శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జిల్లావాసుల గుండెల్లో వార్ధా తుపాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 10: రోజురోజుకి తీరాన్ని సమీపిస్తున్న వార్ధా తుఫాన్ భయంతో జిల్లావాసులకు కంటి మీద కునుకు లేని పరిస్థితి నెలకొంది. ఈనెల 8న అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేణా బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం వార్ధాగా నామకరణం చేసుకున్న ఈ తుఫాన్ నెల్లూరుకు ఆగ్నేయంగా సుమారు 780 కిమీ దూరంలో కేంద్రీకృతమై, దక్షిణ దిశగా పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం రాత్రి గంటకు 22 కిమీ వేగంతో కదులుతూ తీరం వైపు వస్తున్న ఈ తుఫాన్ ఆదివారం తెల్లవారుజాముకు వేగం పెంచుకునే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో ఆదివారం సాయంత్రం నుంచి నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నెల్లూరు-కావలి పట్టణాల నడుమ తుపాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఈ సమయంలో గంటకు 100 నుంచి 120 కిమీ వేగంతో భారీ గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ గాలుల తాకిడి ఆదివారం సాయంత్రం నుంచే మొదలవుతుందని, తొలుత గంటకు 70 కిమీ వేగం వరకు వీస్తూ తుపాన్ తీరాన్ని సమీపించేకొలదీ గాలుల వేగం తీవ్రరూపం దాలుస్తుందని అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ తెలియచేసిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం విస్తృత చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. తీరప్రాంత అధికారులందరినీ వారి కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కృష్ణపట్నం పోర్టులో ప్రమాద సూచికలను ఎగరవేసి మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, పోలీస్ తదితర శాఖల సిబ్బందిని రాబోయే 48 గంటల పాటు అందుబాటులో ఉండాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసి వారి సెలవులను సైతం రద్దు చేసినట్లు తెలిసింది. జిల్లాలోనే తీరం దాటనుందనే తాజా సమాచారంతో జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా తగు ఆదేశాలు జారీ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది అందరినీ ఆయా స్టేషన్ల పరిధిలో అందుబాటులో ఉండాలంటూ జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని ఇప్పటికే వౌఖికమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ తీరప్రాంత మండలాల్లో పర్యటిస్తున్నారు. శనివారం సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని పలు తీరప్రాంత గ్రామాల్లో తుపాన్ షెల్టర్లను ఆయన పరిశీలించారు. దీంతో పాటు అధికారులు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తచర్యలపై వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నవంబర్ నెల అంటేనే తుపాన్ నెలగా నెల్లూరు వాసులు భావిస్తుంటారు. గతంలోనూ పలు సందర్భాల్లో జిల్లాకు వచ్చిన తుపాన్ల తాకిడి ఎక్కువగా నవంబర్ నెలలోనే సంభవించాయి. ప్రస్తుతం కూడా నవంబర్ నెల పూర్తయిన వారం రోజుల వ్యవధిలో రెండు తుపాన్లు ఏర్పడడం, ఒక తుపాన్ తప్పిపోయిందని ఆనందపడేలోగా మరో భారీ తుపాన్ గండం జిల్లా వాసుల్ని భయపెడుతోంది.

ప్రతిఒక్కరికి ఆరోగ్య సంరక్షణ
* జనవరి 1 నుంచి ప్రారంభం
* ఎన్‌టిఆర్ వైద్యసేవ పరిధి విస్తృతం
* ఎమ్మెల్సీ బీద రవిచంద్ర వెల్లడి
నెల్లూరు, డిసెంబర్ 10: రాష్ట్రంలోని ప్రతిఒక్కరికి ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుందని ఎమ్మెల్సీ, టిడిపి జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర వెల్లడించారు. శనివారం జిల్లా టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా నేత జగన్మోహన్‌రెడ్డి ఎన్‌టిఆర్ వైద్యసేవలు నిరుపేదలకు అందడం లేదంటూ వ్యాఖ్యానించడం, ఆయన పిలుపు మేరకు వైకాపా వర్గాలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్ని నిర్వీర్యం చేసిన ఘనత జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని విమర్శించారు. ఆయన హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి కోట్లు దండుకునే అవకాశం కల్పించారని అప్పట్లోనే కాగ్ నివేదిక తప్పుబట్టిందన్న సంగతి గుర్తుంచుకోవాలని వైసిపి నేతలను ఎద్దేవా చేశారు. వైఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిలో కేవలం 274 రకాల వ్యాధులు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా భావించిన ఎన్‌టిఆర్ వైద్యసేవ పరిధిలో 1044 రకాల వ్యాధులు ఉన్నట్లు తెలిపారు. అప్పట్లో 260 ఆసుపత్రుల పరిధిలో వైద్యసేవలు జరిగేవని, ప్రస్తుతం విభజన ఆంధ్రప్రదేశ్‌లో 345 ఆసుపత్రుల్లో ఎన్‌టిఆర్ వైద్యసేవ అందుబాటులో ఉందన్నారు. దీనికితోడు ఉమ్మడి రాష్ట్రంలో రెండున్నరేళ్లలో వైఎస్ ఆరోగ్యశ్రీ కోసం రూ.1100 కోట్లు ఖర్చు చేశారని, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌లో రెండున్నరేళ్లలో తమ ప్రభుత్వం రూ.1860 కోట్లు ఖర్చు చేసిందన్నారు. పూర్తి వివరాలు తెలియక జగన్మోహన్‌రెడ్డి కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ధర్నాలు చేపడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలని కోరుతూ ప్రతిపక్ష నేతలు ధర్నాలు చేస్తే సబబుగా ఉంటుందని, ప్రభుత్వాసుపత్రుల్లో శస్తచ్రికిత్సలు చేయవద్దంటూ ధర్నాలు నిర్వహించడం ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికే చెల్లిందని ఎద్దేవా చేశారు. కార్పొరేషన్ టిడిపి ఫ్లోర్‌లీడర్ డాక్టర్ జెడ్.శివప్రసాద్ మాట్లాడుతూ హిస్టాక్టమి, అపెండిక్స్, హెర్నియా వంటి వ్యాధులకు శస్తచ్రికిత్సలను ప్రభుత్వాసుపత్రుల్లో నిర్వహించడం ద్వారా అక్కడ వైద్యసేవలను విస్తృతపరచి, ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ తరహా శస్తచ్రికిత్సలను అవసరం లేకున్నా చేయడం ద్వారా కొన్ని ఆసుపత్రుల యాజమాన్యం నిధులు దోచుకునే ప్రయత్నాలు చేస్తుంటే, ఆ చర్యలకు అడ్డుకట్ట వేయడానికే తమ నేత చంద్రబాబు ప్రభుత్వాసుపత్రుల్లో శస్తచ్రికిత్సలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారని వివరించారు. దీనివల్ల జగన్‌మోహన్‌రెడ్డికి వచ్చిన నష్టమేమిటో తమకు అర్థం కావట్లేదన్నారు. ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు, టిడిపి నేతలు చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, తాళ్లపాక అనూరాధ, నూనె మల్లికార్జునయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా అధికారులు ఉండాలి
* నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ హితవు
నెల్లూరు, డిసెంబర్ 10: కార్పొరేషన్ అధికారులు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు పనులు చేయాలని నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్ సూచించారు. శనివారం స్థానిక గాంధీబొమ్మ సమీపంలోని స్వతంత్రపార్కులో రూ.65 లక్షల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమారు 50 ఏళ్ల కిందట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్వతంత్ర పార్కు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని, 2014లో రూ.65 లక్షల నిధులు అప్పటి ప్రభుత్వం కేటాయించిందని, అయితే ఇప్పటికీ పనులు పూర్తికాలేదని అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్‌ను ప్రశ్నిస్తే కార్పొరేషన్ నుంచి నిధులు విడుదల కావడం లేదంటున్నారని, ఈ నిధుల్ని వెంటనే మంజూరు చేయాలని కార్పొరేషన్ అధికారులను డిమాండ్ చేశారు. కార్పొరేషన్‌లో ఎటువంటి పని జరగాలన్నా లంచం ఇవ్వనిదే జరిగే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు అడిగే నెలవారీ కమీషన్లను కట్టలేక ఎందరో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. శుక్రవారం అవినీతికి పాల్పడమంటూ ప్రమాణం చేసిన కార్పొరేషన్ అధికారులు ఆ ప్రమాణానికి కట్టుబడి ఉంటే తామెంతో హర్షిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, దేవరకొండ అశోక్, వైసిపి నేతలు వేలూరు మహేష్, దార్ల వెంకటేశ్వర్లు, వందవాశి రంగ, కొప్పోలు చంద్రశేఖర్, మున్వర్, సుధ, బాలయ్య, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయినులకు ప్రభుత్వ గుర్తింపు
నెల్లూరు, డిసెంబర్ 10: దేశంలోనే తొలిసారిగా మహిళా ఉపాధ్యాయులను ప్రత్యేకంగా గౌరవించే సంప్రదాయానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయమని మహిళా సహకార ఆర్థిక సంస్థ డైరెక్టర్ మల్లి నిర్మల శనివారం ఒక ప్రకటనలో హర్షం వెలిబుచ్చారు. ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావుపూలే భార్య సావిత్రిబాయి పూలే జయంతి అయిన జనవరి 3వ తేదిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం తన భర్తతో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత సావిత్రిబాయి సొంతమన్నారు. మహిళలకు విద్య నేర్పించేందుకు ఆమె ఎన్నో అవమానాలను సైతం భరించారని, సాంఘిక దురాచారాలపై ఆమె చేసిన పోరాటం నేటి మహిళా లోకానికి స్ఫూర్తివంతమని కొనియాడారు.

కోడిపందెం స్థావరాలపై నకిలీ పోలీసుల దాడి
రూ.లక్ష రూపాయలతో పరారీ
పోలీస్‌స్టేషన్‌లో బాధితుల పిర్యాదు
మనుబోలు, డిసెంబర్ 10: కోడిపందెం స్థావరాలపై నకిలీ పోలీసులు దాడులు చేసి సుమారు లక్ష రూపాయల పైబడి దోచుకుని ఉడాయించిన సంఘటన మండల పరిధిలోని కొమ్మలపూడి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరుకు చెందిన చెంచయ్య అలియాస్ ప్రసాద్, పైరజ్ అనే ఇద్దరు తమకు సంబంధించిన మేకలను శుక్రవారం చిల్లకూరు సంతలో లక్ష ఎనిమిది వేల రూపాయలకు విక్రయించారు. నెల్లూరులో ఉన్న కాపలావారికి జీతాలు, బియ్యం, సరకులకు రూ.8వేలు ఇచ్చారు. అటు తర్వాత గూడూరుకు తిరిగి స్వస్థలానికి బయలుదేరారు. కొమ్మలపూడి-చవటపాలెం సరిహద్దులో ప్రతి శుక్రవారం, బుధవారం కోడిపందెలు ఇన్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్నారు. దీంతో ప్రసాద్, ఫైరజ్‌లు కోడిపందెం వద్దకు వెళ్లారు. కోడిపందెం నిర్వహించే ఇన్‌ఫార్మర్‌ల సాయంతో నకిలీ పోలీసులు దాడులు చేయడం అక్కడ ఉన్నవారి వద్ద సొమ్ములను దోచుకుని వెళ్లడం పరిపాటిగా మారింది. ఇదే తరహాలో ప్రసాద్ వద్ద నుండి రూ.లక్ష రూపాయలు, ఫైరజ్ నుండి రూ.5వేలు, ఒక సెల్‌ఫోన్‌ను తీసుకుని ఉడాయించారు. గతంలో ఈ నకిలీ పోలీసులు గత రెండు వారాల క్రితం నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన కిషోర్ అనే వ్యక్తిని చితకబాది అతని వద్ద నుండి రూ.75వేల రూపాయలు తీసుకుని ఉడాయించారు. ఈ దాడిలో హోంగార్డుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

స్వర్ణముఖి నదికి నిరంతరంగా నీరు
నాయుడుపేట, డిసెంబర్ 10: రాష్ట్రంలో నదుల అనుసంధానం ద్వారా జిల్లాలోని రైతాంగం కష్టాలు తీరనున్నాయని, అందులో భాగంగా స్వర్ణముఖి నదికి నిరంతరాయంగా నీరు విడుదల చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయని టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. శనివారం ఆయన పట్టణ పరిధిలోని మల్లాం క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై 42 అడుగుల ఎత్తుగల పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చే వారికి నాయుడుపేట గేట్ వేగా తెలియచేస్తూ 35 లక్షలతో టిటిడి పాలకవర్గం ఆంజనేయ విగ్రహం ఏర్పాటు చేస్తున్నదన్నారు. పట్టణానికి ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లా రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, ఈ పరిస్థితిని అధిగమించడానికి పట్టణ పరిధిలోని స్వర్ణముఖి నదికి నిరంతరాయంగా నీరు విడుదల చేయడానికి సిఎం ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. టిటిడి ఆధ్వర్యంలో హరిజన, గిరిజన ప్రాంతాల్లోని దేవాలయాలు, భజన మందిరాల నిర్మాణానికి 10 లక్షల వరకు ఆర్థికసాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు
వాకాడు, డిసెంబర్ 10: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 15 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఎంపి వరప్రసాద్ తెలిపారు. శనివారం మండలంలోని కొండాపురంలో ఎంపి నిధులు 5 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ గత రెండున్నరేళ్ల కాలంలో పదిహేను కోట్లతో వేయి పనులను చేపట్టామన్నారు. అందులో సిసి రోడ్లు, డ్రైనేజి, సామాజిక వికాస భవనాలు, తుఫాను రక్షిత భవనాలకు నిధులకు కేటాయించామన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు మెరుగైన వౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నానని తెలిపారు. ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు సరఫరా, రహదారి, కరెంటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. తీరప్రాంతాల్లోని అన్నిగ్రామాల్లో రక్షిత భవనాలు నిర్మిస్తామన్నారు. పెద్దనోట్ల రద్దు వలన దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో పాటు పేదవారి కష్టాలు వర్ణనాతీతంగా మారాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొన్న నిర్ణయం వల్ల సామాన్యుడి జీవనం కష్టతరంగా మారిందన్నారు. తమ నేత జగన్ ప్రజల పక్షాన పోరాడుతున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బాబు కుట్ర పన్నుతున్నారని, ప్రజల పక్షాన తమ నేత నిరంతరం పోరాటం చేస్తున్నారన్నారు. ఎంపి వెంట ఎన్ పద్మనాభరెడ్డి, మోహన్‌నాయుడు, కె శ్రీనివాసులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

పక్షుల పండుగకల్లా పనులు పూర్తికావాలి:కలెక్టర్
దొరవారిసత్రం, డిసెంబర్ 10: నేలపట్టు పక్షుల కేంద్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు పక్షుల పండుగకన్నా ముందుగానే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు ఆదేశించారు. శనివారం ఆయన నేలపట్టులో జరుగుతున్న పనులను పరిశీలించారు. నేలపట్టు పక్షుల కేంద్రంలో సుమారు 1.48 కోట్లతో పిల్లల పార్కు, సమాచార కేంద్రం, అతిధిగృహాల మరమ్మతులతో పాటు పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ వీటిని పరిశీలించి పండుగ తేదీలు సమీపిస్తున్నాయని, పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత పనులను పూర్తిచేయాలని వారిని హెచ్చరించారు. అనంతరం స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. మళ్లీ తాను నేలపట్టుకు వస్తానని, తాను వచ్చేలోగా అన్ని పనులు పూర్తికావాలన్నారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ శ్రీనివాసులు, ఎండివో చంద్రశేఖర్ ఉన్నారు.

ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేయాలి
ఉపాధ్యాయులకు డిఇఓ ఆదేశం
గూడూరు, డిసెంబర్ 10: ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం ఆదేశించారు. శనివారం స్థానిక కేశవ నిలయంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన విద్యాసదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరచి, నాణ్యమైన విద్యను అందిస్తే ప్రైవేటు పాఠశాలల వైపు విద్యార్థుల తల్లితండ్రులు ఆసక్తి చూపరని అన్నారు. ఆ దిశగా ఉపాధ్యాయులు దృష్టిసారించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా ఉండాలంటే విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో పెంచాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారుచేయడానికి ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనలో మార్పు తీసుకొచ్చి ఉత్తమ ఫలితాలు తీసుకురాగలగితే విద్యార్థుల తల్లితండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు చూడరని అన్నారు. విద్యాబోధనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదని, ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిఇఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో దశపతిరావు, డాక్టర్ సిఆర్ రెడ్డి, దేశిరెడ్డి ప్రజేందర్‌రెడ్డి, చక్రపాణి, రామ్మోహన్, రామ్మోహన్, పోలయ్య, ఎస్‌వి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

వృద్ధురాలిని బెదిరించి
31 సవర్ల బంగారు నగల దోపిడీ
నెల్లూరు రూరల్, డిసెంబర్ 10: ఇంట్లో వృద్ధురాలు ఒక్కరే ఉన్నారని తెలుసుకొని ఆమెను బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, ఇంటిలో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన వైనమిది. నెల్లూరు రూరల్ పోలీసుల కథనం మేరకు ఈ దోపిడీ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ధనలక్ష్మీపురంలోని సామంతవారితోపు ప్రాంతంలో నివాసముంటున్న ఎం సుగుణమ్మ కుటుంబ సభ్యులు శుక్రవారం శుభకార్యం నిమిత్తం అందరూ వెళ్లారు. ఆమె తల్లి కాంతమ్మను ఇంటిలో వదిలివెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన అగంతకుడు శుక్రవారం అర్ధరాత్రి ఇంటిలోకి చొరబడి వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును కత్తిరించుకొని వెళ్తుండగా ఒక్కసారిగా వృద్ధురాలు అరవడంతో ఆమె దిండు కిందనే ఉన్న మిగతా బంగారు వస్తువుల మూటను అగంతకుడు గమనించి వృద్ధురాలిని బెదిరించి ఆ మూటను తస్కరించినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 31 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకొన్న రూరల్ పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి విచారణ జరిపారు. క్లూస్‌టీమ్ అగంతకుడి వేలిముద్రలను తీసుకుంది. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సిఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ఇంటిలో కుటుంబ సభ్యులు శుభకార్యానికి వెళ్లడం, వృద్ధురాలు ఒక్కరే ఇంటిలో ఉండటం అంతా గమనించి తెలిసినవారు చేసిన పనిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.