శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పాలకుల నిర్లక్ష్యం-విద్యార్థులకు శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, నవంబర్ 29: పాలకుల నిర్లక్ష్యంతో జిల్లావాసుల ఆశలు ఆవిరైపోతున్నాయి. తాజాగా నెల్లూరులోని ఏసి సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో 2017-18 విద్యా సంవత్సరానికి గాను ఉన్న 150 మెడికల్ అడ్మిషన్లను రద్దు చేస్తూ భారత వైద్యమండలి (ఎంసిఐ) ఉత్తర్వులు జారీ చేసింది. 2014వ సంవత్సరంలో 150 సీట్లతో వైద్య కళాశాల ప్రారంభమైంది. అప్పటి నుంచి సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 150 మంది వైద్య విద్యార్థులకు సంబంధించి కళాశాలలో సరైన సదుపాయాలు లేవని ఎంసిఐ తనిఖీల్లో తేలింది. బోధనా సిబ్బంది కొరత, వౌలిక వసతుల లేమి, అనుబంధ ఆసుపత్రుల్లో తీసికట్టుగా ప్రమాణాలు తనిఖీల్లో బట్టబయలయ్యాయి. వసతుల లేమి నేపధ్యంలో ఎంసిఐ 2017-18 విద్యా సంవత్సరానికి గానూ ఉన్న 150 మెడికల్ అడ్మిషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్ల నుంచి వైద్య కళాశాల పురోగతి అంతంతమాత్రంగా ఉన్నా పాలకులు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా మంత్రిగా ఉన్న నారాయణ ప్రభుత్వం వైద్య కళాశాల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న తీవ్ర విమర్శలు వినవస్తున్నాయి. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా దీనిపై దృష్టి పెట్టకపోవడంలో కళాశాల ప్రారంభమై రెండేళ్లయినా పురోగతి కన్పించడం లేదు. ఈ పరిస్థితుల్లో భారత వైద్యమండలి వచ్చే ఏడాది మెడికల్ అడ్మిషన్లు రద్దు చేసింది. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా ఉన్న చాట్ల నరసింహారావును మంత్రి నారాయణ నామమాత్రంగా నియమించారే తప్ప హాస్పిటల్, వైద్య కళాశాల అభివృద్ధికి ఇప్పటిదాకా వారు సాధించింది ఏమీ లేదు. అదేవిధంగా వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను ఇప్పటివరకు భర్తీ చేయకపోవడంతో చాలామంది విద్యార్థులు కూడా ప్రభుత్వ కళాశాలలో చేరేందుకు సుముఖత చూపలేదు. ఇదిలావుంటే ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత, ల్యాబ్‌లు, ఆపరేషన్ థియేటర్లు సరిగా లేవని భారత వైద్యమండలి పరిశీలనలో తేలింది. అయితే జిల్లాలో ఓ ప్రైవేటు వైద్య కళాశాల ఉండటంతో ఒక పథకం ప్రకారం ప్రభుత్వ వైద్య కళాశాల అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుండి నెల్లూరులో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ఎంతోమంది నాయకులు పోరాటం చేసినా ఫలించలేదు. ఈనేపథ్యంలో జిల్లాకు ఎలాగైనా ప్రభుత్వ వైద్య కళాశాలను సాధించాలని ఆనం కుటుంబం పట్టుబట్టడంతో ఎట్టకేలకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దానిని మంజూరు చేశారు. ఆనం కుటుంబం పుణ్యమా అంటూ జిల్లాకు వైద్య కళాశాల మంజూరైనా దానిని వినియోగంలోకి తెచ్చేందుకు ఇప్పటి పాలకవర్గం మాత్రం ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి వేస్తూ వస్తోంది. దీంతో వైద్య కళాశాలలో సరైన వసతులు లేవని ఓ నిర్ధారణకు వచ్చిన ఎంసిఐ వచ్చే ఏడాది అడ్మిషన్లను రద్దు చేసింది. ఇప్పటికైనా వైద్య కళాశాలకు కావాల్సిన వౌలిక వసతులు కల్పించి అడ్మిషన్లు పునరుద్ధరించేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది.
అడ్మిషన్లు రాబడతాం
ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమూర్తి శాస్ర్తీ
రద్దు అయిన సీట్లను తిరిగి రాబడతామని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ కృష్ణమూర్తి శాస్ర్తీ తెలియచేశారు. ఎంసిఐ సూచించిన ప్రమాణాలను ఫిబ్రవరి నెలఖారులోపు పెంచి వారికి నివేదిస్తామన్నారు. అనంతరం అడ్మిషన్లకు ఎంసిఐ గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
* ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి డిమాండ్
నెల్లూరు, నవంబర్ 29: రాష్ట్రంలో 10 శాతానికి పైగా ఉన్న ఆర్యవైశ్యుల కోసం ఇతర కులాలకు ఏర్పాటు చేసిన విధంగా ప్రత్యేక ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల్లో 70 శాతం వరకు నిరుపేదలుగా, దుకాణాల్లో నెలవారీ జీతాలకు పనిచేస్తున్నారని, అటువంటి వారికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు కార్పొరేషన్ ఏర్పాటు ఎంతో సహకరిస్తుందన్నారు. తమకు ఎటువంటి రాయితీలు అక్కర్లేదని, కార్పొరేషన్ ఏర్పాటుచేసి రూ.1000 కోట్ల మూలధనాన్ని ఏర్పాటుచేస్తే చాలని, తామే ఆ మూలధనాన్ని రెండింతలు చేయగలమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఆర్యవైశ్య సంఘాల సహకారం కోరిన ముఖ్యమంత్రి, ఇతర కులాల సమస్యలు తీరుస్తున్న విధంగా తమకు కూడా న్యాయం చేస్తారనే నమ్మకం తమకుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే జనవరి నెలలో గుంటూరులో లక్ష మంది వైశ్యులతో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికతో సిద్ధమయ్యామన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్‌ను అంగీకరించి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తే సభాముఖంగా ముఖ్యమంత్రిని సత్కరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తమ న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించకుంటే త్వరలో జరగబోయే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చూపేందుకు కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా ఆర్యవైశ్య మహాసభ ద్వారా నెల్లూరు నగరంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, త్వరలో వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని జిల్లా సంఘాలను కోరుతూ, రాష్ట్ర శాఖ తరపున రూ.లక్ష సహాయం కూడా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నగర డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ అర్బన్ ఆర్యవైశ్య సంఘం తరపున నెల్లూరు నగరంలో నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలను చేశామని, భవిష్యత్తులో తమ సేవలను మరింత విస్తృతపరుస్తామని ఆయన వెల్లడించారు.

బ్యాంకుల్లో నగదు గోల
ఎస్‌బిఐ అధికారులతో ఖాతాదారుల వాగ్వాదం
సూళ్లూరుపేట, నవంబరు 29: వారం రోజుల నుండి బ్యాంకుల్లో నగదు లేదు.. కేవలం డిపాజిట్‌లు మాత్రమే స్వీకరిస్తామని బోర్డులు పెట్టారు. మంగళవారం ఇదే బోర్డులు కనిపించడంతో ఖాతాదారులు ఆగ్రహంతో బ్యాంకు అధికారులతో వాగ్వివాదానికి దిగడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఎస్‌బిఐలో వారం రోజుల నుండి నగదు ఇవ్వకపోవడంతో ప్రతి రోజు వచ్చి ఖాతాదారులు తిరుగుముఖం పడుతున్నారు. మంగళవారం ఉదయం కొందరు బ్యాంకు ఖాతా పుస్తకాలు చేతపట్టుకొని నగదు తీసుకోవాలని కౌంటర్ వద్దకు వెళ్లారు. నగదు లేదు డిపాజిట్‌లు మాత్రమే తీసుకొంటున్నామని కౌంటర్‌లో సమాధానం చెప్పడంతో ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు. నగదు లేదు ఇంకా రాలేదు వస్తే ఇస్తామని సమాధానం చెప్పడంతో తమ ఖాతాలో ఉన్న నగదు ఇచ్చేందుకు ఎందుకు లేదు, ఎందుకు ఇవ్వరంటూ ఎదురు ప్రశ్నలు వేసి వాగ్వివాదానికి దిగారు. దీంతో చేసేదేమిలేక కౌంటర్‌లో ఉన్న సిబ్బంధి మేనేజర్ దగ్గరకు వెళ్లమని చెప్పారు. వెంటనే మేనేజర్ గది వద్దకు వెళ్లి బయకు రావయ్యా ఎందుకు నగదు లేదు మా ఖాతాలో ఉండేది అడుగుతున్నాం, ఇదేందంటూ ఆందోళనకు దిగారు. మేనేజర్ బయటకువచ్చి శాంతించండి ఎక్కడా డబ్బులు లేనందున నగదు ఇవ్వలేమని, వచ్చిన వెంటనే అందరికీ ఇస్తామని సమాధానం చెప్పారు. దీంతో అక్కడున్న కొందరు తమ ఇంట్లో పెళ్లి వేడుకలకు మీరు ఇస్తారా.. మోదీ ఇస్తారా అంటూ నిలదీశారు. మా డబ్బు మాకు ఇచ్చేందుకు ఎందుకు లేదు.. రోజు ఇదే సాకు చెప్పి తిప్పించుకొంటున్నారంటు మేనేజర్‌తో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఒక్కసారిగా బ్యాంకు ఆవరణ అంతా ఉద్రిక్తతగా మారడంతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై గంగాధర్‌రావు తన సిబ్బందితో బ్యాంకు వద్దకు చేరుకుని ఖాతాదారులకు సర్దిచెప్పి మేనేజర్‌తో మాట్లాడించి శాంతింప చేశారు.

మెరుగైన వైద్యం అందిస్తాం
పరికరాల కొనుగోలుకు కోటి 67 లక్షల నిధులు
* కలెక్టర్ ముత్యాలరాజు వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, నవంబర్ 29: నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి కోటీ 67 లక్షల రూపాయలను వివిధ పరికరాల కొనుగోలుకు నిధులు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు వెల్లడించారు. మంగళవారం కలెక్టర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆఫ్తమాలజీ డిపార్టుమెంట్‌కు కావలసిన పరికరాలను సమకూర్చుతున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు, సిబ్బంది రెండుపూటల బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేయాలన్నారు. ఎవరైతే బయోమెట్రిక్ విధానంలో రెండుపూటల హాజరుపట్టీలో నమోదు చేసుకోరో వారి జీతాలను నిలిపివేస్తామన్నారు. తప్పనిసరిగా డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ విధానంలో హాజరును నమోదు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన సిసి కెమేరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిసి కెమేరాలను తప్పనిసరిగా రోగులను డాక్టర్లు చూసే గదిలో కనబడే విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సదరం కార్యక్రమం కింద దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలను జారీచేసే విభాగాన్ని తనిఖీ చేశారు. వారం రోజుల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటిని క్రోడీకరించి లబ్ధిదారులకు జారీ చేయాలన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం ఇస్తున్న పింఛను మంజూరు చేయాలంటే తప్పనిసరిగా సదరం కార్యక్రమం కింద సర్ట్ఫికెట్ అవసరమవుతుందని, ఈ విషయంపై అశ్రద్ధ చేయకుండా ఎప్పటికప్పుడు జారీ చేయాలన్నారు. నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఇ-ఇసుపత్రిగా చేయటానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలియజేశారు. నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఇ-ఆసుపత్రిగా చేసినట్లయితే ఏదైనా రోడ్డు ప్రమాదాలుగాని, ఇతర ప్రమాదాలు గాని జరిగినప్పుడు రక్తం అవసరమైతే, ఆ విషయాన్ని సంబంధిత బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి ప్లాష్ అవుతుందని, ఈ రక్తాన్ని వారు ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి బాధితుల ప్రాణాలు కాపాడటానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న బ్లడ్ బ్యాంక్‌ను తనిఖీ చేశారు. ఆయన అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో వివిధ అంశాలపై సూచనలిచ్చారు. బ్లడ్‌బ్యాంక్ రికార్డులలో రక్తం ఇచ్చినప్పుడు తేదీని, సమయాన్ని నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్‌టిఆర్ ఆరోగ్య పథకం డెస్క్‌ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత సిబ్బంది తప్పనిసరిగా రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. ఆఫ్తమాలాజీ, డ్రసింగ్, స్కానింగ్ విభాగాలతో పాటు జనరల్ వార్డు పరిశీలించారు. అంతరాయం లేకుండా రోగులకు సేవ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బయోమెట్రిక్ విధానానికి కావలసిన యంత్రాలను ఏర్పాటు చేయాలని ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మలమ్మను ఆదేశించారు. రోగులకు ఇచ్చే ఆహార మెనూను పరిశీలించిన కలెక్టర్ రోగులతో మాట్లాడారు.

నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించండి
* వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు సిఎం ఆదేశం
వేదాయపాళెం, నవంబర్ 29: నగదు రహిత లావాదేవీలపై గ్రామస్థాయి నుంచి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సిఎం చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లు, బ్యాంకు అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీల పట్ల చిన్న వ్యాపారులకు, ప్రజలకు కలిగే ఉపయోగాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ ప్రక్రియలో ప్రధానంగా అవసరమైన పాస్ మిషన్లు, విద్యాసంస్థలు, డ్వాక్రా, చౌకధరల దుకాణాలు, కమర్షియల్, రైతుబజార్లు, తదితర వ్యాపార సంస్థల ద్వారా పాస్ మిషన్లను ఏర్పాటుచేసి నగదు రహిత లావాదేవీలు పూర్తిస్థాయిలో జరిగేలా చూడాలని సూచించారు. ప్రధానంగా పట్టణాలు, గ్రామాలలో ఎక్కడ ఎక్కువగా కొనుగోలు చేస్తారో అటువంటి షాపుల దగ్గర పాస్ మిషన్స్ పెట్టి నగదు రహిత లావాదేవీలు జరిగేలా చూడాలన్నారు. మొబైల్, బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ ద్వారా నిర్వహించేలా చూడాలన్నారు. నగదు రహిత లావాదేవీలపై విస్తృత ప్రచారం నిర్వహించి ప్రతిరోజూ ఈ ప్రక్రియపై తీసుకున్న ఏర్పాట్లకు సంబంధించిన నివేదికలు జిల్లాలవారీగా అందచేయాలన్నారు. ప్రజలలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి నగదు రహిత లావాదేవీల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేలా బ్యాంక్ అధికారులు, జిల్లా కలెక్టర్లు సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జెసి ఇంతియాజ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్రావ్, డిఆర్‌డిఏ, హౌసింగ్, డ్వామా పిడిలు లావణ్య, హరిత, రామచంద్రారెడ్డిలతోపాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నెల్లూరు మున్సిపల్ కమిషనర్ బదిలీ
నెల్లూరు సిటీ, నవంబర్ 29: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సిసిఎల్‌ఎ కార్యాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న సాములూరు హరీష్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కమిషనర్ వెంకటేశ్వర్లును సిడిఎంఎ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు అందాయి.

మాటల మాంత్రికుడ్నికాదు.. చెప్పిందే చేస్తాను
* ప్రజల సమస్యలను పరిష్కరించేది టిడిపియే
* జనచైతన్య యాత్ర ముగింపు సభలో మంత్రి నారాయణ
వేదాయపాళెం, నవంబర్ 29: రాష్ట్రంలో నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు జిల్లా మంత్రికి అనుభవం లేదని ప్రతిపక్ష పార్టీ నేతలు అంటున్నారని, కాని తాను మాటల మాంత్రికుడ్ని కాదు.. చెప్పిందే చేస్తానని మున్సిపల్‌శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. జనచైతన్య యాత్రల ముగింపు సందర్భంగా మంగళవారం నగరంలో పాదయాత్ర, బహిరంగ సభ నిర్వహించారు. స్థానిక విఆర్‌సి కూడలి నుంచి మంత్రి నారాయణ, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు, నర్తకి సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన జనచైతన్య యాత్ర ముగింపు సభలో మంత్రి నారాయణ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు జనచైతన్య యాత్రల ద్వారా వివరించామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో 50 శాతం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. రాష్ట్రం గడ్డుకాలంలో ఉన్నా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 70 శాతం పూర్తిచేసిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. జిల్లాలో ప్రధానంగా తాగునీరు, మురుగునీటి సమస్యను రూపుమాపేందుకు కేంద్రం, రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి జిల్లాకు రూ.1100 కోట్లు నిధులు తెచ్చిన తనకా అనుభవం లేనిది అంటూ ప్రశ్నించారు. నగరంలో సైడుకాలువలు లేక ప్రజలు అంటురోగాల బారిన పడుతున్న నేపథ్యంలో కేంద్రాన్ని ఒప్పించి అండర్ గ్రౌండ్ డ్రైనేజిని తీసుకువచ్చిన తనకు ఏమి అనుభవం కావాలని ప్రతిపక్ష పార్టీని సూటిగా ప్రశ్నించారు. 50 వేల మందికి నెలకు జీతాలు ఇస్తూ వారి జీవనోపాధికి తోడ్పాటునందిస్తున్నాను, మీరు ఎంత మందికి జీతం ఇచ్చి పోషిస్తున్నావని వైసిపి నేత జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. అనుభవం అంటే ప్రజలను పక్కదోవ పట్టించడం కాదు ప్రజల సమస్యలను తీర్చడమని ఎద్దేవా చేశారు. రైతులకు మూడుసార్లు రుణమాఫీ చేసిన ఘతన టిడిపికే దక్కుతుందన్నారు. 2009లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రుణమాఫీ అవసరం లేదని చెబితే చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉన్నా కేంద్రంతో పోరాడి రుణమాఫీ చేయించారన్నారు. కాలువ కట్టలపై నివసిస్తున్న పేదప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేయడం తప్పా వైసిపి నాయకులకు ఏమీ చేతకాదన్నారు. కాలువ కట్టలపై ఉన్న ప్రజలు 5వేల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేషన్ కోర్సును ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ కోర్సులను ప్రారంభించామన్నారు. పేద ప్రజలకు ఒక్కపైసా ఖర్చులేకుండా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేవిధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. పిహెచ్‌సిలను కూడా త్వరలో మోడల్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లా మంత్రిగా నగరంలో ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా వైసిపి నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రతి గ్రామం, మండలంలో జనచైతన్యయాత్రలు నిర్వహించి ప్రజల అవసరాలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేసేదిశగా ముందుకు వెళుతున్నామన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చంద్రబాబు చేస్తున్న కృషిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. దేశంలో ఏ ప్రభుత్వమైనా రూ.15లు కడితే రూ.5లక్షలు ప్రమాద బీమా ఇస్తోందా అని వైసిపిని నిలదీశారు. ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు ప్రమాద బీమాను ఏర్పాటు చేసిందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి బిడ్డల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంటే దానిని కూడా విమర్శించడం దారుణమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు ఆరోగ్యశ్రీ గురించి విమర్శలు చేయలేదన్నారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలు లబ్ధి పొందుతున్నారు లోపాలు సరిదిద్దమన్నాం. ఆరోగ్యశ్రీ కంటే గొప్పగా ఎన్టీఆర్ వైద్యసేవ తీసుకువస్తే మీరు విమర్శలు చేయడం తగదన్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ అమరావతికి భూసేకరణలో రైతులను నొప్పించకుండా రైతులను ఒప్పించి 33వేల ఎకరాల భూమిని సేకరించిన ఘనత చంద్రబాబుకు, మంత్రికి దక్కుతుందన్నారు. అభివృద్థిలో ముందుకు దూసుకెళ్తున్న టిడిపిని అడ్డుకోవడమే వైసిపి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ప్రజల పార్టీగా ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే టిడిపి ధ్యేయమన్నారు. నగర ఇన్‌చార్జి ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ టిడిపి చేపడుతున్న సంక్షేమ పథకాలను ఓర్వలేక వైసిపి నాయకులకు అసత్య ప్రచారాలు చేయడమే అలవాటుగా మారిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలకు రూ.10వేలు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వైసిపి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకే జనచైతన్యయాత్రలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం టిడిపి రాష్ట్ర పరిశీలకులు నరసింహయాదవ్, ఆనం జయకుమార్‌రెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, కొండ్రెడ్డి రంగారెడ్డి, మాజీ మంత్రి రమేష్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు ప్రసంగించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్ని అలరించాయి. లిటిల్ ఏంజిల్స్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అమరావతి నిర్మాణంపై చేసిన నృత్యం చూపురులను ఆకట్టుకుంది. అలాగే పాదయాత్రలో పలు సంక్షేమ పథకాలను గుర్తుగా శకటాలు ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు ఆనం రంగమయూర్‌రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆర్‌కెటి శేషయ్య, మొయినుద్దీన్, సీనియర్ నాయకుడు రమణారెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డితోపాటు కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అభివృద్ధిని పక్కనపెట్టి ఆరోపణలు చేయడం తగదు
* పంట సంజీవినిలో అన్నీ అక్రమాలే
* ధైర్యం ఉంటే దోషిగా నిరూపించు
* సోమిరెడ్డికి కాకాణి సవాల్
వేదాయపాళెం, నవంబర్ 29: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కనపెట్టి ప్రతిపక్ష పార్టీపై ఆరోపణలు చేయడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టుకున్నారని, అది తగదని వైకాపా జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నగరంలోని మాగుంట లేఅవుట్‌లో ఉన్న వైకాపా జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేఖరుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోదీ నిర్ణయంతో దేశ ప్రజలు గత 20 రోజులుగా నానా అవస్థలు పడుతున్నారన్నారు. పెద్దనోట్ల రద్దుపై ప్రజలకు న్యాయం జరిగేలా జిల్లాలో సోమవారం బంద్ నిర్వహిస్తుంటే జిల్లాలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ మంత్రులు ప్రజలను పరామర్శించాల్సిందిపోయి వైసిపి నేత జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలుగుదేశం పార్టీ చేపడుతున్న అభివృద్థి పనులను వైసిపి అడ్డుకుంటోందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసిపి ఎప్పుడూ అభివృద్ధిని అడ్డుకోదన్నారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భారీగా అక్రమాలకు పాల్పడింది టిడిపి నాయకులు కాదా అని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు పంట సంజీవిని గుంతలను తవ్వడం, బిల్లులు డ్రా చేసుకోవడం మరలా ఆ గుంతలను పూడ్చివేయడం ఇదే పనిగా పెట్టుకున్నారన్నారు. ఈ విషయంలో స్థానిక ఎంపిడివోకు ఫిర్యాదు చేయడంతో ఆయన నోటీసులు కూడా జారీ చేయలేదా అని ప్రశ్నించారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపణలు చేయడంలో ముందుంటారన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించి వారిని అన్నివిధాలుగా ఆదుకుని ఉంటే సొంత నియోజకవర్గంలో మిమ్మల్నే ఎన్నుకుని ఉండేవారన్నారు. మీ కుటుంబ సభ్యులే పత్రికా సమావేశం ఏర్పాటుచేసి మీరు చేస్తున్న అక్రమాలను బయటపెడుతున్నారంటే ఇది చాలు మీ నీఛ రాజకీయానికి నిదర్శనమన్నారు. కాకాణి అవినీతిపరుడు, భూకబ్జాలు చేస్తున్నారని విమర్శలు చేయడం కాదు, అధికారం మీ చేతుల్లో ఉంది, దమ్ముంటే భూకబ్జా చేసినట్లు రుజువు చేయాలంటూ సవాల్ విసిరారు. ఈకార్యక్రమంలో వైసిపి బిసి సెల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, సురేంద్ర, రమణారెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.