శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 15: సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని శని, ఆదివారాల్లో జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఉదయం సంక్రాంతి సందర్భంగా తమ పూర్వీకులకు ప్రత్యేక పూజలు చేశారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో యువతీ యువకులకు చిన్నారులకు పలు స్వచ్ఛంద సంస్థలు డివైఎఫ్‌ఐ వంటి యువజన సంఘాలు, పలు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్థానిక బోడిగాడితోట సమాధుల తోటలో పెద్దల పండుగను పురస్కరించుకొని తమ పూర్వీకుల సమాధులకు నగరవాసులు ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు చేసి తర్పణాలు వదిలారు. ఈకార్యక్రమంలో మంత్రి నారాయణ, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం కనుమ పండుగ సందర్భంగా తమ కష్టసుఖాలలోను వెన్నవంటి ఉన్న పశువులకు ప్రత్యేక పూజలు చేసి వాటిని అలంకరించుకోవడం ద్వారా ప్రజలు తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో పట్టణాలతో పోల్చితే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కనుమ పండుగ నిర్వహించుకున్నారు. పశువులకు ప్రత్యేక స్నానాలు చేయించడం, వాటి కొమ్ములను వివిధ రంగులతో అలంకరించడం మొదలు వాటికి ఇష్టమైన ఆహారం అందించడం వరకు భక్తిశ్రద్ధలతో చేశారు. నగరంలోని మైపాడుగేటు సెంటర్‌లోగల శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో కనుమ పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నిర్వహించిన స్వామివారి తెప్పోత్సవం కనులపండుగగా జరిగింది. వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తెప్పోత్సవాన్ని తిలకించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక సిఐ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెప్పోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన మేయర్
నెల్లూరు నగరంలోని జరిగే అన్ని పండుగలను దైవభక్తితో నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. కనుమ పండుగను పురస్కరించుకుని స్థానిక మైపాడు గేట్ జాకీర్‌హుస్సేన్ నగర్ ప్రాంతంలోని జాఫర్ కాలువలో జరిగే కనుమ తెప్పోత్సవ ఏర్పాట్లను మేయర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో జరిగే అన్ని పండుగలకు ప్రాధాన్యత కల్పిస్తూ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంప్రదాయ పండుగల నిర్వహణకు నిధులను సద్వినియోగం చేస్తున్నామన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా అన్ని పండుగలను ఆత్మీయంగా జరుపుకోవాలని మేయర్ నగల ప్రజలకు పిలుపునిచ్చారు. కనుమ తెప్పోత్సవానికి సుమారు 2 లక్షల మంది భక్తులు విచ్చేసే అవకాశాలు ఉన్నందున పారిశుద్ధ్యం, ట్రాఫిక్, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టిసారించి 250 హైమాక్స్ లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ వివరించారు. ప్రధానంగా మహిళా భక్తుల భద్రత కోసం 35 మంది మహిళా పోలీసులు, తొక్కిసలాట జరగకుండా రోప్ పార్టీ పోలీసులు, దొంగతనాలు జరగకుండా మఫ్టీ పోలీసులను సిద్ధం చేసినట్లు చెప్పారు. స్థానిక శివాలయంతో పాటు నగరంలోని పలు దేవస్థానాల నమూనాలను తెప్పోత్సవంలో భాగంగా పూజించడం ఆచారంగా వస్తోందన్నారు. ఈనేపథ్యంలో ముందుజాగ్రత్తగా 14 మంది గజఈతగాళ్లను సిద్ధం చేశామని మేయర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంట కార్పొరేటర్లు పొత్తూరు శైలజ, మామిడాల మధు, దొడ్డపనేని రాజానాయుడు, మన్నం పెంచలనాయుడు, ప్రశాంత్, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

వైభవంగా గోదాదేవి కల్యాణం
సూళ్లూరుపేట, జనవరి 15: మన్నార్ పోలూరు అలఘమల్లారి కృష్ణస్వామి ఆలయంలో ఆదివారం తిరుమల తిరుపతి ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోదాదేవి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణ నడుమ స్వామివారి, అమ్మవారి విగ్రహాలను ఆలయం చుట్టూ ప్రదర్శనగా కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం వేదపండితులు కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పట్టువస్త్రాలను ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, శ్రీసిటీ ఎండి రవి సన్నారెడ్డి సమర్పించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎన్వీ మురళి, పిట్ల సుబ్రహ్మణ్యం, ఆకుతోట రమేష్, తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా సిద్ధేశ్వరస్వామి తిరునాళ్లు
పెళ్లకూరు, జనవరి 15: భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన శ్రీ సిద్ధేశ్వరస్వామి తిరునాళ్లు ఆదివారం మండల పరిధిలోని శిరసనంబేడు గ్రామంలో వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా కనుమ పండుగ నాడు నిర్వహించే స్వామివారి ఉత్సవాలను నిర్వాహకులు అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు. స్వామివారి విగ్రహాన్ని రథంలో ఉంచి రకరకాల పుష్పాలు, విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించి స్వామివారిని గిరి ప్రదక్షిణం చేయించారు. సాయంత్రం పూట రథాన్ని కొండకు దిగువభాగాన ఉంచి భక్తులకు కనువిందు చేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా నెల్లూరు, చిత్తూరు, చెన్నై ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రిపూట గ్రామోత్సవం నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా నిర్వాహకులకు స్వామికొండకు దిగువభాగాన పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. రాత్రి 8 గంటల నుంచి పాటకచ్చేరి మొదలు కావడంతో యువత కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గడిపారు. రోసనూరు గ్రామంలోను ఆదివారం భూపతేశ్వరస్వామి తిరునాళ్లు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు స్వామికి గ్రామోత్సవం నిర్వహించగా స్వామివారిని మాజీమంత్రి పరసా రత్నం దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కె రామకృష్ణంరాజు, సత్యంరాజు, వి మురళీకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఉత్సాహంగా ఏటి పండుగ
నాయుడుపేట, జనవరి 15 : స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతమైన నాయుడుపేట పట్టణంలో ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఏటి పండుగ ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని హిందూ సంప్రదాయం ప్రకారం గొబ్బి దేవతలను స్వర్ణముఖిలో వదిలే సంప్రదాయం ఆనవాయితీగా వస్తోంది. దీనే్న ఏటి పండుగగా పట్టణ ప్రజలు నిర్వహించుకుంటారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాక్షస బెలూన్ ఎగుర వేసి పండుగను ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా హాజరవుతారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యుద్దీపాలంకరణతో జరిగే ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పరసా రత్నం, నగర చైర్‌పర్సన్ ఎం శోభారాణి, వైస్ చైర్మన్ అత్తికాయల సుబ్రహ్మణ్యం, కమిషనర్ ప్రసాద్‌నాయుడు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు జి రఘునాథరెడ్డి, మాజీ ఎంపి నెలవల సుబ్రహ్మణ్యం, జిల్లా టిడిపి కార్యదర్శి రాజారెడ్డి, జడ్పీటిసి శ్రీరాంప్రసాద్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పార్శిల్ లారీలో సరకు మాయం
దొరవారిసత్రం, జనవరి 15 : దొరవారిసత్రం మండలం నెలబల్లి గ్రామ సమీపంలోని హుస్సేనమ్మ దర్గా వద్ద జాతీయరహదారిపై నిలిపి ఉన్న పార్శిల్ లారీలోని కొంత సరకు మాయమైనట్లు లారీ యజమాని శివలింగం సుబ్బరాజు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, చెన్నై నుంచి హైదరాబాద్‌కు పార్శిల్ లారీలో లోడు వేసుకొని వస్తున్నారు. ఈ లారీని నెలబల్లి వద్ద రాత్రి నిలిపి ఉండటంతో శనివారం అర్ధరాత్రి సమయంలో 93 బాక్సులకు గాను 32 బాక్సులు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కోటిరెడ్డి కేసు నమోదు చేసి లారీలోని మిగిలిన సరకులను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అంతర్‌రాష్ట్ర దొంగలు అరెస్ట్
* రెండు లారీలు స్వాధీనం
గూడూరు, జనవరి 15 : గూడూరు, చిల్లకూరు మండలాల పరిధిలోని లారీలను అపహరించి విక్రయించే నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాలకు చెందిన ఆరుగురు ముఠా వ్యక్తులను గూడూరు సబ్ డివిజనల్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి అపహరణకు గురైన రెండు లారీలను స్వాధీనం చేసుకున్నట్లు గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి బాదపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయన శనివారం గూడూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో లారీ అపహరణకు పాల్పడ్డ నిందితుల వివరాలను, స్వాధీనం చేసుకున్న లారీలను విలేఖర్లకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూళ్లూరుపేట మండలం ఇస్కమిట్ట ప్రాంతానికి చెందిన రుద్రపాటి కృష్ణయ్య, చిల్లకూరు మండలం వల్లిపేడు గ్రామానికి చెందిన షేక్ షఫీలు 2015వ సంవత్సరంలో చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు వద్ద నిలిపి ఉన్న లారీని అపహరించుకొని వెళ్లారని తెలిపారు. అనంతరం కడప జిల్లా రాయచోటికి చెందిన షేక్ ఖాజావలీ, తాలిబ్ ఆలీఖాన్‌ల సాయంతో అనంతపురంకు చెందిన హజరత్ అనే వ్యక్తి ద్వారా లారీలను రిపేరు చేయించి హిందూపురంకు చెందిన షఫీ ఉల్లా అనే వ్యిక్తికి విక్రయించారు. అలాగే గత ఏడాది గూడూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఆపి ఉన్న మరో లారీని కూడా రుద్రపాటి కృష్ణయ్య, షేక్ షఫీలు దొంగలించి నెల్లూరులో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు సమాచారం అందిందని, దీంతో వారిపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకొని విచారించగా రెండు లారీలను అపహరించినట్టు అంగీకరించినట్టు డిఎస్పీ తెలిపారు. ఈ రెండు లారీల అపహరణ కేసుల్లో నిందితులైన వారితోపాటు మిగిలిన నలుగురిని అరెస్ట్‌చేసి రెండు లారీలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు రూరల్ సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు ఎం బాబీ, అంకమ్మ, ఏడుకొండలు పాల్గొన్నారు. లారీ నిందితులను అరెస్ట్ చేయడంలో చురుకైన పాత్ర పోషించిన సిబ్బందికి డిఎస్పీ అభినందనలు తెలిపారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు
గూడూరు, జనవరి 15 : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం రాత్రి పట్టణంలోని అలఘనాథస్వామి. చెన్నకేశవస్వామి, కోదండరామాంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కల్యాణాలు వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమాలను తిలకించేందుకు భక్తజనులు విశేష సంఖ్యలో హాజరై కల్యాణాన్ని కనులారా వీక్షించారు. వీరికి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తీర్ధప్రసాదాలు అందచేశారు.

తీరంలో పర్యాటకుల సందడి
వాకాడు, జనవరి 15 : మండలంలోని తూపిలిపాలెం గ్రామానికి అతి సమీపాన ఉన్న బంగాళాఖాతం సముద్ర తీరానికి ఆదివారం పర్యాటకులతో నిండిపోయింది. ప్రతి ఆదివారం ఈ తీరానికి నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి పర్యాటకులు విశేష సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆదివారం పండుగ దినం కావడం, విద్యార్థులకు, ఉద్యోగులకు సెలవు కావడంతో తీరమంతా పర్యాటకులతో నిండిపోయింది. సహజసిద్ధంగా ఉన్న తీరం వద్ద సముద్ర స్నానం చేయడం, వాతావరణం అనుకూలంగా ఉండటం, తీరం వెంబడి పచ్చని చెట్లు, రొయ్యల హేచరీలు, సముద్రంలో నిర్మించిన జెట్టీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుండటంతో ఇక్కడకు తరలివస్తున్నారు. ఇక్కడ పర్యాటకులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

వైభవంగా సాయిబాబా తెప్పోత్సవం
వెంకటగిరి, జనవరి 15: పట్టణంలోని కుమ్మరిగుంట పుష్కరిణిలో షిరిడి సాయిబాబా తెప్పోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజున కుమ్మరిగుంట పుష్కరిణిలో సాయిబాబా తెప్పోత్సవాన్ని వైభంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కుమ్మరిగుంట పుష్కరిణి నలుదిక్కులా ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ భక్తులకు ఆకట్టుకున్నది. ఈ సంవత్సరం సాయిబాబాను సింహ వాహనంపై అధిష్ఠించి తెప్పోత్సవం నిర్వహించారు. సాయిబాబా దత్తాశ్రమంలో తెప్పోత్సవాన్ని పురస్కరించుకొని వై శ్రీను బృందంచే ప్రత్యేక నాదస్వర కచేరి, శ్రీనివాస మంగాపురం శ్రీవశిష్ట ఆశ్రమం, శ్రీ లలిత పీఠ సంస్థాపకులు, న్యాయవేదాంత సర్వదక్షణాచార్యులైన పూజ్యశ్రీ స్వస్వరూపానందగిరి స్వాముల వారిచే ఆధ్యాత్మిక ఉపన్యాసం, హిందీ ధర్మపరిషత్ టిటిడి నెల్లూరుశాఖ వారి సౌజన్యంతో శ్రీ వివిఎస్ వినోద్‌కుమార్‌వారి బృందంచే భక్తి పాట కచేరి నిర్వహించారు. తెప్పోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సంవత్సరం కుమ్మరిగుంట పుష్కరిణిలో ఏర్పాటు 30 అడుగుల సిమెంట్ విగ్రహం భక్తులను ఆకట్టుకుంది. పాలకేంద్రం నుంచి పాత బస్టాంబ్ మీదుగా వాహనాలను స్ధానిక సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ కొండపనాయుడు బస్సులను ఆపివేసి తెప్పోత్సవం వద్దకు భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా వెళ్లేలా చర్యలు చేపట్టారు. కనుమ పండగను పురస్కరించుకొని పట్టణంలోని కాశీతోటలో మహిళలు గొబ్బి పండుగను ఘనంగా నిర్వహించారు. గొబ్బెమ్మను ప్రత్యేకంగా అలంకరించి గొబ్బి పాటలు పాడి అనంతరం గంగలో కలిపారు.

మనుబోలులో దొంగనోటు కలకలం
* మద్యం షాపులో బయటపడిన నకిలీ రూ.500నోటు
మనుబోలు, జనవరి 15: మండలపరిధిలోని కాగితాలపూరు రోడ్డు సమీపంలో ఉన్న మద్యం షాపులో రూ.500 నకిలీ నోటు కలకలం సృష్టించింది. దీంతో గ్రామంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి మద్యం షాపులో రూ.500 నోటు ఇచ్చి మద్యం కొనుగోలు చేశాడు. అటుతర్వాత పక్కనే ఉన్న డాభా యజమాని తన వద్ద ఉన్న 2వేల రూపాయల నోటు ఇచ్చి చిల్లర తీసుకున్నాడు. మద్యం షాపు వాళ్లు చిల్లర ఇవ్వగా తీసుకువచ్చిన డాభా యజమాని రూ.500నోటు పరిశీలించగా, కాగితంపై ఉన్న ముద్రణ తేడాగా ఉండటంతో దానిని పలువురికి చూపించారు. నకిలీ నోటు కాగితం లావుగా ఉండటంతో ఈ నోటును నకిలీగా గుర్తించారు.

కొనసాగుతున్న పోలీస్ పికెట్
మనుబోలు, జనవరి 15: మండలపరిధిలోని బద్దెవోలు గ్రామంలో పోలీస్ పికెట్‌ను గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తుల మధ్య జరిగిన సాగునీటి ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. దీంతో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండే విధంగా గ్రామంలో అప్పటి నుండి పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు. ఆదివారం స్థానిక ఎస్‌ఐ గంగాధర్ గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో గొడవలు, ఘర్షణలకు దిగితే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.