నెల్లూరు

పుస్తకాల బాట... అక్షరాల పూదోట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరిగిన చొక్కా వేసుకున్నా ఫర్వాలేదు... కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో... అన్నది పెద్దల మాట. అరచేతిలో సాంకేతికత ఇమిడిపోతున్నా... ప్రజాజీవనాన్ని ఆధునికత ఎంతగా ప్రభావితం చేస్తున్నా... బ్లాగులు, వెబ్‌సైట్లు నెట్టింట్లో వచ్చి పడుతున్నా.... పుస్తకానికున్న ఆదరణ నాటికీ నేటికీ వనె్న తగ్గలేదన్నది వాస్తవం. పుస్తక పఠనంపై ఇంటర్నెట్ తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళన కేవలం ఓ విమర్శగానే మిగిలిపోయంది. వాలుకుర్చీలోనో, పార్కులోనో, ప్రయాణంలోనో... ఎక్కడపడితే అక్కడ చదువుకునే సౌలభ్యం కలిగిన పుస్తకంతో కలిగే తృప్తి మానిటర్‌మీదో, ల్యాప్‌టాప్‌లోనో, సెల్‌ఫోన్‌లోనో చదివితే కలగదన్నది ప్రతి ఒక్కరికీ అనుభవమే. పుస్తక పఠనంతో కలిగే అనుభూతి, ఆస్వాదన మాటల్లో వర్ణించలేనిది. ఆ అనుభూతే పఠన ప్రియుల్ని పుస్తక ప్రదర్శనల బాట పట్టిస్తోంది. అందరి అభిరుచులకు అనుగుణంగా పుస్తకాలన్నీ ఒకేచోట కొలువుదీరి అక్షరాల పూదోటగా కనువిందు చేస్తుంటే ఆస్వాదించకుండా ఎవరుంటారు? పుస్తక ప్రదర్శన ఎక్కడ జరిగినా, ఎన్నిసార్లు జరిగినా ఓ మంచి పుస్తకం కోసం వెతుకులాడని వారెవరు? చిన్న పిల్లల దగ్గర్నుంచి వృద్ధుల వరకూ అన్ని వయసులవారూ పుస్తక ప్రదర్శనశాలలో దర్శనమివ్వడం పుస్తకాలకు ఆదరణ తగ్గలేదనడానికి ఓ నిదర్శనం. సాహితీ గోష్ఠులు, సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల కోసం పోటీలు నిర్వహించడం, ఇటు కళలకు... అటు పఠనానికి సమ ప్రాధాన్యత కల్పించడం నిర్వాహకుల ఉత్తమ అభిరుచికి నిదర్శనం.

ఎక్కడెక్కడో ముద్రితమైన పుస్తకాలు నెల్లూరు బాట పట్టాయ. తొమ్మిది రోజులపాటు ఓ పండుగలా సాగిన ఈ సంబరాలు పుస్తక ప్రియుల్ని మహదానందపరిచాయ. పుస్తకం అవసరాన్నీ, పఠనాసక్తి విలువనూ చాటిచెప్పిన ఈ సంబరాలు బాలల్లో, యువతలో చైతన్యాన్ని నింపాయ. పఠనాసక్తి కలిగిన ప్రతిఒక్కరూ సందర్శించేలా తొమ్మిది రోజులపాటు కనువిందు చేసిన ఈ సంబరాలు నేటితో ముగియనున్నాయ.
నెల్లూరు చరిత్రలో తొలిసారిగా నవ్యాంధ్ర పుస్తక సంబరాలు పేరిట ఏర్పాటైన బుక్ ఎగ్జిబిషన్ పుస్తక ప్రియులతో కళకళలాడుతోంది. విజయవాడ బుక్ సొసైటీ, ఎన్టీఆర్ ట్రస్టు, ఎమెస్కో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక సంస్థ సంయుక్తంగా ఏర్పాటుచేసిన నవ్యాంధ్ర పుస్తక సంబరాలు నెల్లూరులో పండగ వాతావరణం నెలకొంది. నెల్లూరు, ప్రకాశం జిల్లా ప్రజల కోసం ఉద్దేశించి నెల్లూరులో ఏర్పాటుచేశారు. సాహితీవేత్తలు, పుస్తక ప్రియులు, గృహిణులు, విద్యార్థులు, న్యాయవాదులు, ఎంతోమంది ఈ పుస్తక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. విశాలమైన విఆర్ కాలేజీ మైదానంలో 90 స్టాల్స్ ఏర్పాటుచేశారు. ఇందులో 500 మంది పబ్లిషర్స్ తమ ప్రచురణలు పుస్తక ప్రియులకు అందుబాటులో ఉంచారు. ఎల్‌కెజి నుంచి డిగ్రీ, పిజి, రీసెర్చ్ స్కాలర్స్‌కు ఉపయుక్తమైన పుస్తకాలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. సందర్శకులు వారికి కావాల్సిన పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. భావితరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే చరిత్ర పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, మనస్సుకు ఉల్లాసం కలిగించే హాస్య రచనలు, పిల్లలకు విజ్ఞానం అందించే నీతికథలు, కార్టూన్లు, విద్యార్థులకు పాఠ్యాంశాల విశే్లషణకు ఉపయుక్తంగా ఉండే అనేక పుస్తకాలు, గృహిణులకు వంటలు, హెల్త్‌టిప్స్ వంటి పుస్తకాలు ఈ ప్రదర్శనలో ఉండడంతో ప్రతిరోజూ విద్యార్థులతో విఆర్ కాలేజీ మైదానం కిటకిటలాడుతోంది. మామూలు ఎగ్జిబిషన్ అనుకుంటూ లోనికి వెళ్లేవారు మైదానంలో ఏర్పాటుచేసిన 90 స్టాళ్లలో కొలువుదీరిన పుస్తకాలు ఒకదాని మించి మరొకటి చూసి ఆశ్చర్య చకితులవుతున్నారు. ఒక పుస్తకం కొంటే అంతకంటే మంచి పుస్తకం మరొకటి దర్శనమిస్తోంది. న్యాయవాదులు, కంప్యూటర్ నేర్చుకునే విద్యార్థులు వారికి కావాల్సిన పుస్తకాలు కొనుగోలు చేశారు. పుస్తకాలకు రాయితీలు, డిస్కౌంట్లు ఇవ్వడంతో కొనుగోళ్లు పెరిగాయ. అంతేకాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రతిరోజూ ఒక అంశంపై విద్యావేత్తలతో చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరపడం సంబరాలకు నిండుదనం వచ్చింది. పుస్తకాల సంబరం తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో జరగడంతో నెల్లూరు సాహితీ ప్రియులు, ప్రజల్లో ఎనలేని ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించింది.
ఇదిలావుండగా తొలిరోజు ప్రారంభ సభలో వేదికపై ఉన్న జిల్లా ఉన్నతాధికారులు పుస్తక ప్రదర్శనను తిలకించేందుకు పాఠశాలలకు పనివేళల్లో వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించడంతో విద్యార్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ పుస్తక సంబరాల్ని తిలకించడానికి వీలు కలిగింది. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు వేర్వేరుగా పద్యాలు, శ్లోకాల పఠనం, క్విజ్, స్పెల్‌బీ, వ్యాసరచన, చిత్రలేఖనం, సినీ, లలిత, జానపద శాస్ర్తియ పాటల పోటీలు, జామ్ (జస్ట్ ఎ మినిట్) వంటి అంశాలపై పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. వీటికి తోడు ఎగ్జిబిషన్ మైదానంలో రక్తదాన శిబిరం, వైద్యశిబిరం, విద్యార్థులకు వ్యక్తిత్వ శిక్షణ శిబిరం కూడా నిర్వహించారు.
ఇక సాంస్కృతిక ప్రదర్శనల్లో కూచిపూడి, జానపద నాట్యం, డప్పులు, కోలాట, పగటివేషాలు, మిమిక్రీ, హరికథ,యక్షగానం, పద్యనాటకం వంటివి ప్రజల మనస్సుకు హత్తుకునేలా జరిగాయి.
పుస్తక సంబరాన్ని మున్సిపల్ శాఖామంత్రి పి నారాయణ ప్రారంభించి పుస్తక ప్రియుల్ని ఉత్తేజ పరిచారు. అదేరోజు తిక్కన కవితా రీతులపై సాహితీవేత్త మోపూరు వేణుగోపాలయ్య ప్రసంగించారు. ఆరో తేదీన దువ్వూరు రామిరెడ్డి సాహిత్య దర్శనం అనే అంశంపై, ఆయన రచించిన పానశాల రచనపై ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు హనుమారెడ్డి, ప్రొద్దుటూరునుంచి వచ్చిన సుప్రసిద్ధ అవధాని నరాల రామారెడ్డి చక్కగా విశే్లషించారు. నెల్లూరు జిల్లా ప్రజల జీవితాలతో పెనవేసుకున్న జమీన్‌రైతు పత్రిక ఆవిర్భావం, వికాసంపై ప్రముఖ రచయిత పెరుగు రామకృష్ణ విశే్లషణాత్మకంగా వివరించారు.
ఆకట్టుకున్న పాదయాత్ర
ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తికలిగించేలా పుస్తక ప్రియులు దాదాపు 500 మంది నెల్లూరులోని బోసుబొమ్మ సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ మీదుగా విఆర్‌సి మైదానం వరకు నిర్వహించారు. ఈ పాదయాత్రకు ప్రముఖ పత్రికా సంపాదకుడు కె రామచంద్రమూర్తి నాయకత్వం వహించారు. అనంతరం జరిగిన సభలో ఎమెస్కో సంస్థ ప్రచురించిన అర్థం కోసం అనే్వషణ పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రముఖ సాహితీవేత్త వాడ్రేవు చిన వీరభద్రుడు విశే్లషించారు. అలాగే వేదం వెంకటరాయశాస్ర్తీ, పఠాభి, మరుపూరు కోదండరామిరెడ్డి, పొణకా కనకమ్మ వంటి సాహితీవేత్తల సేవలు కొనియాడుతూ వక్తలు ప్రసంగించారు.
పుస్తక సంబరాలకు విచ్చేసే ప్రతి ఒక్కరికీ ఎమెస్కో సంస్థ ఒక బుక్‌లవర్స్ కార్డు కూపన్‌ను ఉచితంగా అందజేస్తున్నారు. అందులో సందర్శకుల పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ రాసి బాక్స్‌లో వేయాలి. ప్రతిరోజూ 8 గంటలకు ప్రముఖ వ్యక్తులతో డ్రా తీసి అందులో నలుగుర్ని విజేతలుగా ఎంపిక చేస్తారు. మొదటి బహుమతిగా ఐదువేలు, రెండో బహుమతిగా రెండువేలు, మూడో బహుమతిగా వెయ్యిరూపాయలు, నాలుగో బహుమతిగా 500 రూపాయలు (పదిమందికి) ఇస్తారు. ఈ విజేతలు స్టాల్స్‌లో ఆ విలువకు దగ్గ పుస్తకాలు ఎమెస్కో స్టాల్‌లో పొందవచ్చు. దీని ద్వారా ఎంతమంది పుస్తకాల ఎగ్జిబిషన్‌ను సందర్శించారో తెలుసుకోవడం, రెండోది ప్రజలను పుస్తక పఠనానికి ఆకర్షించడంగా నిర్వాహకులు ఈ పద్ధతి ఎంచుకున్నారు. మొదటిరోజు 2,100 మంది సంబరాలను తిలకించారు. రెండోరోజు 2,500 మంది సందర్శించారు. సుమారు నాలుగువేల మంది బుక్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారని ఎమెస్కో బుక్‌స్టాల్ నిర్వాహకులు విజయకుమార్ తెలిపారు. ప్రముఖ రచయిత పెరుగురామకృష్ణ నవ్యాంధ్ర పుస్తక సంబరాల సాంస్కృతిక కార్యక్రమాల కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. బుక్ ఎగ్జిబిషన్ జరిగేచోట ప్రతిరోజూ సాయంత్రం ఆయా రంగాల్లో లబ్దప్రతిష్టులతో నెల్లూరుతో పెనవేసుకున్న సాహితీప్రముఖుల గురించి చర్చలు, ఉపన్యాసాలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. తిక్కన కవితారీతులు, దువ్వూరి రామిరెడ్డి, జమీన్ రైతు పత్రికవంటి అంశాలను ఎంపిక చేసుకుని వారి విశిష్టతను సాహితీ వేత్తలకు, నెల్లూరు ప్రజలకు తెలియజేయడంలో సఫలీకృతులయ్యారు. బుక్‌స్టాల్స్‌లో అన్ని రకాల పుస్తకాలు లభించడంతో రాజమండ్రి నుంచి పరిశోధనా విద్యార్థులు ఎందరో వచ్చి పుస్తకాలు కొనుగోలు చేసుకుని వెళ్లారు.

ఆకట్టుకుంటున్న
చరిత్ర పుస్తకాలు

విఆర్‌సి మైదానంలో ఏర్పాటు చేసిన పుస్తకాల దుకాణాల్లో పల్లవి పబ్లికేషన్స్, మణి బుక్ సెంటర్‌లలో ఆంధ్రభూమి ఎడిటర్ ఎం.వి.ఆర్ శాస్ర్తీ రచించిన చరిత్ర, స్వాతంత్య్ర సమరయోధులు, ఉన్నమాట, వీక్‌పాయింట్, నేటి చరిత్ర, విప్లవవీరులు, 1857, జవహర్‌లాల్‌నెహ్రూ, ఇదీ చరిత్ర, భగత్‌సింగ్ జీవిత చరిత్రను తెలిపే పుస్తకాలు విద్యార్థులు, యువత, సేవా దృక్పథం కలిగిన యువకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పుస్తక ప్రదర్శనకు వచ్చిన వారందరూ ఈ పుస్తకాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు.
93 స్టాల్స్
నవ్యాంధ్ర పుస్తక సంబరాల సందర్భంగా నగరంలోని విఆర్‌సి మైదానంలో ఏర్పాటు చేసిన పుస్తక దుకాణాల్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అవసరమైన రకరకాల పుస్తకాలు, సిడిలు, సైన్స్ పరికరాలను అందుబాటులో ఉంచారు. మొత్తం 93 స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా, ప్రతి స్టాల్‌లో ప్రత్యేకమైన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. వీటిలో ఆధ్యాత్మికం, సాంస్కృతికం, ఆటలు, పాటలు, కంప్యూటర్ విద్య, సాంకేతిక, సైన్స్, తదితర అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. విద్యార్థులకు విద్యను అందించే సిడిలను అమ్మకాలకు ఉంచారు. ఈ సిడిల్లో పాఠ్యాంశాలు ఉదాహరణలతో సహా ఓ అధ్యాపకుడు బోర్డుపై వివరిస్తున్న దృశ్యాలు పొందుపరచి ఉన్నాయి.

సందర్శకుల మాట...

ఎంతో బాగుంది
ఇంతవరకు ఇంత భారీస్థాయలో నెల్లూరులో పుస్తక ప్రదర్శన ఏర్పాటుచేయడం చూడలేదు. పుస్తకాలు ఒకదానిమించి మరొకటి ఉన్నాయి. ఎమి కొనుగోలు చేయాలో తర్కించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అన్నీ బాగున్నాయి. వివిధ పబ్లిషర్స్ అందిస్తున్న ప్రచురణలు అన్నీ ఒకచోటే ఉండడం బాగుంది. నిర్వహణ అద్భుతం. ముఖ్యంగా పల్లవి పబ్లికేషన్స్ స్టాల్‌లో ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవిఆర్ శాస్ర్తీ రాసిన భగత్‌సింగ్, ఉన్నమాట పుస్తకాలు నన్ను ఆకర్షించాయి.
- కాంతి, గృహిణి

నిజంగా సంబరాలే
నిజంగా అద్భుతం. నెల్లూరు పుస్తక ప్రియులకు నిజంగా పండగే. అన్ని రకాల పుస్తకాలు ఒకచోటే దొరకడం అరుదైన సంఘటన. చాలా బాగుంది. ఇది జ్ఞాన యజ్ఞంలా ఉంది. నిర్వహణ తీరు అద్భుతం.
- పడకళ్ల ప్రసాద్, బంగారు వ్యాపారి

నమ్మలేకున్నా..
ఇన్ని పుస్తకాలు ఒకే చోట అమ్మకం అనే అంశం నాకు తెలిసినంతవరకు నెల్లూరులో ఇదే మొదటి సారి. చాలా బాగుంది. అన్ని వర్గాల వారికీ అవసరమైన విజ్ఞానం లభించే పుస్తకాలు ఒకచోటే లభిస్తున్నాయి. పైగా రాయితీ కూడా కల్పించడం అభినందనీయం
- బిసి కృష్ణారెడ్డి, రిటైర్డ్ లెక్చరర్, నెల్లూరు

తరలివచ్చిన విజ్ఞానం
నెల్లూరులో పుస్తకాల సంబరాలు జరపడం ముదావహం. విజ్ఞాన భాండాగారం తరలి వచ్చిందా అనిపిస్తోంది. ఎక్కడ చూసినా పుస్తక ప్రియులే. ఎవరి చేతిలో చూసినా పుస్తకాలే. చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో సాయం వేళ పుస్తకాలు చూసుకుని అందులో నచ్చిన వాటిని కొనుగోలుచేశాను. టివిలకు అతుక్కుపోకుండా పుస్తక పఠనం అలవర్చుకుంటే విజ్ఞానం పెరుగుతుందని నా అభిప్రాయం.
- ఆర్ శ్రీనివాసులు, విఆర్ డైట్ లెక్చరర్

రాబోయే తరాలకు గుర్తుగా...
రాచర్ల పాడు నుంచి వచ్చాను. పుస్తక ప్రదర్శన చాలా బాగుంది. తనకు పురాణాలు, ఆధ్యాత్మిక అంశాలంటే ఇష్టం అటువంటి పుస్తకాల స్టాల్స్ సందర్శించి రెండు పుస్తకాలు కొన్నాను. ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. రాబోయే తరానికి పుస్తకమే గుర్తుగా ఉంటుందని పుస్తకాలు కొనడానికి వచ్చాను. ఎక్కువ ధర పెట్టి పెద్ద పెద్ద పుస్తకాలు కొనలేకపోయినా నా అభిరుచికి తగ్గట్టు ఒకటి రెండు చిన్న పుస్తకాలు కొనుగోలు చేశాను.
- ప్రభాకర్ నాయుడు, వ్యవసాయదారుడు

అన్నీ ఒకచోటే
నెల్లూరులో పండగ వాతావరణం నెలకొంది. పుస్తక ప్రియులు ఎంతో ఇష్టంగా ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తున్నారు. నేను నా కుటుంబ సభ్యులతో వచ్చాను. ఎవరికి కావాల్సిన పుస్తకాలు వారు కొనుగోలు చేశారు. రాయితీ కల్పించడం వల్ల మరో పుస్తకం కూడా కొనుగోలుచేయాలనిపించింది.
- విఠపు లక్ష్మి , గృహిణి

అరుదైన పుస్తకాలు
నెల్లూరులో పుస్తక ప్రదర్శన జరుగుతోందని మిత్రుని ద్వారా తెలుసుకుని వచ్చాను. వివిధ పబ్లిషర్స్ వారి ప్రచురణలు అమ్మకాలకు పెట్టి రాయితీ ఇవ్వడం బాగుంది. అరుదైన పుస్తకాలు లభిస్తున్నాయి. నాకు కావాల్సిన పుస్తకం హైదరాబాద్‌లో కూడా లభించలేదు. ఈ పుస్తక సంబరాల్లో లభించింది. చాలా సంతోషంగా ఉంది.
- దినకర్ (హైదరాబాద్),
బిటెక్ సెకండియర్

విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు ఈ బుక్‌స్టాల్స్‌లో లభిస్తున్నాయి. చాలా బాగుంది. కంప్యూటర్ కోర్సు చేసే విద్యార్థులకు ఉపయుక్తమైన పుస్తకాలు లభిస్తున్నాయి. నాకు కావాల్సిన పుస్తకాలు దొరికాయ.
- ఎస్‌కె యాస్మిన్, విద్యార్థిని
ఎంఎస్‌సి కంప్యూటర్స్

500మంది పబ్లిషర్లు
ఒక మంచి సంకల్పంతో నెల్లూరులో బుక్ ఎగ్జిబిషన్‌ను నవ్యాంధ్ర పుస్తక సంబరాలు పేరిట ఏర్పాటుచేశాం. తొమ్మిదిరోజులపాటు ఈ సంబరాలు నిర్వహించాం. దాదాపు 90 స్టాల్స్ ఏర్పాటుచేశాం. ఇందులో ప్రభుత్వం తరఫున డ్వాక్రా, సెట్విన్ తదితర విభాగాలకు 20స్టాల్స్ కేటాయించగా మిగతావి పబ్లిషర్స్‌కు కేటాయించాం. దాదాపు 500 మంది పబ్లిషర్లు వారి ప్రచురణలు నెల్లూరు పుస్తకప్రియులకు అందుబాటులో ఉంచారు.
- ఎబిఎస్ సాయిరామ్
బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి

భాషా సాహిత్యాల పరిచయం
భాష సాహిత్యాన్ని పరిచయం చేయడం ఈ సంబరాల ప్రధాన ఉద్దేశం. యువతను పుస్తక పఠనంవైపు ఆకర్షించాలని ఈ ప్రయత్నం. పుస్తక సంబరాలను తిలకించడం వల్ల యువతలో సామాజిక స్పృహ కలుగుతుంది. సాహిత్యంపై అభిలాష కలుగుతుంది. భావితరాలకు మంచి సందేశం ఇస్తుంది.
- పెరుగు రామకృష్ణ, రచయత
కన్వీనర్, పుస్తక సంబరాలు

- పీసపాటి సంపత్‌కుమార్, 9347109377