బద్దలయ్యేంత శబ్దంతో పేలిపోయి ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. వేడుకల చివర్లో ఈ ప్రమాదం సంభవించినట్లు ఆలయం దగ్గర్లోని ఓ భవనంపైనుంచి బాణసంచా ప్రదర్శనను చూస్తున్న టీవీ జర్నలిస్టు లాలూ చెప్పాడు. ‘ఓ భారీ నిప్పు గోళాన్ని, ఆ వెంటనే పిడుగులాంటి శబ్దాన్ని నేను చూశాను. ఈ పేలుడుతో ఆ ప్రాంతంలో విద్యుత్ సైతం ఆగిపోయింది. జనం ప్రాణభయంతో కేకలు వేయడం విన్నాను. అది వెన్నులోంచి వణుకు పుట్టించే అనుభవం’ అని లాలూ అన్నాడు.
గుర్తు పట్టడానికి వీల్లేకుండా కాలిపోయిన మృతదేహాలు, చెల్లాచెదరుగా పడి ఉన్న అవయవాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా కనిపించిందని అతను చెప్పాడు. భారీ శబ్దాన్ని, అగ్నిగోళం లాంటి మంటను తాను చూశానని ఆలయం సమీపంలోనే ఉంటున్న రాజు అనే అతను చెప్పాడు. తాను వెంటనే సంఘటన స్థలానికి పరుగెత్తానని, ఎక్కడ చూసినా మృతదేహాలు, రక్తపు మరకలతో నిండి ఉన్న దుస్తులు, పాదరక్షలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయని అతను పిటిఐకి చెప్పాడు.
బాణసంచాతోపాటుగా రకరకాల ప్రత్యేక బాణసంచా విన్యాసాలకు సంబంధించిన వాటిని నిల్వ ఉంచిన కాంక్రీట్ బిల్డింగ్ సైతం పేలుడులో పూర్తిగా నేలమట్టమైంది. పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే బిల్డింగ్‌కు చెందిన పెద్ద పెద్ద సిమెంట్ శ్లాబులు సైతం పది మీటర్ల దూరం ఎగిరి పడ్డాయని విజయన్ అనే మరో ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ఆలయానికి చెందిన మరో బిల్డింగ్ సైతం పూర్తిగా నేలమట్టమైందని అతను చెప్పాడు. మృతదేహాలు గుర్తు పట్టడానికి వీలులేని విధంగా కాలిపోయాయని, చనిపోయిన, గాయపడిన వారి చెప్పులు, కాంక్రీట్ శ్లాబులు ఆలయం చుట్టుపక్కల చెల్లాచెదరుగా పడి ఉన్నాయని అతను చెప్పాడు. చనిపోయిన, గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని వివిధ ఆస్పత్రులకు తరలించడం జరిగిందని అతను చెప్పాడు. అయితే ప్రమాదం తెల్లవారుజామున జరగడం వల్ల వారిని ఆస్పత్రులకు తరలించడానికి వాహనాలు దొరకడం కష్టమైందని అతను చెప్పాడు. తాను, తన స్నేహితుడు అందరికన్నా ముందు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను తరలించడం, గాయపడిన వారికి సాయపడ్డం మొదలుపెట్టమని రోజువారీ కూలీ సురేశ్ బాబు చెప్పాడు. ‘నేను ఇలాంటి ఘోరమైన దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. ఎక్కడ చూసినా గుర్తు పట్టడానికి వీల్లేనంతగా కాలిన మృతదేహాలు, తెగిపడిన అవయవాలు, ఛిద్రమైన శరీరాలు.. ఆ షాక్‌నుంచి నేను ఇప్పటికీ కోలుకోలేకుండా ఉన్నాను. భోజనం, నీళ్లు కూడా సహించడం లేదు. ఆ దృశ్యాలే ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నాయి’ అని అతను చెప్పాడు.
ఆలయం సమీపంలోని అయిదు బిల్డింగ్‌ల పైకప్పు పెంకులన్నీ ధ్వసమయ్యాయని, వేడుకలు చూడడానికి గుమికూడిన జనంపై కాంక్రీట్ శ్లాబులు, ఐరన్ గ్రిల్స్ పడ్డంవల్ల చాలామంది మృతి చెందడం, గాయపడ్డం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు, సంఘటన స్థలంలోని రెడ్‌క్రాస్ అధికారులు చెప్పారు.
రాష్ట్రం 10, కేంద్రం 2 లక్షల పరిహారం
న్యూఢిల్లీ: పుట్టింగల్ దేవి ఆలయంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ తలా 2 లక్షల రూపాయల తక్షణ పరిహారాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల సాయాన్ని సైతం ప్రధాని ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ సైతం మృతుల కుటుంబాలకు తలా పది లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారాన్ని సైతం ఆయన ప్రకటించారు.