జాతీయ వార్తలు

ఆదేశాలకు తొందర లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ హైదరాబాద్, మే 3: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్)పై తాజాగా దాఖలైన పిటిషన్లపై ఆదేశాలకు తొందరేం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో సహా వివిధ రాష్ట్రాలు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, సీఎంసీ వెల్లూర్ వంటి మైనార్టీ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టు నుంచి ఏదో ఒకవిధమైన ఆదేశాలు జారీ కావచ్చని వేలాది విద్యార్థులు ఎదురుచూశారు. అయితే మే ఒకటిన తొలి దశ నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగిన అంశాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు తాజా పిటిషన్లపై అత్యవసరంగా ఆదేశాలివ్వాల్సిన పరిస్థితి లేదని స్పష్టం చేసింది. అందరి వాదనలు పూర్తిగా విన్న తరువాతే నిర్ణయం తీసుకుంటామని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం తేల్చి చెప్పింది. అంతే కాదు జూలై 24న నిర్వహించబోయే రెండో దశ నీట్‌కు కేంద్రం, సీబీఎస్సీ విస్తృతమైన ప్రచారం కల్పించాలని కోరింది. దీని వల్ల మే 1న పరీక్ష రాయలేక పోయిన విద్యార్థులకు వారి అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం లభిస్తుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తాజా పిటిషన్లపై వాదనలు వినేముందు నీట్ తొలి దశ పరీక్షలకు హాజరైన విద్యార్థుల సమాచారాన్ని అందించాల్సిందిగా కేంద్రాన్ని, సీబీఎస్సీని కోరింది. అంతే కాదు భాషకు సంబంధించిన సమస్యపై గుజరాత్‌తో పాటు వివిధ రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా గత రెండు సంవత్సరాలలో నిర్వహించిన పరీక్షా ప్రశ్నపత్రాలను సమర్పించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు రాజ్యాంగంలోని 370, 371 అధికరణాల ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్ పరీక్షలు తామే నిర్వహించుకోవటానికి రాజ్యాంగ అధికారాలు ఉన్నాయని జమ్ముకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వాదించాయి. జమ్ముకశ్మీర్ రాజ్యాంగం లోని 370 అధికరణం 35 ఏ సెక్షన్ 6 ప్రకారం నీట్ ద్వారా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తమ రాష్ట్రంలో అడ్మిషన్లు ఇవ్వటం సాధ్యం కాదని జమ్ము కశ్మీర్ ప్రభుత్వం వాదించింది. పరీక్షల నిర్వహణలో కేంద్రం జోక్యం చేసుకోజాలదని కూడా విన్నవించింది. జస్టిస్ ఏ ఆర్ దవే, శివకృతి సింగ్, ఏకే గోయెల్‌తో కూడిన ధర్మాసనం తాజా పిటిషన్లపై విచారణకు కావలసిన మార్గదర్శకాలను రూపొందించనుంది. మంగళవారం కర్ణాటక, తమిళనాడు, సీ ఎంసీ వెల్లూరు, లూధియానాల వాదనలు ధర్మాసనం విన్నది. గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని తాము పరీక్షా విధానాన్ని రూపొందించి ప్రైవేట్ సంస్థ టీసీఎస్ ద్వారా నిర్వహిస్తున్నామని.. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి వెయ్యి రూపాయలు ఫీజు రూపంలో వసూలు చేస్తున్నామని కర్ణాటక తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కే.వేణుగోపాల్ ధర్మాసనానికి తెలిపారు. దీనిపై తీవ్రంగా ప్రతిస్పందించిన ధర్మాసనం చాలా రాష్ట్రాలు వేర్వేరు ఫీజులను డిమాండ్ చేస్తున్నాయి. పరీక్షలు రాయటం కోసం తల్లిదండ్రులు.. విద్యార్థులు ఒక చోటి నుంచి మరో చోటికి శ్రమకోర్చి ప్రయాణాలు చేయాల్సి వస్తోంది’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీ ఎంసీ లూధియానా తన వాదనలు వినిపిస్తూ క్రిస్టియన్ మైనారిటీలను గుర్తించటానికి తమ పరీక్షలో బైబిల్‌పై ప్రత్యేక పేపర్ ఉందని పేర్కొంది. రాష్ట్ర పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు తక్కువ టైమ్‌లో నీట్‌కు సంసిద్ధం కావటం చాలా కష్టమని దాదాపు అన్ని రాష్ట్రాలు వాదించాయి.. అందరి పిటిషన్లపై గురువారం మధ్యాహ్నం 2గంటలకు వాదనలు కొనసాగుతాయి. ఈ లోగా వివిధ పిటిషన్లపై కేంద్రం, సీబీఎస్సీ, ఎంసీఐలు తమ స్పందనలను సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.