జాతీయ వార్తలు

సుప్రీం సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న కరవు పరిస్థితులపై సుప్రీం కోర్టు మంగళవారం మరోసారి కేంద్రాన్ని నిలదీసింది. కరవుపై కేంద్రం స్వయంగా ఎందుకు చర్య తీసుకోవటం లేదని ప్రశ్నించింది. దేశమంతటా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉంటే కేంద్రానికి ఎందుకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరవుపై రాష్ట్రాలు తమంత తాముగా ప్రకటన చేసేదాకా ఎలాంటి చర్యా చేపట్టరాదని భావిస్తున్నారా అంటూ ప్రశ్నించింది. దేశంలోని కరవు పరిస్థితిపై సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం విస్తృతంగా చర్చించింది. ఈ వ్యవహారంలోకేంద్రం బాధ్యతలపై ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సోలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) పీ ఎస్ నరసింహను ప్రశ్నించింది. కేంద్రం తరపున ఏఎస్‌జీ సమాధానమిస్తూ దేశంలో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తనంత తానుగా కరవు ప్రాంతాలను ప్రకటించజాలదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కరవును ప్రకటించేందుకు సొంత యంత్రాంగం ఉంటుందన్నారు. ‘‘మేము కరవును ప్రకటించలేము. మన దేశం సమాఖ్య నిర్మాణం కలిగి ఉంది. రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తనంత తానుగా జోక్యం చేసుకోజాలదు’’ అని ఏఎస్‌జీ సుప్రీం కోర్టుకు విన్నవించారు. ఒక వేళ రాష్ట్రాలకు నిధులు కావలసి వస్తే, మిగతా కేంద్ర పథకాలతో పాటు అదనపు నిధులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఇంతకుముందు సుప్రీం కోర్టు నుంచి అక్షింతలు పడిన వెంటనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 12, 230 కోట్ల నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మరాఠ్వాడా ప్రాంతంలోని లాతూర్‌కు మీరజ్ జంక్షన్ నుంచి 5లక్షల లీటర్ల మంచినీరుతో 10 రైల్వే వ్యాగన్లను కేంద్రం పంపించింది. కేంద్రం తీసుకున్న ఈ చర్యను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు. లాతూర్ కోసం రోజుకు 10 లక్షల లీటర్ల నీటిని రెండు నెలల పాటు సరఫరా చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేజ్రీవాల్ ప్రకటించారు.

బాకీలు ఎన్ని కోట్లు?

ఆర్‌బిఐని ప్రశ్నించిన సుప్రీం
ఎంత మొత్తమో వెల్లడించండి
సాధ్యం కాదన్న రిజర్వ్ బ్యాంక్
తదుపరి విచారణ 26కు వాయదా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశంలో పేరుకు పోతున్న లక్షలాది కోట్ల రూపాయల మొండి బకాయిల పట్ల సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వందల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న వ్యక్తులు తమ కంపెనీలు దివాలా తీశాయంటూ తప్పించుకు పారిపోతున్నారని, కానీ, 15వేలు, 20వేలు మేర చిన్న రుణాలు తీసుకున్న పేద రైతులు వేధింపులకు గురవుతున్నారని సుప్రీం కోర్టు చురక వేసింది. ఈ నేపథ్యంలో అసలు ఎంత మొత్తం మొండి బకాయిల్లో ఇరుక్కు పోయిందో వెల్లడించాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఆర్ భానుమతితో కూడిన సుప్రీం బెంచి స్పష్టం చేసింది. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని వారి పేర్లను వెల్లడించకుండా ఎంత మొత్తం ఇలా కూరుకు పోయిం దో స్పష్టం చేయాలని సూచించింది. అయితే, ఈ ప్రతిపాదనకు రిజర్వ్ బ్యాంక్ విముఖత వ్యక్తం చేసింది. గోప్యత కారణాల దృష్ట్యా వీటి వివరాలను వెల్లడించడం సాధ్యం కాదని తెలిపింది. దాదాపు 500కోట్ల రూపాయలకు పైగా రుణాలు తీసుకుని కట్టని కంపెనీలు, వ్యక్తులకు సంబంధించిన వివరాలను పరిశీలించిన మీదట సుప్రీం కోర్టు ఈ సూచన చేసింది. ‘తిరిగి చెల్లించని రుణాల మొత్తం ఎంత ఉందో వెల్లడించవచ్చు. ఇందుకు పాల్పడ్డ వారి పేర్లను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు’అని సుప్రీం బెంచి తెలిపింది. చెల్లించాల్సిన రుణాల మొత్తం లక్షల కోట్ల రూపాయలకు పైనే ఉందని, వీరిలో చాలా మంది తీసుకున్న రుణాలు కూడా 500కోట్ల రూపాయల పైమాటేనని సుప్రీం బెంచి పేర్కొంది. ఈ విషయంలో తమకు సహకరించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ, బ్యాంకుల సంఘాలను కూడా భాగస్వాములుగా పేర్కొన్న సుప్రీం కోర్టు తదుపరి విచారణను 26కు వాయిదా వేసింది. నేడు జరిగిన విచారణ సందర్భంగా మాట్లాడిన ఆర్‌బిఐ న్యాయవాది ‘ఆర్‌బిఐ నిబంధనలు, పరపతి సమాచార కంపెనీల (నియంత్రణ)చట్టం ప్రకారం ఇలాంటి సమాచారాన్ని వెల్లడించడం సాధ్యం కాదని తెలిపారు. ప్రజా హిత పిటిషన్ దాఖలు చేసిన ఎన్‌జివో సంస్థ తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ‘మొండి బకాయిల మొత్తాన్ని వెల్లడించవచ్చు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఆర్‌బిఐ అందించాల్సిందేనంటూ గతంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా ఇచ్చింది’అని గుర్తు చేశారు. అయితే ఆ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు సమాచార హక్కు చట్టానికి సంబంధించినదేనని, ప్రస్తుతం పరిశీలనలో ఉన్న కేసుకు అది ఎంత మాత్రం వర్తించదని ఆర్‌బిఐ న్యాయవాది ఉద్ఘాటించారు.