శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సిఎం మాటలు నీటి మూటలేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, జనవరి 16: తమ గ్రామానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రావడం, తమ గ్రామానికి వరాల జల్లు కురిపించడంతో తమ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని, కానీ ఇక్కడి పంచాయతీ పాలకుల తీరు తమను తీవ్ర మనోవేదనకు గురి చేస్తోందంటూ ఈ ప్రాంత ప్రజలు వాపోయారు. సోమవారం మండల పరిధిలోని చెన్నూరు శెట్టిగారి బిట్‌కు చెందిన ప్రజలు పంచాయతీ కార్యాలయం ఎదుట తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జన్మభూమి-మావూరు కార్యక్రమానికి తమ గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి కోరని వరాలు సైతం ఇవ్వడంతో తామెంతోమురిసిపోయాయని అన్నారు. కానీ ఇక్కడి అధికారులు తమకు కనీస అవసరాలైన తాగునీరు, వీధిలైట్లు, మురుగుకాలువలు శుభ్రం వంటివి చేయకపోవడం వల్ల తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ఈ విషయమై పలుమార్లు పంచాయతీ కార్యాలయానికి వెళ్లినా అక్కడ అధికారులు ఎవరు ఉండటం లేదని, ఇక తమ సమస్యలను ఎవరికి విన్నవించుకోవాలని వారు మండిపడుతున్నారు. సిఎం హామీతో ఒక్కసారిగా తమ గ్రామ రూపురేఖలు మారిపోతాయని ఆశించామని, కాని ఇక్కడి అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో నివసించే తాము ఉదయం లేస్తే కూలి పనులకు వెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తుంటామని, కనీసం వీధిలైట్లు వెలగడం లేదని, తాగునీరు రావడం లేదని, ఉన్న బోర్లు కాస్త మరమ్మతులకు గురై నీరు రావడం ఎప్పుడో ఆగిపోయిందన్నారు. గత 15 రోజుల నుండి తమ ప్రాంతంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొని ఉండటంతో తాగడానికి నీరు లేక నానా అవస్థలు పడుతున్నామన్నారు. పంచాయతీ కార్యాలయానికి వెళ్లి అధికారులున్నప్పుడు తాగునీటి సరఫరా విషయం గురించి ప్రస్తావిస్తే మోటార్లు చెడిపోయాయని చెప్పి తప్పించుకొంటున్నారని వారు వాపోయారు. ఈ ప్రాంతంలో 5 తాగునీటి బోర్లు ఉండగా అందులో 3 చెడిపోయి ఉండగా రెండు మాత్రమే వాడుకలో ఉన్నాయని, వాటిలోనే ఇంతమంది నీరు పట్టుకోవాల్సి వస్తున్నదని అన్నారు. దాదాపు 150 ఇళ్ల వారు నీటి కోసం పడరాని తిప్పలు పడుతున్నామన్నారు. 150 ఇళ్ల వారికి ఈ రెండు బోర్ల నుండి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తమకు అవి చేస్తాం, ఇవి చేస్తాం అని ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు తాము నీటి కోసం ఇన్ని అవస్థలు పడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు కూడా సరిగా లేవని, చుట్టూ చెట్లు పెరిగిపోవడం, రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగకపోవడం వల్ల విష పురుగులు సంచరిస్తున్నాయని, దీంతో తాము భయాందోళనతో కాలం వెళ్లదీస్తున్నామని తెలిపారు. ఇక్కడ 32 విద్యుత్ స్తంభాలు ఉండగా ప్రతిదానికి లైట్లు ఉన్నా అవి వెలిగిన పాపాన పోలేదని అన్నారు. సాయంత్రం ఆరు గంటలైతే ఈ ప్రాంతం అంధకారంలో మగ్గాల్సిందేనన్నారు. వీధులన్నీ చెత్తకుప్పలతో నిండి ఉన్నాయని, వాటిని శుభ్రం చేసే నాధుడే కరవయ్యాడని అన్నారు. ఇకనైనా అధికారులు, పాలకులు స్పందించి తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అధికలోడు టిప్పర్ల పట్టివేత
తడ, జనవరి 16: చింతవరం నుండి చెన్నై వైపు అధిక లోడుతో వెళుతున్న రెండు టిప్పర్లను నెల్లూరు ఆర్టీఓ శ్రీనివాసులు పట్టుకున్నారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా సోమవారం నెల్లూరు ఆర్టీవో శ్రీనివాసులు శ్రీసిటీ కూడలి వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా చింతవరం నుండి కారూరు పారిశ్రామికవాడలో ఉన్న షేన్ గోవింద్ గ్లాస్ ఫ్యాక్టరీకి అధిక లోడుతో వెళుతున్న రెండు సిలికా టిప్పర్లను పట్టుకున్నారు. అనంతరం వాహనదారులకు నోటీసులు అందచేసి ఆ వాహనాలను తడ పోలీసులకు అందజేశారు.

కొత్తూరులో జింక పిల్ల హల్‌చల్!
బిట్రగుంట, జనవరి 16: బోగోలు మండలం విశ్వనాథరావుపేట పంచాయతీ కొత్తూరు గ్రామ సమీపంలో సోమవారం ఓ జింక పిల్ల హల్‌చల్ చేసింది. దీనిని గమనించిన స్థానిక ప్రజలు జింక పిల్ల కుక్కల బారిన పడకుండా రక్షించి దానిని సంరక్షణ కోసం బిట్రగుంట పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు జింక పిల్లను స్వాధీనం చేసుకుని అటవీ శాఖ సిబ్బందికి అప్పగించారు. ఈసందర్భంగా గ్రామంలో జింక పిల్లను చూడడానికి ఎగబడ్డారు.

కన్నుల పండువగా కోదండరాముని తెప్పోత్సవం
గూడూరు, జనవరి 16: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరాముని తెప్పోత్సవ వేడుకలు సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా మేళతాళాలతో కోదండరాముని, అమ్మవారి విగ్రహాలను ఆలయం నుండి కోనేరు వరకు తీసుకొచ్చి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలను తిరుమల, తిరుపతి దేవస్థానం వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి ఉభయకర్తగా వ్యవహరించిన కనుమూరు హరిశ్చంద్రారెడ్డి దంపతులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోనేరులో ప్రత్యేకంగా తయారుచేయించిన తెప్పలో స్వామి అమ్మవార్లను ఉంచి తెప్పోత్సవం నిర్వహించారు. గూడూరు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ వేడుకలను తిలకించేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. కోనేరును రంగురంగు విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. కోనేరు చుట్టూ విద్యుత్ దీపాలతో భారీ కటౌట్‌లు ఏర్పాటు చేశారు. శివకాశీ నుండి తెప్పించిన భారీ బాణసంచా ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోనేరు వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పట్టణ పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యుడు పాశం సునీల్‌కుమార్, డిఎస్పీ బి శ్రీనివాస్, చైర్‌పర్సన్ పి దేవసేన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఫ్రతియేటా ఖర్చుకు వెనకాడకుండా కనుమూరు హరిశ్చంద్రారెడ్డి ఈ తెప్పోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం పట్ల ఆయనకు గూడూరు మీద ఉన్న అభిమానాన్ని తెలియజేస్తోందన్నారు. ఆయన సొంత నిధులు దాదాపు 80 లక్షలు వెచ్చించి నిరుపయోగంగా ఉన్న ఈ ప్రాంతంలో కోనేరును నిర్మించి ప్రతి సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ తెప్పోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. గత నాలుగేళ్లుగా ఈ వేడుకలను గూడూరు ప్రజలకు కనువిందు చేస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

తెగిపోతున్న పేగు బంధాలు!
శిశుగృహకు చేరుతున్న పసికందులు
దత్తత స్వీకరణ ప్రక్రియలో అధికార్ల చేతివాటం
ఆత్మకూరు, జనవరి 16: బిడ్డకు తల్లి భారమేమో గాని.. తల్లికి మాత్రం బిడ్డ ప్రాణమనేది నిన్నటి మాటగా మారుతోంది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన కన్నబిడ్డల్ని తమంతట తామే కనుమరుగయ్యేలా రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మారుతున్న సమాజంలో అనైతిక ధోరణులు ప్రబలిపోతున్నాయనేందుకు ఎన్నో సంఘటనలు నిదర్శనంగా మారుతున్నాయి. ఈక్రమంలో మానవ రక్తసంబంధాలకు తూట్లు పడేలా తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నారు. కన్నబిడ్డల పట్ల సైతం కర్కశంగా కొనసాగుతున్న సంఘటనలూ ఉన్నాయి. కలకాలం కలసి సాగాల్సిన దంపతుల నడుమ ఏర్పడుతున్న కలహాల నేపథ్యంలో తమ బిడ్డల్ని సైతం వదిలేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనైతిక సంబంధాలతో కలిగిన సంతానాన్ని నిర్జన ప్రదేశాల్లో వదిలి వెళ్లిపోతున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం జిల్లాలోని సూళ్లూరుపేటలో జరిగిన ఓ ఉదంతం మానవీయకోణంలో చూస్తే అయ్యోపాపం అనిపిస్తోంది. మగదిక్కు లేని ఓ చిన్నారి తల్లి అప్పులపాలైంది. ఆమె తొలుత తన మూడు సంవత్సరాల బిడ్డను పోషించలేనని భావించి ఐసిడిఎస్ అధికార్ల ఆధీనంలోకి చేరేలా తానే స్వయంగా ప్రయత్నించింది. కొన్నాళ్ల తరువాత ఆ తల్లి ఎలాగైనా తన బిడ్డను తిరిగి పొందాలని మనోభావనకు వచ్చింది. అయితే ఆ బాలికను అప్పగిస్తే ఆమె అప్పులోళ్ల ఒత్తిళ్లు భరించలేక ఎక్కడ విక్రయించేస్తుందోనని ఐసిడిఎస్ అధికార్లు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారు. ఆ చిన్నారి శిశుగృహంలోనే తల దాచుకునేలా ఏర్పాట్లు చేశారు. కాగా, బిడ్డల్లేని తల్లిదండ్రులు మాత్రం శిశుగృహకు చేరుకుని తాము దత్తతకు తీసుకుంటామని ముందుకొస్తున్నారు. శిశుగృహల్లో చిన్నారులకు దత్తత తీసుకుంటామని వచ్చిన దరఖాస్తుల సంఖ్యకు రెట్టింపుగా ఉండటం విశేషం. చట్టప్రకారం ప్రభుత్వ ఐసిడిఎస్ తరపు దత్తత ఇచ్చిన తరువాత మూడేళ్ల వరకు సిడబ్ల్యూసి (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) పర్యవేక్షిస్తోంది. కనీసం ఆరు నెలలకో పర్యాయమైన ఐసిడిఎస్ అధికారులు తమ నుంచి చిన్నారుల్ని దత్తత తీసుకున్న కుటుంబాల్ని పరిశీలిస్తారు. ఆ తరువాతనే పూర్తిగా దత్తత ప్రక్రియ పూరె్తైనట్లవుతోంది. అంతా ఆన్‌లైన్‌లోనే అంటూనే ఈ దత్తత ప్రక్రియలో ఐసిడిఎస్ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దరఖాస్తుల వరుసతో సంబంధం లేకుండా మీకు ముందుగా నచ్చిన బిడ్డని దత్తత దక్కేలా ఏర్పాట్లు చేస్తామంటూ నెల్లూరు ఐసిడిఎస్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి భారీగా వసూళ్లకు పాల్పడటంపై పత్రికల్లో వార్తలొచ్చాయి. పోలీసులు సైతం విచారణ జరిపారు. ఇలాంటి అక్రమాలకు తావివ్వకుండా బిడ్డల్ని పెంచుకునేందుకు ఆసక్తి కనబరిచే జంటల్ని పరిశీలించే అనాధ శిశువుల దత్తత ప్రక్రియ వేగిరపరచడం సముచితం.

క్రీడలకు అత్యంత ప్రాథాన్యత
మంత్రి నారాయణ స్పష్టం
* జాతీయ క్రీడల లోగోను ఆవిష్కరించిన మంత్రి

నెల్లూరు, జనవరి 16: క్రీడలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పురపాలక మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఈనెల 19 నుండి 22వ తేది వరకు జరగనున్న జాతీయ క్రీడల ఏర్పాట్లను ఆయన సమీక్షించి క్రీడల లోగోను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్ల లోపు వారికి నిర్వహించే జాతీయ క్రీడలు విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం 13 కమిటీలను ఏర్పాటు చేసిందని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. దేశంలో ఎక్కువ శాతం యువతీ యువకులే ఉన్నారని, వారికి క్రీడల్లో అవకాశాలు కల్పిస్తే అంతర్జాతీయంగా పతకాలు సాధించడం పెద్ద కష్టం కాబోదన్నారు. కలెక్టర్ ఆర్.మత్యాలరాజు మాట్లాడుతూ జాతీయ క్రీడల ఏర్పాట్ల వివరాలను తెలుపుతూ బాలబాలికలకు ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. క్రీడల అనంతరం జిల్లాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలకు పర్యటనలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. క్రీడాంశాలు జరిగేచోట బాలబాలికలకు ప్రత్యేక వాలంటీర్ బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అధికారులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ జాతీయ క్రీడలు విజయవంతం చేసేందుకు నగరపాలక సంస్థ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంటకస్వామినాయుడు, సంయుక్త కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

నెలాఖరుకు కస్తూర్బా కళాక్షేత్రం పనులు పూర్తి
నెల్లూరు, జనవరి 16: నగరంలోని శ్రీవెంకటేశ్వర కస్తూర్భా కళాక్షేత్రం మరమ్మతులు ఈనెలాఖరు నాటికి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అధికారుల్ని ఆదేశించారు. సోమవారం ఆయన మరమ్మతు పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేస్తూ ఆధునీకరించిన కస్తూర్భా కళాక్షేత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కళాక్షేత్రంలో నిరంతరం కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉండేలా చర్యలు చేపట్టాలని, ఆధునిక సౌకర్యాలతో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.

మిస్టర్ ఆంధ్రా పోటీల్లో నెల్లూరీయుల ప్రతిభ
నెల్లూరు, జనవరి 16: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈనెల 15న జరిగిన మిస్టర్ ఆంధ్రా పోటీల్లో జిల్లా బాడీబిల్డింగ్ క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాకు చెందిన ఎ.రజనీకాంత్ 60 కేజీల విభాగంలో స్వర్ణపతకం సాధించడం విశేషం. అదేవిధంగా 85 కేజీల విభాగంలో ఎ.్ధన శ్రీనివాస్ స్వర్ణపతకాన్ని, 80 కేజీల విభాగంలో కె.రవి, 90 కేజీల విభాగంలో వై.రాజేంద్ర రజత పతకాలను సాధించారు. పోటీల్లో జిల్లా పేరు ప్రఖ్యాతులు పెంపొందేలా చేసిన క్రీడాకారులకు జిల్లా అమెచ్యూర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ నేతలు డివి పవన్‌తేజ, సి.వెంకటేశ్వరరెడ్డి తదితరులు అభినందించారు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయడంలో ప్రతిభ చూపిన టీం కోచ్ యు.శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
డ్వాక్రా మహిళల అభ్యున్నతికి కృషి
* మంత్రి నారాయణ స్పష్టం

నెల్లూరు, జనవరి 16: డ్వాక్రా మహిళల తలసరి ఆదాయాన్ని 36 వేల నుంచి లక్షా పది వేలకు 2022 నాటికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు. సోమవారం స్థానిక విఆర్‌సి కళాశాల మైదానంలో వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్టు రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి, గొబ్బెమ్మల పండుగ సంబరాల కార్యక్రమానికి మంత్రి నారాయణ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ సంబరాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భోగి, మకర సంక్రాంతి, కనుమ మూడు పర్వదినాలుగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సంబరాల్లో ముగ్గులు, గొబ్బెమ్మలు, మెహంది తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 87 లక్షల మంది డ్వాక్రా, మెప్మా మహిళలు ఉన్నారని, 110 మున్సిపాలిటీల్లో 20 లక్షల పైచిలుకు ఉన్నారని ఆయన తెలిపారు. వసంతలక్ష్మి ఛారిటబుల్ ట్రస్టు 1998 నుండి మహిళల అభ్యున్నతికి అమ్మ బడి, బాల కార్మికులపై వివక్షత, అనాధ బాలలకు పునరావాసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వయం రక్షణ కోసం శిక్షణలు ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలు మహిళల అభ్యున్నతి కోసం శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఫౌండేషన్ కోర్సులకు వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్టు తమ సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది పిల్లలు ఈ ఫౌండేషన్ కోర్సును ఉపయోగించనున్నారని, తొలి విడతగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రారంభించామని ఆయన తెలిపారు. రానున్న రెండు నెలల్లో రాష్టమ్రంతటా ప్రారంభించడం జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రతి పేదవాని ఇంటిలో కుల, మత, వర్గ విభేదం లేకుండా పండుగ వాతావరణం నెలకొల్పటం ప్రభుత్వ లక్ష్యమని, అందుకు రంజాన్ తోఫా, క్రిస్మస్, సంక్రాంతి కానుకలని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, కార్పొరేటర్లు శ్రీనివాసులు, సత్యనారాయణ, టిడిపి మహిళా ప్రతినిధి శైలజ తదితరులు పాల్గొన్నారు.

వేడుకగా గొబ్బెమ్మ పండుగ
భారీగా తరలివచ్చిన జనం
ప్రారంభించిన మంత్రి నారాయణ

నెల్లూరు, జనవరి 16: సంక్రాంతి పండుగలో భాగంగా సోమవారం పెన్నా నదీతీరంలో గొబ్బెమ్మల పండుగ కోలాహలంగా సాగింది. ఈ వేడుకకు జనం భారీగా తరలివచ్చారు. స్థానిక రంగనాయకులపేట పెన్నానది ఒడ్డున ఏర్పాటు చేసిన గొబ్బెమ్మలు, గాలిపటాల సంబరాలలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, వచ్చే ఏడాది సంక్రాంతి సంబరాలను పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు.జిల్లాను పర్యాటక కేంద్రంగా మార్చడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో స్వర్ణాలచెరువును రూ. 20 కోట్ల వ్యయంతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సంక్రాంతి సంబరాలను మండలస్థాయి నుండి జిల్లాస్థాయి వరకు నిర్వహించడానికి జిల్లాకు కోటి రూపాయల వంతున మంజూరు చేసినట్లు తెలిపారు. రాజరాజేశ్వరి అమ్మవారు, భ్రమరాంబ మల్లికార్జునస్వామి, రంగనాయకులస్వామి తదితర దేవుళ్ల ప్రతిమలను సంబరాలు జరిగే ప్రదేశంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు వీటిని దర్శించి ధన్యులు కావాలని ఆయన కోరారు. తొలుత ఆయన గాలిపటాలు ఎగరవేసి గొబ్బెమ్మలను ఆడారు. ఈ కార్యక్రమానికి షంషుద్దీన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, సంయుక్త కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ ఆహ్మద్, మన్సిపల్ శాఖ అధికారులు, కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.