నల్గొండ

మార్గదర్శకంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 20: జిల్లా సాగుతాగునీటి రంగ ప్రగతికి ఇరిగేషన్ ప్రణాళిక మార్గదర్శిగా ఉండేలా రూపొందించాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డిలు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఏజెన్సీలు రూపొందించిన జిల్లా ఇరిగేషన్ ప్రణాళిక పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా సమీక్షించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతు ప్రతి నీటి చుక్కను వినియోగించుకుని రైతులు లాభపడేలా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఇరిగేషన్ ప్రణాళిక ఉండాలన్నారు. తీవ్ర వర్షాభావంతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి ఉన్నందునా కేంద్ర భూగర్భ జలవనరుల బోర్డు నివేదికతో పాటు 2011నుండి 15వరకు ఉన్న భూగర్భ జలాల వివరాలను ప్రణాళికలో పొందుపరుచాలన్నారు. జిలాల్లో ఉన్న భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు వాటి ఆయకట్టు వివరాలను పొందుపరుచాలని, కొత్త ప్రాజెక్టులను చేర్చాలని సూచించారు. ఎంపి గుత్తా మాట్లడుతు హైద్రాబాద్‌కు సరఫరా జరుగుతున్న కృష్ణా నీటిలో తిరిగి కొంత మూసీలో కలిసి జిల్లాకు చేరుతుందని దానితో ఎంత మేరకు కొత్త ఆయకట్టుకు సాగునీరందించవచ్చన్న విషయాలు ప్రణాళికలో చూపాలన్నారు. జిల్లాలో భూసేకరణ భూములకు హద్ధులు నిర్ణయించి తిరిగి అవి సాగు జరుగకుండా చూడటం ద్వారా ప్రాజెక్టుల పనులు పురోగమించేలా చూడాలన్నారు. ప్రభుత్వ విప్ సునిత మాట్లాడుత బునాదిగాని కాలువ పనులు ఎప్పటికి పూర్తి చేస్తారో తెలుపాలంటు అధికారులను ప్రశ్నించారు. ఈ పనులకు మూడు విభాగాలు పనిచేస్తున్నా కొన్ని చోట్ల రైతులకు పరిహారం అందలేదని, పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టి కొత్తవారికి సదరు పనులు అప్పగించి పూర్తి జరిగేలా చూడాలన్నారు. ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావు మాట్లాడుతు మినీ ట్యాంకులకు ప్రతిపాదించిన వాటిలో నీరు లేదని, అదనపు లిఫ్ట్‌లకు ప్రతిపాదనలు ప్రణాళికలో సూచించాలన్నారు. ఈ సమావేశంలో సిపివో సురేందర్, జెడిఏ నర్సింహరావు, జడ్పీ సిఇవో మహేందర్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఇ ధర్మానాయక్, ఈఈ హామీద్‌ఖాన్, డిఆర్‌డిఏ పిడి అంజయ్య, డ్వామా పిడి దామోదర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతా నియమాలతో సురక్షిత ప్రయాణం

నల్లగొండ టౌన్, జనవరి 20: ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ తమ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవాలని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, డిటిసి చంద్రశేఖర్‌గౌడ్‌లు సూచించారు. బుధవారం పట్టణ శివార్లలోని రామానంద తీర్ధ ఇంజనీరింగ్ కళాశాల నందు జిల్లా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ ఆధ్వర్యంలో ఈనెల 20నుండి 26వరకు నిర్వహించబోవు 27వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల అవగాహణ కార్యక్రమంలో బాగంగా వారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో 15నుండి 35సంవత్సరాలలోపు యువకులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని, తద్వారా దేశం యువతను, పురోగతిని నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నిమిషానికి ఒక ప్రమాదం చోటు చేసుకుంటుందని, ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మరణం, ప్రతి గంటకు 15మంది ప్రమాదాల్లో చనిపోతున్నారని అన్నారు. గత సంవత్సరం 1లక్షా 41వేల 526మంది మృతిచెందారని, ఈ ప్రమాదాలలో 82శాతం మగవారు మరణిస్తూ వారి కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోతున్నాయన్నారు. అజాగ్రత్తల వల్లనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని గమనించాలన్నారు. క్షేమంగా గమ్యం చేరడమే లక్ష్యంగా వాహనాలను నడపాలని సూచించారు. ఫిబ్రవరి నుండి రోడ్డు భద్రతా నియమాలను పాటించని వారిపై భారీ జరిమానాలను విధిస్తామని హెచ్చరించారు. రెగ్యులర్‌గా ప్రమాదాలు జరిగే స్తలాలను గుర్తించి తగు చర్యలు తీసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 20టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు. సామాజిక భాద్యతగా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కృషి చేయాలని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు తమ సూచనలను, నినాదాలను 8374097263 నంబర్‌కు పంపించాలని మంచి నినాదాలను ఎంపిక చేసి బహుమతులందజేస్తామన్నారు. అనంతరం విద్యార్ధులచే రోడ్డు బద్రతా నియమాలను పాటిస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సి ఐ ఆదిరెడ్డి, ఆర్‌టివో హనుమంతారెడ్డి, కళాశాల డైరక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ హరినాధ్‌రెడ్డి, ఎంవి ఐ సురేష్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, విద్యార్థినీవిద్యార్థులు, కళాశాల బస్ డ్రైవర్‌లు పాల్గొన్నారు.

ఆశ్రమానికి
ముప్పు వాటిల్లనివ్వం
* అందరితో చర్చించాకే బైపాస్‌పై నిర్ణయం: జెసి
యాదగిరిగుట్ట రూరల్, జనవరి 20: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి అభివృద్ధిలో భాగంగా రాయగిరి నుండి యాదాద్రి వరకు రోడ్డు విస్తరణ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో యాదగిరిగుట్టలోని రోడ్డు నిర్వాసితుల్లో కొందరు వ్యతిరేకించడంతో బైపాస్ రోడ్డుకు శ్రీకారం చుట్టారు. ఈ బైపాస్ రోడ్డులో రైతుల భూములతో పాటు, ఆశ్రమం, ప్రభుత్వ పాఠశాల ఉండడంతో స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. తమకున్న కొద్దిపాటి భూమిని బైపాస్ రోడ్డుకు ఇచ్చి తము రోడ్డుపాలు కావస్తుందని రైతులు, తమ అనుమతి లేనిదే ఆశ్రమ ప్రహరీని కూల్చడంతో ఆశ్రమ పీఠాధిపతి, ఆశ్రమ దాతలు, హిందూపరిరక్షణ సమితి, దేవాలయాల పరిరక్షణ సమితి, పలు రాజకీయ పార్టీలు బైపాస్ రోడ్డును వ్యతిరేకిస్తున్నారు. కొద్దిరోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న తరుణంలో రైతులను, ఆశ్రమవాసులను బుజ్జగించేందుకు జిల్లా జాయంట్ కలెక్టర్ సత్యనారాయణ. గుట్ట తహశీల్ కార్యాలయంలో రైతులతో సంప్రదింపులు జరిపారు. ఆశ్రమానికి చేరుకుని చలించిన ఆయన బుచ్చిదాస గీతా మందిరంలోనే ఆశ్రమ నిర్వాహకులు, పీఠాధిపతులు, సాధువులు, స్థానికులతో చర్చించిన అనంతరం జెసి మాట్లాడుతూ ఆశ్రమానికి ముప్పు వాటిల్లకుండా అందరితో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. యాదాద్రి క్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవుగా ఉండాలని, ఆశ్రమాలు, ఆధ్యాత్మిక కేంద్రాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోద శ్రీరాములు పలు అంశాలతో కూడిన విజ్ఞాపన పత్రాలను జేసికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాయగిరి నుండి యాదాద్రి వరకు రోడ్డు మరమ్మతులు జరుగుతుంటే మళ్లీ బైపాస్ రోడ్డు అంటూ రైతులను, స్థానికులను మనోవేదనకు గురిచేస్తున్నారని అన్నారు. శ్రీశ్రీ రామకృష్ణానందగిరిస్వామి, శ్రీశ్రీ నిత్యానందగిరి స్వామి, శ్రీశ్రీ నిర్విశేశానందస్వామి మాట్లాడుతూ బైపాస్ నైరుతి మీదుగా వెళ్లడంతో యాదాద్రికి నష్టం కలుగుతుందని, అంతగా అభివృద్ధికి నోచుకోదని పలువురు ఆగమ శాస్త్ర పండితులు సూచిస్తున్నా బైపాస్ రోడ్డు నిర్మిస్తామంటే యాదాద్రి అభివృద్ధిని అడ్డుకుంటామంటే ఏమి చేసేది లేదన్నారు. దేవాలయాల పరిక్షణ కమిటీ రాష్ట్ర నాయకుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి అభివృద్ధికి కంకణబద్ధులమై ఉన్నామని, రోడ్లు వేస్తామంటూ ఆలయాలు, ఆశ్రమాల తెరువు వస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి జిల్లా నాయకులు రచ్చ శ్రీనివాస్, గుజ్జ శ్రీనివాస్, ఆశ్రమ నిర్వాహకులు రమేష్‌గౌడ్, జెకే నర్సింహ్మ, గండయ్య, మిర్యాల లక్ష్మి, రచ్చ యాదగిరి, రచ్చ లక్ష్మీబాయి, ఆర్‌డిఓ మధుసూధన్, ఎంఆర్‌ఓ రామకృష్ణ, ఆర్ ఆండ్‌బి డిఈ వెంకటేష్, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు శివ, దిలీప్, ఆరె శ్రీ్ధర్‌గౌడ్, గుండ్లపల్లి మలేష్‌గౌడ్ పాల్గొన్నారు.

పిలాయిపల్లి కాలువను పూర్తి చేయించలేకపోయా..

ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
చౌటుప్పల్, జనవరి 20: ఈ ప్రాంతంలో శాశ్వతంగా సాగునీటి సమస్యను పరిష్కారం చేసేందుకు మూసీ జలాలను మళ్లించేందుకు గాను పిలాయిపల్లి కాలువ పనులను పార్లమెంటు సభ్యుడిగా సకాలంలో పూర్తి చేయించలేకపోయానని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో బుధవారం ఎంపిపి చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. మండల పరిషత్ సమావేశంలో వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి మాట్లాడుతూ పిలాయిపల్లి కాలువను పూర్తి చేయకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు దొంగ బిల్లులు పెట్టుకోని నిధులు డ్రా చేసుకోవడం తప్పా పనులపై జ్యాస ఉండదన్నారు. ఐబి డిఇ శ్రీ్ధర్ ఉన్నంత కాలం పిలాయిపల్లి కాలువ పనులు పూర్తి కావన్నారు. పిలాయిపల్లి కాలువను వెడల్పు చేస్తే తప్పా లక్ష్యం నెరవేరదన్నారు. మళ్లీ టెండర్లు పిలిచి కాలువను వెడల్పు చేస్తే ఆరు నెలల్లో పూర్తి చేయవచ్చన్నారు. తనకు అదునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఐదేళ్లు ఎంపిగా బాధ్యతలు నిర్వహించినా చిన్న కాలువ పనులు పూర్తి చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా, గోదావరి జలాల అనుసంధానంతో పాటు రిజర్వాయర్ల ఏర్పాటుతో రానున్న కాలంలో మూసీ జలాలు ఉపయోగకరంగా మారనున్నాయన్నారు. అధికారుల పనితీరులో మార్పు వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. అధికారుల్లో పని చేయాలన్న నిబద్ధత లోపించిందన్నారు. కొత్త సీసాలో పాత సారాయి అన్న మాదిరిగా పాలన సాగుతుందన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మంచి పనులకు ప్రభుత్వానికి పూర్తి సహకారం ఉంటుందన్నారు. మైనర్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ ఏర్పాటు చేయకుండా కొంత మంది స్వార్థపరులు అడ్డుపడ్డారని, దీంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న కాలంలో ఫ్లైఓవర్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఎంపిటిసి, జెడ్పీటిసిల హక్కుల కోసం శాసనమండలిలో ప్రస్తావిస్తానన్నారు. శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసి ఎంపిటిసి, జెడ్పీటిసిల స్థాయి పెంచానన్నారు. జిల్లాకు చెందిన మంత్రి సైతం ఎంపిటిసిలకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడే స్థితికి తీసుకొచ్చానన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి, తహశీల్దార్ షేక్‌అహ్మద్, ఎంపిడివో రజిత తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల హక్కుల సాధనకు నిరంతర ఉద్యమాలు

ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి

చౌటుప్పల్, జనవరి 20: కార్మికుల హక్కుల సాధన కోసం అన్ని ట్రేడ్ యూనియన్‌ల సహకారంతో నిరంతర ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు, సిడబ్ల్యూసి సభ్యుడు డాక్టర్ జి.సంజీవరెడ్డి అన్నారు. చౌటుప్పల్‌లోని ఆర్టీసి బస్టాండ్ ఆవరణలో స్వర్గీయ సుర్కంటి నరసింహారెడ్డి ప్రాంగణంలో బుధవారం ఐఎన్‌టియుసి జిల్లా జనరల్ కౌన్సిల్ మహాసభ జరిగింది. ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన సిడబ్ల్యూసి మెంబర్ డాక్టర్ జి.సంజీవరెడ్డి, నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ మహాసభలో ఆయన మాట్లాడుతూ స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలన్నారు. పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనన్నారు. రాజ్యసభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులను వేధిస్తే సహించబోమని హెచ్చరించారు. ఐఎన్‌టియుసికి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాంతాల అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తుందన్నారు. కేసిఆర్ తన కుటుంబ సభ్యుల సంక్షేమానికే అధిక ప్రాధాన్యతనిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మనే మోసం చేసిన కేసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేయడం లెక్కకాదన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మహాసభలో పాల్వాయి స్రవంతి, ఆర్.డి.చంద్రశేఖర్, భాస్కర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, ఎం.డి.అనీఫ్, యరగాని నాగన్న, బోయ రాంచందర్, వెన్‌రెడ్డి రాజు, అంబటి అంజయ్య, సవమన్న, శోభారాణి, బడేసాబ్, సామకూర రాజయ్య, పాశం సంజయ్‌బాబు, ఉబ్బు వెంకటయ్య, గోద వెంకటేశం, పగిళ్ల గోపాల్‌రెడ్డి, ప్రజ్ఞానాయక్, తరుపతి రవీందర్, సదానందం, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
* దుబ్బాక నర్సింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్
నల్లగొండ టౌన్, జనవరి 20: నల్లగొండ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నల్లగొండ మున్సిపల్ కమీషనర్ అలివేలు మంగతాయారు, టిఆర్‌ఎస్ నల్లగొండ నియోజక వర్గ ఇన్‌చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డిలు అన్నారు. బుధవారం స్థానిక 36వ వార్డులో కౌన్సిలర్ నవీన్‌గౌడ్ ఆధ్వర్యంలో పలు అభివృద్ది పనులలో భాగంగా పేద మహిళల కన్నీటి కష్టాలు తీర్చేందుకు ఆన్‌లైన్ ద్వారా మంజూరైన దీపం పథకం గ్యాస్ కనెక్షన్‌లను వార్డు మహిళలు పంపిణీ చేశారు. అనంతరం 8లక్షల నిధులతో సిసి రోడ్డు పనులు, లోతట్టు ప్రాంతాల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కాకుండానే ప్రజా సంక్షేమ రంగానికి 36వేల కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్మమేనని అందుకోసం సిఎం కెసిఆర్ రేయింబవల్లు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ అభిమన్య శ్రీనివాస్, ఔట రవీందర్, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు అబ్బగోని రమేష్‌గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థి జెఎసి క్యాలెండర్ ఆవిష్కరణ
కలెక్టరేట్(నల్లగొండ), జనవరి 20: మహాత్మగాంధీ యూనివర్సిటీ విద్యార్ధి జేఎసి క్యాలెండర్‌ను బుధవారం రిజిస్ట్రార్ యు.ఉమేష్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెఎసి చైర్మన్ కట్టా వినయ్‌కుమార్, అనంతుశివకుమార్, ప్రిన్సిపాల్స్ అన్నపూర్ణ, రమేష్‌కుమార్, అంజిరడ్డె, ఏ.రవి, రమేష్, వెంకటరమణారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, సునీల్, వెంకన్న, అశోక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో ఆనందం, ఆరోగ్యం
*జిల్లా జడ్జ్జి అనంతపధ్మనాభస్వామి
నల్లగొండ లీగల్, జనవరి 20: నిరంతరం వృత్తిలో నిమగ్నమయ్యే న్యాయవాదులకు క్రీడలు ఎంతో ఆనందం, ఆరోగ్యాన్ని కల్గిస్తాయని జిల్లా జడ్జీ కె. అనంత పధ్మనాభస్వామి అన్నారు. బుధవారం జిల్లా కోర్టులో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడలలో భాగంగా న్యాయవాదుల క్రీడలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన క్యారమ్స్, చెస్, వాలిబాల్ క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.వి సుధాకర్, క్రీడల కార్యదర్శి బి.అశోక్‌కుమార్, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

పాఠశాల ఆటో బోల్తా..
చిన్నారి మృతి
మునగాల, జనవరి 20: పాఠశాల ఆటో బోల్తాపడి చిన్నారి మృతిచెందిన సంఘటన మండలపరిధిలోని తిమ్మారెడ్డిగూడెం గ్రామశివారులో బుధవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలకేంద్రంలోని త్రినిటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న తిమ్మారెడ్డిగూడెంకు చెందిన తిమ్మారెడ్డి యాకుబ్‌రెడ్డిసంధ్యా దంపతుల కుమార్తె అశ్విని(7)తో పాటు అదే గ్రామానికి చెందిన పలువురు విద్యార్ధులు పాఠశాల ముగిసిన తర్వాత రోజుమాదిరిగానే ఆటోలో గ్రామానికి వెళ్తుండగా గ్రామశివారులో ఆటో ముందు టైరు పగిలి పోవడంతో ఆటో అదుపుతప్పి ఫల్టీకొట్టింది. దీంతో ఆటోలోని 10మంది విద్యార్థులకు స్వల్పగాయాలు కాగా అశ్వీని తలకు బలమైన గాయం తగలడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. మృతదేహానికి మునగాల ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్షలు నిర్వహించి ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గడ్డం నగేష్ తెలిపారు. కాగా చిన్నారి మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కంటతడి పెట్టారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.