శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో 37వ జాతీయస్థాయి క్రీడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 19: నెల్లూరులో 37వ జాతీయ క్రీడలను నిర్వహించేందుకు ముందస్తు చర్చలు, ఏర్పాట్లు జరుగుతున్నట్లు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. గురువారం ‘ఖేలో ఇండియా’ అండర్-14 జాతీయస్థాయి క్రీడా పోటీలను నెల్లూరులోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ క్రీడల నిర్వహణకు సంబంధించి కేంద్ర క్రీడల మంత్రి విజయగోయల్‌తో ఇప్పటికే చర్చించినట్లు చెప్పారు. జిల్లాలో బహుళార్ధ సాధక ఇండోర్ స్టేడియం నిర్మాణం గురించి కూడా ప్రస్తావించామని, త్వరలో ఈ దిశగా చర్యలు ఉంటాయని హామీనిచ్చారు. జిల్లాలోని ఉదయగిరి, కావలి, వెంకటగిరి, కోవూరులలో ఒక్కోచోట రూ.2 కోట్ల వ్యయంతో మినీ స్టేడియాలను నిర్మించేందుకు పనులను ఉగాదిలోగా ప్రారంభిస్తామని వెల్లడించారు. నిధుల మంజూరు ప్రక్రియ పూర్తయిందని, నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రతి పాఠశాలలోనూ క్రీడాప్రాంగణం ఉండేలా చూడాలన్నారు. కుల, మత ప్రాంతాలకతీతంగా అందరూ చేరే వేదిక క్రీడా మైదానమని అన్నారు. చిన్ననాటి నుండి ఆర్‌ఎస్‌ఎస్‌లో ఆటలాడటం వల్లే ప్రస్తుతం తాను ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేందుకు కారణమని తెలిపారు. పలు క్రీడల్లో అత్యున్నత స్థానానికి చేరుకున్న క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచేందుకు ప్రయత్నించాలని సూచించారు. రాజకీయ నేతలు సైతం రాజకీయ క్రీడలు ఆడటం పక్కనబెట్టి శారీరక, మానసిక శ్రమ కలిగించే ఆటలకు దిగితే ఆరోగ్యవంతులుగా ఉండగలరని హితవు పలికారు. అగ్గిపెట్టెల్లాంటి ఇరుకుగదుల్లో తరగతులు బోధించడం మాత్రమే కాకుండా విశాల క్రీడల్లో వారు ఆసక్తి కనబరిచేలా విశాలమైన ప్రత్యేక క్రీడా మైదానాలను ప్రతి పాఠశాల నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అంతక్రితం వెంకయ్యనాయుడు జెండాను ఆవిష్కరించి ఖేలో ఇండియా అండర్-14 జాతీయ క్రీడలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. అనంతరం స్టేడియం వెలుపల జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని 4 ప్రాంతాల్లో నిర్మించనున్న మినీ స్టేడియాల శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ఎస్పీ విశాల్‌గున్ని, శాప్ చైర్మన్ మోహన్, శాప్ సభ్యులు రవీంద్రబాబు, స్థానిక కార్పొరేటర్ మేకల రజని తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా ప్రారంభమైన క్రీడలు
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులతో నెల్లూరు ఏసి సుబ్బారెడ్డి స్టేడియం సందడిగా మారింది. మధ్యాహ్నం 2 గంటలకు వివిధ రాష్ట్రాల జట్లకు పోటీలకు సంబంధించి ఫిక్సర్స్‌ను పూర్తిచేశారు. అనంతరం 4 గంటల నుంచి పోటీలు ప్రారంభమయ్యాయి.

-
ప్రతిరోజు భద్రతా దినంగా భావించాలి
* రహదారి ప్రమాదరహిత జిల్లాగా చేద్దాం
* భద్రతా వారోత్సవాల ప్రారంభ వేడుకలో జిల్లా ఎస్పీ
నెల్లూరు, జనవరి 19: భద్రత విషయంలో వారోత్సవాలకు పరిమతం కాకుండా ప్రతిరోజు భద్రతా దినంగా ప్రతిఒక్కరూ భావించాలని, భవిష్యత్తులో రోడ్డు ప్రమాదరహిత జిల్లాగా నెల్లూరు జిల్లాను చూసుకునేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని పిలుపునిచ్చారు. 28వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను గురువారం ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణించే ముందు ఒకసారి కుటుంబం గురించి ఆలోచిస్తే ప్రమాదాలను చాలావరకు తగ్గించవచ్చని హితవు పలికారు. కుటుంబాల కోసమే డ్రైవింగ్ వృత్తిని ఎంచుకున్న వారు తమమీద ఆధారపడ్డ వారిని తమ ప్రయాణంలో అనుక్షణం గుర్తుంచుకోవాలని సూచించారు. నగరంలో 14వేల ఆటోలు ఉన్నాయని, అయితే అందరూ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని, ప్రయాణికుల కొరత ఉండదని అన్నారు. ఇతర డ్రైవర్లతో ప్రయాణీకులను ఎక్కించుకునే విషయంలో ఏర్పడే పోటీ వాతావరణమే నగరంలో ట్రాఫిక్‌కు ప్రధాన అంతరాయంగా ఉందన్నారు. నగరంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేశామని, సిసి కెమెరాల నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. నిబంధనలను అతిక్రమించినవారు దొరికిపోతారని, వారి ఇంటికే నేరుగా ఈ-చలానా పంపించడం జరుగుతోందన్నారు. రెండు పర్యాయాలు చలానా కట్టని వారి వాహనాన్ని సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. తాము ఉదయం నుంచి సంపాదించిన కష్టార్జితాన్ని ఒక్క పొరపాటుతో చలానా రూపంలో ప్రభుత్వానికి కట్టుకోవద్దని హితవు పలికారు. వాహనాల డీలర్లు కూడా వాహనాలను అమ్మే సమయంలో చోదకులకు తగిన రీతిలో కౌనె్సలింగ్ ఇవ్వాలని సూచించారు. వాహన ప్రమాదాల్లో ఎక్కువ శాతం ముందు ఉన్న వాహనం వెలుతురులో సరిగా కనిపించకనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దీన్ని నివారించేందుకు ప్రతిఒక్కరూ వాహన వెనుక భాగంలో రిఫ్లెక్టర్ స్టిక్కర్స్ అంటించుకోవాలని కోరారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ద్విచక్ర వాహనాలు కొనిచ్చే సమయంలో తగిన విధంగా వారికి అన్ని సూచనలు ఇవ్వాలని కోరారు. జిల్లాలో పోలీస్ శాఖ తీసుకున్న కొన్ని నిర్ణయాలకు డ్రైవర్ల సహకారం అవసరమని తెలిపారు. జాయింట్ కలెక్టర్-2 చంద్రవౌలి మాట్లాడుతూ తమ జీవితాలు సైతం తమ డ్రైవర్ల బాధ్యతపై ఆధారపడి ఉంటాయని, ప్రతి డ్రైవరు తనతో పాటు అవతలి వారి జీవితాల బాధ్యత తనదిగా భావించాలని హితవు పలికారు. ఉప రవాణ కమిషనర్ ఎన్.శివరామప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో రూ.18 కోట్లతో డ్రైవింగ్ శిక్షణ కళాశాల ఏర్పాటు కాబోతున్నట్లు వెల్లడించారు. మానవ తప్పిదాల కారణంగానే అనేక అనేక రహదారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. జాతీయ రహదారి సమీపంలో 58 మద్యం దుకాణాలను గుర్తించామని, వీటిని తొలగించేందుకు జిల్లా రహదారి భద్రతా మండలి ముందు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రహదారిపై ప్రమాద పీడిత ప్రాంతాలను ఇతర శాఖల సమన్వయంతో తాము గుర్తించామని, అక్కడ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రవాణా కార్యాలయ ఉద్యోగి కృష్ణయ్య ‘ట్రాఫిక్ రూల్స్ పాటించన్నా.. ప్రమాదాలకు బలికాకన్నా’ అంటూ హృద్యంగా పాడిన పాట అందర్నీ ఆకట్టుకుంది. అనంతరం జిల్లా ఎస్పీ, ఇతర అధికారులతో కలిసి భద్రతా వారోత్సవాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సిఇఓ రామిరెడ్డి, మంత్రి కార్యాలయ ఓఎస్‌డి పెంచల్‌రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్‌ఇ విజయకుమార్, నెల్లూరు, గూడూరు ఆర్టీవోలు కిషోర్, చందర్ తదితరులు పాల్గొన్నారు.

ఖాదీ వస్త్రాలు, హస్తకళలను ఆదరించాలి
* కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పిలుపు

నెల్లూరు, జనవరి 19: ఖాదీ వస్త్రాలు, హస్తకళలను ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ఆదరించాలని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచారం, ప్రసార శాఖా మంత్రి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. గురువారం మంత్రి స్థానిక సర్వోదయ కళాశాల మైదానంలో నిర్వహించిన రాష్టస్థ్రాయి ఖాదీ, హస్తకళల వస్తువుల ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత వస్త్రాల తయారీలో లక్షలాది మంది చేనేత కార్మికులు జీవిస్తున్నారని, వారికి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో చేనేత కార్మికులు పేదరికంలో ఉన్నారని, వారికి తమతమ వృత్తులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యం పెంచే శాస్ర్తియ పద్ధతులు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు, బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎస్ సురేంద్రరెడ్డి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

‘వ్యర్థపదార్ధాలతో మానవ మనుగడకు ముప్పు’

నెల్లూరు, జనవరి 19: వ్యర్థ పదార్ధాల ద్వారా వచ్చే దుష్ఫలితాలు మానవ మనుగడకు పెనుముప్పుగా పరిణమించిందని పలువురు వ్యక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం ఆసుపత్రుల వ్యర్ధాల నిర్వహణపై స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండలి, సేఫ్ ఎన్విరాన్ సంయుక్త నిర్వహణలో జరిగిన వర్క్‌షాపులో పలువురు పర్యావరణ నిపుణులు ప్రసంగించారు. ఈ సమావేశానికి పర్యావరణ ఇంజనీరింగ్ ఎం ప్రమోద్‌కుమార్‌రెడ్డి అధ్యక్షత వహించారు. కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి సీనియర్ ఇంజనీర్ జె చంద్రబాబు మాట్లాడుతూ, ఆసుపత్రుల వ్యర్థాల వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాక, పరిసర ప్రాంత ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులబారిన పడతారని హెచ్చరించారు. వ్యర్థాలను నశింపజేసే విధానాలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2016లో రూపొందించిన వ్యర్థ నిర్వహణ పద్ధతులను ఆయన వివరించారు. డాక్టర్ కె రమణమూర్తి, డాక్టర్ వి వందన శాస్ర్తియ వ్యర్థ పద్ధతులను వివరించారు. సేఫ్ ఎన్విరాన్‌మెంట్ సంస్థ ఎండి వెలగపూడి వెంకటేశ్వరరావు సంధానకర్తగా ఈ సమావేశానికి నిర్వహించారు. ఈ వర్క్‌షాపులో 300 మంది వైద్యులు, నర్సులు పాల్గొన్నారు.

అభివృద్ధి సంక్షేమ పథకాలను సమీక్షించాలి
* లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ పెందుర్తి సూచన

నెల్లూరు, జనవరి 19: జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయించిన సమయానికి పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్, శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ అధికారులను ఆదేశించారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కమిటీ ప్రభుత్వ హామీలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పశుసంవర్థక, విద్యాశాఖ, గృహ నిర్మాణం, పర్యాటక, యువజన, మైనార్టీ, రెవెన్యూ తదితర శాఖల వారీగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు శాఖలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పలువురు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఇలాంటి తప్పులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తమ శాఖల పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పూర్తికాని పనులను సత్వరమే పూర్తిచేయాలన్నారు. సమీక్షా సమావేశానికి జిల్లా అధికారులు రాకుండా ఇన్‌చార్జీలను పంపించారని, వారు కమిటీకి సరైన సమాచారం అందించలేకపోయారని ఆ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో 15 శాఖలకు సంబంధించిన హామీలను సమీక్షించారు. తొమ్మిది హామీలను పెండింగ్‌లో పెట్టామని అందులో రెండు హామీలను కడపలో సమీక్షించనున్నట్లు తెలిపారు. ఆరు హామీలను డ్రాఫ్టు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ, సమీక్షా సమావేశానికి వచ్చిన అధికారులు పూర్తి సమాచారంతో రాలేదన్నారు. తదుపరి జరగబోయే సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు వైస్ చైర్మన్ రాజీనామా
ఆత్మకూరు, జనవరి 19: ఆత్మకూరు పురపాలక ఉపాధ్యక్షులు షేక్ సందానీ తన పదవికి రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం ఈమేరకు తన రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుకు అందజేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ మూడో వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన సందానీ 2014 జూలై నెలలో జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికలో ఆ పదవిని అదృష్టవశాత్తు అందుకోగలిగారు. ఇక్కడ లక్కీ ఏమిటంటే...? సందానీ సిపిఎంలో కొనసాగుతున్నారు.
‘ఆత్మకూరు మున్సిపాలిటీలో సిపిఎం మద్దతుదారుడిగా సందానీ ఒకే ఒక్క వార్డులో గెలుపొందారు. అయితే చైర్‌పర్సన్ ఎన్నికలో ఈయన ఓటే కీలకంగా మారింది. తన మద్దతు కావాలంటే వైస్ చైర్మన్ ఇవ్వాల్సిందేనని సందానీ పట్టుబట్టాడు.’
మొత్తం ఐదేళ్ల పదవీకాలంలో మధ్యేమార్గంగా సగభాగమైన రెండున్నర సంవత్సరాలపాటు వైస్ చైర్మన్ అప్పగించేందుకు సిపిఎం పెద్దల సాక్షిగా ఒప్పందం జరిగింది. ఆ క్రమంలో ఈ నెల 3వ తేదీకే రెండున్నరేళ్ల పదవీ కాలం పూరె్తైంది. ఈ విషయమై సిపిఎం నేతలతో తాజాగా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంతనాలు జరిపిన నేపథ్యంతో వైస్ చైర్మన్ సందానీ తన పదవి నుంచి వైదొలిగారు. ఈయన రాజీనామా చేసేందుకు మార్గం సుగమం కావడంతో ముందుగానే చేసుకున్న ఒప్పందం ప్రకారం వైస్ చైర్మన్ రేసులో ఉన్న టిడిపి ఆత్మకూరు పట్టణ కమిటీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి ఆ పదవికి చేరువకానున్నారు. నూతన వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు కనీసం నెలరోజులకుపైగా సమయం పట్టవచ్చని అధికారుల ద్వారా అందుతున్న సమాచారం. ఆర్డీఓ స్థాయి అధికారి సమక్షంలో నూతన వైస్ చైర్మన్ ఎన్నికకు ముహర్తం నిర్ణయిస్తారు. ప్రత్యక్ష పద్ధతిలో వైస్ చైర్మన్‌గా పోటీ చేసే అభ్యర్థికి అనుకూలంగా కౌన్సిలర్లు చేతులు ఎత్తే విధానం ద్వారా ఎన్నిక జరగనుంది. ఆత్మకూరు మున్సిపాలిటీలో ప్రస్తుతం తెలుగుదేశానికి తిరుగులేని ఆధిపత్యం ఉండటం గమనార్హం. మొత్తం 23 మంది కౌన్సిలర్లలో 15 మంది ఈ పార్టీ తరపునే చలామణిలో ఉన్నారు. వైస్ చైర్మన్ పదవికి మాజీగా మారనున్న సదరు సందానీ కూడా ప్రత్యుపకారంగా తెలుగుదేశానికే మద్దతివ్వనున్నారు. దీంతో వైస్ చైర్మన్ ఎన్నిక అధికార పార్టీ తరపున ఏకపక్షంగానే జరిగే అవకాశాలు కనిపిస్తుండటం విశేషం. వైఎస్‌ఆర్‌సి తరపున ఏడుగురు కౌన్సిలర్లతో సహా ఎంపి, ఎమ్మెల్యే వంటి ఎక్స్‌అఫీషియో సభ్యత్వాలు కూడా జత కలసినా తెలుగుదేశంతో పోటీకై సరితూగని వ్యవహారమే.

జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాలకు ప్రతిపాదనలు
* ఎంపి మేకపాటి వెల్లడి

నెల్లూరు, జనవరి 19: నెల్లూరు జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు కృషితో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం నెల్లూరులోని కేంద్రీయ విద్యాలయం ప్రాంగణంలో సరస్వతీ విగ్రహాన్ని ఎంపి మేకపాటి ఆవిష్కరించారు. ఎంపి లాడ్స్ నిధులు మూడు లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్‌ప్లాంట్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కావలిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. ఆత్మకూరులో కూడా కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఎంపి పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సరితారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

22 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
తడ, జనవరి 19: చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం నుండి మినీ లారీలో సూళ్లూరుపేటకు అక్రమంగా తరలిస్తున్న 22 బస్తాల ఆంధ్ర రేషన్ బియ్యాన్ని తడ ఎస్‌ఐ సురేష్‌బాబు గురువారం పట్టుకున్నారు. వరదయ్యపాళెం నుండి సూళ్లూరుపేటకు మినీలారీలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో తడ ఎస్‌ఐ అక్కంపేట వద్ద ఉన్న జైన్ టెంపుల్ సమీపంలో కాపుకాచి ఆ లారీని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వాహనాన్ని తడ పోలీసుస్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
గూడూరు, జనవరి 19: దుకాణానికి మోటార్ సైకిల్‌పై సరకులు తీసుకొని వెళుతున్న వ్యక్తిని వెనక నుండి లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన గురువారం రాత్రి చిల్లకూరు మండలంలో చోటుచేసుకొంది. పోలీసుల కథనం మేరకు చిల్లకూరు మండలం అన్నంబాక గ్రామానికి చెందిన సోమిశెట్టి కోటేశ్వరరావు (55) తన మోటార్ సైకిల్‌పై గూడూరులో సరుకులు తీసుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో చిల్లకూరు మండలం నాంచారంపేట గ్రామం వద్ద వెనక నుండి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు అదుపు తప్పి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న చిల్లకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైల్వే రిజర్వేషన్ వేళల పొడిగింపు
సూళ్లూరుపేట, జనవరి 19: సూళ్లూరుపేటలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఇకపై ఉదయం, మధ్యాహ్నం రెండు వేళలు పనిచేయనున్నట్లు స్టేషన్ మేనేజర్ రమణయ్య తెలిపారు. ఇంతకుముందు ఉదయం 8 నుండి 12 గంటల వరకు మాత్రమే రిజర్వేషన్ చేసుకొనే సౌకర్యం ఉండేది. అయితే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు ఉదయంతో పాటు మధ్యాహ్నం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రెండు వేళల రిజర్వేషన్ చేసుకొనే సౌకర్యం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.

అవివాహిత దారుణ హత్య
బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 19: మండల కేంద్రమైన బుచ్చిరెడ్డిపాళెంలో ఓ అవివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మంగలికట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న మోర్ల లక్ష్మీకుమారి (42) అనే అవివాహిత తన తండ్రి మోర్ల సుబ్రహ్మణ్యంతో కలిసి నివాసం ఉంటుంది. బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటిలోనికి జొరబడి ఆమె తలపై నాప రాయితో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై సంఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. లక్ష్మీకుమారి తల్లి పద్మావతి సంవత్సరం క్రితం మృతిచెందింది. ఈ కారణం చేత తండ్రి సుబ్రహ్మణ్యంను నిద్ర చేయించేందుకు అతని సోదరి చెనె్త్న తీసుకెళ్లింది. దీంతో ఒంటరిగా ఉన్న పద్మావతిని ఎవరో పథకం ప్రకారం హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు సైతం ఎలాంటి కేకలు వినలేదని పోలీసుల విచారణలో తెలిసింది. సంఘటనా స్థలాన్ని రూరల్ డిఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ హతురాలి వంటిపై ఉన్న నగలు అలాగే ఉండటం చేత ఈ హత్య ఆభరణాల కోసం జరిగింది కాదని భావిస్తున్నామన్నారు. పోలీసుల వద్ద కొంత సమాచారం ఉందని, త్వరలోనే హంతకులను పట్టుకుంటామని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

హోరాహోరీగా క్రీడా పోటీలు
నెల్లూరు, జనవరి 19: ఖేలో ఇండియా క్రీడా పోటీలు నగరంలోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో హోరాహోరీగా సాగుతున్నాయి. అండర్-14 విభాగంలో తొలిరోజు జరిగిన బాలుర కబడ్డీ పోటీలో పంజాబ్ జట్టు తెలంగాణా జట్టుపై 32-22 స్కోరు తేడాతో గెలుపొందింది. గుజరాత్ జట్టు 54-38 స్కోరుతో మధ్యప్రదేశ్ జట్టుపై విజయం సాధించింది. రాజస్తాన్ బాలుర జట్టు 67-29 తేడాతో కేరళ జట్టుపై, హర్యానా జట్టు 48-47 తేడాతో కర్నాటక జట్టుపై విజయం సాధించింది. హర్యానా, కర్ణాటక జట్లపై జరిగిన మ్యాచ్ నువ్వా నేనా అనేరీతిలో హోరాహోరీగా సాగింది. చివరకు ఒక పాయింట్ తోడాతో హర్యానా విజయం సాధించింది. బాలికల కబడ్డీ పోటీల విషయానికి వస్తే గురువారం తమిళనాడు, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 53-20 తేడాతో గుజరాత్‌పై గెలిచింది. మరో మ్యాచ్‌లో కర్ణాటక కేరళపై 70-20 స్కోరు తేడాతో ఘనవిజయం సాధించింది. ఖోఖో పోటీలో బాలుర విభాగంలో మధ్యప్రదేశ్ జట్టు 15-8 తేడాతో త్రిపుర జట్టుపై, ఉత్తరాఖాండ్ 10-5 తేడాతో కేరళపై, ఆంధ్రప్రదేశ్ జట్టు 15-5 స్కోరుతో తెలంగాణా జట్టుపై విజయం సాధించాయి. అంధ్రా, తెలంగాణాల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రా క్రీడాకారుడు సచిన్‌రాజ్ అద్భుతమైన ప్రతిభ కనబర్చి తమ జట్టును విజయపదాన్ని నడిపించాడు. బాలికల విభాగంలో పుదుచ్ఛేరి జట్టు 10-4 స్కోరుతో ఉత్తరాఖాండ్‌పై, మధ్యప్రదేశ్ జట్టు 15-4 తేడాతో త్రిపురపై, ఆంధ్రప్రదేశ్ 11-4 తేడాతో తమిళనాడుపై, తెలంగాణా 11-9 స్కోరుతో పశ్చిమ బెంగాల్‌పై విజయం సాధించాయి. ఉషు (రణవిద్య) అంశానికి సంబంధించి పోటీలు శుక్రవారం ఉదయం నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.